నితీశ్‌ కుమార్‌ (బిహార్‌ సీఎం)

Madhav SingaRaju Article On Nithish Kumar - Sakshi

రాయని డైరీ

ఢిల్లీ నుంచి శుక్రవారమే పట్నా వచ్చేశాను. ఇంకో రోజు ఢిల్లీలోనే ఉండి ఉన్నా అక్కడ నేను మాట్లాడవలసిన వాళ్లెవరూ లేరు. వాళ్లూ అంతే. ఎక్కడ నాతో మాట్లాడవలసి వస్తుందోనని నేను అక్కడ ఉండగానే ఎవరి శాఖల్లో వాళ్లు బిజీ అయిపోడానికి తొందరపడుతున్నారు. 
‘‘వెళ్లొస్తాను’’ అన్నాను.. ప్రమాణ స్వీకారాలు, పోర్ట్‌ఫోలియోలు అవగానే. 
‘‘ఏమీ తీసుకోకుండానే వెళ్తున్నారు’’ అన్నారు అమిత్‌ షా, ఆయన పక్కన ఉన్నాయన.. బాగా బాధపడిపోతూ! 
‘‘ఒకటే ఇస్తామని మీరు అన్నందుకు నేను బాధపడాలి కానీ, ఇస్తానన్న ఆ ఒక్కటì  కూడా వద్దన్నందుకు మీరెందుకు బాధపడాలి అమిత్‌జీ?’’ అని అడిగాను.
‘‘ఇస్తుంటే వద్దని వెళ్లిపోవడం బాధ కలిగించే సంగతే కదా నితీశ్‌జీ. అయినా బిహార్‌కి ఐదు ఇచ్చాం కదా’’ అన్నారు షా!
‘‘బిహార్‌కి ఐదు ఇచ్చారు కానీ, జేడీయూకి ఐదు ఇచ్చారా అమిత్‌జీ. ఐదు కూడా వద్దు. మూడే కదా మేము అడిగింది. ఒక కేబినెట్, ఒక ఇండిపెండెంట్, ఒక సహాయ మంత్రి’’ అన్నాను. 
‘‘ముందైతే ఒకటి తీసుకోండి నితీశ్‌జీ’’ అన్నారు. వద్దంటే వద్దన్నాను. 
వచ్చింది కదా అని తీసేసుకుంటే, తీసుకున్నాక ఇక వచ్చేదేమీ ఉండదు. ఎవరికైనా ఇచ్చిందే గుర్తుంటుంది. ‘ఇస్తానన్నారు కదా’ అని గుర్తు చేస్తే ‘ఇచ్చేశాం కదా గుర్తులేదా’ అని మనకే గుర్తు చేస్తారు!
‘‘అమిత్‌జీ.. ఏ సభలోనూ సభ్యులు కాని పాశ్వాన్‌ని, జైశంకర్‌ని కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు. మాకివ్వడానికి మాత్రం మీకు చేతులు రావడం లేదు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా?!’’ అన్నాను. 
‘‘మీ బాధకు అర్థం లేదు నితీశ్‌జీ’’ అన్నాడు హఠాత్తుగా.. అమిత్‌ షా పక్కన ఉన్నాయన! ఆయన్ని ఎక్కడో చూసినట్లుంది కానీ ఎక్కడ చూసిందీ గుర్తుకు రావడం లేదు. 
‘‘మీరెవరో గుర్తు చేసుకోడానికి మీ ముందే నేను ప్రయత్నిస్తూ  కనిపించడం మీకు ఇబ్బందిగా ఏమీ అనిపించదు కదా’’ అన్నాను ఆయనతో. ఆ మాట ఆయన్నేమీ కదలించలేదు. అమిత్‌ షా మాత్రం బాగా కదిలిపోయారు. 
‘‘నా పక్కన ఉన్న మనిషిని గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పడం ద్వారా మీరేమి సంకేత పరచదలచుకున్నారో రెండు విధాలుగా నేను అర్థం చేసుకోగలను నితీశ్‌జీ. అమిత్‌షా పక్కన కూర్చొని ఉన్నా కూడా, మీరు ఆ మనిషికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదనేదొకటి. బిహార్‌లోని మొత్తం నలభై సీట్లలో బీజేపీకి పదిహేడు సీట్లు సంపాదించి పెట్టిన వ్యక్తిని ఒక ప్రముఖుడిగా గుర్తించడానికి మీరు సిద్ధంగా లేరనేది మరొకటి. వినండి నితీశ్‌జీ.. ఈయన పేరు భూపేందర్‌ యాదవ్‌. బిహార్‌ బీజేపీ ఇన్‌చార్జి’’ అన్నారు అమిత్‌షా.
‘ఓ! మీరేనా!’ అన్నట్లు భూపేందర్‌ వైపు చూశాను. ‘అవును.. నేనే’ అన్నట్లు చూశాడు భూపేందర్‌.
‘‘కానీ అమిత్‌ జీ.. బిహార్‌లో పదిహేడు సీట్లు గెలవడానికి కారణమైన భూపేందర్‌ని గుర్తించలేదని మీరు కదలిపోయారు. పదహారు సీట్లు గెలిచిన జేడీయూని గుర్తించకుండా ఒకే మంత్రి పదవి ఇస్తామన్నందుకు నేనెంత కదలిపోవాలి’’ అన్నాను. 
అమిత్‌ షా, భూపేందర్‌ అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయారు! 
పట్నా వచ్చి ఇరవై నాలుగు గంటలు దాటింది. ఢిల్లీ నుంచి ఎవరూ ఫోన్‌ చెయ్యలేదు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైముంది. ఆలోపైనా చెయ్యాలి. చెయ్యలేదంటే.. బిహార్‌లో ఈసారి తనెవరికీ, తనకెవరూ సపోర్ట్‌ చేసే అవసరం ఉండదన్న గట్టి నమ్మకంతో బీజేపీ ఉందని. 
-  మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top