పోటెత్తిన జన జాతర... జగన్‌ యాత్ర

Guest Column By Gourav - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల గుండా 350 రోజులపాటు దాదాపు 3650 కిలోమీటర్ల దూరం వరకూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగించిన జనసంకల్ప యాత్ర  మండువేసవిని, కుంభవృష్టిని, తుపానులను, చలిగాలులను ధిక్కరిస్తూ తనకు తానుగా ఒక చరిత్రను సృష్టించుకుంది. ఈ పాదయాత్రకు బలమైన నేపథ్యం ఉంది. విభజనానంతరం ఏపీ అసెం బ్లీలోనూ, బయటా టీడీపీ ప్రభుత్వ దాష్టీకాన్ని, ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరును నిశితంగా గమనించిన జగన్‌ ఇక అధికార పక్షంతో అసెంబ్లీలో పోరాడటం వ్యర్థమని గ్రహించి ప్రజలకు దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, సాధ్యమైనంతవరకు వాటికి పరిష్కారాలు వెదకటానికి ప్రయత్నించారు. నవరత్నాలను ప్రకటించిన గుంటూరు ప్లీనరీ అనంతరం టీడీపీపై బహుముఖరీతిలో ఒత్తిడి పెంచాలని జగన్‌ నిర్ణయించారు. తనకు తాను స్వయంగా పాదయాత్రను చేపట్టారు. ప్రతిరోజూ అసెంబ్లీని బహిరంగ సెషన్‌గా మార్చి ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని లాగి నేరుగా ప్రశ్నించే ప్రక్రియే పాదయాత్ర. ఇటీవలికాలంలో ఏ జాతీయ, ప్రాంతీయ రాజ కీయ నేతకూ సాధ్యంకాని రీతిలో జనసమీకరణకు పాదయాత్ర పట్టం కట్టింది. ప్రతిరోజూ పాదయాత్ర ఓ కొత్త ప్రారంభమే. కొత్త సమస్యలను పరిష్కరించడమే. ప్రజలనుంచి నిత్యం నేర్చుకుంటూ వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడమే.

ప్రజలనుంచి తెలుసుకున్న అంశాలను వారి బాధలను నేరుగా తన ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారు జగన్‌. ప్రజాసంకల్ప యాత్ర అంతిమ ఘట్టంలోకి వచ్చేసరికి భవి ష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటూ  ప్రజల మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు. గ్రామ సచి వాలయం, గ్రామ స్వరాజ్‌కి సంబంధించిన వినూత్న భావనలు కూడా ఈ పాదయాత్రలోనే జగన్‌ భావి కార్యాచరణ అమలుకు సన్నద్ధంగా తోడై నిలిచాయి. ఇడుపులపాయలో ప్రారంభించి గుంటూరు జిల్లాకు చేరుకున్న జగన్‌కి జనం ప్రభంజనంలా స్వాగతమిచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా నదిపై, గోదావరి నదిపై నిర్మించిన అతి భారీ వంతెనలు సైతం తలవంచి నమస్కరించడమే కాకుండా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. 

ప్రాణహాని తలపెట్టినా చిరునవ్వే సమాధానం: 
వైఎస్‌ జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేని విచ్ఛిన్నకర శక్తులు ఆయనపై భౌతికంగా దాడి చేసి తుదముట్టించాలని పథకం రచించాయి. విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై కత్తితో దాడిచేసిన శ్రీనివాస్‌ అధికారం చలాయిస్తున్న కీలక సూత్రధారుల చేతిలో పావు మాత్రమే. కోట్లాది ప్రజలు, దేవుడు, వైఎస్సార్‌ ఆత్మ ఆశీస్సులతో జగన్‌ కనీస గాయాలతో ఈ కుట్ర నుంచి తప్పించుకున్నారు. తనపై దాడిని  పురస్కరించుకుని టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని జగన్‌ భావించి ఉంటే ఏపీ మొత్తం మంటల్లో మండిపోయేది. అలాంటి పరి స్థితి రాకూడదనే ప్రథమ చికిత్స అనంతరం జగన్‌ హైదరాబాద్‌ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు.

అటు సీఎం, ఇటు డీజీపీ కలిసి జగన్‌ అభిమానే దాడిచేశారని వక్రభాష్యాలు చెప్పడం నుంచి.. హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి జాతీయ దర్యాప్తు సంస్థకు సహకరించవద్దంటూ రాష్ట్ర పోలీసు శాఖను ప్రేరేపించడం దాకా బాబు ప్రజల హృదయాల్లో జగన్‌పై దాడి కేసులో ప్రథమ ముద్దాయిగానే నిలిచిపోయారు. అదే సమయంలో తనపై ప్రభుత్వం, సీఎం, టీడీపీ నేతలూ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా కిమ్మనకుండా, తనకు న్యాయస్థానమే న్యాయం చేయాలని కోరిన జగన్‌ ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. పాదయాత్ర ముగింపునకు సమీపిస్తున్న సందర్భంగా గత కొద్ది రోజులుగా సీనియర్‌ జర్నలిస్టులకు టీవీ ఇంటర్వూ్యలు ఇస్తూ వస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రజా సంక్షేమానికి సంబంధించినంతవరకు తన దృష్టినీ, విజన్‌నూ ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

గంట కుపైగా సాగిన ఆ ఇంటర్వూ్యలలో ఎంతో ఆత్మవిశ్వా సంతో, భావ స్పష్టతతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌ అదే సమయంలో చంద్రబాబుపై ఒక్క తేలికపాటి వ్యాఖ్య కూడా చేయలేదు. ప్రజల సంక్షేమంపైనే తనకు నిబ ద్ధత ఉందని ఆయన చాటుకున్నారు. రాజీలేని దీక్షతో ప్రజలకు సేవ చేయడం, తన తండ్రిలాగే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం  సాధించుకోవడమే తన ఏకైక వాంఛ అని వైఎస్‌ జగన్‌ స్పష్టంగా పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచం కనీ వినీ ఎరుగని జన ప్రభంజనాన్ని పాదయాత్ర ద్వారా ఆకర్షించిన జగన్‌ వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించనున్నారని జనవాక్యం. 
- గౌరవ్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top