అవినీతి అనకొండలు | Sakshi
Sakshi News home page

అవినీతి అనకొండలు

Published Thu, Dec 28 2017 1:15 AM

Gollapudi Maruti Rao article on corrupted officials - Sakshi

జీవన కాలమ్‌
పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. ఇçప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు.

ఈ మధ్య అతి తరచుగా అవినీతిపరులయిన అధికారులని పట్టుకునే సందర్భాలు కోకొల్లలుగా పత్రికల్లో కనిపిస్తున్నాయి. ఇదేమిటి? ఈ దేశం ఉన్నట్టుండి ఇంత నిజాయితీగా మారిపోయిందా అని ఆశ్చర్యమూ, అనుమానమూ కలుగుతోంది.

పత్రికలు చదివేవారికి ఈపాటికే కొన్ని పేర్లు కంఠస్థమయిపోయాయి. జిల్లా రివెన్యూ అధికారి గణేశ్, విజయవాడ పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజనీరు పాము పాండురంగారావు, నెల్లూరు జిల్లా రవాణాశాఖ ఏవో కృష్ణకిశోర్‌ ఇవాళ శీలం సూర్యచంద్రశేఖర అజాద్‌ అనే దేవాదాయ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌. అసలు దేవాదాయ శాఖే వివాదాస్పదమైన ఏర్పాటు. చక్కగా తమ మతాన్నో, దేవుడినో నమ్ముకున్న భక్తుల డబ్బుని దోచుకోవడానికి ఈ ‘అజాద్‌’ల దరిద్రం ఎందుకు? పోనీ, ఈ పని అన్ని మతాలవారి విషయంలో–ముస్లింలు, క్రైస్తవులు, జైనుల విషయంలో చేస్తున్నారా? భారతదేశంలో హిందువులకే ఈ ‘అజాద్‌’ దరిద్రం ఎందుకు పట్టాలి? అద్భుతంగా నిర్వహించబడుతున్న ఎన్నో ఆలయాలు–దేవాదాయ శాఖ అధికారుల పాలిటబడి – ఆయన నాలుగైదు ఆలయాలకు ఒకే అధికారి అయిన పాపానికి కనీసం దీపానికి నోచుకోని సందర్భాలు నాకు తెలుసు. ఎందుకు ఈ ఆఫీసర్లు? ఒక్క ‘అజాద్‌’ చాలడా మన పాలక వ్యవస్థ నిస్సహాయతను, నిర్వీర్యతను చెప్పడానికి!

50 కోట్ల ఆదాయం, తన నౌకర్ల పేరిట ఒక సోలార్‌ ప్రాజెక్టు, లక్షల రొక్కం, కోట్ల విలువైన ఆస్తులు–ఎన్నాళ్ల బట్టి ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుంటే ఈ ‘అజాద్‌’ దోపిడీ సాధ్యమయింది? వీరు ఈ దేశానికి నిర్భయ దోషుల కన్నా చీడపురుగులు కదా! దేవుడి ఆదాయాన్ని నంచుకుతినే ఒక ‘నీచ’పు ఉద్యోగికి ఏమిటి శిక్ష?   తమ హక్కు అయిన పట్టా పాసుబుక్కుల కోసం లంచం ఇవ్వలేని చిన్న చిన్న రైతు కుటుంబాల వారు రోజుల తరబడి – చిన్న రివెన్యూ ఉద్యోగుల ‘లంచం రాయితీ’ల కోసం ఎమ్‌.ఆర్‌.ఒ. ఆఫీసుల దగ్గర చెట్ల కింద వంటలు చేసుకుంటూ బతకడం నేను స్వయంగా చూశాను.
ఈ ఉద్యోగుల ఫొటోలు పత్రికల్లో వేస్తే సరిపోతుందా? వీళ్లందరినీ బట్టలు విప్పి ఊరేగించాలి కదా! ఈ దుర్మార్గుల కోసం నిర్భయ కంటే భయంకరమైన చట్టం తేవాలి కదా!
నలుగురి దుశ్చర్య కారణంగా ఒక నిర్భయకి అన్యాయం జరిగింది. దేవుడి సొమ్ముని, ప్రజల విశ్వాసాన్ని ఎన్ని సంవత్సరాలుగా దోచుకుతింటున్న ఈ కమిషనర్‌ గారికి ఏం శిక్ష వెయ్యాలి? గణేశ్‌ అనే మహానుభావుడిని ఎలా సత్కరించాలి?

కింది స్థాయిలో మూగగా దోపిడీకి గురవుతున్న జనానికి ఈ అవినీతిపరుల నుంచి విముక్తి లభించనంత వరకు నోట్ల రద్దు జరిగినా, పట్టిసీమ, పోలవరాలు నీళ్లు తోడినా ప్రజలు సంతోషించరు.
దేశంలో సంస్కరణలకు కంకణం కట్టుకున్న మోదీగారికి వారి అనుచరులు చెప్పాలి. తమరు చేస్తున్న సంస్కరణలు– రోజూ పట్టెడు కూడుకు యాతన పడేవారికి అర్థం కావు. వారిని అనుక్షణం దోచుకుంటున్న గణేశ్‌లు, అజాద్‌లు, పాండురంగారావుల బారి నుంచి కాపాడండి. అప్పుడు వ్యవస్థ మీద విశ్వాసం పెరుగుతుంది.

మా దేవుడిని ఈ అనకొండల బారి నుంచి విడుదల చేయండి. ఈ దేశంలో మీ సౌహార్దతకు నోచుకున్న ముస్లిం, క్రైస్తవ, జైన సోదరుల పాటి సంయమనాన్ని హిందువులూ పాటించగలరు. మాలో చిన్న అవినీతిపరులున్నా – ఏనాడయినా పాలకవర్గం మా మీద రుద్దిన ‘అజాద్‌’ స్థాయికి రారు.  పత్రికలు ఇవాళ పెద్ద అక్షరాలతో వార్తలు చెప్తాయి. సామాన్య పాఠకుడు బుగ్గలు నొక్కుకుం టాడు. ఈ దేశంలో అవినీతికి తగిన శిక్ష పడుతోందని తృప్తి పడతాడు. కానీ తన ఇంటి నౌకర్ల పేరుతో సోలార్‌ ప్లాంటుని స్థాపించగల ఘనుడు–రోడ్డు మీద పడి అడుక్కు తినడు. తినడని మనందరికీ తెలుసు. ఇప్పుడు బయటపడింది బెల్లం ముక్క. ఆయన్ని పట్టుకున్నవారు కూడా ‘రుచి’ తెలిసినవారే. వారిని శంకించడం, అనుమానించడం ఉద్దేశం కాదు.

గణేశ్‌లూ, పాము పాండురంగారావు గార్లు, దొడ్డపనేని వెంకయ్యనాయుడు, కృష్ణకిశోర్, దేవుడిని అడ్డం పెట్టుకుని దోచుకున్న ప్రస్తుత ‘అజాద్‌’ కమిషనర్‌గారు బట్టల్లేకుండా వీధుల్లో ఊరేగిన దృశ్యం కళ్ల ముందు కనిపించనప్పుడు–వారు కూరల బజారులో పది మంది దృష్టిలో నిలవలేక తల మీద గుడ్డ కప్పుకు తిరిగినప్పుడు– భక్తితో దేవుని హుండీలో రూపాయి వేసి దండం పెట్టిన మామూలు మనిషికి కనీస తృప్తి అయినా మిగులుతుంది.

చాలా సంవత్సరాల కిందట మా అబ్బాయి మెర్సిడిస్‌ కారు కొన్నాడు. మెర్సిడిస్, ఆడి కార్లున్న వారి మీద ఆదాయ శాఖ దాడి– ఆనవాయితీట. ఒక తమిళ ఇన్‌కం ట్యాక్స్‌ అధికారి వచ్చాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ– ‘‘బాబూ! ఈ ఉద్యోగంలో మేము చేరిన రోజే రెండింటిని ఇంటి దగ్గర మరచిపోయి వస్తాం– సిగ్గు, లజ్జ’’ అన్నాడు.
ఇది దాడులు చేసేవారికి సంబంధించిన రెండో పార్శ్వం.

గొల్లపూడి మారుతీరావు
 

Advertisement
Advertisement