వెండితెరపై మన పూర్ణ | Biopic on Telangana Girl Malavat Poorna | Sakshi
Sakshi News home page

వెండితెరపై మన పూర్ణ

Mar 2 2017 1:16 AM | Updated on Apr 3 2019 6:34 PM

వెండితెరపై మన పూర్ణ - Sakshi

వెండితెరపై మన పూర్ణ

మాలావత్‌ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు.

ఎవరెస్టు అధిరోహించిన పూర్ణపై బాలీవుడ్‌ సినిమా
తెలంగాణ అమ్మాయిపై హిందీలో తొలి బయోపిక్‌ ఇదే
ప్రపంచవ్యాప్తంగా మార్చి 31న విడుదల
ట్రైలర్‌కు విశేషాదరణ.. 3.6 లక్షల మందికి పైగా వీక్షణ


సాక్షి, హైదరాబాద్‌: మాలావత్‌ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి పద్నాగేళ్లలోపే ఎవరెస్టు ఎక్కి ప్రపంచ రికార్డు సృషించిన తెలంగాణ అమ్మాయి. తాజాగా ఆమె జీవిత చరిత్ర వెండితెరకెక్కుతోంది. అది కూడా హిందీలో! ఓ తెలంగాణ అమ్మాయి జీవితంపై బాలీవుడ్‌ స్థాయిలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘పూర్ణ’పేరుతో వస్తున్న ఈ సినిమా మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

పూర్ణ ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్‌ఫస్టియర్‌ చదువుతోంది. ఆమె తల్లి లక్ష్మి, తండ్రి దేవదాస్‌ వ్యవసాయ కూలీలు. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం కావడంతో తల్లిదండ్రులు పూర్ణను తాడ్వాయి గురుకుల పాఠశాలలో చేర్పించారు. పర్వతారోహణపై పూర్ణ ఆసక్తి చూసి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మరో విద్యార్థి ఆనంద్‌తో కలిసి పూర్ణ 2014 మే 25న ఎవరెస్టును అధిరోహించింది. బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, నిర్మాత రాహుల్‌ బోస్‌ పూర్ణ సాహస యాత్ర గురించి తెలుసుకుని దీన్ని సినిమాగా మలిచారు. పూర్ణగా హైదరాబాద్‌ విద్యానగర్‌ అరవింద ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి అదితి ఇనాందార్‌ నటించింది.

మహేంద్రహిల్స్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఆమె స్నేహితులుగా నటించారు. ఆర్నెల్ల పాటు చిత్ర నిర్మాణం సాగింది. 5 రోజల క్రితం విడుదలైన ట్రైలర్‌ను ఇప్పటికే 3.6 లక్షల మంది వీక్షించారు. పూర్ణ జీవితంపై ఏకంగా బాలీవుడ్‌లో సినిమా రానుండటం గొప్ప విషయమని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ శ్రద్ధ వల్ల గురుకుల పాఠశాలల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రవేశాలకు భారీ పోటీ నెలకొంది. ఈ సమయంలో వస్తున్న పూర్ణ సినిమాతో తెలంగాణ గురుకులాల ప్రతిష్ట దేశమంతటికీ తెలుస్తుంది’’అని అభిప్రాయపడ్డారు.
'పూర్ణ' ట్రైలర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement