2020కల్లా కలల తెలంగాణ

CM Kcr comments on Kaleshwaram project - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాగునీటితో మున్ముందు అంతా అద్భుతమే

శాశ్వత ప్రయోజనం కల్పించేలా ప్రాజెక్టుల నిర్మాణం

వేగంగా రిజర్వాయర్లను పూర్తి చేయాలి

నీళ్లు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు చెరువులు నింపాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని.. 2020 కల్లా మనం అనుకున్న కలల తెలంగాణ వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మున్ముందు అంతా అద్భుతంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పరిధిలో రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని.. నీళ్లు రాగానే ఎప్పటికప్పుడు చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివరంగా అధ్యయనం చేసి పనులు కొనసాగించాలని సూచించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనుల తీరుపై సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ హరిరాం తదితరులతో సమీక్షించారు. తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్‌ రూపకల్పనలో భాగమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమని కేసీఆర్‌ పేర్కొన్నారు. మంజీరా, దుందుభి, కనగల్‌ వాగు, మూసీ, పాకాల సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉప నదులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచించారు. 

రిజర్వాయర్ల పనులు వేగిరం చేయండి
అనంతగిరి, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్ల పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కరువు ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాగునీరివ్వాలని, నీళ్లు వచ్చిన వెంటనే చెరువులు నింపుకొంటూ పోవాలని సూచించారు. మిడ్‌ మానేరు నీటితో చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపాలన్నారు. మల్లన్నసాగర్‌ కింద కాల్వల పనులను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. మల్లన్నసాగర్‌ నుండి సింగూర్‌కు గ్రావిటీ ద్వారానే నీళ్లు పోవాలని, ఆ మార్గంలో ఎక్కువ ప్రాంతం సాగులోకి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. జాతీయ రహదారి నుంచి మెదక్‌ పట్టణం వరకు, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్క గుంట భూమి కూడా మిగలకుండా సాగులోకి రావాలన్నారు. గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్‌ లాంటి చోట అద్భుతమైన వసతి గృహాలు నిర్మించాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ఆ వసతి గృహాలు ఎత్తైన ప్రదేశాల్లో.. సుమారు 20–30 ఎకరాల స్థలంలో నిర్మిస్తే బాగుంటుందన్నారు.

జీవధారలతో..
అప్పర్‌ మానేరు ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయే అవకాశం లేదని, అప్పర్‌ మానేరు నుంచి లోయర్‌ మానేరు వరకు ఈ ప్రాజెక్టు ఒక జీవధార వంటిదని కేసీఆర్‌ పేర్కొన్నారు. అలాగే కాకతీయ కాలువ మరో జీవధార అని, గోదావరి మీద కడుతున్న బ్యారేజీలతో ఉత్తర కరీంనగర్‌ ప్రాంతం ఒక జీవధార అవుతుందని చెప్పారు. ఈ జీవధారలతో పంటలతోపాటు నిత్యం పచ్చదనం నెలకొంటుందన్నారు. ఇక సింగూరు ప్రాజెక్టు  నుంచి కొండ పోచమ్మ, మల్లన్నసాగర్‌ వరకూ జీవధారేనని, దీనివల్ల మెదక్‌ జిల్లాకున్న మెతుకుసీమ పేరు సార్థకమవుతుందని వ్యాఖ్యానించారు. ఎస్సారెస్పీ ఎప్పటికీ నిండి ఉండాల్సిన అవసరముం దని, దానిమీదే మిషన్‌ భగీరథ ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top