నిజాలు నిగ్గు తేలాలి!

K Ramachandra Murthy Write article on CM Chandrababu Naidu - Sakshi

త్రికాలమ్‌

‘చంద్రబాబునాయుడు 29 విడతలు ఢిల్లీ వచ్చినట్టు పదేపదే చెబుతున్నారు. ఒక్క పని కూడా కాలేదంటున్నారు. నిజమే. కానీ ఆయన వచ్చిన ప్రతిసారీ మూడే మూడు విషయాలు అడిగేవారు. ఒకటి, ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డిపైన ఉన్న  కేసుల విచారణ వేగం పెంచి, దోషిగా  నిర్ధారించి జైలుకు పంపాలి. రెండు, శాసనసభ స్థానాల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు సత్వరం తీసుకోండి. మూడు, పోలవరం ప్రాజెక్టుకు తాను అడుగుతున్న  నిధులన్నీ ఒక్క విడతలోనే ఇచ్చేయాలి. అంతే కానీ, ప్రత్యేకహోదా గురించి ఆయన ప్రస్తావించనేలేదు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనకు ఆయన ఆనందంగా అంగీకరించారు. 

పైగా రాష్ట్రానికి గొప్ప మేలు చేశానంటూ చెప్పుకున్నారు కూడా. అటువంటి వ్యక్తి మంత్రులను ఉపసంహ రించుకోవడం, మన ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ నోటీసు ఇవ్వడం విడ్డూరం.’ ఇటీవల ఢిల్లీలో జరిగిన  ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతల సమా వేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ మాటలు అన్నారని సమావేశంలో పాల్గొన్న ఒక నాయకుడు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబునాయుడు చాలా సమర్థవంతంగా ‘మార్కెటింగ్‌’ చేశారని (ప్రజలు ఒప్పుకునే విధంగా వివరించారని) బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్‌ నరసింహారావు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని రాష్ట్రాల నాయకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఎన్‌డీఏ కావచ్చు. యూపీఏ కావచ్చు. కేంద్ర ప్రభుత్వం కోసం పని చేసే నిఘా విభాగం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యక్రమాలపైన  కూడా కేంద్రానికి అవగాహన ఉంటుంది. ప్యాకేజీతో చంద్రబాబునాయుడు సరిపుచ్చుకున్నారనే మొన్నటి వరకూ ఎన్‌డీఏ ప్రభుత్వంలోని పెద్దల అభిప్రాయం. అందుకే ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్‌డీఏ సర్కార్‌ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్టుపైన గెలిచిన ముగ్గురు లోక్‌సభ సభ్యులు పార్టీ ఫిరాయించారు. వారిపైన అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభ స్పీకర్‌కు పిటిషన్‌ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకూ ఆ పిటిషన్‌పైన స్పీకర్‌ చర్య తీసుకోలేదు.

ఓటుకు కోట్ల కేసు వివరాలు ప్రధాని నరేంద్రమోదీకీ, అమిత్‌షాకీ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులు కొందరు అప్పుడే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది శాసన సభ్యులను కొనుగోలు చేసి వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఫిరాయింపజేసిన వైనం సైతం కేంద్ర నాయకత్వానికి తెలుసు. చీటికీమాటీకీ ప్రత్యేక విమానంలో విదేశాలకు చంద్రబాబునాయుడు వెళ్ళిరావడం కూడా  కేంద్రం దృష్టిలో ఉంది. పోలవరం పనులలో అక్రమాలూ, అవినీతీ జరుగుతున్న సమాచారం కేంద్ర మంత్రులకు తెలుసు. 

మసూద్‌ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, రాజకీయ, నైతిక విలువలకు పాతరేసినా ముఖ్య మంత్రిని కేంద్రం ఒక్క మాట అనలేదు. నిజానికి అది ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యం. దాన్ని ‘మిత్రధర్మం’ అని పిలవడం ఆత్మవంచన, పరవంచన. మిత్రులు కలసి ప్రజలకు మేలు చేయాలి కానీ ద్రోహం చేయకూడదు. ‘కేవలం రాజకీయ కారణాల వల్ల మీరు ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించారు కానీ రాష్ట్ర అభివృద్ధికోసం మాత్రం కాదు,’ అంటూ అమిత్‌ షా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో నిష్టురమాడారు. అమిత్‌ షా లేఖ కలకలం సృష్టించింది. లేఖాంశాలు బట్టబయలు కాగానే చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్‌ స్పందించారు. అమిత్‌ షాకి రాష్ట్రానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం లేదంటూ ధ్వజమెత్తారు. మధ్యాహ్నం రెండున్నరకు శాసనసభలో చంద్రబాబునాయుడు ఉపన్యాసం ప్రారంభించి సుదీర్ఘంగా రెండున్నర గంటలు సాగించారు. అమిత్‌షాను ఏకిపారేశారు. మర్యాద, మన్నన లేకుండా లేఖ రాశారంటూ తప్పుపట్టారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు అసత్యాలు చెప్పరాదంటూ ప్రబోధించారు. 

ఎందుకోసం ఎదురుదాడి? 
ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ ఎన్‌డీఏ చివరి బడ్జెట్‌ ప్రతిపాదనలు పార్లమెంటులో సమర్పించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యా యం జరిగిపోతోందంటూ చంద్రబాబునాయుడు హడావుడి చేయడం వెనుక ఒక గుర్తింపు  ఉన్నది. ఒక పథకం ఉన్నది. తాను ఊహించని విధంగా  ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకున్నది. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావి వర్గాలూ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగ ణించాయి. 

ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం తెలుగువారిని అవమానించడమే అన్న అభిప్రాయం జనసామాన్యంలో బలపడింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యేకహోదా ప్రధానమైన నిర్ణాయకాంశం అవుతుందనే భయం పట్టుకుంది.  కేంద్రంలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) సర్కార్, ఆంధ్రప్రదేశ్‌ లోని తెలుగుదేశం (టీడీపీ) ప్రభుత్వం కలసి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఆంధ్రు లకు ద్రోహం చేశాయనే వాస్తవం ప్రజలకు అర్థమైపోయింది. వారిలో ఆవేశం, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి.

తాను రూటు మార్చకపోతే వచ్చే ఎన్నికలలో దారుణంగా దెబ్బతినడం ఖాయమని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు చేయడంలోనూ, ప్రత్యేకహోదా సాధించడంలోనూ తాను విఫలమైన సంగతి గమనించారు. ఈ వైఫల్యాలు తనను వెంటాడి ఎన్నికలలో ఓడిస్తాయని గ్రహించారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి  ఒక పథకం రచించారు. తన వైఫల్యాలన్నింటికీ ఎన్‌డీఏ ప్రభుత్వ సహాయ నిరాకరణ ధోరణి కారణమనే ఒక అభిప్రాయాన్ని సానుకూల మీడియా ద్వారా, అసెంబ్లీలో తన సుదీర్ఘ ప్రసంగాల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా ప్రబలంగా నిర్మించాలని నిర్ణయించారు. తనపైనా, తనయుడిపైనా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడం కోసం విచారణ సంస్థలను పురమాయించకముందే ఎదురుదాడికి దిగడం శ్రేయస్కరమని చంద్రబాబునాయుడు భావించి ఉంటారు. 

ఇప్పుడు కేసులు పెడితే ఎదురు తిరిగారు కనుక కేసులు బనాయించారని ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతి సంపా దించవచ్చు, ఎన్నికలలో గట్టెక్కవచ్చు.  కేసులు పెట్టిన తర్వాత ఎదురు తిరిగితే కేసు పెట్టారు  కనుక ఎదురు తిరిగారని ప్రజలు అనుకుంటారు. అప్పుడు చంద్రబాబునాయుడికి సానుభూతి రాదు. అందుకని సమయజ్ఞత పాటించి చంద్రబాబునాయుడు కేంద్రంపైన దాడి ప్రారంభించారు. కానీ మోదీ నైజం తెలిసిన ఢిల్లీ పెద్దలు చంద్రబాబునాయుడికి హితవు చెబుతూనే ఉన్నారు. మోదీతో పెట్టుకుంటే కష్టమంటూ హెచ్చరించారు. పైకి గంభీరంగా తర్జని చూపిస్తూ గట్టిగా మాట్లాడుతున్నప్పటికీ లోలోన భయం పీడిస్తూనే ఉంది. అందుకే తడబాటు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని అరుణ్‌ జైట్లీ దగ్గరికి పంపించింది ఈ కారణంగానే. 

అటు తానే, ఇటు తానే
చంద్రబాబునాయుడికి ఒక అరుదైన లక్షణం ఉన్నది. తన ప్రత్యర్థులతో ప్రతి రోజూ పోల్చుకుంటారు. ప్రతి రోజూ ప్రత్యర్థిపైన ఆధిక్యం సాధించాలని తపి స్తుంటారు. అధికారంలో ఉంటూనే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషిం చాలని ప్రయత్నిస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడుతున్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఏమి మాట్లాడారో ఆయనకు గుర్తు ఉండదు. ముఖ్య మంత్రి హోదాలో మట్లాడే సమయంలో తాను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏమన్నారో మరచిపోతారు. ఉదాహరణకు ప్యాకేజీని పొగిడిన సంగతి ప్రత్యేక హోదా అడిగే సమయంలో గుర్తు ఉండదు. నాలుగేళ్ళ తర్వాత హోదా కోసం అడగడం ప్రారంభించినప్పటికీ నాలుగేళ్ళుగా హోదా కోసం పోరాడుతున్నట్టు ప్రజలను నమ్మించాలని ప్రయత్నం. 

నాలుగేళ్ళుగా నిజంగా పోరాడుతున్న పార్టీ లనూ, నాయకులనూ పూర్వపక్షం చేసి తానే అగ్రగామినంటూ చాటుకోవాలన్న ఆరాటం. ఏ పాత్ర పోషించే సమయంలో ఆ పాత్రలో లీనమైపోతారు. ఆ పాత్రను పండించడానికి శతవిధాలా కృషి చేస్తారు. ప్యాకేజీని సమర్థిస్తూ ఎంత సమర్థంగా వాదించగలరో, ప్యాకేజీని వ్యతిరేకిస్తూ అంతే బలంగా వాదన విని పించగలరు. ఇటువంటి వ్యక్తులకు సత్యాసత్య విచక్షణ కానీ ధర్మాధర్మ వివేచన కానీ ఉండవు. తమ వాదనను గెలిపించుకోవడానికీ, తమ ప్రయోజనం నెర వేర్చుకోవడానికీ ఏది అవసరమో అదే చెబుతారు. తాము చెప్పిందే సత్యం. తమపైన దాడి చేస్తే యావదాంధ్రులపైనా దాడి చేసినట్టే. 

14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పింది  కనుకనే కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయిందనీ మొన్నటి వరకూ చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఆర్థిక సంఘం ప్రత్యేకహోదా గురించి మాట్లాడనే లేదని, సంఘంలో సభ్యుడిగా పని చేసిన వ్యక్తి ఈ విషయం స్పష్టంగా చెప్పారనీ ఇప్పుడు వాదిస్తున్నారు. గత మూడేళ్ళుగా ప్రతిపక్ష నాయ కుడు జగన్‌మోహన్‌రెడ్డి, వామపక్ష నాయకులూ, మేధావులూ, నాబోటి పాత్రి కేయులూ చెబుతూ వస్తున్నది అదే. ఆర్థికసంఘం అధ్యక్షుడు వై. వేణు గోపాలరెడ్డి స్వయంగా ఒక టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో, మంథన్‌ వేదికపైనా ఆ విషయం స్పష్టం చేశారని కూడా చెప్పాం. ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు అభిజీత్‌సేన్‌ లిఖితపూర్వకంగా ఈ విషయం నిర్ధారించారని కూడా తెలియ జేశాం. 

అప్పుడు మా మాట వినిపించుకోకుండా అడ్డంగా దబాయిస్తూ, ప్రత్యేకహోదా సంజీవిని కాదని బుకాయిస్తూ, ఇప్పుడు అదే వాదన మనకు వినిపించడం అదరగండం కాకపోతే ఏమిటి? ప్రత్యేకహోదా కలిగిన 11 రాష్ట్రాలకూ జీఎస్‌టీ నుంచి మినహాయింపులను 2027 వరకూ పొడిగిస్తూ కేంద్రమంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది 2017 ఆగస్టులో. ఈ నిర్ణయాన్ని సిఫార్సు చేసిన జీఎస్‌టీ మండలిలో ప్రతి రాష్ట్ర అర్థిక మంత్రికీ సభ్యత్వం ఉంది.  ఈ అంశంపైన చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్టుడు సభలో ఉన్నారు. ఈ నిర్ణయం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ముఖ్యమంత్రికి ఈ విషయం అప్పుడే చెప్పి ఉంటారు. 2017 ఆగస్టు నుంచి 2018 ఫిబ్రవరి వరకూ ఈ సంగతి ముఖ్యమంత్రి ప్రస్తావించనేలేదు. 2018 జనవరి 12న మోదీని కలుసుకున్నప్పుడు సైతం ఈ అంశం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడలేదు. ఇప్పుడు అదే అంశంపైన కేంద్రాన్ని నిలదీస్తున్నట్టు స్వరం పెంచి మాట్లాడుతున్నారు. నాటకీయతకేమీ కొదవ లేదు. 

సుదీర్ఘ ప్రసంగాలు 
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసం గానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపైన చర్చకు సమాధానం ఇస్తూ మార్చి 7న చంద్రబాబునాయుడు రెండు గంటల సేపు మాట్లాడారు. అప్పటి నుంచి దాదాపు ప్రతి రోజూ సగటున రెండు గంటల సేపు మాట్లాడుతూనే ఉన్నారు. శనివారంనాడు అమిత్‌షా లేఖను ఆసాంతం చదివి వినిపిస్తూ ప్రతి వాక్యాన్నీ ఖండించారు. లేఖలో పేర్కొన్న వాస్తవాలని సైతం అంగీకరించకుండా దాడి చేశారు. ఆ లేఖ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నే కాకుండా ఆంధ్రులందరినీ అవమానించిందనీ, చులకన చేసిందనీ ఇటీవల సంభవించిన పరిణామాలను ఉటంకిస్తూ విమర్శించారు. 

ఈ ఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర గంద రగోళంలో పడవేశాయి. చంద్రబాబునాయుడి ప్రభుత్వంపైన బీజేపీ నాయకుడు వీర్రాజు చేసిన ఆరోపణలూ, లోకేశ్‌పైన పవన్‌కల్యాణ్‌ చేసిన అవినీతి ఆరో పణలూ, ‘ఆపరేషన్‌ ద్రవిడ’లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్‌ గరుడ’ను బీజేపీ అమలు చేయబోతున్నదంటూ నటుడు శివాజీ టీవీ చానళ్ళలో చేస్తున్న హడావిడి ప్రజలను తికమకపెడుతున్నాయి. ఎవరి వెనుక ఎవరు ఉన్నారో, ఎవరి బంటు ఎవరో, ఎవరి ఎజెండా ఏమిటో తెలియక ప్రజలు అయో మయంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.  ఆరోపణాస్త్రాలు అన్ని వైపుల నుంచీ దూసుకొని వస్తున్న వాతావరణంలో ఏది  సత్యమో, ఏది అసత్యమో తెలియక, పరిపాలన పైనా, అభివృద్ధిపైనా పాలకులు దృష్టి కేంద్రీకరించలేని అస్తవ్యస్త పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రకరకాలుగా వేలకోట్ల రూపాయల కైంక ర్యం జరిగిందనే ఆరోపణలన్నిటిపైనా విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చడం అందరికీ మంచిది.

- కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top