రాయని డైరీ; దేవె గౌడ (మాజీ ప్రధాని)

Madhav Singaraju Article On Deve Gowda - Sakshi

లోక్‌సభలో రేపు నా చివరి ప్రసంగం. లోక్‌సభకు కూడా ఇవి చివరి ప్రసంగ దినాలే. సోమవారం నాకు చివరిది. బుధవారం లోక్‌సభకు చివరిది. లోక్‌సభకు చివరి రోజులు కాబట్టి నాలాగే అందరూ ప్రసంగించాలనుకుంటే కనుక మొన్న ఏడో తారీఖున లోక్‌సభలో నేను మాట్లాడిందే నా చివరి ప్రసంగం అవుతుంది.

ఆరోజు నాకేం తృప్తిగా అనిపించలేదు. తనివితీరా మాట్లాడాలని మనసు ఎంతగానో తపించింది. ‘‘అయినా సరే, ‘కొంతే’ మాట్లాడాలి మీరు’’ అని కటువుగా అనేశారు సుమిత్రా మహాజన్‌! ఒక మాజీ ప్రధానికి స్పీకర్‌ ఇచ్చిన ఆరు నిముషాలు ఆ ‘కొంత’కు మాత్రం ఎలా సరిపోతాయి?!

ఆరు నిముషాల్లోనే అన్నీ చెప్పేయాలని ఎమోషనల్‌ అవుతుంటే.. ఐదో నిముషంలోనే ‘‘మీ టైమ్‌ అయిపోతోంది గౌడాజీ’’ అని స్పీకర్‌ గుర్తుచేశారు. ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయాను. గుర్తొచ్చే సరికి ఆరో నిముషమూ గడిచిపోయింది! 

‘‘మేడమ్‌ స్పీకర్‌ మహాజన్‌.. మరికొంత సమయం కావాలి’’ అని అభ్యర్థించాను. ‘అవసరమా?’ అన్నట్లు, కళ్లజోడులోంచి చూశారావిడ! ప్రధాని అవకముందు గానీ, ప్రధానిగా ఉన్నప్పుడు గానీ, మాజీ ప్రధానిగా గానీ నన్నెవరూ అలా చూడలేదు. 

ఇరవై ఏళ్ల క్రితం ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి, పూర్తిగా ఒక ఏడాది కూడా ప్రధానిగా లేని ఒక మాజీ ప్రధానికి, అదీ కాంగ్రెస్‌ సపోర్ట్‌తో ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏం ఉంటుందని మేడమ్‌ స్పీకర్‌ భావించినట్లున్నారు! అయినా నేను మాట్లాడ్డం ఆపలేదు. మైక్‌ లాగేశారు! మనసు చివుక్కుమంది.  

ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు ఉమన్‌ రిజర్వేషన్‌ బిల్లు వచ్చిందో మేడమ్‌ స్పీకర్‌ మర్చిపోయినట్లున్నారు! ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు వరి రైతులు ఒక వంగడానికి ‘దేవె గౌడ’ అని పేరు పెట్టుకున్నారో మేడమ్‌ స్పీకర్‌కి గుర్తులేనట్లుంది! 

ఢిల్లీలో సోమ, మంగళ, బుధ.. మూడు రోజులు ఉండాలి. పడుకోబోతుండగా కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మల్లికార్జున్‌ ఖర్గే ఫోన్‌ చేశాడు.. ‘‘పడుకున్నారా?’’ అని!

‘‘లేదు ఖర్గే. నీకే ఫోన్‌ చేయాలనుకుంటున్నాను’’ అన్నాను. 

‘‘అనుకున్నాను. నాకు ఫోన్‌ చేయాలని అనుకుంటారని. సభలో అలా అనేశారేమిటి గౌడగారు. చివరి ప్రసంగం కావచ్చని! హసన్‌ సీటును మీ మనవడు ప్రజ్వల్‌కి ఇచ్చి, నార్త్‌ బెంగళూరు నుంచి మీరు కంటెస్ట్‌ చేస్తారని మేమంతా అనుకుంటుంటే..!’’ అన్నాడు ఖర్గే. 

‘‘సీటుకు, చివరి ప్రసంగానికి లింకేమిటి ఖర్గే. సీటున్నా ఇక జన్మలో మాట్లాడకూడదని కూర్చుంటే అది చివరి ప్రసంగమే కదా. అయినా ఆవిడ చూశారా ఎలా మైక్‌ లాగేశారో’’ అన్నాను. 

‘‘నేనూ గమనించాను గౌడగారూ.. మేడమ్‌ స్పీకర్‌ మిమ్మల్ని చూసిన చూపులో.. ‘ఎప్పుడూ నిద్రపోతూ కనిపించేవారు, ఇవాళెందుకు మెలకువగా ఉండి.. ప్రసంగిస్తానని పీక్కు తింటున్నారు’ అనే విసుగు  కనిపించింది’’ అన్నాడు.

‘‘ఎవరైనా ఎందుకు నిద్రకు ఆగలేకపోతారు ఖర్గే?’’ అని ఆవేదనగా అడిగాను. ‘‘నిద్ర చాలకపోతే గౌడగారూ’’ అన్నాడు. ‘‘నిద్ర ఎందుకు చాలకపోతుంది ఖర్గే?’’ అని అడిగాను. ‘‘విరామం, విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ పోతుంటే’’ అన్నాడు. 

‘‘అదే చెప్పాలనుకుంటున్నాను ఖర్గే.. రేపు సభలో. నాకిచ్చిన టైమ్‌ సరిపోకపోతే మీకిచ్చిన టైమ్‌లోంచి ఈ మాజీ ప్రధానికి కొంత ఇవ్వగలరా?’’ అని అడిగాను.

‘‘ఫుల్‌ టైమ్‌ తీసుకోండి గౌడగారు.. మా మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏముంటుందనీ! తీసుకోండి’’ అన్నాడు ఖర్గే.

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top