మూలాల్ని ఛేదించటమే ‘మీటూ’

ABK Prasad Guest Column On Mee Too - Sakshi

రెండో మాట

స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్‌ ఆపరేషన్‌’ జరక్కుండా సమాజాన్ని, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవులకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్‌ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్‌ శాఖలకు, పాలకులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కానరాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. అందుకే మూలాన్ని ఛేదించడమే మీటూ ఉద్యమ కర్తవ్యం కావాలి.

‘స్త్రీలు పనిచేస్తున్న సంస్థల్లో కేవలం స్త్రీల పట్ల జరిగే వేధింపుల పరిష్కారానికి మాత్రమే 1997లో న్యాయస్థానం విశాఖ ఆదేశిక సూత్రాల (గైడ్‌లైన్స్‌)ను రూపొందించింది. కానీ గతం నుంచీ స్త్రీల పట్ల జరుగుతున్న వేధింపుల, అత్యాచారాల పరిష్కారానికి కూడా నేడు విశాఖ గైడ్‌లైన్స్‌ వర్తింపచేయాల్సిన అవసరముంది’’   – జస్టిస్‌ (రిటైర్డ్‌) సుజాత మనోహర్, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ ఇంటర్వ్యూ

‘నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో మానవుల విజయానికి ప్రజల గుర్తింపు అనే ముద్రను ఒక ఆరాధ్యమంత్రంగా భావించడం జరుగు తోంది. కానీ ఈ విజయభావన చాటున జరుగుతున్నది సామాజిక అన్యా యాల పట్ల సామాజికులు నోరెత్తకుండా చేయడమే! ఇలాంటి తప్పుడు పవిత్ర భావనను సృష్టించడానికి పితృస్వామిక వ్యవస్థ తన శక్తియుక్తుల్ని ఇప్పటికే చాలా వెచ్చించింది. కానీ ఈ వ్యవస్థ తనకు తాను అద్దంలో చూసుకుంటే దాని వికృతాకారం బయటపడుతుంది. సామాజిక ఔన్నత్యం పేరిట విర్రవీగే దాని డాబు దర్పాలన్నీ నేడు ‘నేను (మేము) సైతం’’ అని ఆత్మరక్షణార్థం విరుచుకు పడుతున్న మహిళా ఉద్యమం ముందు డుల్లి పోతాయి. అది కదలబారుతున్న లక్షలాదిమంది బాధాతప్తుల çహృదయ స్పందన అని గుర్తించాలి’  – మిస్‌ ఫరా నక్వీ, ప్రసిద్ధ మీడియా రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఢిల్లీ

ఇప్పటికీ సమాజంపై పెత్తనం చలాయిస్తున్న పితృస్వామిక వ్యవస్థ అనాదిగానే తన ఉనికికోసం, స్త్రీ పరంగానూ, పురుషుడి పరంగానూ కొన్ని సామెతలను సమాజం మీదికి వదిలి కూర్చుంది. ఆడదాని బతుకు అరిటాకు బతుకుగా చిత్రించి ఆమెను అనాథగా మార్చింది. స్త్రీ మాట ఆపదలకు మూలమని చెప్పి నోరు నొక్కింది. కానీ అదే వ్యవస్థ తాను మాత్రం మారకుండా ఉత్తరోత్తరా రానున్న పరిణామాలను ఊహించు కుని బహుశా దోపిడీ సమాజంలో స్త్రీకి ఒక ‘రాయితీ’గా ఆడదాన్ని నోరు పెట్టుకుని బతకమనడంలో కూడా బోలెడంత అర్థముండి ఉండాలి. అందుకే అన్ని రకాల దాష్టీకాలకు చరమాంకాన్ని రచించేందుకు ఇపుడు ‘నేను (మేము) సైతం’ (మీటూ–ఉయ్‌ టూ) అంటూ ప్రపంచ మహిళా ఉద్యమ ఉ«ధృతిలో భాగంగా మన దేశంలో కూడా పితృస్వామిక వ్యవస్థ ఆగడాలకు భరతవాక్యం చెప్పే వైపుగా ఉద్యమిస్తోంది.

నిజానికి ఈ మహోద్యమ పునాదులు ఈనాటివి కావు. ఒక వైపునుంచి తెలుగునాట వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, గిడుగు... మరోవైపునుంచి రాజా రామ్మోహన్‌ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, జ్యోతిబాయి పూలే, గాంధీజీలు సామాజిక అసమానతలకు, స్త్రీ పురుషుల మధ్య వివక్షతకు వ్యతిరేకంగా సంస్కరణోద్యమాలు నిర్వహించారు. అయినా ఫలితం నేటికీ పాక్షికంగానే ఉండిపోయింది. నిజానికి నిర్భయ హత్యోదంతం తర్వాత కూడా వేధింపులకు నిస్సిగ్గుగా పాల్పడిన వారిలో కొందరికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా గత దశాబ్దిన్నర కాలం లోనూ దేశంలో ‘రేప్‌’ కేసులు అదుపులోకి రాకపోవడం చూస్తుంటే పితృస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్థల్లో మౌలికంగా ఏ పరివర్తనా రాలేదు. కనీసం అందుకు జరిగిన ప్రయత్నమూ చిత్తశుద్ధితో జరగలేదు.

ఒకనాటి జార సమాజం అనుకున్న రాజుల, చక్రవర్తుల కాలంలోనే ఆ సమాజాన్ని సరిదిద్దడం కోసం శృంగారానికి సంబంధించిన కథల ద్వారా ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేసే యత్నంలో అన్యాపదేశంగా 17–18 శతాబ్దాలలోనే ‘హంసవింశతి’లో అయ్యలరాజు నారాయణామా త్యుడు, ‘శుకసప్తతి’ కథల ద్వారా పాలవేకరి కదిరీపతి పండితుడూ గొప్ప నీతిని బోధించారు. ఒక మంచివాడున్న చోట ఒక దుష్టుడూ ఉంటాడన్న సూక్తి ఫ్యూడల్‌ వ్యవస్థలోనూ, పెట్టుబడి సమాజంలోనూ అనివార్యం. చెడును చూపడం ద్వారా మంచిని వ్యవస్థాపించడానికి ప్రయత్నించడం ప్రజాహితమైన కావ్యసృష్టి నాటక కళా రంగాలకు ధ్యేయంగా ఉండాలనీ, తద్వారా జన సామాన్యంలో మానసికంగా ఔన్న త్యానికి దారులు పరచాలనీ నిరూపించిన స్త్రీ, పురుష రచయితలు నేటికీ లేకపోలేదు.

అయితే తమ స్వార్థ ప్రయోజన పునాదులపైన ఆదినుంచీ బలుస్తూ వచ్చిన ఫ్యూడల్, పెట్టుబడిదారీ సమాజాలకు ‘సిజేరియన్‌ ఆపరేషన్‌’ జరక్కుండా, సామాజిక పరిస్థితుల్ని మార్చలేం. అందుకే గురజాడవారి ‘కన్యాశుల్కం’లో గిరీశం ‘అటునుంచి నరుక్కురమ్మని’ చెప్పింది. ఆ శస్త్ర చికిత్స ఈ వ్యవస్థకు జరగనందునే నైతిక బలహీనతలు ముదిరిపోయి– అవి జర్నలిస్టులకు, నటులకు, సినీ దర్శకులకు, కవు లకు, రచయితలకు, కళాకారులకు, సంగీత కళాకారులకు కార్పొరేట్‌ భద్ర పురుషులకు, పార్లమెంటేరియన్లకు, సైనిక పోలీస్‌ శాఖలకు, పాల కులకు– ఒకరేమిటి సమాజాన్ని శాసించే సర్వ శాఖలకూ వ్యాపించి, కాన రాని కీచక పర్వాలు తెరచుకుంటున్నాయి. మనం ప్రేమించే పాండవుల్ని సహితం ఈ జాఢ్యం పీడించింది. కాబట్టే వ్యాస భారతం సహితం ‘పాండవాంః జారజాతాః’ అని పేర్కొనవలసి వచ్చింది. చెప్పుకుంటూ పోతే చాలా ‘చిత్రమైన’ చరిత్రలు మనలోనే గూడుకట్టుకుని ఉన్నాయి.

ఈ వేధింపుల, అత్యాచారాల జాఢ్యం ఒక్క యువతులపట్లనే కాదు, వివాహిత స్త్రీలనూ వదలడం లేదు. దేశంలోని వివాహిత మహి ళలలో నూటికి 80 మంది తమ భర్తల నుంచే గృహ హింసను ఎదు ర్కొంటున్నారని ఒక తాజా సర్వే పేర్కొనగా, 27 శాతంమంది అవి వాహిత స్త్రీలు సొంత బంధువులనుంచీ, 18 శాతం మంది స్త్రీలు మగ కుర్రకారు స్నేహితుల నుంచీ, 17 శాతం స్త్రీలు పరిచయస్తులనుంచీ వేధింపులు ఎదుర్కొంటున్నారని సర్వేలో బయటపడింది. కాగా, 99.1 శాతం మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, ఆ కేసులు అసలు రిపోర్టు కాకుండానే కనుమరుగు చేశారని ‘నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే’ తాజాగా వివరాలు నమోదు చేసింది. ఈ సందర్భంగా అన్నింటికన్నా లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యే వ్యక్తులపైగాని, వేధింపు లకు పాల్పడే వ్యక్తులపైగానీ మానవుల మెదడులోని ‘హార్మోన్లు’ కల్గించే ప్రభావం గురించి శాస్త్రవేత్త టాటా ఇనిస్టిట్యూట్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగంలో పరిశోధకురాలు, మనస్తత్వ శాస్త్రవేత్త అయిన ప్రసిద్ధ ప్రొఫె సర్‌ శ్రీమతి ప్రాచీ యాదవ్‌ కొన్ని విషయాలను వెల్లడించారు:

‘‘లైంగిక వేధింపునకు లేదా అత్యాచారానికి పాల్పడేవారు వ్యక్తి జాఢ్య ఉన్మాదులు. ఈ జాఢ్యం ఉన్న ప్రతివ్యక్తి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కానీ ఇందుకు లోనయ్యే బాధితురాళ్లు మాత్రం దుర్భలులై పోయి, నిస్త్రాణమైపోతారు. ఈ దారుణానుభవం బాధితుల జీవితం లోని ప్రతి ఒక్క దశల్లోనూ వెన్నాడుతూనే ఉంటుంది. మహిళల మనస్సుపై పడే ఈ హింస/గాయం– జీవిత భాగస్వామి లేదా తెలిసిన వ్యక్తినుంచో లేదా కుటుంబ సభ్యులనుంచో, స్నేహితుల నుంచో, పని చేసేచోటనో లేదా వీధిలో వెంటాడుతున్నప్పుడో, అసలు ఏ మాత్రం పరి చయం లేని వ్యక్తులనుంచో ఎదురుకావచ్చు. చివరికి చిన్నారులైన ఆడ పిల్లలూ ఈ హింసకు గురికావచ్చు. ఈ లైంగిక దాడులకు ప్రధాన కారణం మనిషి మెదడు పనిచేసే ప్రక్రియల్లోనే ఉంది.

ఈ దారుణ ఘటనలకు మనిషి శరీర భాగాల్లోని హార్మోన్లు వెంటనే ప్రతిస్పంది స్తాయి. లైంగిక ప్రమాదానికి గురైన స్త్రీ అప్పుడు తాను ఎదురు తిరిగి పోరాడటమా లేక హింస బారినుంచి తప్పించుకుని పారిపోవడమా అని ఆ క్షణంలోనే తేల్చుకుంటుంది. ఈ నిర్ణయ శక్తిని నిర్ణయించేది ఆమె మెదడులోని ‘కాటెకోలమైన్‌’ హార్మోన్‌. అలాగే ‘కోర్టిసోల్‌’ అనే హార్మోను ఎదురు తిరగమని బాధితురాల్ని ప్రోత్సహించే నైతిక బలమిస్తుంది. ఇలా హింసకు గురికాబోతున్న సమయంలో ఆ వ్యక్తి భౌతికంగా, ఉద్రే కంగా అనుభవించే బాధను తట్టుకునేందుకు ‘ఆక్సిటోసిన్‌’ అనే హార్మోన్‌ వేదనలో ఉన్న స్త్రీ/పురుషులు హేతుబద్ధంగా వ్యవహరించే శక్తిని తాత్కా లికంగా కోల్పోతారు. మొత్తం శరీరమే స్తంభించిపోతుంద’’ని ప్రొఫెసర్‌ ప్రాచీ వివరించారు (డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌).

ఈ వైపుగా కూడా ఆలోచించి, పరిశీలించి దేశంలోని సామాజిక కార్యకర్తలు, మహిళా ఉద్యమకారులు అధ్యయనం చేసి ఉన్న పరిస్థితు లతో రాజీ పడకుండానే మహిళా ఉద్యమానికి మరింతగా శక్తియుక్తుల్ని పొందుపరిచి అవిశ్రాంత పోరును ఉధృతం చేస్తేగానీ పితృస్వామ్య– పెట్టుబడి వ్యవస్థలు ఈ మాత్రమైనా అంకెకు రావని గుర్తించాలి. శరీర సౌందర్యంకన్నా బుద్ధి బలానికి ప్రాధాన్యత కల్పించిన ప్రాచీన హంస– చిలక కథల్ని మరొకసారి చదివి, నేటి యువతీ యువకులు సన్మార్గ స్ఫూర్తిని పొందడం అవశ్యం.

అందుకనే మహాకవి గురజాడ వందేళ్ల క్రితమే ‘స్త్రీల కన్నీటి గాథ లకు కారణం నాకు తెలుసు. వారికి వకాల్తా పట్టడానికే నేను నిర్ణయిం చుకున్నాను’ అన్నాడు. కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర ద్వారా ఒక బరువైన మాటను, తప్పును సవరించుకునే లోచనా శక్తినీ, ఆలోచనా శక్తినీ తనను ప్రలోభ పెట్టబోయిన సౌజన్యారావుకు కల్పిస్తూ ఒక నీతిని ప్రబోధించిన తీరు కూడా ‘నభూతో నభవిష్యత్‌’. ‘చెడని వారిని చెడ గొట్టవద్దని చెప్పింది మా అమ్మ’ అన్న అంత బరువైన సందేశాన్ని ఆమె ద్వారా గురజాడ ఎందుకు సమాజానికి అందించాడు? ఇంతకూ స్త్రీ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఎందుకు తహతహలాడుతుందో గుర జాడ, చలం తమ గుండె గొంతుకల్ని ఇలా విప్పారు: ‘‘ప్రేమలేక, సంతో షం లేక జీవితంలో ఇంటరెస్టు కోల్పోయి, తను ఏ బాధపడ్డా కరుణించే వారు లేక, ఇంక విధిలేక బండచాకిరీలో తన శక్తినీ, ద్వేషంలో తన ప్రేమనీ, తిట్లలో తన ఆనందాన్ని సార్థకం చేసుకోవాలనే ప్రయత్నిస్తుంది స్త్రీ’’ ఆ ప్రయత్నానికి నేటి వైజయంతినే ‘మీటూ’ మహిళా ఉద్యమం!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top