ఇప్పుడు వీస్తున్న గాలి

K Ramachandra Murthy Article On AP Politics In Sakshi

త్రికాలమ్‌ 

రాజకీయాలలో నాయకులు ఉంటారు. నిర్వాహకులు ఉంటారు. నిర్వాహకులను మేనేజర్లు అంటారు. అంతకంటే పెద్ద స్థాయి ఊహించుకున్నవారు సీఈవో అని కూడా తమను తాము అభివర్ణించుకుంటారు. నాయకుడికి ఆవేశం, సాహసం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ సహజ లక్షణాలై ఉంటాయి. పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం, అందు కోసం అవసరమైతే నియమనిబంధనలను ఉల్లంఘించడం, నీతినియమాలను పక్కన పెట్టడం, ఏదో ఒక విధంగా కథ నడిపించడం పార్టీ మేనేజర్లు చేసే పనులు. ముందుండి పోరాడే స్వభావం లేనివారు నాయకత్వపాత్రకు సరిపోరు. ప్రజలకు కష్టంగా తోచినప్పటికీ యదార్థం చెప్పగలవారే సిసలైన నాయకులు. నిజం చెప్పకుండా దాటవేసేవారు కానీ, అసత్యం చెప్పేవారు కానీ, అమలు చేయలేని వాగ్దా నాలు చేసేవారు కానీ ప్రజలను మభ్యపెట్టే కపట నాయకులు. 

సహజ నాయకులు కొత్త పోకడలు పోతారు. ప్రజల తరఫున నిలబడి పోరాడతారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యా మ్నాయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎన్‌టి రామారావు నాయకుడు. పార్టీనీ, పార్టీ ప్రభుత్వాన్నీ హస్త గతం చేసుకొని వాటిని కాపాడుకుంటూ వచ్చిన చంద్ర బాబునాయుడు దక్షత కలిగిన నిర్వాహకుడు. పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపిం చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకుడు. ప్రతిపక్షంలో మగ్గు తున్న పార్టీని గెలిపించేందుకు అహర్నిశలూ కృషి చేసి, ఆసేతుహిమాచల పర్యంతం పర్యటించి అద్భుతంగా ప్రచారం చేసి అఖండ విజయం సాధించిన నరేంద్రమోదీ నాయకుడు. కొత్త పంథాలో పార్టీ పెట్టి విజయం సాధించిన ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌ నాయకుడు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో విభేదించి, అత్యంత శక్తిమంతురాలైన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ధిక్కరించి సొంత పార్టీ పెట్టి, కష్టనష్టాలు ఎదురైనా చలించకుండా యుద్ధ రంగంలో నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డి నాయకుడు. 

అమలు సాధ్యం కాని వాగ్దానాలు
అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయడం, అమలు చేయ బోవడం లేదని తెలిసి కూడా మాట ఇవ్వడం మంచి నాయకుడి లక్షణం కాదు. ఈ విషయంలో మోదీ, చంద్ర బాబునాయుడూ ఒకటే. ఎన్నికలలో గట్టెక్కడానికి నోటికి వచ్చిన వాగ్దానాలు ఇద్దరూ చేశారు. స్విస్‌బ్యాంకులో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేయిస్తా నంటూ మోదీ వాగ్దానం చెయ్యడం వంచన. కోట్ల ఉద్యో గాలు కల్పిస్తాననడం కూడా అంతే. అమలు చేసే ఉద్దేశం కూడా లేకుండా జనాన్ని ఆకట్టుకోవడానికి కులానికో వాగ్దానం చేసి, గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం శూన్యహస్తం చూపించడంలో చంద్రబాబు నేర్పరి. రైతు రుణాల మాఫీ వాగ్దానం చేస్తూ రుణాలు చెల్లించవద్దంటూ రైతులను ఉద్దేశించి ప్రకటనలు జారీ చేయడం, జాబు కావా లంటే జాబు రావాలంటూ బూటకపు వాగ్దానం చేయడం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పడం పనిగట్టుకొని మోసం చేయడమే. లోగడ ఏ ప్రధాని అభ్యర్థి కూడా మోదీలాగా అమలు సాధ్యం కాని వాగ్దానాలు చేయ లేదు. ముఖ్యమంత్రి  పదవిని ఆశించి రాష్ట్ర స్థాయి నాయ కులు ఎవ్వరూ చంద్రబాబునాయుడిలాగా నెరవేర్చలేని హామీలు గుప్పించలేదు. యువకుడైనప్పటికీ జగన్‌మోహన్‌ రెడ్డి 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చెప్పారు. రుణమాఫీ వాగ్దానం చేయవలసిందిగా ఆయనపైన ఎంతమంది పార్టీ నాయ కులూ, హితైషులూ ఎన్నిరకాలుగా ఒత్తిడి తెచ్చినప్పటికీ సాధ్యం కాని హామీ ఇవ్వడం నీతిబాహ్యమనే ఉద్దేశంతో వాగ్దానం చేయలేదు. ఆ మాట ఇచ్చి ఉంటే ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగలిగేది. కానీ హామీ అమలు చేయడం కష్టతరమై ఉండేది. హామీ ఇచ్చి గెలిచిన టీడీపీ హామీని పూర్తిగా అమలు చేయడంలో విఫల మైంది. పైగా అమలు చేశామంటూ దబాయిస్తోంది. అది వేరే విషయం. 

 వర్తమానానికి వస్తే, వంద నియోజకవర్గాలను చుట్టి వచ్చిన పాదయాత్రలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు.  వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి, అమలు చేయడం సాధ్యమని విశ్వసిం చిన తర్వాతనే మాట ఇస్తున్నారు. జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టు కొని కాపు రిజర్వేషన్ల గురించి ప్రకటన చేయవలసిం దిగా కోరినప్పుడు కూడా జగన్‌ వాస్తవాలే మాట్లాడారు. తన చేతిలో ఉన్న పనైతే నిస్సంకోచంగా చేస్తానని చెబుతూ, సుప్రీంకోర్టు తీర్పు గురించి గుర్తు చేశారు. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ,  కాపు సమా జానికి మేలు చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాననీ హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌కు టీడీపీ వెయ్యి కోట్ల రూపా యలు ఇస్తానని వాగ్దానం చేసి అందులో సగం కూడా  ఇవ్వ లేదనీ, తాను అధికారంలోకి వస్తే అంతకు రెట్టింపు ఇస్తాననీ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం తన చేతిలో ఉన్న పని కనుక ఇస్తానంటూ వాగ్దానం చేయగలిగారు. ఓట్లు సంపాదించడమే పరమావధిగా చేసే బూటకపు వాగ్దానాలు రాజకీయ నాయకుడికి అపకీర్తి తెస్తాయి. మాట మీద నిల బడటం విశ్వసనీయత కలిగిన రాజకీయవాది లక్షణం.  

ఏమి కావాలో తేల్చుకోవాలి
నాలుగున్నరేళ్ళ కిందటే రాజకీయాలలోకి వచ్చిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నాయకుడికీ, నిర్వాహకుడికీ మధ్య గల వ్యత్యాసం గమనించి ఏమి కావాలో నిర్ణయించుకో వాలి. పవన్‌ మాటలలో నిలకడ కనిపించడం లేదు. కొన సాగింపు ఉండటం లేదు. ఉదాహరణకు ఉద్దానంలో మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజల సమస్య తీసు కుందాం. అక్కడికి అమెరికా నుంచి ఒక ప్రొఫెసర్‌ను తీసు కొని వచ్చారు. కొన్ని ప్రకటనలు చేశారు. సమస్య పరి ష్కారం కాలేదు.  ప్రత్యేకహోదాపైన ఉద్యమంలోనూ అంతే. పార్లమెంటులో మోదీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానం వైఎస్‌ఆర్‌సీపీ పెడితే తాను ఢిల్లీకి వెళ్ళి ప్రతిపక్షాలతో మాట్లాడి మద్దతు కూడకడతానని అన్నారు. తీరా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు సరికదా మద్దతు మాటవరుసకు కూడా చెప్పలేదు. ఈ నెల 25వ తేదీన ప్రత్యేకహోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రబంద్‌కు పిలుపు ఇస్తే మద్దతు ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చినా లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించకపోతే విసిగిపోయి, ఎన్‌డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి  చివరి అస్త్రంగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేస్తే పలాయనం చిత్తగించారంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తగిన గౌరవం, మన్నన లేని కారణంగానూ, ప్రతిపక్ష సభ్యుల పట్ల పాలక పక్షం శత్రుభావంతో వ్యవహరిస్తున్న కారణంగానూ సమావే శాలను బహిష్కరిస్తే ముఖ్యమంత్రికి భయపడి పారిపోయా రంటూ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులను నిందించడం రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. బద్ధ వైరం ఉన్న టీడీపీ కూడా చేయనట్టు జగన్‌పైన ఫ్యాక్షనిస్టు ముద్ర వేయడానికి ప్రయత్నించడం పవన్‌కల్యాణ్‌ మనసులో గూడుకట్టుకున్న అమిత్రభావానికి నిదర్శనం. రాజీనామాలూ, బహిష్కర ణలూ, బంద్‌లూ రాజకీయ పోరాటంలో భాగాలు. టీడీపీనీ, వైఎస్‌ఆర్‌సీపీనీ సమానంగా విమర్శిస్తే సమదూరం పాటిం చినట్టు కాదు. అధికారంలో ఉన్న పార్టీనీ, ప్రతిపక్షాన్నీ ఒకే గాట కట్టడంలో విజ్ఞత లేదు. టీడీపీని నిజంగా ఎండగట్టా లనే ఉద్దేశం పవన్‌ కల్యాణ్‌కి ఉంటే, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలనే పట్టుదల ఉంటే అధికార పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపాలి. కట్టుబట్టలతో అమరావతికి వచ్చామంటూ చంద్రబాబు చెబుతున్నారు. అంత హడావిడిగా ఎవరో తరు ముతున్నట్టు హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారని చంద్రబాబును ప్రశ్నించాలి. పదేళ్ళు హైదరా బాద్‌లో ఉండే హక్కును వదులుకుని అమరావతికి ఎందుకు వచ్చారని అడగాలి. ఓటుకు కోట్లు కేసులో ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ ఏలను ఎందుకు కొనుగోలు చేశారో చెప్పమనాలి. వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎందుకు కట్టబెట్టవ లసి వచ్చిందో సంజాయిషీ అడగాలి.

ఎన్నికల హామీలు ఏ గాలికి కొట్టుకుపోయాయో చెప్పమంటూ నిలదీయాలి. ఇసుక మాఫియా గురించీ, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ గురించీ ప్రశ్నిం చాలి. రాష్ట్రం ఆర్థికంగా కష్టాలలో ఉన్నదంటూ ప్రత్యేక విమానంలో విదేశీయానాలకు రూ. 170 కోట్లకు పైగా దుబారా ఎందుకు చేశారో చెప్పమనాలి. అమరావతి నగర నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా ఎందుకు పేర్చలేదనీ, సింగపూరు గొడవ ఏమిటనీ,  పోలవరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదనీ నిలదీయాలి. విజ యవాడలో దుర్గగుడి దగ్గర ఫ్లయ్‌వోవర్‌ ఎప్పటికి పూర్తవు తుందో చెప్పమనాలి. ఈ ప్రశ్నలు ఏవీ వేయకుండా ప్రతిపక్ష నాయకుడిని తీవ్రపదజాలంతో విమర్శించడంలో ఆంతర్యం ఏమిటి? ప్రశ్నించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగా లని ఆశించే జనసేనాని రాజ్యసభ సీటు ఇస్తానని బాబు అనగానే ఎన్నికలలో 50, 60 స్థానాలకు పోటీ చేయాలన్న సంకల్పాన్ని విరమించుకోకూడదు. ఎన్టీఆర్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని నాటి ముఖ్యమంత్రి అంజయ్య చెప్పారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనను అటక ఎక్కించలేదు.  కాంగ్రెస్‌ పార్టీని బలపరచలేదు.

పవన్‌ ఆంతర్యం ఏమిటి?  
ఏ నాయకుడు ఏమి మాట్లాడుతున్నారనే అంశం కంటే ఎందుకు మాట్లాడుతున్నారో, ఏ ప్రయోజనం ఆశించి మాట్లాడుతున్నారో ఆలోచించడం అవసరం. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్‌ ప్రసంగించిన బహిరంగ సభ జరిగిన సమయంలోనే ఒంగో లులో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘ధర్మపోరాట’ సభ జరి గింది. ఒంగోలులో సభికులు స్తబ్దుగా కూర్చున్నారు. బాబు పక్కనే కూర్చున్న కళావెంకటరావు, తదితరుల మొహాలలో ఉత్సాహం లేదు. ఒంగోలు సభకు హాజరైన జనం కంటే పదిరెట్లు జగ్గంపేట సభలో ఉన్నారు. అక్కడ ప్రజలు  ఉత్సా హంగా కేరింతలు కొడుతూ కనిపించారు. బాబు ఎప్పటి లాగే తర్జని ఊపుతూ, ఏపీలో బీజేపీ ఆటలు సాగవంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ తప్పు తెలుసుకొని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచిందని అన్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ ఒకటేనంటూ ఏపీ పీసీసీ నాయకుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యా నించారు. తరచి చూస్తే అంతస్సూత్రం కనిపిస్తుంది. చంద్ర బాబు బీజేపీనీ, వైఎస్‌ఆర్‌సీపీనీ విమర్శిస్తూ ఉంటారు. రఘువీరారెడ్డీ అదే పని చేస్తారు. పవన్‌కల్యాణ్‌ కూడా అంతే. కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోదనీ, సొంతంగా 175 స్థానాలకు పోటీ చేస్తుందనీ రఘువీరా చెప్పారు.

పవన్‌కల్యాణ్‌ కూడా స్వతంత్రంగా పోటీ చేస్తానం టున్నారు. వామపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా వెల్లడి కాలేదు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెస్, జనసేన ఉపయోగపడతాయి. కాంగ్రెస్‌ ముక్కు ఉన్నా, ఊడినా పెద్ద తేడా ఉండదు. జనసేనాని వ్యూహం వల్ల కాపు సామాజికవర్గం ప్రభావితం అవుతుందని చంద్ర బాబు అంచనా కావచ్చు. ఆ వర్గం టీడీపీపైన ఆగ్రహంతో ఊగిపోతోందని ముఖ్యమంత్రికి తెలుసు. కాపులు తనకు ఓట్లు వేయకపోయినా వైసీఆర్‌సీపీకి వేయకుండా చూడాల న్నది టీడీపీ అధినేత తాపత్రయం. కాపు సామాజికవర్గం పైన పవన్‌కల్యాణ్‌ ప్రభావం అంత బలంగా ఉంటే  పెద్దాపు రంలోనూ, జగ్గంపేటలోనూ జగన్‌ సభలు అంత జయ ప్రదం అయ్యేవి కావు. రాజకీయాలలో ఎత్తుగడలూ, ఎన్ని కల మేనేజ్‌మెంటూ, డబ్బులూ, కులాలూ కొంతవరకు పని చేస్తాయన్న మాట నిజమే. కొంతవరకే పని చేస్తాయని గ్రహించాలి.  నాయకుడు ఒక ప్రభంజనం సృష్టిస్తే, ప్రజలు ఒక పార్టీని గెలిపించాలని నిర్ణయం తీసుకుంటే ప్రత్యర్థుల ఎత్తులన్నీ చిత్తు అవుతాయని 2004, 2009 ఎన్నికలు నిరూపించాయి. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో దృశ్యాలు చూసినవారికి గాలి ఎటు వీస్తున్నదో, ఎంత బలంగా వీస్తున్నదో తెలుస్తుంది.  కొందరు కొన్ని కారణాల వల్ల వాస్తవాన్ని అంగీకరించకపోవచ్చు. అంత మాత్రాన ప్రజల సంకల్పం మారదు. 


కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top