తలంట్లు... ప్రైవేట్లు

Sri Ramana Satirical Story On Chandrababu And Modi Comments - Sakshi

అక్షర తూణీరం

అస్తస్తమానం ఇద్దరూ ఒకరికొకరు ప్రైవేట్‌ చెప్పేసుకుంటున్నారు. మొన్నామధ్య మోదీ అంకుల్‌ ఢిల్లీ నించి వచ్చేసి మన అంకుల్‌కి తలంటు పోసేశారు. వెంఠనే మనంకుల్‌ దోసెడు చమురు ఢిల్లీ అంకుల్‌కి అంటి, బోలెడు కుంకుడు కాయలతో జిడ్డంతా వదిలించి, వేడివేడి నీళ్లతో తలంటోసి తిరిగొచ్చారు. దానికోసానికి అంతంత దూరాలు విమానాలెక్కి తిరగాలా. పనీపాట లేకపోతే సరి అని బామ్మ కోంబడింది. అమరావతి నించి ఇంఖో పాద్ధ విమానంలో ఢిల్లీ వెళ్లిన బాబు అంకుల్‌ మొట్టికాయకి మొట్టికాయ వేశాడు. లెఖ్ఖ ప్రకారం ఏడో పన్నెండో శొంఠి పిక్కలు అటేపు పెట్టాడు. తిన్న టెంకెజల్లలు లెఖ్ఖ చెప్పాడు. నల్లచొక్కాలేసుకుని కాకుల్లా గోల చేశారని మా బాబాయ్‌ వ్యాఖ్యానించాడు. అఘోరించలేకపోయాళ్లే అంది బామ్మ. పేపర్‌ చదివేప్పుడు, టీవీ చూసేప్పుడు బాబాయ్‌ పాలిటిక్స్‌... పాలిటిక్స్‌ అని గొణుగుతూ ఉంటాడు. ఎందుకో ఏవిటో మనకి తెలీదనుకో. జాటర్‌ డమాల్‌. అంతే..! 

బుడుగు, సీగాన పెసూనాంబ సైజు పిల్లలు కూడా ఇక్కడ జరుగుతున్న దశ్యాల్ని చూసి నవ్వుకుంటున్నారు. విజ్ఞులకు హాస్యాస్పదంగా ఉంది. చిన్నప్పుడు పిల్లలకో కథ చెప్పి ఏడిపించేవాళ్లు. ముందు కథకి ‘ఊ’ కొట్టించేవారు. ముసలమ్మ బొంత కుడుతుంటే సూది బావిలో పడింది అనగానే పిల్లలు ఊకొడతారు. ఊకొడితే వస్తుందా? అని నస మొదలుపెడతారు. నవ్వితే వస్తుందా? అరిస్తే వస్తుందా అంటూ బాధిస్తారు. ఈ సన్నివేశంలో ఆ కథ గుర్తొస్తోంది. ‘ప్రధాని మోదీ పరమ ద్రోహి, ఏపీ పచ్చగా ఉంటే చూడలేడు. మనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు... అనే లూప్‌ని ముప్పొద్దులా వల్లిస్తారు చంద్రబాబు. 

నేను ఇన్ని కోట్లిచ్చా అన్ని కోట్లిచ్చానంటూ పెద్ద పెద్ద ఫిగర్స్‌ వల్లిస్తారు మోదీ. రామ రామ డబ్బులా? ఎప్పుడిచ్చారు? ఎక్కడిచ్చారు? నేనే పాపం ఎరగను. నా రాష్ట్ర ఓటర్లమీద ఒట్టు అంటున్నారు చంద్రబాబు. అది బావిలో సూది కథలా సాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. సామాన్యుడికి అర్థంకాని మర్మం ఒకటుంది. ఇచ్చింది కేంద్రం, పుచ్చుకుంది రాష్ట్రం– ఈ విషయాన్ని ఇన్ని వ్యవస్థలున్న ఈ ప్రభుత్వాలు నిగ్గు తేల్చలేవా? మొత్తం హిమాలయ పర్వతం ఎన్ని టన్నులు ఎన్ని గ్రాములు తూగుతుందో చెప్పగలిగే టెక్నాలజీ మనకుంది. బంగాళాఖాతంలో ఎన్ని మిల్లీ లీటర్ల నీరుంటుందో తేల్చగల శాస్త్రజ్ఞానం మనకుంది. మరి ఢిల్లీనించీ తరలివచ్చిన ఫండ్స్‌ని రూపాయి, పైసల్లో లెక్కించి తేల్చలేరా? ఇదొక పరమాశ్చర్య సంఘటన.

నలుగురు నికార్సయిన పెద్ద మనుషుల్ని, ఓ లెక్కలుకట్టే కంప్యూటర్‌ని పురమాయించండి. ఎంతిచ్చారు, ఎంత పుచ్చుకున్నారు మొదట తేల్చండి. అవి ఏ విధంగా వినియోగం లేదా కైంకర్యమైనాయో ఇంకో మెట్టులో తేల్చుకోవచ్చు. ఇంత చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో ప్రజ లకి బొత్తిగా తెలీడం లేదు. అయినా మోదీ మా రాష్ట్రంమీద, మా క్యాపిటల్‌ మీద మీకెందుకంత ఈర్ష్ష్య? మీరు ఆమధ్య విమానంలో వస్తూ, యక్షుడు ఆకాశమార్గాన అలకాపురిని విమర్శగా దర్శించినట్టు మా విశ్వ నగరాన్ని చూశారు. మీ కళ్లు కుట్టాయి. ఆ ఆకాశహర్మ్యాలు, మయసభని తలదన్నే సభా భవనాలు కాలుష్యమే లేని మహాద్భుత కర్మాగారాలు... ఒకటేమిటి అన్నీ కలిసి మిమ్మల్ని చిత్తభ్రమకు గురిచేశాయ్‌. ప్రస్తుతానికి కాగితంమీద ఉన్నాయ్‌. త్వరలో నేలమీదికి వస్తాయ్‌. అదీ కొసమెరుపు. 

మళ్లీ బుడుగు తెరమీదికొచ్చి, అయినా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏవిటా తలంట్లు పోసుకోడం అని హాచ్చర్యపడి పోయాడు. మన ఊరి పెద్ద కరణాన్ని పంపిస్తే చిట్టాలు చూసి కూడికలు వేసి లెఖ్ఖ నివిషంలో తేలుస్తాడంది మా బామ్మ. ‘ఇదంతా ఓటు కోసం గాలం’ అన్నాడు నాన్న. మనకేం తెలియదనుకో. బుడుగులకి ఓట్లు బీట్లు ఉండవ్‌. గాలం అంటే అదొక రకం వల. అయినా డబ్బుల కోసం ఎందుకింత యాగీ పడతారు? మా బామ్మ వత్తుల బుట్టలో కావల్సినన్ని... అడిగితే చచ్చినా ఇవ్వదు. మీరే పట్టికెళ్లండి. డబ్బు మిగిల్తే నాకో నిఝం రైలింజను కొనిపెట్టండి. 

వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top