అసాధారణ వ్యక్తిత్వం ఆమె సొంతం

Indira Gandhi owns an extraordinary personality, writes k Ramachandra Murthy - Sakshi - Sakshi

త్రికాలమ్‌

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శతజయంతి నేడు. నిరుడు ఇదే రోజున ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలకు ఇవాళ తెరపడుతుంది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేవి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ నెహ్రూ, ఇందిరలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. కాంగ్రెస్‌ హయాంలో అంతగా ప్రశస్తి దక్కనివారికి ఇప్పుడు కాస్త అధికంగానే ప్రశంస ఉంటుంది. ఏ దేశంలోనైనా అధికారంలో ఉన్న పార్టీకి ఎవరి పట్ల గౌరవం ఉంటే వారికి బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్‌ ఒక కుటుంబం ఆధిపత్యంలోనే మనుగడ సాగిస్తున్న కారణంగా, దాదాపు యాభై సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా నెహ్రూ వంశజుల ప్రభ చాలాకాలం వెలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రను సవరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వాల ప్రా«థమ్యాలు మారినా, పాలకులు ఎవరి స్తోత్రం వల్లించినా ప్రజల హృదయాలలో కొందరు నేతలు శాశ్వతంగా ఉండిపోతారు. అటువంటి నాయకులలో ఇందిర ఒకరు.

సిండికేట్‌పై విజయం
నలభై నాలుగు సంవత్సరాల కిందట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న విద్యార్థులం ప్రొఫెసర్‌ బషీరుద్దీన్‌ నాయకత్వంలో ఢిల్లీ, ముంబయ్, పుణెలో పర్యటించాం. ఢిల్లీలో నాటి ప్రధాని ఇందిర నివాసానికి వెళ్ళి, ఆమెకు అభిముఖంగా పచ్చికపైన కూర్చొని, పత్రికారంగంపైన ఆమె చేసిన వ్యాఖ్యలు, భవిష్య పాత్రికేయులమైన మాకు చేసిన ఉద్బోధ ఆలకించిన క్షణాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అప్పటికే ఆమె పాకిస్తాన్‌పై విజయఢంకా మోగించి, తూర్పు పాకిస్తాన్‌ను జయించి, బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి దోహదం చేసి, విజయేందిరగా దేశ ప్రజల హారతులందుకున్నారు. 1966లో లాల్‌బహద్దూర్‌ శాస్త్రి హఠాన్మరణం అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన ఇందిరాగాంధీ సిండికేటు పెద్దల (నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, సంజీవరెడ్డి, అతుల్యఘోష్, కామరాజ్‌ నాడార్, ఎస్‌కే పాటిల్‌ తదితరులు) ఆధిపత్యాన్ని ఛేదించారు. ఆ సందర్భంలో వచ్చిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్‌ అధికార అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా వరాహగిరి వెంకటగిరి (వివి గిరి)ని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దించి ఆత్మప్రబోధం ప్రకారం ఓటు చేయాలంటూ కాంగ్రెస్‌ చట్టసభల సభ్యులకు చెప్పారు. గిరిని గెలిపించారు. ఆధిపత్య పోరులో భాగంగానే పార్టీని చీల్చడం, సిండికేటు సభ్యులను పూర్వపక్షం చేయడం అప్పటికే చరిత్ర. మేము చూసింది ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న ఇంది రని. ఒక మహిళ పురుషాధిక్య ప్రపంచంలో నెగ్గుకు రావడం అంత తేలికకాదు. నెహ్రూ కుమార్తె అయినప్పటికీ కాకలు తీరిన నేతల వ్యూహాలను ఎదుర్కోవడం కష్టం. ప్రధాని పదవిలో ఉండటం ఆమెకు కలసివచ్చిన అంశం. 1967 ఎన్నికల సమయంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వందల బహిరంగ సభలలో మాట్లాడారు. ఆ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్‌ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ ఆమె రాజకీయ ప్రస్థానానికి అవసరమైన మెలకువలు అప్పుడే లభిం చాయి. ఆ ఎన్నికల ప్రచారంలోనే ఆమె సమాజంలోని వ్యత్యాసాలను గమనిం చారు. భూమి ఉన్నవారికీ, భూమి లేని పేదలకూ మధ్య అగాధాన్ని అర్థం చేసుకున్నారు. దళితుల, ఆదివాసుల బతుకులలో చీకటి తొలగలేదని గుర్తించారు. ఆమె ప్రత్యర్థులందరూ సంపన్నవర్గాలకు అనుకూలమైన భావజాలాన్ని విశ్వసించేవారనే ముద్ర వేయగలిగారు. స్వయంగా వామపక్ష భావజాలాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాంకులను జాతీయం చేశారు. రాజభరణాలను రద్దు చేశారు. పత్రికలతో, ప్రాంతీయ నాయకులతో నిమిత్తం లేకుండా నేరుగా పేద, మధ్యతరగతి ప్రజలను సంబోధించడం, వారితో సంభాషించడం అలవరచుకున్నారు. పేద ప్రజలతో బంధం ఏర్పాటు చేసుకున్నారు. వారి హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తిరుగులేని జాతీయ నేతగా ఎదిగారు.

సంక్షేమ విధానం
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పథకాలు రూపొందించడం తమిళనాడులో డిఎంకె 1967లోనే ప్రారంభించింది కానీ కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్న సందర్భం లేదు. ‘గరీబీ హఠావో’ నినాదంలో రాజకీయ పార్శ్వం ఉన్నప్పటికీ అది అవకాశవాదం మాత్రం కాదు. పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పం గుండె నిండా ఉన్నది. తమలో ఆత్మవిశ్వాసం ప్రతిష్ఠించిన అధినేతగా ఆమెను దళితులూ, ఆదివాసులూ ఎప్పటికీ మరచిపోరు. సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది ఆమె ప్రభుత్వమే. అంతకు పూర్వం ప్రభుత్వ విధానాలలో, కార్యక్రమాలలో సంక్షేమానికి ప్రాధాన్యం ఉండేది కాదు. నవభారత నిర్మాణంలో భాగంగా ప్రణాళికాబద్ధంగా వివిధ రంగాలను అభివృద్ధి చేసే ప్రయత్నమే జరిగింది కానీ, సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రత్యేక సహాయం చేయవలసిన అవసరాన్ని అంతగా పట్టించుకోలేదు. షెడ్యూల్డ్‌ తరగతుల అభివృద్ధి కార్పొరేషన్, ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఐటీడీఎల్‌) ఇందిరాగాంధీ ప్రమేయంతో వెలసినవే. భూసంస్కరణలు, పేదలకు భూమి ఇవ్వడం, పేదలకు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ ప్రభుత్వం మొదలు పెట్టినవే. ఐఐటి వంటి జాతీయ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు అమలు చేసింది ఆమె ప్రభుత్వమే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించింది, అణు, అంతరిక్ష పరిశోధనలో అసాధారణ ప్రగతి సాధించింది ఆమె హయాం లోనే. పర్యావరణ చట్టాలు తెచ్చింది కూడా ఆమే. శత జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ‘ఇందిరాగాంధీ–ఎ లైఫ్‌ ఇన్‌ నేచర్‌’ పేరుతో పుస్తకం రాశారు.

విజయేందిర
తూర్పు పాకిస్తాన్‌ నుంచి లక్షలాది శరణార్థులు వచ్చి పడటం వల్ల తలెత్తిన సమస్యను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఇందిర విస్తృతంగా పర్యటిం చారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) సేవలు కూడా ఇందుకోసం వినియోగించుకున్నారు. యుద్ధ సన్నాహాల కోసం భారత సైన్యానికి అవసరమైన సమయం ఇచ్చేందుకు దౌత్యనీతిని ఆశ్రయించారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఇందిరను ‘ది విచ్‌’(మంత్రగత్తె) అంటూ నిందించాడు. దౌత్యం వల్ల వచ్చింది ఏమీ లేదు సైన్యం అడిగిన సమయం లభించడం తప్ప. నాటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరల్‌ యాహ్యాఖాన్‌ తూర్పు పాకిస్తాన్‌లో ఏమి జరుగుతున్నదో తెలుసుకొని యుద్ధం ప్రకటించే సమయానికి భారత సైన్యం సరి హద్దు దాటి ఢాకా వైపు వంద కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోయింది. వ్యూహాత్మకంగా సోవియట్‌ యూనియన్‌తో ఇరవై సంవత్సరాల మైత్రీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల నిక్సన్‌ పంపిన యుద్ధ నౌక అడుగు ముందుకు వేయలేకపోయింది. పదిహేను రోజుల్లో యుద్ధం ముగిసింది. జనరల్‌ నియాజీ నాయకత్వంలోని పాకిస్తాన్‌ సైన్యం లొంగిపోయింది. బంగ్లాదేశ్‌ ఆవిర్భావం ఇందిరాగాంధీ జీవితంలో అత్యున్నత విజయం.

ఇంతటి ఘనకార్యం సాధించిన తర్వాత రెండు, మూడు సంవత్సరాలకే ఆమె పతనం ఆరంభమైంది. అవినీతిని ఉపేక్షించారు. పార్టీ సహచరులలో ఎవరినైనా పదవి నుంచి తొలగించాలంటే వారిపైన ఉన్న అవినీతి ఆరోపణలను ఉపయోగించుకునేవారు. తెలంగాణ ఉద్యమం అనంతరం కాసు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా చేయించేందుకు అదే అస్త్రం ప్రయోగించారు. ఆర్‌ కె ధవన్‌ చూపించిన ఫైలు బ్రహ్మానందరెడ్డి చేత రాజీనామా లేఖ రాయించింది. ఇదే విధంగా ఈ అస్త్రాన్ని అనేకమందిపైన ఉపయోగించారు. జేపీ నేతృత్వంలో అవి నీతి వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఇందిరలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ప్రతిపక్ష నాయకులంతా ఉద్యమాన్ని సమర్థించడంతో ఆమెలో అభద్రతాభావం పెరిగింది. ఎవరో తనని తరుముతున్నట్టూ, తనను అంతం చేయడానికి కుట్ర పన్నుతున్నట్టూ భయపడేవారని ఇందిరకు సన్నిహితురాలు పపుల్‌ జయకర్‌ తన పుస్తకంలో రాశారు.

జేపీ ఉద్యమం ఉధృతమైంది. ప్రజలకు వ్యతిరేకమైనవిగా కనిపించిన ఆదేశాలు పాటించనవసరం లేదంటూ పోలీసులకూ, సైనికులకూ ఉద్బోధించారు. రైళ్ళు ఉద్యమకారులను చేరవేస్తూ పూటల తరబడి ఆలస్యంగా నడిచేవి. విద్యాసంస్థలు మూతపడినాయి. ప్రభుత్వం లేనట్టే లెక్క. ఇటువంటి పరిస్థితిలో అలహాబాద్‌ హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఇందిర తరఫున  నానీ పాల్కీవాలా వాదించారు. ఈ తీర్పుపైన సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. అక్కడ షరతులతో కూడిన స్టే వచ్చింది. అప్పటికే గాభరాపడిపోయిన ఇందిర తనయుడు సంజయ్, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి సిద్దార్థశంకర్‌ రే చెప్పిన సలహా పాటించి 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించారు. ఇది ఆమెకు తీరని మచ్చ తెచ్చిన నిర్ణయం. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళలో కుక్కారు. ప్రజాస్వామ్య సంస్థలనూ, సంప్రదాయాలనూ ధ్వంసం చేశారు. ఆత్యయిక పరిస్థితి విధించారు కనుక ఈ కేసులో వాదించజాలనని పాల్కీవాలా చెప్పారు. ఆయనపైన కక్షసాధింపు చర్యలు తీసుకున్నారు. టాటా కంపెనీల బోర్టుల నుంచి ఆయనను తొలగించే విధంగా ఒత్తిడి తెచ్చారు. విమర్శను తట్టుకోలేకపోవడం, ప్రత్యర్థులను అణచివేయడం. నిరంకుశంగా వ్యవహరించడం ఇందిరాగాంధీలో కొట్టొచ్చినట్టు కనిపించిన అవలక్షణాలు. తన నీడను సైతం శంకించే పరిస్థితి. ఎవ్వరినీ నమ్మలేని దౌర్బల్యం ఆమెను ఆవహించింది. సంజయ్‌పైన ఇందిర ఆధారపడటం ఎక్కువయింది. ఉత్తరాదిలో పోలీసుల జులుం పెరిగింది. ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ విధించారు. దాదాపు అన్ని పత్రికలూ ప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి ‘జో హుకుం’ అంటే, ప్రభుత్వాన్ని విమర్శించింది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూపు పత్రికలు మాత్రమే. ఆ రోజుల్లో బెంగుళూరులో ‘ఆంధ్రప్రభ’లో పని చేస్తూ ఆత్యయిక పరిస్థితిని వ్యతిరేకించడం, అరుణ్‌శౌరీ బృందంతో కలసి తిరగడం, తరచు రిపోర్టింగ్‌కి వెళ్ళడం గర్వంగా ఉండేది. 1977లో ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఇందిరగాంధీ ఖమ్మం సందర్శించినప్పుడు నేను సెలవుపైన అక్కడే ఉన్నాను. టాపు లేని జీపులో చేతులు జోడించి ప్రయాణం చేస్తున్న ప్రధాని మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 42 స్థానాలలో 41 స్థానాలనూ కాంగ్రెస్‌ గెలుచుకున్నది కానీ, ఉత్తరాదిలో పార్టీ చావుదెబ్బ తిన్నది. ఇందిర సైతం ఓడిపోయారు. జనతా ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని మొరార్జీ, హోంమంత్రి చరణ్‌సింగ్‌ చాకచక్యం లేకుండా మొండిగా వ్యవహరించడం ఆమెకు బాగా అనుకూలించింది. అంతఃకలహాల కారణంగా జనతా ప్రయోగం చతికిలపడింది. 1980 ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇందిరాగాంధీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇది జరిగిన ఆరు మాసాలకే సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. మళ్ళీ కోలుకోలేదు. ఇదివరకటి చురుకుదనం, వ్యూహరచనా నైపుణ్యం, యుద్ధకౌశలం అదృశ్యమైనాయి.

దేశంకోసం ప్రాణత్యాగం
సైనిక బలగాలు స్వర్ణదేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి భింద్రన్‌వాలే, ఆయన అనుచరులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టగానే వారు లొంగిపోతారనీ, కాల్పులు జరగవనీ, మరణాలు ఉండవనీ జనరల్‌ వైద్య, లెఫ్టినెంట్‌ జనరల్‌ సుందర్జీ హామీ ఇచ్చిన తర్వాతనే సైనిక చర్యను ఇందిరాగాంధీ అనుమతించారు. రెండు గంటలలో పూర్తి కావలసిన పని రెండు రోజలు పట్టింది. తర్వాత స్వర్ణదేవాలయం సందర్శించి సమీపంలోని సరోవర్‌లో తేలుతున్న మృతదేహాలు చూసి ఇందిర దిగ్భ్రాంతి చెందారు. ఇందుకు ఆమే మూల్యం చెల్లించారు. సిక్కు అంగరక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దేశ సమైక్యత, సమగ్రతలకోసం అత్యున్నతమైన ప్రాణత్యాగం చేశారు.

నెహ్రూ నుంచి నరేంద్రమోదీ వరకూ ప్రధానులందరి పదవీకాలాలనూ, జీవితాలనూ పరిశీలిస్తే ఇందిర వ్యక్తిత్వం అర్థం అవుతుంది. ఆమె ఎదుర్కొన్న సవాళ్ళను మరెవ్వరూ ఎదుర్కోలేదు. ఆమె సాధించిన విజయాలను ఇంకెవ్వరూ సాధించలేదు. 16 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో తప్పొప్పులు ఉండటం సహజం. కానీ ఆమె దేశభక్తినీ, చిత్తశుద్ధినీ శంకించడం అపచారం.


- కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top