‘సబ్‌కా విశ్వాస్‌’లో వాళ్లకు చోటుందా? | Sakshi
Sakshi News home page

‘సబ్‌కా విశ్వాస్‌’లో వాళ్లకు చోటుందా?

Published Thu, Jun 6 2019 3:13 AM

Guest Column By Mallepalli Lakshmaiah - Sakshi

కొత్త కోణం
ఈ దేశంలో గత ఐదేళ్ళలో మతం దేవాలయాల్లోనుంచి, అన్నం గిన్నెల్లోకి పొంగిపొర్లింది. ఎవరేం మాట్లాడాలో, ఏం ఆచరించాలో, ఏ సంస్కృతిని అనుసరించాలో, చివరకు ఎవరి అన్నం గిన్నెల్లో ఏముండాలో కూడా ఆధిపత్య మతమో, లేదా హిందుత్వవాదులో నిర్ణయిస్తోన్న దయనీయ పరిస్థితి ఈ దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీల వంటగదులను సైతం రక్తసిక్తంగా మార్చేసింది. ఈ నేపథ్యంలో మన దేశంలో మైనారిటీలలో నెలకొన్న ఊహాజనితమైన భయాలను తొలగించాలని సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌తో పాటు, సబ్‌కా విశ్వాస్‌ కూడా సాధించాలంటూ రెండోసారి అధికార పగ్గాలు చేపడుతోన్న ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. ముస్లింలలోని భయం నిజం కాదని ధ్వనిస్తున్న ఈప్రకటన మన దేశ ముస్లింలలో విశ్వాసాన్ని ప్రోది చేస్తుందా?

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశం లోని ప్రతి పౌరుడి సంరక్షణకు లౌకికభావన కంచు కవచంలాంటిది. కానీ వ్యక్తి  ఆహార్యాన్నీ, ఆహారాన్నీ, సాంప్రదా యాన్నీ, సంస్కృతినీ, గుర్తించి, గౌరవించే కనీస మానవీయ విలువలకి కాలం చెల్లిందనడానికి గడచిన ఐదేళ్ళు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తు న్నాయి. మతం మత్తుమందులాంటిదని ఏనాడో చెప్పిన మార్క్సిస్టు మహాజ్ఞాని వ్యాఖ్యలు అక్షరసత్యాలని వేనవేల సంవత్సరాల మత మౌఢ్యం ప్రతిమారూ నిరూపిస్తూనే ఉంది. అది హిందూత్వ భావజాల పునాదులపై అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ, దాని అనుబంధ సంస్థలూ మతం యొక్క మూఢత్వాన్నీ, వెర్రితనాన్నీ మరిం తగా సాక్షాత్కరించాయి. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ నాటి వరకూ ఆధిపత్య మతమైన హిందూ మతం మైనారిటీ మత మైన ముస్లిం మతంపైనా, ఇస్లాం మతాన్ని ఆచరిస్తోన్న అత్యంత పేద వర్గమైన ముస్లింలపైనా చెలాయిస్తోన్న ఆధిపత్య చరిత్ర యావత్తు రక్తసిక్తంగా మారింది. ఇలాంటి సందర్భంలో రెండోసారి అధికారపగ్గాలు చేపడుతోన్న ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు ఈదేశంలో సమా నత్వ కాంక్షాపరులందరినీ క్షణకాలం పాటు ఆశ్చర్యానికి గురిచేశాయి.  
 
‘‘మన దేశంలో మైనారిటీలలో నెలకొన్న ఊహాజనితమైన భయా లను తొలగించాలి. సబ్‌కాసాథ్‌ సబ్‌కా వికాస్‌తో పాటు, సబ్‌కా విశ్వాస్‌ కూడా సాధించాలి. మనం ప్రజలందరి ప్రభుత్వంగా పనిచేయాలి’’ అంటూ బీజేపీ అనూహ్య విజయాన్ని కైవసం చేసుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త గొంతును విని యావత్‌ దేశం ఆశ్చర్యపోయింది. ఈ దేశంలో ఇసుమంతైనా సెక్యులర్‌ భావజాలం బతికి బట్ట కట్టాలని భావించేవారందరికీ ఈ వ్యాఖ్యలు అద్భుతంగా తోయడంలోనూ ఆశ్చర్యం లేదు. ఈ మాటల్లో సత్యమెంత అన్న అను మానం రానివారెవ్వరూ ఉండరని కూడా గతకాలపు చేదు అనుభవాల దొంతరలు నొక్కి చెపుతున్నాయి. అందుకనుగుణంగానే ఈ మాటల్లోనే ఒక తిరకాసు కనిపిస్తున్నది.

ఒక మాయాజాలం అంతర్లీనంగా వినిపిస్తూ ఉన్నది. ముస్లిం మైనారిటీల్లో ఊహాజనితమైన భయం ఉన్నదని ఆయన మాటల సారాంశంగా మనం భావించొచ్చు. ముస్లింలలోని భయం నిజం కాదన్నది దానర్థం. ఆ మాటల్లోని అంతరార్థంలో సత్యాసత్యా లను పెద్దగా అన్వేషించాల్సిన పనికూడా లేదు. భారతదేశంలోని పరిస్థి తులను గత అయిదేళ్ళుగా పరిశీలిస్తున్న వారెవరికైనా ఈ మాటల్లోని నిజం వెతకడం అర్థంలేనిపనిగా స్పష్టమౌతుంది. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవ మైనారిటీల్లో గత కొన్నేళ్ళుగా నెలకొన్న అభద్రతాభావం పెరి గింది. దానికి గత ఐదేళ్ళలో ఆయా మతాలపైనా, మతాన్ని ఆచరిస్తోన్న ప్రజలపైనా అమానుషమైన దాడులూ, దానికి సమర్థనగా లేవనెత్తిన అప్రజాస్వామిక భావజాలాలూ కారణం. ముఖ్యంగా గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులు కాకతాళీయం కాదన్న సంగతి జగమెరిగిన సత్యం.

ఈ దేశంలో గత ఐదేళ్ళలో మతం దేవాలయాల్లోనుంచి, అన్నం గిన్నెల్లోకి పొంగిపొర్లింది. ఎవరేం మాట్లాడాలో, ఏం ఆచరించాలో, ఏ సంస్కృతిని అనుసరించాలో, చివరకు ఎవరి అన్నం గిన్నెల్లో ఏముం డాలో కూడా ఆధిపత్య మతమో, లేదా ఆ మతాన్ని ఆచరిస్తోన్న పాలకుల నీడలో హిందూత్వవాదులో నిర్ణయిస్తోన్న దయనీయమైన పరిస్థితి ఈ దేశంలో 15 శాతంగా ఉన్న ముస్లిం మైనారిటీల వంటగదులను సైతం రక్తసిక్తంగా మార్చేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనం తరం అంటే 2018 వరకు జరిపిన అధ్యయనంలో దాదాపు 80 మందికి పైగా హత్యకు గురయ్యారని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ పేర్కొన్నది. 
ఆవుని చంపడాన్ని నిషేధిస్తూ ఉన్న చట్టాలను బీజేపీ ప్రభుత్వాలు మరింత కఠినతరం చేశాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు గో సంరక్షణ దళాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అపరిమితమైన అధికా రాలను కట్టబెట్టాయి.

ఎవరైనా గో హత్యకు పాల్పడినట్టు వారు భావిస్తే, లేదా అనుమానం వస్తే, అది కాదని నిరూపించుకునే బాధ్యత సైతం నిందితులపైనే పెట్టారు. ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యే తప్ప మరొకటి కాదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా లాంటి రాష్ట్రాల్లో గో సంరక్షణ దారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. 2017లో ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్‌ ఏకంగా ముస్లింలు చట్ట ప్రకారం నిర్వహిస్తోన్న ఎన్నో పశువధ శాలలను బలవంతంగా మూసివేయించారు. రాజస్తాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఆవులను అక్ర మంగా తరలిస్తున్నారనే పేరుతో వందలాది మందిని అక్రమంగా నిర్బం ధించింది. గోసంరక్షకులకు అధికారికంగా అండదండలు అందించి, అన ధికారికంగా ప్రోత్సాహమిచ్చి అదే వృత్తిని నమ్ముకొని బతుకుతోన్న వేలా దిమంది నిరుపేద ముస్లింలపై దాడులకు కారణమయ్యింది.

దాని ఫలి తమే 2017 ఏప్రిల్‌లో పెహ్లఖాన్‌ అనే పాలమ్ముకునే రైతును స్మగ్లింగ్‌ చేస్తున్నాడనే పేరుతో తీవ్రంగా హింసించిన అమానుష ఘటన అప్పట్లో పెద్ద సంచలనాన్ని రేపింది. గోసంరక్షణ పేరుతో హత్యలకు పాల్పడిన వాళ్ళకు వత్తాసు పలుకుతూ, ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్న వాళ్ళను తెలిసి నేరం చేస్తున్నట్టు, గో సంరక్షకులూ, గో ఆరాధకులు వాళ్ళను ఆపడానికి ప్రయత్నం చేయడం తప్పుకాదు అంటూ హంతకులకు వత్తాసు పల కడం పాలకుల తీరుకి అద్దం పడుతోంది. 2015 మే నుంచి 2018 డిసెంబర్‌ మధ్యలో కనీసం 44 మంది ముస్లింలు హత్యకు గురైనట్టు, వీరిలో అత్యధిక భాగం ఆవు మాంసాన్ని రవాణా చేస్తున్నందుకో, లేదా గోవు మాంసాన్ని ఇంట్లో ఉంచుకున్నం దుకో మృత్యువు ఒడిలోకి చేరిన దుస్థితిని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ బట్ట బయలు చేసింది.

అలాగే దేశంలో జరిగిన మతదాడుల్లో 90 శాతం మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాతే జరిగాయని కూడా ఈ రిపోర్టు వెల్లడించింది. గోసంరక్షకుల పేరుతో కొంతమంది ముఠాలుగా తయారై హింసాకాండకు దిగారు. దాడులు చేశారు. హత్యలకు దిగారు. కేవలం గోభక్షకులనే ఒకే ఒక్కపేరుతో నిరుపేద మైనారిటీల దేహాలను చెట్లకు వేళ్ళాడదీశారు. ఈ కుటుంబాల్లోని వారెవరైనా న్యాయం కోసం గొంతు విప్పితే వారినోళ్ళు మూయించడానికి కండబలాన్ని ప్రయోగించడం అత్యంత సహజక్రియగా మారిపోయింది. చావు భయంతో వెనక్కి తగ్గడం తప్ప వారికి వేరే ఆసరా లేకుండా పోయింది. ఎవరైనా సామా జిక కార్యకర్తలో, సంస్థలో బలవంత పెడితే పేరుకి దర్యాప్తు ప్రారం భించి, దానికి సంబం ధించిన ప్రొసీజర్స్‌ని నిర్లక్ష్యం చేసి, చివరకు నేర స్తులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు కూడా ఈ రిపోర్టు తేల్చి చెప్పింది. 


ఇక ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణసింగ్‌ ఏకంగా ‘‘గోవులను చంపే వారిని మేం ఉరితీస్తాం’’ అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. చివరకు రైళ్ళలో ప్రయాణిస్తున్న వారిపై సైతం గోమాంసం తింటున్నా రనే పేరుతో దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. హరియా ణాలో  బీఫ్‌ తింటున్నారన్న కారణంగా ఓ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలపై అత్యాచారంచేసి, హత్యచేసిన దారుణ ఘటనలు జరగడం మన రాజ్యాం గంలోని లౌకిక భావనకు ఈ దేశం, ఇక్కడి పాలకులు ఇస్తున్న గౌరవ మెలాంటిదో అర్థం అవుతోంది. ఏదైనా నేరం చేసిన వారు తమ నేరాన్ని బహిరంగంగా చెప్పు కోలేరు. నేరం చేసినందుకు తాము శిక్షించబడతా మేమోననే భయం వారిలో ఉంటుంది కనుక. కానీ గోసంరక్షణ పేరుతో దాడులకు పాల్పడిన వారు తమ నేరాన్ని బహిరంగంగా యూట్యూబ్‌లో పెట్టుకుంటున్నారు.


తాము చేసిన దుశ్చర్యకు విర్రవీగుతున్నారు. ఎందు కంటే వారిని ఆ తరువాత శిక్షించడం కాకుండా హీరోలుగా చూస్తున్న పరిస్థితి ఉందంటున్నారు ఇండియన్‌ సోషల్‌ వర్కర్, రచయిత హర్షమం దర్‌. మూకుమ్మడిగా ముస్లింలను హత్యలు చేసిన గుంపు హత్యాకాం డల్లో దోషులకు శిక్షపడిన దాఖలాలే లేవు. ఆ రోజు ముస్లింల హత్యలకు పాల్పడిన గుంపులకు ఇప్పుడిక హద్దూ పద్దూ ఉండదని మరునాటి నుంచే ప్రారంభమైన దాడులు తేట తెల్లం చేస్తున్నాయి. కాబట్టి ప్రధాని, లేదా భారతీయ జనతా పార్టీ వల్లె వేస్తున్న మాటలకూ, చేతలకూ పొంతనలేదన్న విషయంలో ఏమాత్రం సందేహంలేదు. సబ్‌కా సాత్‌ సబ్‌కా విశ్వాస్‌ వినడానికి సొంపుగానే ఉన్నా, అదే విశ్వాసాన్ని ఈ దేశ ముస్లింలలో కలిగించాలంటే హిందుత్వ వాదుల ఆగడాలను పార్టీలు కాదు సమాజమే అడ్డుకట్ట వేయాలి. ఓట్లు దండుకున్న హిందుత్వవాదం వెర్రితలలు వేయకముందే ప్రతి పౌరుడూ మెళకువతో వ్యవహరించక తప్పని పరిస్థితి ఇది.

మరో ఐదేళ్ళ పాటు ఈ దేశంలో దళితులూ, మైనారిటీలూ, స్త్రీలూ తమని తాము వ్యక్తులుగా, ఉమ్మడిగా శక్తిని కూడగట్టుకోవాల్సిన సందర్భమిదే. స్వతంత్రపోరాట కాలంలో ఆ తర్వాత కూడా, ఈ దేశంలోని ప్రతి అభివృద్ధిలో వారి చెమ టచుక్కలున్నాయి. శత్రుదేశాలనుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడం మొద లుకొని, ఈ జాతిబిడ్డల ప్రాణాలు కాపాడటం కోసం ప్రాణాలర్పించడం వరకు ముస్లింల సేవలు అనన్యసామాన్యమైనవి. ఇక్కడ అడుగడుగునా ఎదురౌతోన్న అవమానాలను దిగమింగుతూ తన భూమిపైనే పరాయి వారుగా జీవిస్తున్న వారిని హత్తుకుని, అక్కున చేర్చుకునే రోజు కోసం భారత దేశస్తుడైన ప్రతి ముస్లిం ఎదురుచూస్తూనే ఉంటాడు. వారికి అండగా హృదయమున్న ప్రతిభారతీయుడూ స్పందిస్తూనే ఉంటాడు. ఇది సత్యం.


మల్లేపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

Advertisement
Advertisement