పెళ్లైన తొమ్మిది నెలలకే తమ సోదరికి విడాకులిప్పించాడని కక్షగట్టి బావ అన్నను ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా హతమార్చారు.
బావ అన్నను హతమార్చిన యువకులు
కాటేదాన్: పెళ్లైన తొమ్మిది నెలలకే తమ సోదరికి విడాకులిప్పించాడని కక్షగట్టి బావ అన్నను ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా హతమార్చారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎన్ జావీద్ కథనం ప్రకారం... టోలిచౌకికి చెందిన ఖాదర్‌అలీ(40) మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని అలీనగర్‌లో ప్లాస్టిక్ వేస్టేజ్ బాటిళ్ల పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఇతని సోదరుడు హలీమ్‌కు 9 నెలల క్రితం తహనీస్‌తో వివాహం జరిగింది.
పెళ్లైన కొద్దిరోజులకే హలీమ్, తహనీస్‌ల మధ్య మనస్పర్థలు రావడంతో హలీమ్ తన భార్యకు విడాకులిచ్చి వేరుగా ఉంటున్నాడు. హలీమ్ విడాకుల విషయంలో అతని అన్న కల్పించుకొని విడాకులు ఇప్పించాడని కక్షగట్టిన తహనీస్ సోదరులు అబ్దుల్లా, తాహెర్‌లు హలీమ్ అన్న హత్యకు పథకం పన్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి 11.30కి పరిశ్రమ నుంచి కారులో ఇంటికి వెళ్తున్న ఖాదర్‌అలీపై అబ్దుల్లా, తాహెర్‌లు దాడికి పాల్పడ్డారు.
ముందస్తు పథకం ప్రకారం అతని కళ్లల్లో కారం చల్లి విచక్షణారహితంగా కత్తులు, బాటిళ్లతో దాడి చేసి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పో లీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాత్రి 12.30కి బాధితుడ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులంటున్నారు. నిందితులు అబ్దుల్లా, తాహెర్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు పట్టుబడితే హత్యకు గల వివరాలు తెలుస్తాయని సీఐ జావీద్ తెలిపారు.