నిషేధిత భూముల్లో రిజిస్ట్రేషన్ కుదరదిక! | Barring able to land registration | Sakshi
Sakshi News home page

నిషేధిత భూముల్లో రిజిస్ట్రేషన్ కుదరదిక!

Mar 25 2016 12:59 AM | Updated on Sep 3 2017 8:29 PM

ప్రభుత్వ భూముల పరిరక్షణపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధం విధించింది.

సెక్షన్ 22‘ఎ’ లోకి కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ భూములు
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య కుదిరిన అవగాహన


హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ఇతరుల పేరుమీద రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సర్కారీ భూములు అన్యాక్రాంతమవుతుండడం, వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ యథేచ్ఛగా రిజిస్టర్ చేస్తుండడంపై ఇటీవల హైకోర్టు  తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనల్లోని సెక్షన్ 22ఎ ను తప్పనిసరిగా అమలు చేయాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు తాజాగా ఒక అవగాహనకు వచ్చాయి. తాజాగా భూపరిపాలన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హైకోర్టు సూచించిన విధంగా సెక్షన్ 22ఎను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించాయి. సెక్షన్ 22ఎ/1లో ఎ నుంచి ఇ కేటగిరీ వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భూముల వివరాలను పొందుపరిచేందుకు రెవెన్యూ శాఖ అంగీకరించింది. ఆయా కేటగిరీల్లోని భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఏ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్ కాకుండా నియంత్రించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

 
నిషేధిత భూముల వివరాలు ఇవీ...

సీసీఎల్‌ఏ ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా నిషేధిత భూముల గురించి ఎప్పటికప్పుడు తాజాపర్చిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కంప్యూటర్లో వీక్షించేందుకు అవకాశం కల్పించారు. విక్రయించేందుకుగానీ, రిజిస్ట్రేషన్ చేసేందుకుకానీ వీల్లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్, పోరంబోకు, రిజిస్టర్ అయిన దేవాదాయశాఖ, వక్ఫ్ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ సెక్షన్ 22ఎలో రెవెన్యూ శాఖ పొందుపరిచిన నిషేధిత భూముల్లో కొన్నింటిని తొలగించాల్సి వస్తే, వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. 

 
టిస్లిమ్‌గా వెబ్‌ల్యాండ్: రాష్ట్రంలో భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న వెబ్‌ల్యాండ్(వెబ్‌సైట్) పేరు మార్చాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు. తొలుత తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(టీఎల్‌ఆర్‌ఎంఎస్) పేరును ప్రతిపాదించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఉండేలా తెలంగాణ స్టేట్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్(టిస్లిమ్) సిస్టమ్‌గా మార్పు చేయాలని నిర్ణయించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement