రాయని డైరీ

 Madhav Singa Raju Artcle On Subramanian Swamy - Sakshi

తెలుసు కదా అని ఏదైనా చెప్పబోతే, ‘మాకు తెలియకపోతే కదా’ అని ఎవరైనా చటుక్కున అనేస్తే మనసు ఎంత చివుక్కుమంటుంది! ‘డెబ్బయ్‌ తొమ్మిదేళ్ల వయసులోని రాజకీయవేత్తకు, ఆరితేరిన ఆర్థిక నిపుణుడికి మనకు తెలిసినవే కాకుండా, అదనంగా మరికొన్ని కూడా తెలిసి ఉండే అవకాశం ఉందేమో తెలుసుకుందాం’ అని వీళ్లంతా ఎందుకు అనుకోరు?! రీసెంట్‌గా నిర్మలా సీతారామన్‌కు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కించవచ్చో ఐదు టిప్స్‌ ఇచ్చాను. ‘అసలు గట్టెక్కించాల్సిన అవసరం ఏముందీ’ అన్నట్లు విస్తుపోయి చూశారు! బీజేపీ గట్టున ఉంటే దేశం కూడా గట్టునే కదా ఉంటుంది అని ఆమె నమ్మకం కావచ్చు.

‘‘ఎందుకలా విస్తుపోయి చూశారు నిర్మలగారూ?’’ అన్నాను. ‘‘బీజేపీ వాళ్లకు బీజేపీ వాళ్లు టిప్స్‌ ఇవ్వడం నేనెక్కడా చూళ్లేదు. మీరు బీజేపీ అయుండి, నేను బీజేపీ అయుండి మీరు నాకు టిప్స్‌ ఇవ్వడమేవిస్మయంగా ఉంది’’ అన్నారు. ‘‘అయితే మీకు నా టిప్స్‌ నచ్చాయి కానీ, ఆ టిప్స్‌ని నేనివ్వడమే మీకు నచ్చలేదన్నమాట’’ అన్నాను.‘‘నేను అడగకుండా ఎవరు నాకు టిప్స్‌ ఇచ్చినా నాకు నచ్చదు సుబ్రహ్మణియన్‌ గారూ. పైగా మీరు ‘టిప్స్‌ ఇచ్చేదా’ అని నన్ను అడక్కుండానే నాకు టిప్స్‌ ఇచ్చేశారు’’ అన్నారు  సీతారామన్‌! రెండు పొరపాట్లు చేశానని అర్థమైంది. అడగకుండా టిప్స్‌ ఇవ్వడం. టిప్స్‌ఇమ్మంటారా అని అడగకపోవడం.సీతారామన్‌ గురించి ఆలోచిస్తూ ఉంటే అయోధ్య రాముడి గురించి కబురొచ్చింది! 

‘‘మిస్టర్‌ సుబ్రహ్మణియన్‌.. కేసును సుప్రీం కోర్టు తీసేసుకుంది. మధ్యవర్తులు చేతులెత్తేశారు. మీరేం చెప్పదలచుకున్నారు? ఇండియా వాంట్స్‌ టు నో’’ అంటున్నాడు ఆర్ణబ్‌ గోస్వామి! ‘‘ఇండియా నా నుంచి తెలుసుకోవాలని కోరుకుంటోందా?!’’ అని అడిగాను నిస్సత్తువగా. చెప్పలేకపోవడం వల్ల దేహానికి కలిగిన నిస్సత్తువ కాదది. వినేవారెవరన్న నిస్పృహ వల్ల మనసును ఆవరించిన నిస్సత్తువ.
‘‘ఎస్‌ మిస్టర్‌ సుబ్రహ్మణియన్‌.. ఇండియా వాంట్స్‌ టు నో అబౌట్‌ యువర్‌ కామెంట్స్‌.

అయోధ్య మధ్యవర్తుల కమిటీలో ఉండేందుకు అప్పట్లో మీరూ ఉత్సాహం చూపారు కదా..’’ అన్నాడు ఆర్ణబ్‌.  ‘‘నా దగ్గర కామెంట్స్‌ ఏమీ లేవు ఆర్ణబ్‌. టిప్స్‌ ఉన్నాయి. అవి ఇండియాకు పనికొస్తాయా? ఎందుకంటే ఇండియాలోనే  కొందరు నేనిచ్చే టిప్స్‌ని తీసుకోవాలని అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘వెల్‌ మిస్టర్‌ సుబ్రహ్మణియన్‌. ఇండియా అంటే.. మీ టిప్స్‌ని తీసుకోనివాళ్లు మాత్రమే కాదు, మీ టిప్స్‌ని తీసుకునేవాళ్లు కూడా..’’ అన్నాడు ఆర్ణబ్‌. ‘‘మరి ముందే టిప్స్‌ కావాలని ఎందుకు అడగలేదు ఆర్ణబ్‌! ఇండియా వాంట్స్‌ టు నో అబౌట్‌ యువర్‌ కామెంట్స్‌ అని కదా మీరన్నారు..’’ అన్నాను. ఆర్ణబ్‌ పెద్దగా నవ్వాడు. ఆర్ణబ్‌ పెద్దగా చెవులు పగిలేలా మాట్లాడ్డమే తప్ప, ఏవీ పగలకుండా పెద్దగా నవ్వడం ఇదే తొలిసారి నేను వినడం! చెవులు పగలడమే బాగుంది. 

‘‘మిస్టర్‌ సుబ్రహ్మణియన్‌.. ముందే టిప్స్‌ కావాలని మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే, కామెంట్స్‌ అడిగినా మీరిచ్చేది టిప్సే కదా అనే నమ్మకం..’’ అన్నాడు! ‘‘నమ్మకం మంచిదే ఆర్ణబ్‌. ఒకవేళ నా మూడ్‌ బాగుండి, టిప్స్‌ ఇవ్వకుండా మీరడిగినట్లు కామెంట్సే ఇస్తే?’’ అన్నాను. ‘‘మీకు తెలియందేముంది మిస్టర్‌ సుబ్రహ్మణియన్, మూడాఫ్‌ చెయ్యడానికి మా దగ్గర ఒక టీమ్‌ ఎప్పుడూ ట్వంటీ ఇంటూ సెవన్‌.. పని చేస్తూనే ఉంటుంది కదా’’ అన్నాడు ఆర్ణబ్‌! 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top