అక్షయ్‌ కుమార్‌ (బాలీవుడ్‌ హీరో) ; రాయని డైరీ

Madhav Singaraju Article On Akshay Kumar - Sakshi

మాధవ్‌ శింగరాజు

ఓటేయడానికి ఎవరైనా పోలింగ్‌ బూత్‌ ఎక్కడుందా అని వెతుక్కుంటారు. ముంబై ఓటర్లు నేను ఏ పోలింగ్‌ బూత్‌లో ఉన్నానా అని వెతికినట్లున్నారు! 

‘‘సల్మాన్‌ వేశారు. షారుక్‌ వేశారు. ఆమిర్‌ వేశారు. మేడమ్‌ ట్వింకిల్‌ ఖన్నా కూడా వేశారు. వేయడమే కాదు. ‘ఓట్‌ ఇండియా ఓట్‌’ అని ఒక సెల్ఫీని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. మరి మీరెందుకు ఓటు వెయ్యలేదు?’’ అన్నాడు.. పనిగట్టుకుని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేరుగా ఇంటికే వచ్చిన రిపోర్టర్‌. 

ముంబైలో పోలింగ్‌ జరిగి వారం అవుతోంది. మళ్లీ ఇంకో విడత పోలింగ్‌ రేపు జరుగుతోంది. ఇప్పటికీ అదే ప్రశ్న. ‘మీరెందుకు ఓటేయలేదు?’ అని! 

‘‘చూడండి, మోదీజీని నేను ఇంటర్వ్యూ చేశాను. మీరెవరూ ఇంతవరకూ చేసి ఉండని ఇంటర్వ్యూ అది! నేనడిగానా మిమ్మల్ని.. మీరెందుకు మోదీజీని అంత మంచి ఇంటర్వ్యూ చేయలేకపోయారని?!’’ అన్నాను. 

‘‘ప్రధాని అనే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం కన్నా, ఒక వ్యక్తిని ప్రధానిని చేయడానికి ఓటు వేయడం అన్నది మోర్‌ ఇంపార్టెంట్‌ కదా అక్షయ్‌!’’ అన్నాడు రిపోర్టర్‌. 

నేను ఓటు వేయలేదన్నదొక్కటే వీళ్లందరికీ గుర్తున్నట్లుంది! నా ‘ప్యాడ్‌మాన్‌’ని, నా ‘టాయ్‌లెట్‌ : ఏక్‌ ప్రేమ్‌ కథా’ని మర్చిపోయినట్లున్నారు. ‘తప్పక ఓటు వేయండి’ అని దేశ ప్రజలకు నేను చేసిన విజ్ఞప్తిని కూడా!

‘‘అక్షయ్, మీ శ్రీమతికి ఓటు ఉండి, మీకు లేకపోవడం ఏంటి?’’ అని అడిగాడు ఆ రిపోర్టర్‌. మోదీజీని నేను చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ వంటిదే.. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం.. నన్నతడు చేయబోతున్నాడా! 

మోదీజీకి ఇష్టం ఉండవనిపించిన ప్రశ్నలేమీ నేను ఆయన్ని అడగలేదు. అడగలేదు కాబట్టే మంచి మంచి విషయాలు తెలిశాయి. మోదీకి మామిడి పండ్లంటే ఇష్టమని తెలిసింది. ప్రధాని అయ్యేవరకు మోదీజీ తన బట్టలు తనే ఉతుక్కున్నారని తెలిసింది. మమతా బెనర్జీ ఆయనకు స్వీట్స్‌ పంపుతుంటారని తెలిసింది. అదీ ఇంటర్వ్యూ చేయడం అంటే. 

‘మీ శ్రీమతికి ఓటు ఉండి, మీకు లేకపోవడం ఏమిటి?’ అనే ప్రశ్న వేయడంలో ఆ రిపోర్టర్‌ ఉద్దేశం ఏమై ఉంటుందో నేను ఊహించలేనిదేమీ కాదు.

‘‘చూడండి.. నాకు ఓటు లేదు అని నేను మీకు చెప్పలేదు. నేను చెప్పకపోయినా, ‘మీకు ఓటు లేకపోవడం ఏమిటి?’ అని మీరు నన్ను అడుగుతున్నారంటే ‘నాకు ఓటు లేదు’ అని నా చేత చెప్పించడానికే కదా!’’ అన్నాను. 

‘‘కానీ అక్షయ్‌.. ఢిల్లీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే ఉత్కంఠ కన్నా, ముంబైలో అక్షయ్‌ ఓటెందుకు వెయ్యలేదన్న సందేహమే గత వారం రోజులుగా దేశ ప్రజల్ని నిద్ర లేమికి గురి చేస్తోంది. ఆ సందేహాన్ని మీరు తీర్చకపోతే.. కళ్ల కింద నల్లటి వలయాలు ఉండే ప్రత్యేకమైన జాతిగా ప్రపంచ ప్రజలు మనల్ని గుర్తించే ప్రమాదం ఉంది’’ అన్నాడు. 

నాకూ కొన్ని రకాల పండ్లు ఇష్టం. నేనూ కొన్నిసార్లు నా బట్టలు ఉతుక్కున్నాను. నాకూ కొందరు స్వీట్లు పంపిస్తుంటారు. అలాంటి ప్రశ్నలు అడగడంలో అతడికి ఉండే అసౌకర్యం ఏమిటో నాకు తెలియడం లేదు. 

దేశంలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఉన్నట్లే.. ఓటు వేసినవాళ్లు, వేయనివాళ్లు, ఓటున్నా వేయలేనివాళ్లు.. ఇన్ని కేటగిరీలు ఉన్నప్పుడు నేను ఓటెయ్యకపోవడం ఒక్కటే స్పెషల్‌ కేటగిరీ ఎందుకయింది! 

అదే అడిగాను ఆ రిపోర్టర్‌ని. 

‘‘కానీ మీకు కెనడా పాస్‌పోర్ట్‌ ఉంది’’ అన్నాడు! నవ్వాను.

‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అన్నాడు.

‘‘మీరు ఆ కెనడా నుంచి బయట పడితే కానీ నాలోని భారతీయుడు మీకు కనిపించడు’’ అన్నాను. 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top