
అసెంబ్లీ వేదికగా పచ్చి అసత్యాలు వల్లె వేసిన సీఎం చంద్రబాబు
దాదాపు అన్నింటికి తానే పునాదిరాయి వేసి, తానే పూర్తి చేశానంటూ బీరాలు
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేపట్టి, పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతలే
అది కూడా పోలవరాన్ని నీరుగార్చి కమీషన్ల కోసం ఎత్తిపోతల చేపట్టారంటున్న సాగునీటి నిపుణులు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా.. జంకుగొంకు లేకుండా.. పచ్చి అసత్యాలు చెప్పడంలో తనను మించిన వారు ఉండరని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి చాటుకున్నారు! ఉమ్మడి రాష్ట్రంలోగానీ విభజిత రాష్ట్రంలోగానీ దాదాపుగా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని.. వాటిని తానే పూర్తి చేశానని సెలవిచ్చారు. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావిస్తేనే ఓ కమిటీ వేశారని.. దాని స్ఫూర్తితోనే ఆ ప్రక్రియ మొదలైందని చంద్రబాబు చెప్పడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
1996 లోక్‌సభ ఎన్నికలు, 1999 సార్వత్రిక ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పునాది రాయివేసి.. ఆ తర్వాత తట్టెడుమట్టి కూడా ఎత్తకుండా ప్రజలను వంచించారని గుర్తు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ 1999 నుంచి 2004 మధ్య ప్రతిపక్షనేతగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు చంద్రబాబు వేసిన పునాదిరాళ్ల వద్ద మొక్కలను నాటారని గుర్తు చేస్తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.లక్ష కోట్ల వ్యయంతో ఒకేసారి 83 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టారు.
2009 నాటికే 43 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గాలేరు–నగరి తొలిదశ, వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి.. పులిచింతల, సోమశిల, కండలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మంసాగర్‌లలో పునరావాసం, మిగిలిన పనులను పూర్తి చేసి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు 2019–24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్ నీళ్లందించారని గుర్తు చేస్తున్నారు.
హవ్వ.. నవ్విపోదురుగాక..!
» హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి 1996 మార్చి 11న తానే భూమి పూజ చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో 40 టీఎంసీల హంద్రీ–నీవాను 5 టీఎంసీలకు కుదించి తాగునీటి పథకంగా చేపట్టేందుకు 1999 ఎన్నికలకు ముందు మరో సారి పునాదిరాయి వేశానని చెప్పుకోలేకపోయారు. 1995 నుంచి 2004 మధ్య హంద్రీ–నీవా కోసం కేవలం రూ.13.75 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.. అదీ రెండు సార్లు శంకుస్థాపన, బహిరంగ సభలకు జనసమీకరణ, ఉద్యోగుల జీతభత్యాలకు చేసిన వ్యయమే.
ఆ తొమ్మిదేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక హంద్రీ–నీవా సుజల స్రవంతి పనులు చేపట్టి తన హయాంలోనే రూ.6,948.20 కోట్లు వ్యయం చేసి తొలిదశను పూర్తి చేశారు. రెండో దశలో 80 శాతం పూర్తి చేశారు. దాంతో 2012లో హంద్రీ–నీవా తొలి దశను అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తూ ఆ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించింది.
శ్రీశైలంలో 795 అడుగుల నుంచే హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతలను 2007, ఆగస్టు 31న చేపట్టిన నాటి సీఎం వైఎస్ 2009 నాటికే 90 శాతం పనులు పూర్తి చేశారు. ఇదీ వాస్తవం. 2014–19 మధ్య హంద్రీ–నీవాకు టీడీపీ సర్కార్ రూ.4,182.68 కోట్లు వ్యయం చేసి.. జీవో 22(ధర సర్దుబాటు) పేరుతో కాంట్రాక్టర్లకు అదనపు నిధులు దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారని సాగునీటిరంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
2019–24 మధ్య వైఎస్ జగన్ హంద్రీ–నీవా సామర్థ్యం 40 టీఎంసీల కంటే అధికంగా తరలించి.. రాయలసీమను సస్యశ్యామలం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులను తరలిస్తామనే పేరుతో లైనింగ్ పనులు చేపట్టి, కాంట్రాక్టర్లకు నిధులైతే దోచిపెట్టారని.. కానీ ఇప్పటికీ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
» వెలిగొండ ప్రాజెక్టుకు 1996 ఏప్రిల్ 20న తాను భూమిపూజ చేశానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ భూమి పూజ సందర్భంగా నిర్వహించిన సభ కోసం రూ.పది లక్షలు ఖర్చు చేశారు. కానీ.. 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో తట్టెడుమట్టి కూడా ఎత్తలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టును చేపట్టి తన హయాంలో రూ.3,581.57 కోట్లు వ్యయం చేసి సింహభాగం పనులు పూర్తి చేశారు.
కానీ.. 2014–19 మధ్య ఆ ప్రాజెక్టు కోసం రూ.1,414.51 కోట్లు వ్యయం చేసిన సీఎం చంద్రబాబు.. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లకుపైగా దోచిపెట్టారని.. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల పేరుతో మరో రూ.66.44 కోట్లు దోచిపెట్టారని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ రూ.1,046.46 కోట్లు వ్యయం చేసి ఆసియాలో అతి పొడవైన రెండు సొరంగాలను పూర్తి చేశారు.
కేవలం రూ.905 కోట్లు వ్యయం చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఆగస్టులోనే శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించే అవకాశం ఉండేదని.. కానీ కమీషన్లు రావనే నెపంతో ఆ పనులు కూటమి సర్కార్ చేపట్టడం లేదని.. ఇప్పుడేమో 2026, జూలైకి పూర్తి చేస్తామని కొత్త పాట పాడుతున్నారని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
» తుంగభద్ర డ్యాం 19వ గేటు గతేడాది ఆగస్టు 10న కొట్టుకుపోతే.. ఆ డ్యాం భద్రతపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్ కమిటీ.. కాలం చెల్లిన 33 గేట్లను మార్చాల్సిందేనని నిరుడు సెపె్టంబరు 10న నివేదిక ఇచి్చంది. తుంగభద్ర బోర్డు నిబంధనల ప్రకారం డ్యాం మరమ్మతులకు అవసరమైన నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలుత విడుదల చేయాలి.. ఆ తర్వాత వాటా నిధులను కర్ణాటక, తెలంగాణ విడుదల చేస్తాయి.
కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం గేట్ల మార్పునకు రూ.54.42 కోట్లను సకాలంలో విడుదల చేయలేదు. దాంతో ఈ ఏడాది ఆ డ్యాంలో గరిష్ట స్థాయిలో 105 టీఎంసీలు కాకుండా కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాల్సిన దుస్థితి ఉత్పన్నమైంది. దీని వల్ల ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది.
» వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తన సూచన మేరకే నదుల అనుసంధానంపై కమిటీ వేశారని.. దాని వల్ల నదుల అనుసంధానం ప్రక్రియ మొదలైందని సీఎం చంద్రబాబు సెలవివ్వడంపై సాగునీటిరంగ నిపుణులు నిర్ఘాంతపోతున్నారు. నదుల అనుసంధానం చేయడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేయడానికి, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి 1980 నాటికే ప్రణాళికను కేంద్రం రూపొందించిందని గుర్తుచేస్తున్నారు.
ఆ ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారించి.. 2002లో నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చిందని.. ఆ మేరకే నదుల అనుసంధానంపై కమిటీ ఏర్పాటుచేసి.. ఆ ప్రక్రియను కేంద్రం చేపట్టిందని స్పష్టం చేస్తున్నారు.
» సాగునీటి ప్రాజెక్టులపై 2014–19 మధ్య తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,417 కోట్లు ఖర్చు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.28,376 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ.. జీవో 22, జీవో 63ల ద్వారా 2014–19 మధ్య వ్యయం చేసిన నిధుల్లో అధిక శాతం అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దీనికి నిదర్శనం.. ఆ ఐదేళ్లలో కొత్తగా నీళ్లు ఇచ్చిన ఆయకట్టు 3.84 లక్షల ఎకరాలు మాత్రమేనని పేర్కొంటున్నారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ సర్కార్ ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుంటూ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసిందని గుర్తు చేస్తున్నారు.
పోలవరంలో విధ్వంసం సృష్టించింది చంద్రబాబే..
తెలుగు ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ.. ఆ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. 2009 నాటికే రూ.5 వేల కోట్లు వ్యయం చేసి, సింహభాగం భూసేకరణను పూర్తి చేసి, కుడి, ఎడమ కాలువలను అధిక శాతం పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించే ప్రక్రియను పూర్తి చేశారు. విభజన నేపథ్యంలో ఆ ప్రాజెక్టును వంద శాతం వ్యయం భరించి తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2014, మే 28 పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేసింది. కానీ.. కమీషన్ల దాహంతో, కేంద్రం కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016, సెపె్టంబరు 7న చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌ను తుంగలో తొక్కి.. కమీషన్లు అధికంగా వచ్చే పనులను చేపట్టారు.
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను 2018 నాటికే పూర్తి చేశారు.. అది అప్పట్లో వచ్చిన వరదలకే కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిచెబుతూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ఆ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు.
తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. ఆ ఫలితంగానే రూ.12,157.53 కోట్లు విడుదలకు కేంద్రం అంగీకరించింది. 2014–19 మధ్య సీఎం చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా ఉండి ఉంటే.. 2022 నాటికే వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసేవారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు.. పోలవరంలో నీటి నిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేసి, దాన్ని బ్యారేజ్‌గా మార్చేసి.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని పేర్కొంటున్నారు.