రాహుల్‌ గాంధీ రాయని డైరీ | Rahul Gandhi unwritten Dairy | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీ రాయని డైరీ

Dec 17 2017 12:47 AM | Updated on Dec 17 2017 12:47 AM

Rahul Gandhi unwritten Dairy - Sakshi

హ్యాపీగా ఉంది. అమ్మే పక్కన ఉండి అన్నీ జరిపించింది. నాన్న ఉంటే నాన్నే అన్నీ జరిపించి ఉండేవారు. నాన్నమ్మ ఉంటే నానమ్మే అన్నీ జరిపించి ఉండేది. ఒకవేళ నానమ్మ చనిపోకుండా ఉన్నా, ఆవిడకు నూరేళ్లు పూర్తయ్యాయి కాబట్టి, నానమ్మే పక్కన ఉండి అన్నీ జరిపించడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుగా ఉండేది.

స్పీచ్‌లో అమ్మ నానమ్మని గుర్తు చేసుకుంది. నాన్నని గుర్తు చేసుకుంది. నన్ను కూడా గుర్తు చేసుకుంది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అమ్మ చెబుతూంటే అందరితో పాటు నాకూ వినాలనిపించింది. లైఫ్‌లో నేను చాలా దెబ్బలు తిన్నానని చెప్పింది. పాలిటిక్స్‌లో నాపై పర్సనల్‌ ఎటాక్స్‌ చాలా జరిగాయని చెప్పింది. అయినా కూడా నేను చాలా సహనంగా ఉన్నానని చెప్పింది. నేషన్‌ని చక్కగా లీడ్‌ చేస్తానని కూడా చెప్పింది.

అమ్మ తన స్పీచ్‌లో నానమ్మని ఇందిరాజీ అంది. నాన్నని రాజీవ్‌జీ అంది. నన్ను కూడా రాహుల్‌జీ అంది! అమ్మ అలా నన్ను ‘జీ’ అంటూంటే నాకు నవ్వొచ్చింది. మనసులో చాలాసేపు నవ్వుకున్నాను.
ముందు అమ్మ మాట్లాడింది. తర్వాత నేను మాట్లాడాను. అమ్మకన్నా ముందు మన్మోహన్‌జీ మాట్లాడారు. మన్మోహన్‌జీ మాట్లాడారు కానీ, మాట్లాడలేకపోయారు. మాటలు రావడం  లేదన్నారు. అమ్మ నానమ్మను గుర్తు చేసుకున్నట్లే, మన్మోహన్‌జీ నానమ్మ వాళ్ల నాన్న.. నానమ్మకు రాసిన ఒక ఉత్తరాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంపార్టెంట్‌ అకేషన్స్‌లో ఎమోషన్స్‌ అదిమి పెట్టుకోవాలని నానమ్మకు వాళ్ల నాన్న ఆ ఉత్తరంలో రాశారట. ‘ఎమోషనల్‌ అవడానికి నన్నీవేళ మీరు అనుమతిస్తారా అని అడిగేందుకు మీ మన్నింపును కోరుతున్నాను’ అన్నారు మన్మోహన్‌జీ. ‘నన్ను ఎమోషనల్‌ అవ్వనివ్వండి’ అని ఆయన అడిగిన పద్ధతి కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది.

మన్మోహన్‌జీ తన స్పీచ్‌లో ఇంకొకరిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన ఎవరో మన్మోహన్‌జీకి గుర్తులేనట్లుంది. ‘ఒక ప్రొఫెసర్‌’ అని మాత్రమే గుర్తు చేసుకున్నారు. భయపెట్టే రాజకీయాలు.. ఆశలు రేకెత్తించే రాజకీయాలకు చోటు లేకుండా చేస్తాయని ఆ ప్రొఫెసర్‌ అన్నాట్ట. ఆ మాట చెప్తూ మన్మోహన్‌జీ నావైపు చూశారు. ‘రాహుల్‌జీ.. ఆశలు రేకెత్తించే రాజకీయాల కోసం మీవైపు మేమంతా ఆశగా చూస్తున్నాం’ అన్నారు. ‘జీ’ అన్నట్లు చూశాను.

సాయంత్రం పెద్దవాళ్లంతా ఇంటికి వచ్చారు. నా ఫ్రెండ్స్‌ సచిన్‌ పైలట్, జ్యోతిరాదిత్య కూడా ఉన్నారు. ప్రియాంక అందరికీ టీలు అందిస్తోంది. మిస్టర్‌ వాద్రా అక్కడే ఉన్నారు. సచిన్, ఆదిత్యల మధ్య చేరి మిస్టర్‌ వాద్రా ఏదో అంటున్నారు! ముగ్గురూ నవ్వుతూ నావైపు చూస్తున్నారు.

అమ్మ, నేను, మన్మోహన్‌జీ కూర్చొని ఉన్నాం. ఆజాద్, ఖార్గే వచ్చి నాకు పూలగుచ్ఛం ఇచ్చారు. ‘జరగవలసింది జరిపించారు. జరిపించాల్సిన దాన్ని కూడా జరగనివ్వండి సోనియాజీ’ అన్నారు. అమ్మ కూడా నవ్వుతూ నావైపు చూసింది.
      -మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement