జనరంజకం నిర్మల బడ్జెట్‌

Purighalla Raghuram Article On NDA 2019 Union Budget - Sakshi

సందర్భం

భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం బడ్జెట్‌ ను రూపొందించింది. ఆ మేరకు విధానపరమైన చర్యలను కూడా తీసుకుంది. ఇదంతా కార్పొరేట్లకు సంబంధించిన వ్యవహారం అని, తమకేమీ సంబంధం లేదని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అనుకుంటుంటారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్, పారిశ్రామిక అభివృద్ధి అన్నంతవరకే పరిమితం కాలేదు. దానికి నిదర్శనమే నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌. అందులో పేర్కొన్నట్లుగా.. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగానికి చేరుకుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఇచ్చిన చేయూత. ఆరు వేల పెట్టుబడి మద్దతును రైతులందరికీ అందిస్తామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది దుకాణదారులు, వాటిలో పనిచేసే వారికి మేలు చేకూర్చేలా పెన్షన్‌ పథకాన్ని వర్తింపచేయాలని బడ్జెట్‌లో ప్రకటించటం అందరూ స్వాగతించాలి.  

ఆదాయపు పన్ను, జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం అధికంగా అంచనా వేసి చూపించిందని, అంత సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను 23.25 శాతం, జీఎస్టీ 44.98 శాతం చొప్పున పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఆయన లెక్కలు వేశారు. కానీ, ఈ లెక్కలకు ఆధారం ఏం టి? ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారు? అని నిర్మల రాజ్యసభలో ప్రశ్నిస్తే.. సరిగ్గా ఆమె మాట్లాడే రోజు చిదంబరం సభకు హాజరు కాలేదు. వాస్తవానికి ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను, ఇతర పన్నులన్నీ కలిపితే ఆదాయపు పన్నుగా లెక్కిస్తారు. బహుశా చిదంబరం కార్పొరేట్, ఇతర పన్ను ల్ని తీసేసి ఆదాయపు పన్ను ఒక్కదానినే లెక్కించి అంత రాబడి అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు అని నిర్మలా సీతారామన్‌ బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ చిదంబరం వేసినవి కాకిలెక్కలేనని పార్లమెంటులోనే నిర్మలా సీతారామన్‌ తూర్పారబట్టారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బ్యాంకుల నెత్తిన పెట్టిన మొండి బాకీల స్థాయి ఎక్కడికి చేరిందంటే.. ప్రభుత్వ రంగ, జాతీయస్థాయి బ్యాంకులు అసలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రిజర్వ్‌ బ్యాంకు ఈ మొండి బాకీలపై ఒక నివే దిక వెలువరించింది. మొండి బాకీలకు కారణం ప్రభుత్వ, బ్యాంకు విధానాల్లోని లోపాలు కూడా కారణమని తెలిపింది. అలాంటి విధాన లోపాలను గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం సవరించింది.   

బడ్జెట్‌ అంటే ఒకప్పుడు పైపై మెరుగులు, ఆయా వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు కేటాయింపులు ప్రకటించి శభాష్‌ అనిపించుకోవడాలు మాత్రమే అన్నట్లుగా ఒక తంతుగా జరిగేది.అలాం టి కాస్మొటిక్‌ వ్యవహారాలకు మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాగా, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవని, పోలవరం లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు, ఎంపీలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. పోలవరం సహా ఆయా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. వీటికి ఆయా శాఖల ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ప్రత్యేకంగా బడ్జెట్‌ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నది నిజమే. కానీ, అలా ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు, రాష్ట్రం గురించి కూడా మంత్రి ప్రసంగంలో చోటివ్వలేదన్నది కూడా నిజం. ఎందుకంటే ఇది దేశాభివృద్ధికి రూపొందించిన బడ్జెట్‌ కాబట్టి.  

పైగా, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కొనసాగింపుగా పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌. దానికి తోడు ప్రస్తుత ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. కొత్త ఆర్థిక సంఘం నివేదిక ఈ ఏడాది నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అంటే.. అందులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్‌లో సైతం జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధుల వస్తాయని పేర్కొన్నది. ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు జగన్‌ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే నిధుల కేటాయించడం, రాష్ట్రం లోని గుళ్లకు చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ కేటాయింపులు చేయడం స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడులాగా కేటాయింపులు చేసి వదిలేయటం కాకుండా వాస్తవంగా ఆ కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి జగన్‌ మడమతిప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలి.

పురిఘళ్ల రఘురామ్‌
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top