కోటి అందాల తెలంగాణ | Sakshi
Sakshi News home page

కోటి అందాల తెలంగాణ

Published Thu, Mar 24 2016 2:50 AM

కోటి అందాల తెలంగాణ

అబ్బురపరిచే వేసవి విడుదులెన్నో
 

 సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ.. కోటి రతనాల వీణే కాదు.. కోటి అందాల హరివిల్లు కూడా. అబ్బురపరిచే అందాలను ఇముడ్చుకున్న ప్రాంతాలెన్నో వేసవి విడిదికి రా.. రమ్మని పిలుస్తున్నాయి. ఊరిస్తున్న సెలవులను ఉత్సాహంగా గడిపేందుకు సరైన ప్రణాళిక వేసుకుంటే తెలంగాణను ఇట్టే చుట్టేసి రావొచ్చు.  ఆదిలాబాద్ జిల్లా అం టేనే అడవులకు పెట్టింది పేరు. జీవవైవిధ్యా నికి ప్రతీకగా నిలిచే జన్నారంలోని అభయారణ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి కవ్వాల్ అడవులు హైదరాబాద్ నుంచి కేవలం 270 కి.మీ. రైలు ప్రయాణంతో చేరుకోవచ్చు. ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దులోని జూన్ నుంచి డిసెంబర్ వరకు బొగత జలపాతం కనులవిందు చేస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని అందం చూడాలంటే  రెండు కళ్లూ చాలవు.

పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యంలో గలాగలా పారుతోంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరం వరంగల్. కాకతీయుల నాటి ఆనవాళ్లు కట్టిపడేస్తున్నాయి. వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయాలు, లక్నవరం వేటికవే ప్రత్యేకం. మహబూబ్‌నగర్‌లోని నల్లమల చూసి తరించాల్సిందే. కృష్ణానది ఒడ్డునున్న సోమశిల, మరో ప్రాంతం సింగోటం అబ్బురపరిచే అందాల నిల యాలు. కరీంనగర్ జిల్లాలోని డీర్‌పార్క్, ఉజ్వల పార్క్, లోయర్ మానేరు డ్యాం మనస్సును పరవశింపజేస్తున్నాయి. మెతుకు సీమ మెదక్ జిల్లాలోనూ ఎన్నో చూడముచ్చటైన ప్రాంతాలున్నాయి. ఆసియాలోనే పెద్దదైన చర్చి, ఏడుపాయల ఆలయం ప్రసిద్ధి. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పచ్చదనం కప్పుకున్న దేవరచర్ల గుట్టలు, నాగార్జున సాగర్ డ్యాం, నాగార్జున కొండ అందాల తీరే వేరు. ఉత్తర తెలంగాణ  జిల్లాల వరప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పర్యాటకులను కట్టిపడేస్తోంది. తెలంగాణ ఊటి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ కొండలు, రాజధానికి అతి సమీపంలోని ఈ కొండలు, కోనలు, ఇక్కడి పచ్చదనాన్ని చూసేందుకు రోజూ వేలల్లో పర్యాటకులు వస్తుంటారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement