మాండలిక మాధుర్యాల పదకోశం

Raghava Sharma Article On Annamayya Kshetriya Literature - Sakshi

సందర్భం  

మాండలికాలు మన వారసత్వ సంపద. జానపద విజ్ఞానం మాండలికాల నుంచి పుట్టిందే. ప్రాచీన కాలంలో అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, సారంగపాణి, రామదాసు వంటి వాగ్గేయకారులు, వేమన, బద్దెన వంటి శతకకర్తలు మాండలికాలను వాడారు. యక్షగానాల్లోనూ పాత్రోచితంగా మాండలికాలను ఉపయోగించారు. సాహిత్యంలో గ్రాంధికం నుంచి శిష్టవ్యవహారికానికి, అక్కడ నుంచి మాండలికానికి ప్రాధాన్యత పెరిగి నేడు సాహిత్య రచన భాషగా మాండలికం నిలదొక్కుకుంది.

ఈ మాండలిక భాషా సంపదను భద్రపరుచు కోవడం మన బాధ్యత. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఆచార్య మూలె విజయలక్ష్మి ఆ బాధ్యతను ఎప్పటి నుంచో భుజానికెత్తుకున్నారు. వ్యావహారిక భాష నుంచి జాతీయాలు సేకరించి 2008లో ‘తెలుగు జాతీయాలు పర్యాయ పదకోశం’ నిర్మించారు. భారతీయ భాషల్లో జాతీయాలకు నిర్మించిన తొట్టతొలి పర్యాయపదకోశంగా ఇది గుర్తింపు పొందింది. దీనికి ముందు ‘తెలుగు జాతీయాల కోశం’ నిర్మించారు. తెలుగులో ప్రథమ మహిళా నిఘంటు నిర్మాతగా గుర్తింపు పొందారు. గతంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన ‘తెలుగు మాండలిక పదకోశం’ తెచ్చిన వీరు, తాజాగా చిత్తూరు జిల్లాకు కూడా ‘తెలుగు మాండలిక పదకోశం’ నిర్మించారు. తన గురువర్యులైన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, నిఘంటు నిర్మాత జిఎన్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం ఈ పదకోశాన్ని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆవిష్కరింపచేశారు.

భాష సామాజికం కనుక, సమాజంలో కనిపించే మార్పులు భాషలోనూ కనిపిస్తాయి. సమాజంలో ఉండే కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాల అంతరాలు భాషా వైవిధ్యానికి  దారితీస్తున్నాయి. చారిత్రకంగా, సామాజికంగా, ప్రాంతీయంగా భాషలో కలిగే మార్పులు, విలక్షణత, వైవిధ్యాన్ని మాండలికం అంటున్నాం. ఒక ప్రాంతంలో వాడే ప్రత్యేక పదాలు, పదబంధాలు, జాతీయాలు, సామెతలు, వ్యాకరణాంశాలు, ధ్వని పరిణామాలు, అన్యదేశ పదాలు ఒక ప్రాంత మాండలిక ప్రత్యేకతను పట్టిస్తాయి. మాటల ఉచ్ఛారణ తీరు ‘యాస’ కూడా మాండలికంలో భాగమే.

తెలుగు భాషా ప్రాంతాన్ని స్థూలంగా కళింగాంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ అనే నాలుగు భాషా మండలాలుగా భద్రిరాజు కృష్ణమూర్తి విభజించారు. అయినప్పటికీ, ఆయా జిల్లాలకే పరిమితమైన పదజాలం, మాండలికత ఉంది. జిల్లా అంతటా కూడా భాషలో, యాసలో ఏకరూపత లేదు. ప్రాంతీయ, స్థానిక మాండలికాలకు ఖచ్చితంగా గిరిగీసి సరిహద్దులు ఏర్పాటు చేయలేం. తెలుగు పదజాలం, వ్యాకరణాంశాలు, ధ్వనిమార్పుల్లో ఉన్న వైవిధ్యం, విలక్షణత, భాష సుపంపన్నతను తెలియచేస్తుంది.

ఏ రెండు మాండలికాలైనా భిన్న అర్థాలు ధ్వనిస్తే వాటిని భిన్న భాషలుగా గుర్తించవచ్చు. ఒక భాషలోని మాండలికాలే భిన్నభాషలుగా రూపాం తరం చెందినట్టు భాషా పరిణామ చరిత్ర చెపుతోంది. మూల ద్రావిడ భాష నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తదితర భాషలు పుట్టుకు రావడం ఇందుకు నిదర్శనం.

జిల్లాల వారీగా వ్యావహారిక ఖండికల్ని సేకరించి, ఆయా జిల్లాల మాండలిక భాషా నిర్మాణ భేదాల్ని గతంలో బూదరాజు రాధాకృష్ణ విశ్లేషించారు. జిల్లాల వారీగా జరగని మాండలిక పదసేకరణను ఈ ‘తెలుగు మాండలిక పదకోశం’లో మూలె విజయలక్ష్మి చేపట్టారు. కేవలం పదాల సేకరణకే పరిమితం కాకుండా, వాటి అర్థాలను, వాడే తీరును కూడా వివరించారు. నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావం వల్ల మాండలిక పదజాలం కాలగర్భంలో కలిసిపోకముందే వాటిని నిక్షిప్తం చేయడం ఎంతైనా అవసరం. 

రాఘవశర్మ
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మొబైల్‌ : 94932 26180 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top