స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం | ap assembly trust on speaker kodela | Sakshi
Sakshi News home page

స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం

Mar 16 2016 3:39 AM | Updated on Oct 17 2018 6:18 PM

స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం - Sakshi

స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం

స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై మంగళవారం శాసనసభలో...

సాక్షి, హైదరాబాద్: స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానంపై మంగళవారం శాసనసభలో చర్చించారు. ఆ సమయంలో సభాపతి స్థానంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. చర్చ అనంతరం తీర్మానంపై మూజువాణి ఓటుకు ఆయన అవకాశం ఇచ్చారు. అయితే డివిజన్ (అనుకూల, ప్రతికూలం ఓట్లు గణించడం) కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సోమవారం ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేవలం మూజువాణి ఓటుతోనే సరిపెట్టి, డివిజన్‌కు స్పీకర్ అవకాశం ఇవ్వని నేపథ్యంలో...

మంగళవారం స్పీకర్ పై అవిశ్వాసం సందర్భంగా అలా జరగకుండా ఉండటానికి డివిజన్ కోసం ప్రతిపక్షం గట్టిగా పట్టుబట్టింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఇటు డిప్యూటీ స్పీకర్‌తో, అటు మంత్రి యనమల రామకృష్ణుడుతో పలు దఫాలుగా మంతనాలు సాగించారు. కొంతసేపటి తర్వాత డివిజన్‌కు డిప్యూటీ స్పీకర్ అంగీకరించారు. ఓట్లు లెక్కించడానికి ముందుగా.. అందుకు సంకేతంగా గంట మోగించారు. అనంతరం సభ ద్వారాలు మూసివేశారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్న వారిని మొదట లెక్కించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన 8 మంది సభ్యులు సభకు గైర్హాజరయ్యారు.

సస్పెన్షన్‌లో ఉన్న ఆర్కే రోజా సభలో లేరు. సమీప బంధువు మరణించడం వల్ల మరో సభ్యుడు అనిల్‌కుమార్ పార్టీ నాయకత్వం అనుమతితో సభకు రాలేదు. మిగిలిన 57 మంది అవిశ్వాసానికి అనుకూలంగా తమ స్థానాల్లో లేచినిలబడ్డారు. వారిని లెక్కించిన తర్వాత.. అవిశ్వాసాన్ని వ్యతిరేకించే టీడీపీ, బీజేపీ సభ్యులు నిలబడగా వారు 97 మంది ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఆ సమయంలో శాసనమండలి సభ్యులైన మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ కూర్చొని ఉన్నారు.

తటస్థంగా ఉన్న వారిని నిలబడమంటే.. నవోదయం పార్టీకి చెందిన ఏకైక సభ్యుడు వర్మ నిలబడ్డారు. టీడీపీ సభ్యులు జోక్యం చేసుకుని కూర్చోమని చెప్పడంతో ఆయన కూర్చున్నా రు. దీంతో తటస్థం ఓట్లు లేవని డిప్యూటీ స్పీక ర్ ప్రకటించారు. అవిశ్వాసానికి అనుకూలంగా 57, ప్రతికూలంగా 97 ఓట్లు వచ్చినందున తీర్మానం వీగిపోయిందని ఉప సభాపతి ప్రకటించారు. అనంతరం.. స్పీకర్ కోడెల శివప్రసాదరావును సభకు ఆహ్వానించడంతో ఆయన వచ్చి సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు.
 
సభ గౌరవం పెరిగేలా నడపండి: సీఎం
హుందాగా, సభ గౌరవం ఇనుమడించేలా సభా కార్యక్రమాలను నిర్వహించాలని స్పీకర్‌ను సీఎం చంద్రబాబునాయుడు కోరారు. అవిశ్వాసాన్ని మనసులో పెట్టుకొని బాధపడవద్దని సూచించారు. సభా నాయకుడిగా తాను అండగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రావడంలో కోడెల పాత్ర ఉందన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారని ప్రశంసించారు. సీఎం మాట్లాడిన తర్వాత శాసనసభ బుధవారానికి వాయిదా పడింది.
 
నా జీవితం వడ్డించిన విస్తరి కాదు: స్పీకర్
అవిశ్వాసం వీగిపోయిన తర్వాత సభలో, అనంతరం తన చాంబర్‌లో విలేకరులతో కోడెల మాట్లాడారు. ‘నాపై సభ విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. ప్రతిపక్షం నాపై అవిశ్వాసం ప్రకటించినందుకు కొంచెం బాధగా ఉన్నా.. నన్ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతిపక్షం తీరును నేను గుర్తుపెట్టుకుంటాను. ప్రతిపక్షం అవిశ్వాసం నోటీసు ఇచ్చినప్పుడు, పక్షపాతం అనే ముద్ర నామీద ఉన్నప్పుడు ఎక్కువకాలం స్పీకర్ స్థానంలో ఉండటం నాకు ఇష్టం లేదు.

అందుకే వెంటనే చేపట్టాల్సి వచ్చింది..’ అని చెప్పారు. తన  జీవితం ఒడ్డించిన విస్తరి కాదని, ఒడిదుడుకుల జీవితమంటూ.. తన చిన్ననాటి విషయాలను స్పీకర్ వివరించారు. స్మాల్‌ఫాక్స్ కారణంగా తన ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను వారం వ్యవధిలో పోగొట్టుకున్నప్పుడే డాక్టర్ కావాలని బలంగా అనుకున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి వచ్చాన న్నారు.
 
ఓటింగ్‌కు 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు 9 మంది అధికార టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అధికారపక్షం సభకు హాజరు కానివ్వలేదు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే వారు శాసనసభ్యులుగా అనర్హులవుతారనే భయమే ఇందుకు కారణం.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి  శాసనసభ ఆవరణలోనే ఉన్నప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, పతివాడ నారాయణస్వామి, ఆమంచి కృష్ణమోహన్, జయనాగేశ్వరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి, భగ్గు రమణమూర్తి, బడేటి కోట రామారావు వివిధ కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. స్పీకర్ కోడెల, ఉప సభాపతి మండలిని మినహాయిస్తే టీడీపీకి 114 మంది సభ్యులున్నా 97 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైఎస్సార్‌సీపీకి 59 మంది సభ్యులుండగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 57 ఓట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement