బెల్లం చుట్టూ ఈగలు

Gollapudi Maruthi Rao Writes on corruption - Sakshi

జీవన కాలమ్‌
నన్ను ఉద్ధరించాలంటే – ముందు ఉద్దరించే నాయకుని ‘పెద్దరికం’ నన్ను ఆకట్టుకోవాలి. ప్రపంచానికి సత్యాగ్రహం స్ఫూర్తిని ఇచ్చేవాడు మహాత్ముడే కావాలి.

ఒకేరోజు.. ఒకే పేపరులో కథనమిది. – పోలవరం మండల తహసీల్దార్‌ ఆఫీసులో నిస్సహాయంగా నిర్వాసితులను చేసిన వారికి చేరాల్సిన 80 లక్షల రూపాయల గల్లంతు. ఇది కేవలం నిర్వాసితులను కొత్త వసతులకు చేర్చడానికి కేటాయించిన సొమ్ము. ఇందులో తహసీల్దారు మెరుగు ముక్కంటి అనే మహానుభావుడి పేరుంది. వీళ్లని బస్సుల్లో తరలించడానికి ఈ ఖర్చు అయిందన్నారు. తీరా ఆ బస్సుల యజమానులను పలకరిస్తే– మాకేం సంబంధం లేదన్నారు. అప్పుడు చెప్పిన విషయం – వీళ్లని మినీ లారీల్లో, ట్రాక్టర్లల్లో తరలించామని. మరి అలా రాశారేం? కలెక్టర్‌ సంతకాలు ఎలా చేశారు?!

– బొమ్మరిల్లు చిట్‌ ఫండ్స్‌వారు 1.46 లక్షల మంది కట్టిన 95.11 కోట్లను తినేశారు. భక్త రామదాసు మాటల్లో: ‘ఎవడబ్బ సొమ్ము?’
– విజయవాడ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ రఘు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ శివప్రసాద్, వారి సతీమణి గాయత్రి కలసి కేవలం వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. 500 కోట్ల బినామీ కంపెనీలను సృష్టించారు. రోడ్లు, బిల్డింగ్‌ల చీఫ్‌ ఇంజనీర్‌ మాలే గంగాధరం కేవలం 100 కోట్లు అక్రమ సంపాదనను చేశారట. సరే, జూన్‌లో ప్రజారోగ్యం, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ పాము పాండురంగారావుకి హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేవలం 100 కోట్ల సామ్రాజ్యం ఉన్నదట. మొన్ననే ‘గణేశ్‌’అనే ప్రబుద్ధుడి నిర్వాకాన్ని చదువుకున్నాం.

పోలవరం జాతీయ సంపదగా ముఖ్యమంత్రి గర్వపడుతూంటే మరొక పక్క తమ నివాసాలు, ఉపాధులు పోగొట్టుకున్న చిన్నచిన్న గ్రామీణులను కనీసం కేటాయించిన స్థలాలకు చేర్చాల్సిన ధనాన్ని గల్లంతు చేసే అధికారుల ‘నీచమయిన’అవినీతి సాగిపోతోంది. పెద్దలు రాజధానుల్లో నిజమైన సంస్కరణలకు, ఉపకారాలకు శ్రీకారం చుడుతున్నారు. మన రఘు, శివప్రసాద్, ముక్కంటి, గణేశ్‌ మొదలైన ప్రబుద్ధులు వ్యక్తిగత సామ్రాజ్యాలను సృష్టించుకుని రాజ్యాలు ఏలుతున్నారు.

తర్వాత ఏమవుతుంది? ఏమీ కాదు. వెయ్యి కోట్లు దోచుకున్న అధికారి ఎక్కడ ఉంటాడు? ఆనందంగా తన బంగళాలోనే ఉంటాడు. అవినీతి చేసేదీ, చూసేదీ ‘మనుషులే’నని గుర్తుంచుకుంటే – బెల్లం రుచి అందరికీ వర్తిస్తుంది. ఈగలకి విచక్షణ ఉండదు. మనదేశంలో నిర్భయ సంఘటనకి దేశం అట్టుడికిపోయింది. గట్టి ‘నిర్భయ’చట్టం రూపుదాల్చింది. అయినా నిర్భయంగా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. చట్టానికీ అమలుకీ మధ్య– బెల్లానికీ ఈగలకీ ఉన్న బంధుత్వం ఉంది.

ఈ మధ్య నాకెవరో ఒక వీడియో పంపించారు. ఏదో అరబ్‌ దేశంలో ఓ వ్యక్తి ఓ చిన్న పిల్లని మానభంగం చేశాడు. అంతే. అతని చేతులు వెనక్కి కట్టి వీధిలోకి తీసుకొచ్చారు. ప్రజలు నోళ్లు కొట్టుకుంటూ చూస్తున్నారు. నేలమీద బోర్లాపడిన ఆ వ్యక్తి తలమీద ఒక జవాను తుపాకీని పెట్టి నాలుగు సార్లు కాల్చాడు. అక్కడితో అయిపోలేదు. తర్వాత ఆ శవాన్ని అందరూ చూసేలాగా రోడ్డు మీద వేలాడదీశారు. మరి మన మానవ హక్కుల సంస్థవారు ఏమంటారు? ఓ అమ్మాయి హక్కు గొప్పదా? ఆమెని చెరిచిన ఈ చండాలుడి హక్కు గొప్పదా?

ఒకాయన ఒక కులం వారిని దుయ్యబడుతూ పుస్తకం రాశాడు. ఈ దిక్కుమాలిన దేశంలో ‘అభిప్రాయ స్వేచ్ఛ’ వారికి హక్కు. ఆ కులాల వారు వ్యతిరేకించారు. ఈ ఫలానా వ్యక్తికి ఏమయినా జరిగితే రెండు తెలుగు దేశాల్లో మంటలు లేస్తాయని ఒకానొక పార్టీ నాయకులు వాక్రుచ్చారు. మరి వీరి ‘కుల పిచ్చి’ గురించి ముందుగా మాట్లాడలేదేం? అది వీరి పరిధిలోకి రాదా?. యంత్రాంగంలో అవినీతిని గుర్తుపట్టడం ఒక దశ. ఆ గుర్తుని చెరిపేసే అవినీతి చాపకింద నీరు. గత ఏడెనిమిది సంవత్సరాలలో ఇలా పట్టుబడిన ఒక్క అధికారి జైలుకి వెళ్లిన దాఖలాలు మనకి తెలీదు. కానీ అవినీతి చేసేవారికి తెలుసు. తర్వాత ఏం చేయాలో వారికి తెలుసు. ఏం జరుగుతుందో పట్టుకునేవారికీ తెలుసు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఇంకా తొందరపడితే మొహం పగులుతుంది.

నన్ను ఉద్ధరించాలంటే– ముందు ఉద్దరించే నాయకుని ‘పెద్దరికం’ నన్ను ఆకట్టుకోవాలి. ప్రపంచానికి సత్యాగ్రహం స్ఫూర్తిని ఇచ్చేవాడు మహాత్ముడే కావాలి. వ్యవస్థ నీతి వ్యక్తి శీలానికి మార్గదర్శకం. అరబ్‌ దేశంలో చట్టాన్ని ఎదిరించినప్పటి శిక్ష భయపెడుతుంది. మన దేశంలో శిక్ష మనల్ని కితకితలు పెడుతుంది. 2013లో తన సహచరి మీద అత్యాచారం చెయ్యాలనుకున్న తరుణ్‌ తేజ్‌పాల్‌ మీద 2017లో చార్జిషీటు దాఖలయింది! – ఇదీ మన దేశంలో న్యాయవ్యవస్థ నిర్వాకం. మన రఘు, శివప్రసాద్, ముక్కంటి, మొన్నటి గణేశ్‌ ఇలాంటి దిక్కుమాలిన కాలమ్స్‌ చదివి నవ్వుకుంటారు. వారి నవ్వులకి పెట్టుబడి ఈ వ్యవస్థ చేతికి గాజులు.

గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top