ఓ గొప్ప సినీమాలాంటి కథ

Gollapudi article on paredesci humanity

జీవన కాలమ్‌
సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉపయోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం.

125 సంవత్సరాల కిందటి (1892)– అంటే సరిగ్గా గురజాడ ‘కన్యాశుల్కం’ పుట్టిన సంవత్సరం. నిజంగా జరిగిన కథ. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో 18 ఏళ్ల కుర్రాడు చదువుకుంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. మేన మామ చదువు చెప్పించాడు. ఈసారి ఫీజు కట్టడానికి డబ్బులేదు. ఇతనూ, మరొక మిత్రుడూ కలసి ఆలో చించారు. అప్పటి రోజుల్లో అతి ప్రముఖుడైన ఓ సంగీత విద్వాంసుడి కచేరీ పెట్టించి, టికెట్లు అమ్మి, మిగిలిన డబ్బుతో ఫీజు కట్టుకోవచ్చునని వారి ప్లాను. అప్పట్లో అతి ప్రఖ్యాత పియానో వాద్యగాడు పెరెడెస్కీని కలిశారు. ఆయన మేనేజరు కార్యక్రమానికి 2 వేల డాలర్లు (125 సంవత్సరాల కిందటి మాట అని మరిచిపోవద్దు) గ్యారంటీ ఫీజు అడిగాడు. వీళ్లిద్దరూ ఒప్పుకున్నారు. కచేరీకి ఏర్పాట్లను ప్రారంభించారు.

అనుకున్న రోజున కచేరీ బ్రహ్మాండంగా జరిగింది. కానీ వీరు ఆశించినట్టు లాభం రాకపోగా 1,600 డాలర్లే వసూలైంది. వీళ్లు కుర్రాళ్లు. ఆయన మహానుభావుడు. 1,600 డాలర్లతో సరాసరి ఆయన దగ్గరికే వెళ్లారు. కథంతా చెప్పుకుని 1,600 డాలర్లతోపాటు 400 డాలర్ల చెక్కు ఇచ్చి త్వరలో ఈ బాకీ తీరుస్తామని చెప్పుకున్నారు. పెరెడెస్కీ అంతా విన్నాడు. ఆయన చేతిలోని చెక్కుని చింపేసి 1,600 వెనక్కి ఇచ్చాడు. ‘ఈ కచేరీకి అయిన బాకీలు తీర్చి మీ జీతాలు కట్టుకుని ఏమైనా డబ్బు మిగిలితే తనకివ్వమ’న్నాడు. కుర్రాళ్లు ఆయన ఔదార్యా నికి బిత్తరపోయారు.

తర్వాత పెరెడెస్కీ జీవితం కళ కారణంగా అంత ర్జాతీయ కీర్తిని ఆర్జించిపెట్టింది. ఊహించనంత ధనాన్ని ఆర్జించి పెట్టింది. తన దేశపు ఔన్నత్యానికి, ప్రపంచంలో స్వదేశ స్మారక చిహ్నాల నిర్మాణానికీ ఆయన చేసిన కృషి ప్రజాభిమానాన్ని సంపాదించిపెట్టింది. మన దేశంలో గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌ దేశ ఉపాధ్యక్షుడు అయినట్టుగా– 1919లో పోలెండు స్వతంత్ర దేశమయినప్పుడు దేశాధ్యక్షుడు పిల్సుడెస్కీ ఆయన్ని ప్రధాన మంత్రిని చేశారు. ఇది కళకూ, వితర ణకూ, రాజకీయ జీవనానికీ ఏర్పడిన వంతెన.

1935 నాటి మాట. పోలెండుకి పెరెడెస్కీ ప్రధాన మంత్రి అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో పోలెండు హిట్లరు పుణ్యమంటూ సర్వనాశనమయింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. 150 లక్షలమంది ఆహారం లేక అలమటించే పరిస్థితి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ఏం చెయ్యాలో పెరెడెస్కీకి పాలుపోలేదు. చివరికి అమెరికా ఆహార, పునరావాస సంస్థకి విజ్ఞప్తి చేశాడు. అప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు హెర్బర్ట్‌ హూవర్‌ (తర్వాతి కాలంలో ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు) వెంటనే 150 టన్నుల బట్టలు, రగ్గులు, ప్రత్యేక వంట శాలలను ఏర్పాటు చేసి రోజుకి 2 లక్షలమందికి భోజ నాలను ఏర్పాటు చేశాడు. అమెరికా రెడ్‌క్రాస్‌ సంస్థ 2 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది.

యుద్ధం ముగిశాక కష్ట సమయంలో తన దేశానికి ఉపకారం చేసిన వ్యక్తిని కలుసుకోవడానికి పెరెడెస్కీ అమెరికా వచ్చాడు. హూవర్‌ని కలిసినప్పుడు దాదాపు కళ్లనీళ్ల పర్యంతం అయి కృతజ్ఞతని చెప్పుకున్నాడు. హూవర్‌ నవ్వి ‘మరేం పరవాలేదు సార్‌. 48 సంవ త్సరాల కిందట మీరు స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఓ కుర్రాడికి సహాయం చేశారు. మీకు గుర్తుండకపోవచ్చు. ఆనాడు మీకిచ్చిన 1,600 డాలర్లు వెనక్కి ఇచ్చి మా చదువుని కాపాడారు. ఆ కుర్రాడిని నేనే’ అన్నారు.

ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు మహా నుభావుల ఔదార్యానికి అద్దంపట్టే అపూర్వమైన కథ. సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉప యోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం. అందుకే వారిలో ఒకరు తన దేశపు ప్రధాని అయ్యారు. మరొకరు తన దేశపు అధ్యక్షుడయ్యారు.

హూవర్‌ 1919లో అమెరికా సంక్షేమ సంస్థ అధ్య క్షుడిగా వార్సా వెళ్లారు. తనకి స్వాగతం చెప్పడానికి– ఆనాటి యుద్ధంలో దెబ్బతిన్న ప్రజలు– ముఖ్యంగా 25 వేల మంది పిల్లలు ఆయనకి స్వాగతం చెప్పడానికి జోళ్లు లేని కాళ్లతో బారులు తీర్చారట. ఆ దృశ్యాన్ని చూసి హూవర్‌ చలించిపోయాడు. అప్పటికప్పుడు అమెరికాకు తాఖీదు పంపి– 7 లక్షల ఓవర్‌ కోట్లు, 7 లక్షల జోళ్లు పోలెండుకి ఓడలో పంపే ఏర్పాట్లు చేశాడు. మరో రెండే ళ్లపాటు 50 లక్షల జోళ్లు అమెరికా నుంచి దిగుమతి అవు తూనే ఉన్నాయి.

ఒక వ్యక్తి ఔదార్యం, ఒక వ్యవస్థ ఔదార్యంగా పరి ణమించిన అపూర్వమైన కథనం ఇది. జీవితంలో పేద రికం చిన్న మబ్బుతునక. కానీ అది కప్పి ఉన్న వ్యక్తిత్వ వైభవం అనూహ్యమైన తేజస్సు. మరిచిపోవద్దు. పెరె డెస్కీ గొప్ప కళాకారుడు. హూవర్‌ది గొప్ప పేదరికం. ఉదాత్తతకీ, కళకీ, పేదరికానికీ దగ్గర బంధుత్వముంది.

గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top