200 కాలేజీలకు మించకూడదు! | Affiliated colleges should not exceed 200 | Sakshi
Sakshi News home page

200 కాలేజీలకు మించకూడదు!

Apr 27 2018 12:13 AM | Updated on Apr 27 2018 12:13 AM

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఇకపై 200 కు మించి అనుబంధ కాలేజీలు ఉండటానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుమించి కాలేజీలు ఉంటే రాష్ట్రీయ ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌(రూసా) కింద నిధులు ఇవ్వబోమని స్పష్టం చేసింది.

నిధులు కావాలంటే నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు ఉండాల్సిందేన ని పేర్కొంది. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు, కళాశాల విద్య కమిషనర్ల సమావేశంలో పేర్కొంది. రూసా రెండో దశ కార్యక్రమాలను వచ్చే నెల 3 నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీన్ని వెల్లడించింది.  

600కు పైగా కాలేజీలు..
రాష్ట్రంలోని వర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలపై ఉన్నత విద్యా శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్, కాకతీయ, ఉస్మానియా వంటి యూనివర్సిటీల పరిధిలో 600కు పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. దీంతో వాటి పరిధిలోని కాలేజీలను విభజించే అంశంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిని మార్చాలని ఇప్పటికే ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చింది.

ఒక జిల్లాలో యూనివర్సిటీ ఉన్నా ఆ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వేరే యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. దీంతో వాటిని మార్పు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రస్తుత కేంద్ర ఆదేశాల నేపథ్యంలో యూనివర్సిటీల పరిధులతో పాటు వాటి కింద ఉండాల్సిన అనుబంధ కాలేజీల లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ విద్యా సంస్థలను (యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ వంటివి) పలు ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే సంస్థలుగా మార్చే ఆలోచనలు చేస్తోంది.

పాత జిల్లాల పరిధిలో ఒకట్రెండు గుర్తింపునిచ్చే సంస్థలను ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తోంది. వీటన్నింటిపై త్వరలోనే జరగనున్న ఉన్నత విద్యా మండలి సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరంలో హైదరాబాద్‌లోని కోఠి మహిళా కాలేజీని యూనివర్సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ పనుల కోసం రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement