శుభం భూయాత్‌! 

Vardelli Murali Article On YS Jagan - Sakshi

కామెంట్‌

ఆరంభం బాగుంటే ఆసాంతం బాగుంటుందన్నది నానుడి. ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతటి అఖండ విజయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. ఆ మరుసటి రోజు పార్టీ శాసనసభ నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఎన్నిక య్యారు. ఆ రోజు నుంచి ప్రమాణ స్వీకారంలోపు గడిచిన ఈ నాలుగైదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్తు దేశమంతా ఆయ నను నిశితంగా గమనించ సాగింది. ఎందుకంటే ఆయన గత తొమ్మిది, పదేళ్లుగా సాగిస్తున్న అలుపెరుగని పోరాటం దేశం దృష్టిని అంతగా ఆక ర్షించింది గనుక. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం అధిష్టాన దేవత కనికరించకపోయినా ఆయన ఓదార్పు యాత్రకు బయల్దేరిన నాటి పరిస్థితిని చూస్తే బాల గంగాధర తిలక్‌ రాసిన ఒక కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తాయి.
చిన్నమ్మా నేను వెళ్లొస్తాను..
చీకటి పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది..
శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతోంది..
దారంతా గోతులు.. ఇల్లేమో దూరం..
చేతిలో దీపం లేదు
ధైర్యమే ఒక కవచం..

అలా ధైర్యమే కవచంలా బయల్దేరిన బాటసారి పదేళ్ల తర్వాత చేసిన విజయ గర్జనతో దేశమంతా అతని వైపు చూసింది. పార్టీ నేతగా ఎన్నికైన వెంటనే ఆయన మాట్లాడిన తీరును, పక్క రాష్ట్రం ముఖ్య మంత్రిని ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలసిన వైనాన్ని.. ఆ తర్వాత ప్రధానమంత్రితో గంటకు పైగా భేటీ కావడం, జాతీయ మీడి యాతో మాట్లాడటం ఇవన్నీ ప్రజలంతా గమనించారు. కొన్ని వేలమంది నెటి జన్లు జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలా స్పందించిన వారిలో రచ యితలు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, మేధావులూ ఉన్నారు. జగన్‌ మాటల్లో చిత్తశుద్ధి, నిజాయతీ స్పష్టంగా కనిపిస్తోందని, విన యంగా మాట్లాడుతున్నా ఆ మాటల్లో పదనుందనీ, శక్తిమంతమైన నేతగా ఆయన కనిపిస్తున్నాడని పలువురు అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష నేత హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా నిలబెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచిన వెంటనే హోదా సాధనే తమ తొలి ప్రాధాన్యంగా ప్రకటించడమేగాక వెంటనే ప్రధానిని కలిసి హోదా అవసరాన్ని మరొక మారు గుర్తు చేయడం, రాష్ట్ర పరిస్థితిని ఆయన దృష్టికి తేవడం రాష్ట్ర ప్రజలకు బాగా నచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వెంట తీసుకుపోవడాన్ని కూడా అనేకమంది హర్షించారు. ప్రభుత్వ పాలనలో అధికార యంత్రాంగానికి ఆయన ఇవ్వబోయే గౌరవం, ప్రాముఖ్యతను ఈ సంఘటన తెలియజెప్పిందని చాలామంది సీనియర్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకున్నాను. అలా జరిగి ఉంటే మన ప్రత్యేక హోదా సులభంగా సాధించి ఉండేవాళ్లమని, నిర్మొహమాటంగా మాట్లాడటాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఎంజాయ్‌ చేశారు. హోదా సాధన అనే అంశానికి తాను ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడన్నది ఆ మాటల్లో వెల్లడైంది.

ఈ నాలుగైదు రోజుల్లో జగన్‌ను అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధి కారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన మర్యాద, వినయం, పలకరించే తీరుకు ఫిదా అయ్యానని ఒక అధికారి బహిరంగం గానే వ్యాఖ్యానించాడు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, పాలనా విషయాల్లోనూ, ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఆశ్చర్యం కలిగించిందని ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. రాజకీయ పరిణతి, పరిపాలనా పరిజ్ఞానం ఉన్న ఈ యువకుని చేతిలో రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని మరొక అధికారి ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికే జగన్‌ పరిణతి, వ్యక్తిత్వం, నిబద్ధత లోకానికి వెల్లడి కావడం బహుశా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే మీడియా సంస్థలను తీవ్ర నిరాశకు గురి చేసి ఉంటుంది. ఎందుకంటే నాన్‌– తెలు గుదేశం ముఖ్యమంత్రిగా ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక నెల రోజుల తర్వాత ఆ మీడియా సంస్థలు ఈ ముఖ్యమంత్రికి ఇంకా అధికార యంత్రాంగంపై పట్టు చిక్కలేదంటూ ఆనవాయితీగా వ్యాఖ్యానాలు రాసేవి. ఇప్పుడు జగన్‌ ఏర్పరుచుకున్న ఇమేజ్‌ వల్ల ఆ వ్యాఖ్యానం చేస్తే నవ్వుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది.

కష్టపడేతత్వం, మరో పాతికేళ్లు కష్టపడగలిగే వయసు, ప్రజలను ప్రేమించే గుణం, మంచిని గ్రహించే నేర్పు ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నేత ఆంధ్ర రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. నిర్జన ద్వీపంలో ఒంటరిగా ఉన్నా బతుకు భరోసాను కోల్పోక విశ్వాసాన్ని సడలనీ యకుండా పోరాడి విజయం సాధించిన రాబిన్‌సన్‌ క్రూసో లాంటివాడు జగన్‌రెడ్డి. తలపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తిచేసే, భర్తృహరి సుభాషితాల్లో చెప్పిన ఉత్తమ మానవుని లక్షణాలు కలిగిన వ్యక్తి జగన్‌. నట్టనడి సంద్రాన నావలా నిల్చున్న ఆంధ్రప్రదేశ్‌ను చుక్కాని పట్టి దరిజేర్చే నేర్పు జగన్‌కు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు నమ్ము తున్నారు. కొన్ని రాజకీయ, చారిత్రక కారణాల వల్ల సమస్యలు ఎదు ర్కొంటున్నప్పటికీ విస్తారమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రావని. స్ఫూర్తివంతమైన నాయ కత్వం లభిస్తే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఆ నాయకుడు జగనే కావచ్చు. ఆల్‌ ది బెస్ట్‌ టు ది డైనమిక్‌ లీడర్‌!
- వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top