వార్షికం

Gollapudi Maruthi Rao Happy For Sirivennela Got Padma Shri - Sakshi

జీవన కాలమ్‌

ఈ వార్షికం ప్రతీ యేటా ఇచ్చే పద్మ అవార్డుల గురించి కాదు. ఇవ్వని పద్మ అవార్డుల మీద నా స్పందన గురించి. ‘వార్షికం’ అనే మాటలో వైదికంగా దుర్మార్గమయిన అర్థం. ఇంక కెలకను.  చాలాసార్లు ఈ అవార్డులు పూర్తిగా చచ్చిపోయిన వారికో, లేదా సగంసగం పోతున్న వారికో ఇవ్వడం రివాజు. అయితే ఈ సంవత్సరం చాలా కారణాలకి ఆనందించదగ్గ విషయం– మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ. సాహితీపరులకిచ్చే సత్సాంప్రదాయం, ఓ సినీ గేయ రచయితకి– అందునా సీతారామశాస్త్రికి ఇవ్వడం చాలా హర్షణీయం. ఈ అవార్డులు సాధారణంగా ఇంత దూరం ప్రయాణం చెయ్యవు. 

కానీ ఇదేమిటి! శాస్త్రిగారి పేరు పక్కన ‘తెలంగాణ’ అన్న మాట ఉంది. వారి పేరుని తెలంగాణ ప్రభుత్వం సూచించిందా? ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వానికి అంత తీరిక లేదు. అలనాడు బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పద్మ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారి సినీ రచయిత వైరముత్తు పద్మభూషణ్‌. ఏమయినా తెలం గాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.  శాస్త్రిగారి గొప్పతనానికి ఒకే ఒక మచ్చుతున కని ఉటంకించాలని ఉంది. 1992లో నేనూ, జేవీ సోమయాజులు, పద్మనాభం, తులసి ప్రభృతులం అమెరికా వెళ్లాం. నేను ‘మనిషి గోతిలో పడ్డాడు’ అనే నాటికని రాశాను. గోతిలో పడిన మనిషిని చూసి రక రకాల సామాజిక స్థాయిలకు చెందిన వ్యక్తులు అతని స్థితిని విశ్లేషిస్తారు. చివరికి అతనికి సహాయం చెయ్యకపోగా పెద్ద బండ రాయితో చంపుతారు. అక్కడొక పాట ఉంటే ముగింపు బాగుంటుందని మాకనిపించింది. ఎలాంటి పాట ఉండాలి? అనుకోలేదు. అప్పుడు మా శ్రీనివాస్‌ బతికే ఉన్నాడు. నేను పాట చేయిస్తానన్నాడు. సీతారామశాస్త్రి దగ్గరికి పరిగెత్తాడు. కథ చెప్పాడు. న్యాయంగా ఎలాంటి పాట రాయాలి? చచ్చిపోతున్న వ్యక్తి– సమాజ స్వార్థానికి బలి అయిన వ్యక్తి ఆర్తనాదం. 

శ్రీశ్రీ ఆవేశంగా ‘ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన....’ అంటారేమో! వేటూరి ‘ఈ అపరభీష్ముల రాజ్యంలో ఎందరో బృహన్నలలు...’ అంటారేమో! ఆత్రేయ ‘ఈ స్వార్థపరుల ప్రపంచంలో తలపగిలిన దీనుడు...’ అంటారేమో!  సీతారామశాస్త్రిని నేనెప్పుడూ కలవలేదు. చావు బతుకుల్లో ఉన్న మనిషి– గోతిలో కొన ఊపి రితో ఉన్నాడు. అతని మాట... శాస్త్రి అన్నాడు కదా...   ‘నాకెంతో సంతోషంగా ఉంది  నాకెంతో ఆనందంగా ఉంది  చరిత్ర లోతెంతో కొలవగలిగినందుకు  తలెత్తి పాతాళం చూడగలిగినందుకు...’ 

విశీర్ణమైన మనిషి పాతాళంలో చచ్చిపోతూ– మానవాళి నీచత్వపు లోతుల్ని చూశానని నవ్వుకున్నాడట! నిర్ఘాంతపోయాను. సిరివెన్నెల– ఓ కవితను– పది సాధారణమైన ఆలోచనల స్థాయిని చీల్చి ముందుకు వెళ్తాడు. అక్కడా అతను మొదటి పల్లవి. అతనికి పద్మశ్రీ తెలుగు కవితకి పట్టాభిషేకం. మన తెలుగువారికి మనల్ని చూసి మనం గర్వపడే సహృదయం లేదు. తమిళులకీ, బెంగాలీలకీ అది సొత్తు. ఈ దేశంలో ఓ మహానటి ఉన్నారు. కృష్ణవేణి. ఆమెకి 94 సంవత్సరాలు. మిత్రులు రావికొండలరావుగారు నాకు మెసేజ్‌ పంపారు. తన ఆరవ యేటనుంచే నటనా రంగంలో కాలుమోపి, మీర్జాపురం రాజావారి ఇల్లాలుగా సినీ నిర్మాత అయి ఓ మహానుభావుడు ఎన్టీఆర్‌నీ, ప్రతినాయక పాత్రలు ధరించిన పద్మవిభూషణ్‌ అక్కినేనిని హీరోగా ‘కీలుగుర్రం’లో పరిచయం చేసిన విదుషీమణి– నా చిన్నతనంలో ‘లక్ష్మమ్మ’ని తన్మయులమై చూసిన గుర్తు ఇంకా చెరిగిపోలేదు– కృష్ణవేణి గారిని ఇంకా తెలుగుజాతి గౌరవించుకోలేదు. 

చెన్నైలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రముఖ రచయిత– ఆనాడు పద్మ అవార్డుకి నోచుకోని కన్నదాసన్‌ విగ్రహం ఉంది. మన ఆత్రేయకీ, పింగళికీ లేదు. ఎన్‌.ఎస్‌. కృష్ణన్‌ విగ్రహం ఉంది. మన రేలం గికీ, శివరావుకీ లేదు. పద్మభూషణ్‌ శ్రీపాద పినాకపాణి గౌరవానికి సెమ్మంగుడి అభిరుచి పెట్టుబడి అంటారు. మహా గాయకుడు అన్నమాచార్యను ఆకాశంలో నిలిపిన అజరామరమైన కీర్తనలు చేసి, తన జీవితాన్నే ఒక ఉద్యమం చేసుకున్న బాలకృష్ణ ప్రసాద్‌ వంటి శిష్యుడిని సమర్పించిన నేదునూరిని ఈ జాతి గౌరవించుకోలేదు. మన గొప్పతనాన్ని చూసి మాత్రమే కాదు, చూపి, నెత్తికెత్తుకుని గర్వపడటం జాతి సంస్కారం. ఏపీ ప్రభుత్వం అలాంటి పనిచెయ్యదేం? 
ఏ కూడలిలోనో ఓ రమణారెడ్డి, ఓ సముద్రాల, ఓ వేటూరి పలకరించరేం? తమిళనాడులో సంగీత కళానిధులూ, పద్మశ్రీలూ ఎటుచూసినా కనిపిస్తారు. ‘మా మహనీయుల్ని ఆకాశంలో నిలిపే ఉపకారం మీరు చేసిపెట్టండయ్యా’ అని చరిత్ర చెప్తూంటే– సిగ్గుతో తలవంచుకుని వారి మధ్యనుంచి నడుచుకుపోతూంటాను.

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top