ఛాతీకి మధ్యలో గుండె.. ఆపరేషన్ సక్సెస్!


హైదరాబాద్:  ఛాతీకి మధ్యలో ఉన్న గుండెకు సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా బైపాస్ సర్జరీ చేశారు. ఈ తరహా చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారిగా వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, అనెస్థిషియన్ డాక్టర్ సుబ్రమణ్యం శస్త్రచికిత్స కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.



రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ శంషుద్ధీన్(52) తీవ్రమైన గుండె సంబంధ సమస్యతో బాధ పడుతున్నాడు. ఇటీవల గుండెపోటు రావడంతో చికిత్స కోసం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించగా మూడు ధమనులు మూసుకపోయినట్లు గుర్తించారు. గుండె రక్తం సరఫరా కేవలం 35 శాతానికి పడిపోయినట్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన డాక్టర్ ప్రతీక్ భట్నాగర్‌ను ఆశ్రయించగా, ఆయన పలు రకాల వైద్య పరీక్షలు నిర్విహించారు.



45 డిగ్రీలు వెనక్కి తిరిగి ఉన్న గుండె..

సాధారణంగా మనిషి గుండె ఛాతీ ఎడమ భాగంలో ఉంటుంది. కానీ మహమ్మద్ మహబూబ్‌కు మాత్రం ఛాతీ మధ్య భాగంలో 45 డిగ్రీలు వెనక్కి తిరిగి గుండె ఉంది. అంతేకాదు గుండె కింది భాగంలో లోపలివైపు ధమనులు ఉన్నాయి. వైద్య పరిభాషలో దీన్ని‘మోసోకార్డియో’గా పిలుస్తారు. లక్ష మందిలో ఎవరో ఒకరికి గుండె ఎడమవైపు కాకుండా ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఇలాంటి వారికి చికిత్స చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కానీ, డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, డాక్టర్ శుభి భట్నాగర్, డాక్టర్ రాజమోహన్, డాక్టర్ సుబ్రహమణ్యంలతో కూడిన వైద్య బృందం ఈ కేసును ఓ సవాల్‌గా తీసుకుంది. టోటల్ ఆర్టియల్ రీవాస్క్యులరైజేషన్ మెళుకువలతో గుండె కొట్టుకుంటున్న సమయంలోనే ఎల్‌ఐఎంఎ-రేడియల్ వై గ్రాఫ్ట్ విధానంలో నాలుగు బైపాస్ గ్రాఫ్ట్‌లు విజయవంతంగా అమర్చారు. ఇందుకు నాలుగు గంటల సమయం పట్టినట్లు వైద్య బృందం తెలిపింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top