కొత్త వెలుగుల కోసం..!

k ramachadra murthy Guest column on modi and rahul gandhi - Sakshi

త్రికాలమ్‌

మెడ మీద కత్తి వేలాడుతూనే ఉన్నది. వేటు పడుతుందనే భయం పీడిస్తూనే ఉంది. కొన్ని తలలు తెగిపడటం చూస్తూనే ఉన్నాం. మనవంతు ఎప్పుడనేదే ప్రశ్న. భయంభయంగానే జీవిస్తూ ఏడాది చివరికి క్షేమంగా చేరుకున్నాం. ఒక సంవత్సరం ఈ రోజు కాలగర్భంలో కలిసిపోతోంది. కొత్త ఆశలు మోసుకొని రేపు నూతన సంవత్సరం ఉదయిస్తుంది. కడచిన ఏడాది పాడవునా జీవితం నిజంగానే అంత భయంకరంగా ఉన్నదని కాదు. కొన్ని ఘనకార్యాలు జరగకపోలేదు. సంతోషం కలిగించిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఏదో ఎడతెగని బెంగ. దశాబ్దాలుగా అనుభవించిన స్వేచ్ఛ కోల్పోతున్నామనే బాధ. భయపడుతున్నదంతా నిజంగా జరిగిపోతుందేమోనన్న ఆందోళన. ఏమి అంటే ఏమి జరుగుతుందో, ఏమి ఆపాదిస్తారో, ఏ నింద వేస్తారో, ఏమని బెదిరిస్తారో అని దడ. జరగరానిది జరిగితే పరిస్థితులు ఇంకా ఎంతకి దిగజారుతాయోనన్న విహ్వలత. ఎంచిన కీడు జరగనందుకు ఒకింత ఊరట. ఏడాది పొడవునా ఇదే డోలాయమానం.

ఈ సంవత్సరం ఎట్లా ఆరంభమైనదో అంతకంటే ఆందోళనకరంగానే అంతం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలతో ప్రారంభమైన దిగులు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నాటికి భయంగా రూపాంతరం చెందింది. రాజీలేని సమర్థులైన నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇందిరాగాంధీని అందుకే ఆరాధించారు. ఇప్పుడు నరేంద్రమోదీనీ అభిమానిస్తున్నది ఆ కారణంగానే. పెద్దనోట్ల రద్దువంటి పొరబాటు నిర్ణయం తీసుకున్నా సరే, గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌(జీఎస్‌టీ) అమలులో తొందరపాటు ప్రదర్శించినా సరే ప్రజలు మోదీని గద్దె దింపాలనుకోవడం లేదు.

రాహుల్‌ శైలిలో పరివర్తన
రాజకీయాలకు సరిపోడనుకున్న రాహుల్‌గాంధీ అమెరికా పర్యటన, గుజరాత్‌ ఎన్నికల ప్రచారం తర్వాత ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎంతో కొంత ఎదిగాడు. ప్రజల తప్పు ఎప్పుడూ లేదు. ఎవరికి తగిన గౌరవం వారికి ఇస్తారు. మధ్యతరగతి మేధావులను విశేషంగా ఆకట్టుకున్న మోదీ వారికే కొన్ని సందర్భాలలో నిద్రలేకుండా చేస్తున్నారు. ఇంతకు పూర్వం దేశాన్ని పాలించిన ప్రధానులు ఎవ్వరూ ప్రదర్శించని సాహసం మోదీలో కనిపిస్తుంది. ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేయడం ఆయనకు వినోదం.

ప్రతి ఎన్నికనూ ఒక ప్రతిష్ఠాకరమైన యుద్ధంగా పరిగణించడం, పోరాటంలో గెలుపొందేందుకు ఎంతకైనా తెగించడం, సరిహద్దులను దాటడం, మెరుపుదాడులు నిర్వహించడం మోదీ ప్రత్యేకత. దశాబ్దాలపాటు అనుసరించిన మర్యాదలను ఉల్లంఘించి ప్రత్యర్థులపైన అనూహ్యమైన దాడులు చేయడం మోదీ ప్రత్యేకత. మతం మాట ఎత్తకుండా మత ప్రాతిపదికపైన ఓటర్లను చీల్చడం మోదీ విజయ రహస్యం. వికాసం అంటూ మొదలయ్యే ప్రచారం అనివార్యంగా వికారంతో ముగుస్తుంది. బీజేపీకి విజయం ప్రసాదిస్తుంది.

2017లో ఆరు రాష్ట్రాలలో ఎన్నికలను బీజేపీ గెలుచుకోవడానికి ప్రధాన కారణం మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాల యుద్ధతంత్రం. ప్రతి గ్రామంలో గోరీల దొడ్డి మాత్రమే కాదు స్మశానవాటిక కూడా ఉండాలనడం, రంజాన్‌ రోజున విద్యుచ్ఛక్తి సరఫరా నిరంతరాయంగా ఉంటే దీపావళి పండుగనాడు సైతం ఉండాలనడం పరోక్షంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే. ఉత్తరప్రదేశ్‌లో ఈ వ్యూహంతో ఘనవిజయం సాధించిన తర్వాత అదే సూత్రాన్ని అవసరమైన చోట్ల, అవసరమైన మోతాదుల్లో వినియోగిస్తున్నారు. గుజరాత్‌లో ఈసారి గెలుపు అంత సులువు కాదని గ్రహించిన మోదీ సరిహద్దు అతిక్రమించి మాజీ ప్రధానిపైనా, మాజీ ఉపరాష్ట్రపతిపైనా మెరుపుదాడి చేశారు. కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెచ్చిపోయారు.

తనను అంతం చేయడానికి అయ్యర్‌ పాకిస్తాన్‌ వెళ్ళి ‘సుపారీ’ఇచ్చారని ఆరోపించారు. అయ్యర్‌ ఢిల్లీ నివాసంలో పాకిస్తాన్‌ మాజీ విదేశాంగ మంత్రి కసూరీకి ఇచ్చిన విందులో పాకిస్తానీయులతో కలసి మన్మోహన్, హమీద్‌ అన్సారీలు గుజరాత్‌లో బీజేపీని ఓడించేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలలో సత్యం లవలేశం లేదని అందరి కంటే బాగా మోదీకే తెలుసు. కానీ వీరంతా కుట్ర పన్ని సాటి గుజరాతీకి అన్యాయం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలిగించాలి. హిందువుల కోసం బీజేపీ పాటుపడుతున్నట్టు నమ్మించాలి.

గుజరాత్‌ ఎన్నికల సమయంలోనే శ్రీశ్రీ రవిశంకర్‌ అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధిస్తానంటూ బయలుదేరారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో చర్చలు జరిపారు. హిందూమత సంస్థలు రామాలయ నిర్మాణం గురించి వరుస ప్రకటనలు చేశాయి. ఆ ఎన్నికల తర్వాత రామాలయం ఊసు లేదు. çపద్మావతి చిత్రంపై లేనిపోని రభస సైతం గుజరాత్‌ కోసం ఉద్దేశించిందే. ఆ విధంగా స్థాయి మరచి ప్రధాని ప్రచారం చేయకపోతే అక్కడ ఆరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు.

మధ్యతరగతిలో అసహనం
నిర్హేతుకమైన మీడియా ధోరణులను మధ్యతరగతి ప్రజలు ఆమోదించడానికి సమాజంలో పెరుగుతున్న అసహసం కారణం. ఇందుకు బీజేపీని మాత్రమే నిందించడం సరికాదు. కాంగ్రెస్‌ దోషం చాలా ఉంది. షాబానో కేసులో ఇస్లామిక్‌ ఛాందసవాదులకు కొమ్ముగాసి, బాబరీ మసీదు–రామజన్మభూమి వివాదంలో శిలాన్యాస్‌ను అనుమతించి హిందువులను మెప్పించడానికి ప్రయత్నించడం వల్ల రాజీవ్‌గాంధీ కాంగ్రెస్‌ విశ్వసనీయతను దెబ్బతీశారు. ఇప్పుడు రాహుల్‌గాంధీ దేవాలయ సందర్శన, జందెం వేసుకున్న బ్రాహ్మణుడనంటూ చెప్పుకోవడం, రుద్రాక్షమాల ధరించడం ఎందుకు? తానూ హిందువునేనని చాటుకునేందుకు. అసలు హిందువు ఉండగా నకిలీ హిందూ ఎందుకని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌ ఇదే వైఖరి కొనసాగిస్తే హిందూత్వ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మైనారిటీలకు జరిగే అన్యాయాలను ప్రశ్నించలేరు. బీజేపీకి బి–టీమ్‌గా మారితే అది ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది? కాంగ్రెస్‌ను అటువంటి దయనీయ స్థితికి బీజేపీ నెట్టగలిగింది. సెక్యులరిజం సిద్ధాంతం వల్లించడానికి కాంగ్రెస్‌ నేతలు భయపడే వాతావరణం కల్పించడంలో మోదీ విజయం సాధించారు. రాజ్యాంగ పీఠిక నుంచి ‘సెక్యులరిజం’అనే మాటను తొలగిస్తామని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే అన్నది నోరుజారి కాదు. దాని వెనుక వ్యూహం ఉంది.

ఇందులో కర్ణాటక ఓటర్లకు ఒక సందేశం ఉంది. మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హంతకులను ఇంతవరకూ పట్టుకోలేదు. సెప్టెంబర్‌లో హత్య జరిగినప్పటికీ ఇంత వరకూ అక్కడి కాంగ్రెస్‌ సర్కార్‌ హత్య కేసును ఛేదించలేకపోయింది. రాజస్థాన్‌లో ఒక ముస్లింని వెంటాడి, నరికి, దహనం చేసినప్పుడు సైతం పెద్దలు ఎవ్వరూ పెదవి విప్పలేదు. ఇటువంటి దురంతాలను ఖండించడానికి సంకోచించే వాతావరణం కలవరపెడుతోంది.

అదే సమయంలో ముమ్మారు తలాఖ్‌ను నేరంగా పరిగణించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం మంచి పని. బిల్లులోని లోటుపాట్లను సవరించుకుంటే మంచిది. డెబ్బయ్‌ సంవత్సరాల స్వతంత్రం ముస్లిం మహిళలకు ప్రాథమిక హక్కు ఇవ్వలేకపోయిందన్న అపరాధ భావనను మోదీ సర్కార్‌ తొలగించింది. ఎగువ, దిగువ సభలలో సంఖ్యాబలం ఉన్న దశలో సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ సాహసం చేయలేదు. ఇందిరాగాంధీ కఠినమైన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు. కానీ ఈ ఆలోచన ఆమెకు రాలేదు.

ఓటు బ్యాంకు రాజ కీయం వల్లనే ముస్లిం మహిళలను నిర్లక్ష్యం చేశారంటూ బీజేపీ చేస్తున్న విమర్శను ఖండించడం కష్టం. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలతో పోల్చితే కేంద్ర సర్కార్‌ అవినీతి కుంభకోణాలకు దూరంగానే ఉంది. అందుకు కూడా మోదీని అభినందించాలి. లోక్‌సభలో బీజేపీ స్వయంగా మెజారిటీ కలిగి ఉండటం, మిత్రపక్షాలపైన ఆధారపడి లేకపోవడం మోదీకి కలిసి వచ్చిన అంశాలు. ఈ వెసులుబాటు వాజపేయికి కానీ మన్మోహన్‌సింగ్‌కు కానీ లేదు. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరిగే దేశంలో ప్రధాని స్వయంగా మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా విజయం సాధించగలమని భావించడమే భయం కలిగిస్తున్న ధోరణి.

ముస్లిం జనాభాలో సగంమంది (మహిళలు) తలాఖ్‌ బిల్లు ఫలితంగా బీజేపీ మద్దతుదారులుగా మారితే మైనారిటీల పట్ల వ్యతిరేక ధోరణి రాజేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. మోదీ ఎవ్వరినీ సంప్రదించరనీ, ముఖ్యమంత్రులను కలుసుకోరనీ, కలుసుకున్నా వారితో చనువుగా మాట్లాడరనీ, మంత్రిమండలి సహచరులు సైతం ఆయనతో మనసు విప్పి మాట్లాడటానికి సంకోచిస్తారనీ అంటారు. ఇది కూడా ఆందోళన కలిగించే అంశమే.

తెలుగు రాష్ట్రాల అధినేతలు డిటో
కొన్ని విషయాలలో మోదీ అడుగుజాడల్లోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) నడుస్తున్నారు. తిరుగులేని నాయకులుగా పేరు తెచ్చుకోవాలన్న అభిలాషతో ప్రజల ప్రాథమిక హక్కులను హరించేందుకు పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. సభలు జరుపుకోవడానికీ, ఉద్యమాలు చేయడానికీ, నిరసన ప్రకటించడానికీ పోలీసు అనుమతి కావాలి. సభ తలపెడితే గృహ నిర్బంధాలూ, అరెస్టులూ, వేధింపులూ రివాజుగా మారాయి.

తెలంగాణలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి బృహత్‌ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ అనంతరం నిర్మాణం జరుగుతోంది. ఏమి జరిగినా అధినేత అభీష్టం మేరకు జరగవలసిందే. ఒకరిని సంప్రదించడం కానీ ఒకరు చెప్పిన సలహాని స్వీకరించడం కానీ లేదు. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నదే. రెండు రాష్ట్రాల అధినేతలూ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి బాహాటంగా అప్రజాస్వామిక ధోరణిని ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు అధికార పార్టీకి విధేయంగా ఉంటూ కేసుల దర్యాప్తులో ఆగమంటే ఆగుతున్నారు. సాగమంటే ముందుకు సాగుతున్నారు.

తెలంగాణలో నోటుకు ఓటు కేసు కానీ, నయీం డైరీల ఉదంతం కానీ, డ్రగ్స్‌ మాఫియా కానీ, మియాపూర్‌ భూముల వివాదం కానీ కొలిక్కిరాలేదు. మియాపూర్‌లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని ముఖ్యమంత్రి ప్రకటిస్తే నమ్మవలసిందే. డ్రగ్స్‌ వినియోగదారులను కాకుండా అక్రమ విక్రయదారులనూ, బ్రోకర్లనూ పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులు కొత్త సూత్రం చెబితే అంతే కామోసు అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇంత కంటే దారుణం. శేషాచలం అడవులలో కూలీలను కాల్చి చంపిన కేసులో నేరనిర్ధారణ జరగలేదు.

విశాఖ భూకుంభకోణంపైన వేసిన ‘సిట్‌’ విచారణ అనంతంగా సాగుతోంది. గోదావరి పుష్కరాల ఘట్టంలో ముఖ్యమంత్రి సమక్షంలో లఘుచిత్ర నిర్మాణం జరుగుతున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో రెండు పదులకుపైగా భక్తులు చనిపోవడంపై విచారణ, నిర్ధారణ లేదు. పోలవరం సబ్‌–కాంట్రాక్టర్లకు వందల కోట్ల పనులు నామినేషన్‌పైన ఎందుకు ఇచ్చారంటే సమాధానం లేదు. శ్వేతపత్రం ప్రకటించాలని హితుడు పవన్‌కల్యాణ్‌ అడిగినా లెక్కాపత్రం లేదు. కేంద్రం ఇచ్చిన నిధుల ఖర్చు వివరాలు చెప్పమంటే తలాతోకా లేని లెక్కలు చెబుతున్నారు. కడచిన 42 మాసాలలో సాధించిన ఘనకార్యం లేదు. అమరావతి ఇంకా డిజైన్ల స్థాయి దాటలేదు. అసెంబ్లీ భవనం, సచివాలయం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు వగైరా నిర్మాణాలన్నీ తాత్కాలికమే.

తెలంగాణలో ప్రతిపక్షం సంఘటితం కాలేదు. వాటి మధ్య బలమైన సైద్ధాం తిక విభేదాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటి వరకూ ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ. ఆ పార్టీ నాయకుడు చేస్తున్న పాదయాత్రలో ప్రజలు విశేషంగా స్పందిం చడం కనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రతికూలత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల అధినేతల వ్యవహరణ శైలి వచ్చే సంవత్సరం మారిపోతుందనీ, వారు తమకు నచ్చిన విధంగా కాకుండా ప్రజలు మెచ్చే విధంగా వ్యవహరించాలనీ, అందరినీ కలుపుకొనిపోయే రాజకీయం చేయాలనీ, రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధిగా గౌరవించాలనీ కోరుకుందాం. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అన్న నన్నయ వాక్కు నిజం కాదని మన పాలకులు నిరూపిస్తారని ఆశిద్దాం.
 

-- కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top