సమాజానికి ‘అమృత’ సందేశం

Kancha Ilaiah Writes Guest Column On Amrutha Pranay Braveness After Maruti Rao Lost - Sakshi

విశ్లేషణ

తండ్రి ఆత్మహత్య నేపథ్యంలో, హత్యకు గురైన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల  అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప  ఉదాహరణగా నిలిచిపోతుంది. కులం చుట్టూ పెనవేసుకుపోయిన మానవ అస్పృశ్యత  ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది. మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా  నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. సంపద కానీ, కులం కానీ మానవ  ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు అని అమృత మన సమాజానికి  ఇస్తున్న సందేశం శాశ్వత విలువ కలిగినది.

తెలంగాణలోని మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే 24 ఏళ్ల దళిత యువకుడిని గర్భిణి అయిన భార్య సమక్షంలోనే 2018 సెప్టెంబర్‌ 24న నరికి చంపారు. అమృత ఆ పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యువతి. తన తండ్రి మారుతిరావును ధిక్కరించి మరీ ఆమె ప్రణయ్‌ని పెళ్లి చేసుకుంది. అమృతకు ఇప్పుడు 25 ఏళ్లు. సంపన్నులైన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆమె తండ్రి రియల్‌ ఎస్టేట్, తదితర వ్యాపారాలతో భారీ ఆస్తులు కూడగట్టుకున్నారు. పోలీసులు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఆయనకు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి.

కృష్ణానది ఒడ్డున ఉన్న సంపన్న పట్టణమైన  మిర్యాలగూడ.. తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగే పట్టణాల్లో ఒకటి. ఈ పరిస్థితిని మారుతిరావు సంపదను కూడగట్టుకోవడానికి అనువుగా మల్చుకున్నారు. ప్రణయ్‌ హత్యకేసులో అమృత తండ్రితో పాటు మరి కొందరు జైలుకెళ్లారు. కొన్నినెలల క్రితమే వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. తన భర్త హత్య తర్వాత అమృత మిర్యాలగూడలో తన అత్త, మామలతోటే వారి సొంత ఇంటిలో కలిసి ఉంటోంది. భర్త హత్యకు గురైనప్పుడు ఆమె ఆరునెలల గర్భిణి. అమృత తన అత్తతో కలిసి వైద్య పరీక్షలకోసం ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలోనే ఆమె భర్తను నరికి చంపారు.

న్యాయంకోసం చెరగని నిబద్ధత
తర్వాత ఆమె బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడతడు సంవత్సరం బిడ్డ. ఈ సమయంలోనే 2020 మార్చి 6న మారుతిరావు నోట్‌ రాసిపెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ నోట్‌లో తన కుమార్తె తన ఇంటికి తిరిగి వచ్చి తల్లితో కలిసి ఉండాలని కోరుకున్నారు. తన తండ్రి ఆత్మహత్య తర్వాత, న్యాయంకోసం అమృత నిబద్ధత పట్ల మీడియాలో వస్తున్న కథనాలు నిజంగానే సినిమా కథను తలపిస్తున్నాయి. మారుతిరావు పక్షాన కేసు వాదిస్తున్న లాయర్‌ చెప్పిందాని ప్రకారం, తన కుమార్తె అమృతను తిరిగి తనవద్దకు తెచ్చుకునేందుకు కన్నతండ్రి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

కానీ అమృత తన భర్త హత్యకు న్యాయం జరగాలనే తన వైఖరినుంచి అంగుళం కూడా పక్కకు జరగడానికి తిరస్కరించింది. తన తండ్రి, నిజమైన హంతకుడు బిహార్‌కి చెందిన శుభాష్‌ శర్మ, ప్రణయ్‌ హత్యకు సహకారం అందించిన ఆమె చిన్నాన్న శ్రవణ్‌లకు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుకుంది. ప్రణయ్‌ హత్య కేసులో రాజీ కుదుర్చుకోవాలని ఆమె తండ్రి ఎంతగా ప్రయత్నించాడో అంతకంటే దృఢంగా మారిన అమృత తనను బెదిరిస్తున్నారని ఆరోపించి మరిన్ని కేసులను దాఖలు చేసింది.

తన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి ఆమె వెళ్లలేదు కానీ పోలీసు రక్షణ మధ్య శ్మశానవాటికలో తండ్రి మృతదేహాన్ని చూసి రావాలని ప్రయత్నించింది. కానీ ఆమె బంధువులు ఆమెను తండ్రి శవాన్ని చూడటానికి అనుమతించలేదు. దాంతో ఆమె మౌనంగా పోలీసు వ్యాన్‌లో వెనక్కి వెళ్లిపోయింది. ప్రణయ్‌ హత్య తర్వాత తన బాధను అర్థం చేసుకుని తన పక్కన నిలబడిన తన దళిత అత్త, మామతోనే ఆమె ఉంటోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం ఆ తర్వాత శ్మశాన వాటికలో ఆమె మీడియాతో చెప్పిన మూడు విషయాలు టీవీ తెరపై చూస్తున్న ప్రతి ఒక్కరినీ నివ్వెరపర్చాయి. ఆమె చెప్పిన మాటలివి.

1. ఆత్మహత్య చేసుకోవడం కంటే నా భర్త హత్య కేసులో నాన్న శిక్ష అనుభవించి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. 2. కుటుంబ సభ్యుల పేర్లతో, బినామీ పేర్లతో కూడా ఉంటున్న తండ్రి ఆస్తులను నేను లెక్కచేయను. నా తండ్రికి అనేక ఆస్తులున్నాయని నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఆసక్తి లేదు. 3. ప్రధాన నిందితుడైన తండ్రి మరణించాక అమ్మవద్దకు వెళతావా అని మీడియా అడిగినప్పుడు ఆమె ‘నేను ఇప్పుడు నా కుటుంబంతో, నా కుమారుడితో, నా అత్తమామలతోనే ఉంటున్నాను. అమ్మ కూడా నావద్దకు వస్తే మేం ఆమెను బాగా చూసుకుంటాం. అంతే కానీ మా నాన్న ఇంటికి మాత్రం వెళ్లను’ అని చెప్పింది.

కులతత్వానికి బలైన కుటుంబం
మరణించిన తన భర్త పట్ల, అతడి కుటుంబం పట్ల అమృత ప్రదర్శించిన నిబద్ధత.. నైతిక జీవితానికి సంబంధించి అతి గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది. ప్రణయ్‌ దళితుడు కాకపోయి ఉంటే ఆమె తండ్రి బహుశా అతడిని చంపించి ఉండకపోవచ్చు. ప్రణయ్‌ మరో కులానికి చెంది ఉంటే వారిని మారుతిరావు వదిలివేసి ఉండేవాడు. కానీ కులం చుట్టూ అంటుకుపోయిన మానవ అస్పృశ్యత ప్రభావమే ఒక యువకుడి దారుణ హత్యకు దారితీసింది. అంతిమంగా తండ్రి ఆత్మహత్యకు కారణమైంది. చివరకు మారుతిరావు భార్య కూడా నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. మారుతిరావు కులతత్వమే అతడి కుటుంబాన్ని, అతడిని కూడా ధ్వంసం చేసింది.

మారుతిరావు తన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమించారని చెబుతున్నారు. తన కుమార్తెకు ఇవ్వడం కోసమే అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ వచ్చారు. కాని తన కుమార్తె ఒక యువకుడిని ప్రాణాధికంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతడిని దారుణంగా హత్య చేసే వరకు కన్నతండ్రి తెగించారు. కానీ ఆయన కన్నకుమార్తె ఈ సమాజానికి ఒక విభిన్నమైన నైతిక సందేశాన్ని పంపింది. తమపిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమను ప్రదర్శించడం అంటే ఆ పిల్లల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్ణయించే హక్కు తమకు ఉంటుందని కాదు. అంతకు మించి కుల వ్యవస్థ మనిషి జీవితాన్ని, ప్రేమను, మానవ విలువలను అస్సలు నిర్ణయించకూడదు.

మారుతిరావు మానవ జీవి తానికి సంబంధించిన చెడు ఉదాహరణగా నిలిచారు కానీ ఆయన కుమార్తె తన యవ్వన జీవితంలోనే అత్యంత విభిన్నమైన దారిలో నడుస్తోంది. తన భర్తను కోల్పోయింది. ఆ బాధను అనుభవిస్తూనే బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రినుంచి ఒత్తిళ్లకు గురైంది. మీడియా డేగచూపులను ఎదుర్కొంటోంది. పోలీసు రక్షణలోనే జీవిస్తోంది. చివరకు కన్నతండ్రి ఆత్మహత్యను కూడా భరిస్తోంది. ఒక అగ్రకుల సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిని ఇన్ని రకాల విషాదాలు, గాయాలు ఇంత చిన్న జీవితంలో వెంటాడుతూ వచ్చాయి.

కలకాలం నిలిచే సందేశం
కన్నతండ్రి ఆత్మహత్య తర్వాత మీడియా ఆమెను విభిన్నమైన ప్రశ్నలతో వెంటాడుతోంది. అమృత నుంచి ఆశ్చర్యకరమెన విషయాలను వినాలని టీవీలకు అంటుకుపోయి చూస్తున్న ప్రజలను ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన అమృత నిశ్చేష్టులను చేసింది. ఇంటర్వ్యూలలో ఆమె అత్యంత పరిణతిని, మానవీయమైన, కుల వ్యతిరేక సంస్కృతిని, నడతను ప్రదర్శించింది. భర్తను చంపించిన కన్నతండ్రే ఆత్మహత్య చేసుకున్నాడు.

మరి ఈ ఘటనల మొత్తంలో ఏ పాత్రా లేని, ఏమీ చేయని కన్నతల్లి వద్దకు ఇప్పుడు మీరు ఎందుకు వెళ్లడం లేదు అని ఒక మీడియా వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆమె ఇచ్చిన జవాబు అందరి మతిపోగొట్టింది. ‘‘నా కోసం నా అత్తమామలు వారి కొడుకును పోగొట్టుకున్నారు. నా జీవితంలోని అత్యంత కఠిన పరిస్థితుల్లో వారే నాకు నా బిడ్డకు తోడుగా ఉన్నారు. నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వారే. మా అమ్మ నన్ను ప్రేమిస్తున్న్టట్లయితే, ఆమే మా వద్దకు వచ్చి మాతో కలిసి జీవించాలి’’.

తన భర్త హత్యకు గురైనప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఆమె మీడియాతో మాట్లాడుతూ, మనుషులు మంచివారు లేక చెడ్డవారు అని కులం ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించింది అమృత. ‘నా పోరాటం మొత్తంలో నా భర్త కుటుంబంలోనే మానవీయతను నేను చూశాను. మా నాన్న వారికి వ్యతిరేకంగా ఎన్నో ఘోరమైన చర్యలు చేపట్టారు. కానీ నా కష్టకాలంలో నా కుటుంబం నాతో వ్యవహరించిన దానికంటే ఎంతో బాగా నా అత్తమామలు నన్ను చూసుకున్నారు.

వారిది దిగువ మధ్యతరగతికి చెందిన దళిత కుటుంబం. మా నాన్న చాలా సంపన్నుడు, పైగా అధికార బలం ఉన్నవాడు. కానీ నా అత్తమామలు తన కుమారుడికోసం, అతడి మరణం తర్వాత నా కోసం దేన్నయినా కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఇక్కడే నేను నిజమైన మానవీయతను చూశాను. సంపద కానీ, కులం కానీ మానవ ప్రేమను, అభిమానాన్ని పట్టించుకోవు, సహించవు’. భారతీయ సమాజానికి అమృత ఇస్తున్న ఈ సందేశం కలకాలం నిలిచివుంటుంది.

వ్యాసకర్త: ప్రొ'' కంచ ఐలయ్య షెపర్డ్‌ 
డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top