కాంట్రాక్టు అధ్యాపకుల ‘వెరిఫికేషన్’ ప్రక్రియ షురూ | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకుల ‘వెరిఫికేషన్’ ప్రక్రియ షురూ

Published Thu, May 19 2016 3:36 AM

contract lecturers Verification Processing started

జిల్లాల వారీగా సీనియర్ ప్రిన్సిపాళ్లతో కమిటీల ఏర్పాటు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా వారి ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇటీవలే పూర్తి కాగా, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ముగ్గురు సీనియర్ లెక్చరర్లతో కమిటీలను ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించింది. అయితే జూన్ 2 నాటికి క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న 13 వేల మంది ఉద్యోగుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు 5 వేల మందికి పైగా ఉన్నారు. వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అనేక సమస్యలు బయట పడుతున్నాయి. కొందరికి అర్హతలు లేకపోగా, కొందరు పని చేస్తున్న కాలేజీల్లో మంజూరైన పోస్టులే లేవు. 
 
 అర్హతలు లేనివారే అధికం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు లెక్చరర్ల నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన నిబంధనల ఉత్తర్వుల (జీవో 12, జీవీ 302) ప్రకారం 300 మందికి లెక్చరర్ పోస్టుకు ఉండాల్సిన అర్హతలు లేవని ఇదివరకే ఇంటర్మీడియట్ విద్యాశాఖ గుర్తించింది. ఇక 71 కాలేజీల్లో 632 మంది కాంట్రాక్టు లెక్చర ర్లు అసలు మంజూరే కాని పోస్టుల్లో పని చేస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం పోస్టులు మంజూరు కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదు.

మరోవైపు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులను నిర్వహించే కాలేజీల్లోనూ 250 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టుల్లోనే పని చేస్తున్నారు. దీంతో వారి పరిస్థితి  ఆందోళనకరంగా మారింది. అయితే గతంలో సీఎం కేసీఆర్‌ను వారు కలసినపుడు పోస్టులు మంజూరు చేసి, క్రమబద్ధీకరించాలని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారికి పోస్టులు మంజూరు చేశాకే క్రమబద్ధీకరణ చేసే అంశాన్ని విద్యాశాఖ పరిశీలిస్తోంది. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశంపై చర్చించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు లెక్చరర్ల క్రమబద్ధీకరణ సాధ్యం కాకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న వారికి పోస్టుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించాలని రాజీవ్‌శర్మ ఆదేశించినట్లు తెలిసింది. వారితోపాటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మంజూరు కాని పోస్టులో పని చేస్తున్నట్లు తెలిసింది.

 డిగ్రీ కాలేజీల్లోనూ అనేక సమస్యలు: కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల క్రమబద్ధీకరణలోనూ అనేక సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. 940 మంది డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లలో 40 మంది లెక్చరర్లు 2014 జూన్ 2 నాటికి సర్వీసులోనే లేరని తేలింది. మరో 170 మందిలో 50 మందికి ఉద్యోగంలో చేరే నాటికి సరైన అర్హతలు లేవు.

Advertisement
Advertisement