హెచ్‌.డి. దేవెగౌడ (జేడీఎస్‌) : రాయని డైరీ

HD Deve Gowda Rayani Diary By Madhav Singaraju - Sakshi

మాధవ్‌ శింగరాజు

కుమారస్వామి వచ్చి కూర్చున్నాడు. ‘‘నేనిక కూర్చోలేను నాన్నగారూ’’ అన్నాడు. 
‘‘ఇప్పుడైనా నువ్వు కూర్చొని ఉన్నావని ఎందుకు అనుకుంటున్నావు?’’ అన్నాను. చప్పున కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారస్వామి చాలా సెన్సిటివ్‌. ఏదీ ఆపుకోలేడు. కన్నీళ్లను అసలే ఆపుకోలేడు. అభినందన సభల్లో చేతికి అందిన పుష్పగుచ్ఛం కూడా అతడిని ఏడిపిస్తుంది. అంత మృదు హృదయుడు సీఎంగా నిలబడగలిగాడంటే, అదీ కాంగ్రెస్‌ సపోర్ట్‌తో ఒక ఏడాది కాలాన్నయినా పూర్తి చేశాడంటే గొప్ప సంగతే.’’

‘‘కళ్లు తుడుచుకో కుమార స్వామి’’ అన్నాను.  తుడుచుకోలేదు. తుడుచుకుని మాత్రం చేసేదేముంది అన్నట్లు ఉండిపోయాడు. 
‘‘ఈ కలివిడి ప్రభుత్వాలు ఇలాగే ఏడుస్తాయి కుమారస్వామీ’’ అన్నాను. చివ్వున తలెత్తి, నా కళ్లలోకి చూశాడు!
‘‘నన్నంటున్నారా, ప్రభుత్వాలను అంటున్నారా లేక ప్రభుత్వాలను అడ్డు పెట్టి నన్ను అంటున్నారా నాన్నగారూ..’’ అన్నాడు ఉద్వేగంగా. 

‘‘ఏమన్నాను కుమారస్వామి?’’ అన్నాను. 
‘‘అదే నాన్నగారూ.. ‘ఇలాగే ఏడుస్తాయి’ అన్నారు కదా. ఆ ఏడుస్తున్నది ఎవరూ అని’’ అన్నాడు.
‘‘ఛ.. ఛ.. కుమారస్వామి. మనమెందుకు ఏడుస్తాం. సంకీర్ణ ప్రభుత్వాలను అంటున్నాను నేను’’ అన్నాను.
‘‘అయినా సరే, నేనిక కూర్చోలేను నాన్నగారు. సిద్ధరామయ్య నాకు మినిమం రెస్పెక్ట్‌ కూడా ఇవ్వడం లేదు’’ అన్నాడు. 

‘‘సిద్ధరామయ్య రెస్పెక్ట్‌ ఇస్తున్నంత కాలం కూర్చొని, సిద్ధరామయ్య రెస్పెక్ట్‌ ఇవ్వడం లేదు కనుక లేచి వెళతాను అంటే దానర్థం మన మీద మనకు రెస్పెక్ట్‌ లేదని కుమారస్వామీ..’’ అన్నాను. నివ్వెరపోయి చూశాడు.
‘‘మినిమం రెస్పెక్ట్‌ కూడా ఇవ్వని సిద్ధరామయ్యను కదా నాన్నగారూ మీరు అనవలసింది. మినిమం రెస్పెక్ట్‌ను కోరుకుంటున్న నన్ను అంటున్నారేమిటి?’’ అన్నాడు. 
‘‘సిద్ధరామయ్య ఎవరు?’’ అన్నాను. 

‘‘అర్థమయింది నాన్నగారూ. సిద్ధరామయ్య ఎవరు అన్నట్లుగానో, సిద్ధరామయ్య ఎవరైతే నాకేంటి అన్నట్లుగానో ఉండమనేగా మీరు చెబుతున్నారు’’ అన్నాడు!
కొంచెం కొంచెం తేరుకుంటున్నట్లుగా ఉన్నాడు. నా మాట అర్థమౌతోంది. 

‘‘సిద్ధరామయ్యకు డెబ్బై తొమ్మిది సీట్లు, నీకు ముప్పై ఏడు సీట్లు ఉండొచ్చు కుమారస్వామీ. అలాగని సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. సొంతకాళ్లపై నిలబడే బలం లేక, నువ్వు సిద్ధరామయ్య చేతులపై కూర్చొని ఉండొచ్చు. అలాగని కూడా సిద్ధరామయ్య ఎవరో నీకు తెలిసి ఉండాల్సిన పని లేదు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్నట్లుంటేనే.. ‘నేనెవరో మీకు తెలుసు కదండీ’ అని చెప్పుకోడానికి వస్తారు ఎవరైనా. ఏమంటున్నాడూ.. కూలగొట్టేస్తానంటున్నాడా గవర్నమెంటుని! కూలగొట్టుకోనివ్వు’’ అన్నాను. 

‘‘అది కాదు నాన్నగారూ నా ఆవేదన.. మనతో పొత్తు పెట్టుకుంటే వాళ్ల పార్టీకి నష్టం జరుగుతోందని రాహుల్‌తో అంటున్నాడట. మనం అంత హీనం అయిపోయామా!’’ అన్నాడు. 
‘‘పట్టించుకోకు’’ అన్నాను. ‘‘ఎందుకు పట్టించుకోకూడదు నాన్నగారూ?’’ అన్నాడు.

‘‘కాంగ్రెస్‌ పార్టీకి ఒకరు నష్టం చేయడమేంటి కుమారస్వామీ? వాళ్లకు ప్రెసిడెంట్‌ లేకపోతే కదా!!’’ అన్నాను.
అప్పుడు కళ్లు తుడుచుకున్నాడు. జూలైతో జేడీఎస్‌కి ఇరవై ఏళ్లు నిండుతాయి. కుమారస్వామిని జాతీయ అధ్యక్షుడిని చేస్తేనన్నా కాస్త కుదుట పడతాడేమో చూడాలి.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top