జనహితం జగన్‌ ‘లాంగ్‌మార్చ్‌’

Guest Column By ABK Prasad Over Prajasankalpayatra - Sakshi

రెండో మాట

వర్తమాన కాల పరిస్థితులను గమనిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా తలపెట్టిన అపూర్వమైన ప్రజాçసంకల్ప యాత్ర సరికొత్త చైతన్యాన్ని రగుల్కొల్పింది. సంకల్పయాత్రలో భాగంగా నింగి లోతులు చూశారు, సేద్య ధారలందించే జలనిధుల్ని కొలిచారు. ప్రయాణించిన ప్రతిచోటా మట్టిబెడ్డను కలుసుకున్నారు. రాతిముక్కను కలుసుకున్నప్పుడల్లా దానిలోని రత్న తత్వాన్ని తెలుసుకున్నారు. వేలు, లక్షలాదిమంది సామాన్య ప్రజల గుండెచప్పుళ్లను దగ్గరగా విన్నారు. తన తపస్సు ఫలించి తన సందేశం తెలుగుజాతి గుండెల్లో ఘూర్ణిల్లి, అది కాస్తా జనత పాడుకునే మంత్రంగా మోగాలని ఆశిస్తున్నారు జగన్‌.

‘‘నాగరికత సృష్టికర్త భూమండలం కాదు, మనిషి మాత్రమే’’నని చాటినవారు ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు, ప్రపంచ నాగరికతా చరి త్రను సుమారు పదకొండు సంపుటాలలో క్రోడీకరించి దించిన సాధికార చరిత్రకారులు విల్‌ డూరాంట్, ఏరియల్‌ డూరాంట్‌ దంపతులు. ఆ నాగ రికతలో అంతర్భాగంగానే సామాజిక పురోగతిలోని ఎగుడుదిగుళ్ల ఫలి తంగా తలెత్తిన మానవకల్పిత అసమానతలకు, పరస్పర దోపిడీకి గురైన కారణంగా దగాపడిన దళిత బహుజన బడుగు వర్గాల సమున్నతికి కంకణం కట్టుకున్నవారు లేకపోలేదు. కానీ, ఈ అసహజ సామాజిక పునాదికి మూలాలు కనుగొన్న స్ఫూర్తి ప్రదాతలు అన్ని కాలాలలోనూ ఉన్నారు. ఒడ్డున నిలబడి సము ద్రాన్ని పొగడొచ్చుగానీ దాని లోతు పాతులు తెలుసుకోవడం కష్టం. ఈ పరిస్థితిని ఎక్కువ దూరదృష్టితో అంచనా కట్టినవాడు కవి సినారె. ఆయన మాటల్లోనే:

‘‘ఎన్ని మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు
నింగి లోతును చూడగోరితే నీటి చుక్కను కలుసుకో!
మనిషి మూలం తెలియగోరితే మట్టిపెడ్డను కలుసుకో!
రత్న తత్వం చూడగోరితే రాతిముక్కను కలుసుకో!
రత్నమై ప్రకాశించాలంటే ముందుగా రాతి తత్వం తెలుసుకో!
కాలగతిలో ఎంత చరిత్ర దాగెనో మౌన వీణను మీటి తెలుసుకో!’’

ఆ తవ్వోడలో భాగంగా ఆ తూరుపుకొండల్లోనే ఉదయించిన సూర్యు లెందరో, అరచేతిని అడ్డుపెట్టినా ఆ సూర్యకాంతిని ఎవరూ ఆపలేరన్న సందేశమూ ప్రకాశమానంగా, నేటికీ జాలువారు తున్నదీ ఆ సంప్ర దాయం నుంచే. అదే స్ఫూర్తితో నేడు జనహితమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు, యువనేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడూ, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమా రుడు జగన్‌మోహన్‌రెడ్డి యుక్త వయసులోనే తన చుట్టూ పాలకులల్లిన ముళ్ల కంచె నుంచి బయటపడి తెలుగు జన మహా సంద్రంలోకి దిగి తన అనుభవ పాఠం నుంచి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా కొత్త పాఠాలు నేర్చుకోసాగారు.

పాలకపక్షాల కుట్రలను, కుహ కాలను ఛేదించడం కోసమే జగన్‌ ఒక్క అడుగుతో ప్రారంభించిన జన హిత యాత్రను ప్రజా సంకల్పయాత్రగా మార్చడంలో భాగంగా నింగి లోతులు చూశారు, సేద్య ధారలందించే జలనిధుల్ని కొలిచారు, మనిషి మూలాలను తెలుసుకునేందుకు ప్రయాణించిన ప్రతిచోటా మట్టిబెడ్డను కలుసుకున్నారు. రాతిముక్కను కలుసుకున్నప్పుడల్లా దానిలోని రత్న తత్వాన్ని తెలుసుకున్నారు, తద్వారా కాలగతిలో దాగిన పేదజీవులు, కష్ట జీవులు చిందించి నిర్మించిన చరిత్రనూ ఈ ప్రజా సంకల్ప యాత్రలో తన మౌనవీణను మీటి మరీ తెలుసుకున్నారు. రత్న తత్వాన్ని గ్రహిం చిన జగన్‌ ప్రజల కనీస అవసరాలను తీర్చగల ‘నవరత్న’ పథకాన్ని రూపొందించారు. పాలకులు ఉద్దేశిత లక్ష్యాలను నెరవేర్చనప్పుడు రాజీ నామా ఇచ్చి పోవాలన్న నీతిని ప్రజల మనస్సుల్లో నాటగలిగారు. 

అంతేగాదు, కేంద్ర, రాష్ట్రాలలోని పాలకాధములు తనను, తన భవి ష్యత్తును రాచి రంపాన పెట్టడానికి ఏ నీచానికైనా పాల్పడటానికి సిద్ధ మైనప్పుడు అనితర సాధ్యమైన ఆత్మస్థయిర్యంతో హుందాగా ఎదు ర్కొంటూ తొట్రుపాటు లేకుండా, నిమిషంపాటు అసహనాన్ని కూడా ప్రదర్శించకుండా అనునిత్యం దుష్టపాలనా శక్తులను ఒక్కుమ్మడిగా ఎదు ర్కోగల ధైర్యాన్ని, దిటవునూ తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలలో పాదుకొల్పుతూ జగన్‌ చేసిన మహా సాహస శాంతి క్రతువు ప్రపంచ చరిత్రలో మరొక ‘లాంగ్‌మార్చ్‌’గా చెప్పుకోవచ్చు. ఛైర్మన్‌ మావో సే టుంగ్‌ నాయకత్వంలో చైనీస్‌ రెడ్‌ ఆర్మీ నిర్వహించిన ‘లాంగ్‌ మార్చ్‌’కి, జగన్‌ సారథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సాగించిన ప్రజా సంకల్పయాత్రకు మధ్య కొన్ని అంశాలలో పోలికలు లేకపోలేదు: 370 రోజులలో చైనీస్‌ ‘లాంగ్‌ మార్చ్‌’ 9,000 కిలోమీటర్ల (5,600) మైళ్ల పర్యంతం సాగగా, జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 341 రోజుల్లో 3,600 కిలోమీటర్లు (2,237 మైళ్లు) పూర్తి చేసుకుంది.

ప్రపంచ చరిత్రలో ఈ రెండూ చరిత్ర సృష్టించిన ‘పాదయాత్ర’లే. చైనీస్‌ రెడ్‌ ఆర్మీ దేశ విమోచన కోసం గ్రామాలను, పట్టణాలను ప్రజా సహకారంతో విముక్తి గావించుకుంటూ సాగిన విప్లవ ప్రభంజనం కాగా, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ సుదీర్ఘ సంకల్పయాత్ర.. పాలకుల అంధ పరిపాలన నుంచి బయటపడి వెలుగు చూడగోరుతున్న గ్రామీణ, పట్టణ, పేద, మధ్యతరగతి వృత్తి జీవులు, రైతాంగ విద్యాధిక యువతతో కూడిన లక్షలు, కోట్లాది తెలుగు ప్రజలలో నవ చైతన్యాన్ని రగుల్కొల్పగలిగిన మహా సంఘటన.  ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో పాదయాత్రలకు తొలిరూపం 1935– 1936లో నాటి మద్రాసు శాసనసభకు, ముఖ్యమంత్రి రాజగోపాలాచారి మంత్రివర్గానికి రైతాంగ సమస్యలపై బృహత్‌ మెమొరాండాన్ని సమ ర్పించడానికి కొమ్మారెడ్డి సత్యనారాయణ, కమ్యూనిస్టు నాయకులు చల సాని వాసుదేవరావు నాయకత్వంలో ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు 1,500 కిలోమీటర్లు సాగిన రైతాంగ పాదయాత్ర. ఆ తరువాతి ఖ్యాతి– ఏపీలో కునారిల్లి పోతున్న కాంగ్రెస్‌ను పునఃప్రతిష్టించేందుకు కాంగ్రెస్‌ నాయకుడు, జనప్రియుడైన రాజశేఖరరెడ్డి తలపెట్టి జయప్ర దంగా నిర్వహించిన రాష్ట్రవ్యాపిత పాదయాత్రకు దక్కుతుంది.

వైఎ స్సార్‌ పూర్వీకులు కాలానికి ఎదురీతగా నిలిచిన త్యాగధనులు. ఆ వార సత్వాన్ని, స్ఫూర్తినీ నేటితరంలో కొనసాగించిన వారు విజయమ్మ, కూతురు షర్మిల, జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ముగ్గురి పాదయాత్రలకు వైఎస్‌ భారతి అందించిన ప్రోత్సాహం విస్మరించదగినది కాదు. మన దేశ చరిత్రలో ఆధ్యాత్మిక యాత్రలు, భజన సమాజాల యాత్రలే ఎక్కువ కానీ, నిజ జీవనానికి, ప్రజా సౌభాగ్య రక్షణకు, సమ సమాజ స్పృహతో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలు తక్కువ. దేశ చరిత్రలో రాజకీయ పాదయాత్రలూ లేకపోలేదు. గతంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో 1917లోనే బిహార్‌లోని చంపారన్‌లో ఉద్యమిం చిన దేశ తొలి రైతాంగ పోరాటం. ప్రజా సమస్యలు, వాటికిగల కారణా లను ఏకరువు పెడుతూ సాగిన మహోద్యమమది. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో ప్రజాతంత్ర రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని పాలకులు భ్రష్టుపట్టించి, నిరంకుశ పాలనా శకాన్ని ప్రారంభించడంతో జయప్రకాష్‌ నారాయణ్, చంద్రశేఖర్‌ వంటి సర్వోదయ నాయకులు ప్రజలలో చైతన్యం రగిలిం చడానికి ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలూ నిర్వహించాల్సి వచ్చింది. 

సరిగ్గా ఈ స్ఫూర్తినుంచే, వర్తమాన కాల పరిస్థితులను గమనిస్తున్న వైఎస్‌ జగన్‌ ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా తలపెట్టిన అనుపమానమైన జనహిత, ప్రజాçసంకల్ప యాత్ర సరికొత్త చైతన్యాన్ని రగుల్కొల్పింది. అది ఆయనలో తాను గుర్తెరిగిన ప్రజా సమస్యల పరి ష్కారం వైపుగా యజ్ఞదీక్షకు బీజాలు నాటింది. నేటి పాలనాధికారపు మంత్రనగరిలో గణతంత్ర రిపబ్లిక్‌ అవతరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు వీలు కల్పించిన రాజ్యాంగమూ, అది నెలకొల్పిన వ్యవస్థలనూ దఫదఫా లుగా నిరంకుశ పాలకులు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో జగన్‌కు తెలిసిపో యింది. చివరికి రాష్ట్ర పాలకులు కూడా కత్తిపోటు రాజకీయాన్ని ఆశ్ర యించి న్యాయవ్యవస్థలనూ, నేర విచారణ సంస్థలనూ శాసించే నిరం కుశులుగా మారడమూ, సత్వర న్యాయ విచారణకు, శిక్షా నిర్వహణకు వీలు లేనంతగా పాలకులు అన్య మార్గాలను అనుసరించి ‘రూల్‌ ఆఫ్‌ లా’ నుంచి, తప్పుకోవడానికి ద్వారాలు వెదకడమూ జరుగుతోంది.

ఈ దారుణ పరిస్థితి– గత పదిహేనేళ్లలో న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యా నికి స్థానిక పాలకులు పాల్పడిన పరిణామాలను జగన్‌తోపాటు ప్రజలూ, బాధ్యతగల పాత్రికేయులూ నిశితంగానే పరిశీలిస్తున్నారు. 
తన ప్రజా సంకల్పయాత్రలో జగన్‌ వేలు, లక్షలాదిమంది సామాన్య ప్రజల గుండెచప్పుళ్లను దగ్గరగా విన్నారు. ఒక్క ముసలి, ముతకలతోనే కాకుండా, అసంఖ్యాకంగా యువతీ యువకులతో ఎలా ఇంటరాక్ట్‌ అయ్యాడో, అంతే అసంఖ్యాకంగా వయోజన స్త్రీ పురుషులతో ఆప్యాయంగా మెలిగి వారి మనస్సులను గెలుచుకున్నారు. కుల, మత, వర్గ విచక్షణ లేకుండా చిన్నారులు, చంటిబిడ్డలను సహితం గోముగా, ఆప్యాయంగా ముద్దాడి, దీవించారు. అంతటి యాత్రలకూ అలసట గానీ, విసుగూ, విరామాలుగానీ లేకుండా నిరంతర చైతన్య జ్వాల మధ్య చిరునవ్వుతోనే– జన సమూహాల నుంచి వస్తున్న పలు అర్జీలను, మహ జర్లను, జరగాల్సిన పనులపై మెమోరాండాలు, వినతి పత్రాలు అందు కున్నారు. కమ్మరి కొలిమినీ తట్టారు, కుమ్మరి చక్రాన్నీ తిప్పారు.

రైతు గుండెకు భరోసా ఇచ్చారు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నా లకూ పరిచయమయ్యారు. తన మెడకు పాలక వర్గాలు ఎక్కు పెట్టిన ‘కోడికత్తి’ వ్యూహాన్ని త్వరలోనే ఛేదించబోతున్నారు జగన్‌. ఈ దుర్మార్గాన్ని గుర్తు చేసుకోబట్టే ‘ఆః’ అనే ఆశ్చర్యార్థక కవితలో మహాకవి శ్రీశ్రీ అంతరా ర్థాన్ని జగన్‌ బాధతో ఇలా మననం చేసుకోగలిగారు: ‘‘నిప్పులు చిమ్ము కుంటూ/నింగికి నేనెగిరిపోతే/ నిబిడాశ్చర్యంతో వీరు’’ నోరెళ్లబెడతారు, కుళ్లిపోతారు, కాగా ‘‘నెత్తురు కక్కుకుంటూ/నేలకు నే రాలిపోతే/ నిర్దాక్షి ణ్యంగా వీరె’’ లోలోపల సంతోషిస్తారు అని గుండె భారంతో అనగలి గారు జగన్‌. అందుకే అతను చిరంజీవి, అతడు జన నేత. తన తపస్సు ఫలించి తన సందేశం తెలుగుజాతి గుండెల్లో ఘూర్ణిల్లి, అది కాస్తా జనత పాడుకునే మంత్రంగా మోగాలని ఆశిస్తున్నారు జగన్‌. ఆప్తవాక్యంగా చివరికొక్కమాట– జగన్‌ ప్రవర్తనకు, ఒద్దికకు అచ్చెరువొందిన వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నట్టుగా ‘‘నన్ను నడిపించేవాడు నాకన్నా ఉన్నతుడై ఉండాలి’’ తథాస్తు!!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top