ట్రంప్‌ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ

Madhav Singaraju Rayani Dairy On Trump - Sakshi

చేతులు ముఖానికి అంటించుకోడానికి లేదు. ముఖానికి రుద్దుకోడానికి లేదు. కళ్లు నులుముకోడానికి లేదు. చూపుడు వేలిని, మధ్య వేలిని కలిపి తుపాకీలా కణతల దగ్గర అలవాటు ప్రకారం పెట్టుకోడానికి లేదు. ఏదీ పట్టించుకోని వాడికి నాకే ఇలా ఉందంటే అన్నీ పట్టించుకునే ప్రపంచానికి ఎలా ఉందో! 
‘‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌ మీరేం చేయబోతున్నారు?’’ 
వైట్‌హౌస్‌ కరోనా మీటింగ్‌లో ఎవరిదో గర్జన.. ‘హ్యాండ్స్‌ అప్‌’ అన్నట్లు!
ఆ సింహం ఎవరా అని చూశాను. ‘ఇట్స్‌ మీ’ అంది ఆ చెయ్యి. చేతికి గ్లవుజ్‌ ఉంది. ముఖానికి మాస్క్‌ ఉంది. 
‘‘నువ్వు వాషింగ్టన్‌ పోస్టు అనే చెత్త పత్రిక నుంచి వచ్చి ఉంటే కనుక నేనేం చేయబోతున్నదీ తెలుసుకునే కర్మ నీకు లేదు. ఎలాగూ నువ్వు రాయదలచుకున్నదే కదా నువ్వు రాస్తావు.’’ అన్నాను. 
‘‘నేను వాషింగ్టన్‌ పోస్టు నుంచి రాలేదు’’ అంది ఆ చెయ్యి.
ఆ చేతి వంక కొన్ని క్షణాలు ఆపేక్షగా చూశాను. గ్లవుజును తొలగించి ఆ చేతిని తాకాలన్న కోరిక కలిగింది. అతడు వాషింగ్టన్‌ పోస్టు నుంచి రానందు వల్ల నాలో జనించిన ఆపేక్ష కాదు అది. వాషింగ్టన్‌లో ఎవర్ని చూసినా మొదట వాళ్ల చేతుల మీదకే పోతోంది నా మనసు. కరోనాలో ఒక మంచితనం ఉంది. మన చేతులతో మన ముఖాన్ని తాకనివ్వదు కానీ, మన ముఖంతో అవతలి వాళ్ల చేతుల్ని ఎంత దూరాన్నుంచయినా తాకనిస్తుంది. 
‘‘వాషింగ్టన్‌ పోస్టు నుంచి రాకపోతే.. నా భార్య నిద్ర లేవగానే చూస్తూ కూర్చుండే ఆ దరిద్రపు గొట్టు సీఎన్‌ఎన్‌ చానల్‌ నుంచి వచ్చావా?’’ అని అడిగాను. 
‘‘లేదు మిస్టర్‌ ప్రెసిడెంట్‌. నేను మీ దేశపు వార్తాపత్రిక నుంచి కానీ, మీ దేశపు న్యూస్‌ చానల్‌ నుంచి కానీ రాలేదు. లండన్‌లోని రాయిటర్స్‌ న్యూస్‌ ఏజెన్సీ ప్రతినిధిని నేను. కరోనా వైరస్‌ నుంచి అమెరికన్‌ ప్రజల్ని కాపాడేందుకు ఈ అత్యవసర సమావేశంలో మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు?’’ అన్నాడు ఆ చెయ్యి గల మనిషి.
‘‘ముందొక విషయాన్ని మీరు గ్రహించాలి మిస్టర్‌ రాయిటర్స్‌. ఇది అత్యవసర సమావేశం కాదు. సమావేశం. మామూలు దగ్గు జలుబుల వంటి సమావేశం. ఇండియా నుంచి వస్తున్న క్లోరోక్విన్‌ బిళ్లలు వేసుకుంటే తగ్గిపోయే జ్వరంలాంటి సమావేశం’’ అన్నాను. 
‘‘కానీ మిస్టర్‌ ప్రెసిడెంట్‌. మీరంటున్న మామూలు దగ్గు జలుబులతో మరణిస్తున్న వారు మీ దేశంలో ఎక్కువవుతున్నారు. మీరు ఏర్పాటు చేసిన సమావేశం అత్యవసరం అయింది కాకపోవచ్చు. కానీ అత్యవసరంగానే కదా ఏర్పాటు చేశారు. చెప్పండి. మీరేం నిర్ణయం తీసుకోబోతున్నారు? యు.ఎస్‌.లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే మూడ్‌లో ట్రంప్‌ ఉన్నారని మాకేవో వార్తలు అందుతున్నాయి’’ అన్నాడు!
‘‘నా నిర్ణయాలింకా నా ఫోర్‌హెడ్‌లోనే ఉన్నాయి. అలాంటప్పుడు వార్తలుగా అవి మీకెలా అందుతాయి’’ అన్నాను వేళ్లను నుదుటికి ఆన్చుకుని. 
‘‘అవి ఎప్పుడు బయటికి వస్తాయి.. మీ ఫోర్‌హెడ్‌ నుంచి’’ అన్నాడు! 
‘‘లాక్‌డౌన్‌ని ఎత్తివేయడం అంటే ఎకానమీని రీ–ఓపెన్‌ చెయ్యడం. నేను రీ– ఓపెన్‌ గురించి చెబుతామనుకున్నాను. నువ్వు ఎత్తివేత గురించి అడుగుతున్నావు’’ అన్నాను. 
‘‘కానీ ప్రాణాలు ముఖ్యమైనవి కదా మిస్టర్‌ ప్రెసిడెంట్‌..’’ అంటున్నాడు. 
‘‘అమెరికాలో మూతికి మాస్క్‌ కట్టుకుని కనిపించే చిట్టచివరి మనిషిని నేనే అవుతాను మిస్టర్‌ రాయిటర్స్‌. పోతున్న ప్రాణాల గురించి నువ్వు రాసుకో.  పోనివ్వకూడని ఎకానమీ ప్రాణాల గురించి నేను ఆలోచిస్తాను’’ అన్నాను.
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top