జనం కోసం నడిచి.. నడిచి.. నడిచి

Guest Column By Sree Ramana Over YS Jagan - Sakshi

అక్షర తూణీరం

పాదయాత్ర... సుదూర పాదయాత్ర.. అలుపెరు గని పాదయాత్ర ఒక అపూర్వ ఘట్టం. జనం మధ్యలోంచి, ప్రజల గుండె చప్పుళ్లు వింటూ, వారి నిరాశా నిస్పృహల్ని, ఆవేదనల్ని, ఆర్తనాదాల్ని సాకల్యంగా అర్థం చేసుకుంటూ, దగాపడిన తెలు గింటి ఆడపడుచుల కన్నీళ్లు తుడుస్తూ, ఇడుపుల పాయ నించి ఇచ్ఛాపురం దాకా జనం కోసం ఆ కొస నించి ఈ కొస దాకా నడిచి.. నడిచి.. నడిచి – సత్సం కల్పయాత్ర విజయ యాత్రగా ముగిసింది. 3,648 కిలోమీటర్ల దారిలో అణువణువునా నేలతల్లిని స్పృశిస్తూ, 2,516 పొలిమేరల నీళ్లు రుచిచూసి, అన్ని గ్రామాల గాలిపీల్చి సంకల్ప దీక్షతో జగన్‌మోహన్‌ రెడ్డి విజేతగా నిలిచారు. ఇది ఆయన తెలుగుతల్లికి ఇచ్చిన నీరాజనం. 3,648 కిలోమీటర్లు నడిచి, అడు గడుగునా ఆగి, గతాన్ని అడిగి తెలుసుకుని, భవిష్య త్తుకి భరోసా ఇచ్చి అడుగు ముందుకు వేయడం జగనన్న దిన చర్య.

నవంబర్‌ 6, 2017న కదిలిన పాదం జనవరి 9, 2019న ఆగింది. మూడు సంవత్సరాలు ఈ నడకలో మారాయి. గ్రీష్మాలు, వసంతాలు వచ్చాయి, వెళ్లాయి. ఏ మార్పులు వచ్చినా జగనన్న లక్ష్యంలో మార్పులేదు. అన్నివర్గాల ప్రజల గోడుని వినాలి. వారిని నిండు గుండెతో ఓదార్చాలి. నిండు దోసి లితో భరోసా ఇవ్వాలి. నాలుగున్నరేళ్లుగా సాగు తున్న ఒట్టి మాటల్ని కట్టి పెట్టించి, గట్టి మేల్‌ తల పెట్టే దిశగా జగనన్న ఆలోచనలు పల్లవించాయి. ‘నేనున్నా... ఏడవకండేడవ కండని’ ఎలుగెత్తి అరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ నలు చెరగుల్ని ఊరడించారు. తెలుగు జాతి పక్షాన ఆ నేతకు శుభాభినందనలు. జన సామాన్యం హితం కోసం తన మనసుని, గుండెని, పాదాలని బొబ్బలెత్తించుకున్న జగనన్నకి మేలగుగాక!

చంద్రబాబు హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన పనులకు కోసెడు దూరం. ఉన్నట్టుండి ఒక సర్కస్‌ డేరా రంగుల్లో వెలుస్తుంది. మెరుపులు, మేళాలు, లైటింగ్‌ దిగుతాయి. డేరాలో కొందరు పిచ్చి పిచ్చి ఫీట్లు చేస్తారు. గడసానులు తీగెమీద నడుస్తారు. దీనంగా తిండి చాలక ఎండుపడ్డ అడవి జంతువుల్ని కొరడా ఝళిపిస్తూ గ్యాలరీ ముందు గుండ్రంగా తిప్పుతారు. కోతులు సైకిళ్లు తొక్కు తాయ్‌. చిలుక రివాల్వర్‌ పేలుస్తుంది. అంతా కనికట్టు! బఫూన్‌ పిచ్చి అల్లరితో వినోద పరుస్తాడు. చెక్కల బావిలో మోటార్‌ బైకు చక్కర్లు కొడుతుంది. ఉన్నట్టుండి బఫూన్‌ పులినోట్లో తలకాయ పెడతాడు. రోజూ రెండు ఆటలు ఒకే క్రమంలో సాగుతాయ్‌. 

ఇక్కడ కలెక్షన్లు పడిపోగానే ఇంకో టౌన్లో వెలుస్తుంది రంగుల డేరా. మళ్లీ మేళాలు... మళ్లీ ప్రచార హోరు... షరా మామూలే! రాయలసీమ కరువు జిల్లాల్లో రెయిన్‌గన్లతో లక్షల హెక్టార్ల భూమిని రక్షించామని ప్రచారం చేసుకున్న చంద్ర బాబు తీరు సర్కస్‌ డేరాని తలపించిందని జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజం, చంద్రబాబు ఎంతటి వాగ్దానాన్నైనా ఇచ్చేస్తారు. సానుకూలంగా దాన్ని గాలికి వదిలేస్తారు. జగన్‌ పాదయాత్ర పొడుగునా చంద్రబాబు, ఆయన సహచరులు రకరకాల విమర్శలు, వ్యాఖ్యా నాలు చేస్తూనే ఉన్నారు. ఇవి సామాన్య జనంలో అధిక ప్రచారం కల్పించి విజయానికి దోహద పడ్డాయ్‌. అన్నిచోట్లా్ల ఆగి, స్థానిక సమస్యల్ని మనసు కెక్కించుకోవడం, వాటి పరిష్కారాల గురించి చర్చిం చడం విలక్షణమైన చర్య.

అన్ని ప్రాంతాల ప్రజలు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై జగన్‌ స్పష్టమైన అవగాహన సాధిం చుకున్నారు. ఇది నేతకు కావల్సిన మొట్టమొదటి లక్షణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జగనన్న అరచేతిలో ఉంది. ఏ ప్రాంతం అయినా ఆయనకు కొట్టిన పిండి. రహదార్లు, రోడ్లు, నీటి వసతులు, పండే పంటలు, విద్యా వసతులు, వైద్య సదుపాయాలు ఇంకా సమస్త విషయాలమీద సుస్పష్టమైన అవ గాహన ఉంటుంది. నిజంగా ప్రజలకి పాటుపడాలనే స్థిర చిత్తం ఉన్న నేతకి సరైన అవగాహన ఉంటే ఇక కానిదేముంటుంది?


  శ్రీరమణ
 (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top