‘డబుల్’ వేగంతో పనిచేయండి

‘డబుల్’ వేగంతో పనిచేయండి - Sakshi


సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు పద్ధతులను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో స్థలాల కొరత ఉన్నందున అపార్ట్‌మెంట్ పద్ధతిలో మైవాన్ పరిజ్ఞానం వినియోగించి ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక కాంట్రాక్టర్‌లతో ఎక్కడివక్కడ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక, పనుల అప్పగింత వ్యవహారాలను కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు.



పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వటంలో ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరిస్తున్నందున ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించిన పద్ధతులకు స్వస్తిపలకాలని ఆదేశించారు. ఆది వారం సాయంత్రం ఆయన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. జిల్లాల్లో 2 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలోని బస్తీలను కాలనీలుగా మార్చాలని చెప్పారు. ఇందుకోసం అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులును మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు.

 

3 నుంచి 9 అంతస్తులతో ఇళ్లు...

కొత్త ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను టీఎస్‌ఐఐసీ, దిల్, గృహనిర్మాణ సంస్థ పరిధి నుంచి సమీకరించాలని, అవసరమైతే ప్రభుత్వ భూములూ కేటాయించేందుకు సిద్ధమని ముఖ్య మంత్రి కేసీఆర్ వెల్లడించారు. మూడు నుంచి తొమ్మిది అంతస్తులుగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మైవాన్ పరిజ్ఞానాన్ని వినియోగించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ముందుకొచ్చిన సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఇళ్ల కోసం ఉచితంగా ఇసుకను అందజేయాలని, సిమెంటు కంపెనీలతో మాట్లాడి ఫ్యాక్టరీ ధరకే అందేలా చూడాలని ఆదేశించారు.



హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న వాంబే, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లనూ త్వరగా పూర్తి చేయాలన్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వోద్యోగులు, పోలీసులకు కేటాయించాలని నిర్ణయించినందున అందుకు అవసరమైన కసరత్తును వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్, గృహనిర్మాణశాఖ కార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top