వరదలనూ వదలని రాజకీయాలు

Politics On Kerala Floods - Sakshi

సందర్భం

విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహాయక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశ ముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకోలేదు. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులే అయినప్పటికీ యూఏఈ వరదసాయాన్ని కేంద్రం తిరస్కరించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావనిపిస్తోంది. మరికొందరు దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివారణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడటం దురదృష్టకరం.

కేరళలో వచ్చిన వర దలు గత వందేళ్లలో ఆ రాష్ట్రం చూడని వర దలు. ఈ ప్రకృతి వైప రీత్యాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పూర్తి అవగాహన, పరస్పర సహకా రంతో పనిచేశాయి. బాధితులను రక్షించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్‌ఎఫ్‌), స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాయి. పూర్తి సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు చేతనైతే తమవంతు సహాయం అందించడం లేదా నైతిక మద్దతు ప్రకటించడం వదిలేసి కొంతమంది అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా పెట్టుకున్నారు. దక్షిణ భార తదేశంలో జరిగే ఉపద్రవాలకు కేంద్రం సరైన సహ కారం అందించడం లేదని బాధ్యతారహితంగా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఉపద్రవ సహాయక కార్యక్రమాలతో సంబంధంలేని, అవగాహన లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపద్రవlసహా యక కార్యక్రమాలను పర్యవేక్షించే వ్యక్తి వ్యాఖ్యలు చేసినప్పుడు వాటికి ప్రాధాన్యం సంతరిస్తుంది. ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ ట్విట్టర్లో రాష్ట్రప్రభుత్వం వరదల సహాయం కోసం కేంద్రాన్ని రూ. 2,200 కోట్లు అడిగిందని. కేంద్రం రూ. 600 కోట్లు ఇచ్చిం దని, యూఏఈ ప్రభుత్వం రూ. 700 కోట్లు ఇస్తా మంటే కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని అర్థం వచ్చేలాగా ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యానాల ఉచితాను చితాలను విశ్లేషించే ముందు భారతదేశంలో విప త్తులను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యవస్థీకృత విధానం ఉన్నదో పరిశీలిద్దాం.

ఈనాడు ప్రపంచంలో చాలా దేశాలలో లేని విధంగా విపత్తులను ఎదుర్కోవడానికి భారత దేశంలో చక్కని విధివిధానాలు రూపొందించారు. అమెరికా కత్రినా తుపాను ఎదుర్కొన్న విధానంతో పోల్చుకుంటే భారతదేశం వరదలు–తుపాన్లు వంటి ఉపద్రవాలు చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నది. 2005లో కేంద్ర ప్రభుత్వం విపత్తుల పర్యవేక్షణ చట్టాన్ని రూపొందించింది. అదేవిధంగా విపత్తుల నిర్వహణ ప్రణాళిక తయారుచేశారు. ఈ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి విపత్తుల నివారణ, నిర్వహణ కోసం రూపొందించిన సెండాయ్‌ సమావేశపు విధి విధానాలకు అనుగుణంగా రూపొందించారు. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ ఉప ద్రవ పర్యవేక్షణ వ్యవస,్థ రాష్ట్రస్థాయిలో ముఖ్య మంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ, జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉపద్రవ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

అదే విధంగా ఉపద్రవ సమయాలలో సహాయ రక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక బలగం ఎన్డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటు చేశారు. ఉపద్రవ సహాయ రక్షణ కార్యక్రమాలలో శిక్షణనిచ్చి సామర్థ్యాలు పెంచ డానికి ఒక ప్రత్యేక శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ దక్షిణభారత కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని గన్నవరం సమీపంలో రూపుదిద్దుకుం టోంది. వీటన్నిటికీ మించి ఉపద్రవ సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్యాబినెట్‌ సెక్రటరీ ఆధ్వ ర్యంలో ఒక కమిటీ, రాష్ట్రస్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో కమిటీ, జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తాయి. ఈ కమిటీలు రోజువారీగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం ద్వారా మీటింగులు నిర్వహించుకొని ఉపద్రవ నివారణ రక్షణ కార్యక్రమాలకు దిశానిర్దేశం చేస్తుంటాయి.

ఉప ద్రవ నివారణ, రక్షణ కార్యక్రమాలను నిర్వహించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు, అధికా రులు పూర్తి సమన్వయంతో సహకారంతో పనిచేయ డంలో ఈ కమిటీలు చాలా ప్రధాన పాత్ర పోషి స్తాయి. హుదూద్‌ తుపాన్‌ సందర్భంలో ఈ కమిటీల పాత్రను, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల నుంచి పూర్తి సహాయ సహకారాలను నేను ప్రత్యక్షంగా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య కార్యదర్శిగా  చూశాను. రక్షణ హోం శాఖ కార్యదర్శులను అర్ధరాత్రి అపరాత్రి సమ యాల్లో కూడా ముఖ్య విషయాల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. వారి స్పందన కూడా సమస్యల పరిష్కారానికి అనుకూలంగా ఉండేది. నేడు కేరళ వరదలు ఎదుర్కోవడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని అనుకోవటానికి అవకాశాల్లేవు.

వివాదమంతా ఆర్థిక సాయం గురించే!
ఇక ఎటొచ్చి సమస్యంతా ఆర్థిక సహాయం గురించే. విపత్తుల నివారణకు, నిర్వహణకు కావాల్సిన ఆర్థిక సదుపాయాలకోసం విధి విధానాలను ఆర్థిక సంఘాలు నిర్దేశిస్తాయి. 2005 విపత్తుల నిర్వహణ చట్టం తర్వాత వచ్చిన 13, 14 ఆర్థిక సంఘాలు ఈ అంశంపై దృష్టి పెట్టి విపత్తు నిర్వహణకు కేంద్ర  స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్‌ఎస్, డీఆర్‌ఎఫ్‌ అనే రెండు నిధులను ఏర్పాటు చేశాయి. కేంద్రం కొన్ని ప్రత్యేక డ్యూటీల ద్వారా కేంద్ర స్థాయి నిధికి వనరులు సమీకరిస్తోంది. అదనంగా బడ్జెట్‌ నుంచి అవసరాన్నిబట్టి కేటాయిస్తోంది. రాష్ట్రస్థాయి నిధికి ఈ కేంద్ర నిధి నుంచే ఆర్థిక సంఘం నిర్ణయించిన విధంగా నిధుల కేటాయింపు జరుగుతుంది. 14వ ఆర్థిక సంఘం ముందు ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులను కేంద్రం 75 శాతం, రాష్ట్రాలు 25 శాతం భరించేవి. 14వ ఆర్థిక సంఘం కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం భరించేటట్లు నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును అనుసరించి 2015 –20 మధ్య వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి విపత్తుల నిర్వహణకు రూ. 55 వేల కోట్ల కేటాయింపులు జరి గాయి. గత సంవత్సరాల్లో విపత్తు నిర్వహణలో రాష్ట్రాలు పెట్టిన ఖర్చు ఆధారంగా ఈ కేటాయిం పులు జరిగాయి. ఇది శాస్త్రీయ విధానం కాదని గుర్తించి విపత్తుల సూచికను రాష్ట్రాలవారీగా తయా రుచేయాలని 14వ ఆర్థిక సంఘం అభిలషించింది. ఇది కష్టసాధ్యమైన విషయంగా గుర్తించి అంతకు ముందు విపత్తులపై రాష్ట్రాలు చేసిన ఖర్చులను కొలబద్దగా తీసుకుని రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు.

ఇందువల్ల ఇంతకుముందు ఉపద్రవాలు ఎదుర్కొన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు జరి గాయి. ఉదాహరణకు ఈ ఐదేళ్ల కాలంలో అంటే 2015 నుంచి 2020 దాకా కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రూ. 2,186కోట్లు మధ్యప్రదేశ్‌కు రూ. 4,363 కోటు,్ల మహారాష్ట్రకు రూ. 7,376కోట్లు కేటా యించగా, కేరళకు ఈ ఐదేళ్లలో ఈ నిధి కింద కేటాయింపు రూ. 919 కోట్లు మాత్రమే. ఇంతకు ముందు సంవత్సరాల్లో కేరళలో ఉపద్రవాలు లేనం దువల్ల అవి ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి కేటాయింపులు తక్కువే జరిగాయి. అందు వల్ల ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కేరళ ఎక్కువ ఆర్థిక సహాయం అడగటానికి హేతుబద్ధమైన ప్రాతి పదిక ఉంది. ఎక్కువ కేటాయింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉపద్రవాలు రానప్పుడు కేటాయించిన నిధులను వెనుకకు తీసుకునే వెసులుబాటునూ 14వ ఆర్థిక సంఘం కల్పించినట్టు లేదు. అలాంటి వెసు లుబాటు ఉంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ మీద అదనపు భారం పడకుండా ఖర్చు కాని రాష్ట్రాల నుంచి ఈ నిధులను కేరళ లాంటి రాష్ట్రానికి మళ్లించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం కనుక 15వ ఆర్థిక సంఘం అయినా ఈ అంశంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ఏదైనా విపత్తు సంభ వించినప్పుడు ప్రధానమంత్రి విపత్తు ప్రాంతాలు పరిశీలించి ప్రకటించే సాయం తాత్కాలికమైనది. పూర్తి సహాయాన్ని నిపుణుల బృందం వచ్చి పరిశీ లించాక నిర్ధారిస్తారు. వెంటనే నిర్వహించవలసిన రక్షణ, సహాయ కార్యక్రమాలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు.

విదేశీ సాయంపై అధికారం కేంద్రానిదే
విదేశీ సహాయం విషయాల్లో ఈ అంశాల్లో నిర్ణయా« ధికారాన్ని విపత్తుల నివారణ ప్రణాళిక కేంద్రప్రభు త్వానికి వదిలేసింది. విదేశీ సహాయం తీసుకోవడం ద్వారా ఒక రాష్ట్రానికి అధిక సాయం లభిస్తే మరో సారి ఇంకో రాష్ట్రానికి తక్కువ సహాయం జరిగి సహా యక చర్యల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశముంది. ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకో లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు విదేశీ సాయం లేనప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలో ఆలోచించి ఈ విషయంలో  నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్‌ సింగ్‌  ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి అంశాలన్నిం టిని సమగ్రంగా పరిశీలించి జాతీయ విపత్తులకు విదేశీ సహాయం తీసుకోలేదు. అదే సంప్రదాయాన్ని ఈనాడు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించాక కొనసాగించడానికి నిర్ణయించినట్టుగా కనిపిస్తోంది.

యూఏఈ ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న సహాయం ఊహా పరమైనదేనని తెలిసిపోయింది. కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి చాలా అనుభవజ్ఞులు. పై అంశాలేవి వారికి తెలియనివి కావు. ఈ పై అంశాల దృష్ట్యా వారు చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావ నిపిస్తోంది. మరికొందరు ఉత్తర, దక్షిణ భారత అంశాలను ప్రస్తావించి దక్షిణాది రాష్ట్రాల విష యంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. విధి విధానాలను అనుసరించి జరిగే విపత్తుల నివా రణ నిర్వహణ కార్యక్రమాలను ఈ కోణంలో చూడ టం దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఇలాంటి విపత్తే తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి ప్రాంతా ల్లో వస్తే దేశం ఇంత నిశితంగా చూసి ఉండేది కాదు. సహాయ సహకారాలు అంతంతమాత్రంగానే ఉండి ఉండేవి. కారణం ఆ రాష్ట్రాల వెనుకబాటుతనం. సమర్థ నాయకత్వ లోపం. దక్షిణాది రాష్ట్రాల్లో పరి స్థితులు వేరు. భవిష్యత్తులో తమ సమస్యలను స్పష్టంగా వినిపించగల, సాధించుకోగల సమర్థ నాయకత్వాలు కలిగిన దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కన్నా ఈ విషయాల్లో ముందే ఉంటాయి.


వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ‘ iyrk45@gmail.com
ఐవైఆర్‌ కృష్ణారావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top