శాకం శరణం గచ్ఛామి

శాకం శరణం గచ్ఛామి


నవంబర్ 1 ప్రపంచ శాకాహార దినోత్సవం

‘తిండి కలిగితె కండగలదోయ్... కండ గలవాడేను మనిషోయ్’ అన్న మహాకవి మాట అక్షర సత్యమే. అయితే, కండబలం పెంచుకోవడానికి మాంసాహారమే తినక్కర్లేదు. శుభ్రంగా శుద్ధ శాకాహారాన్ని సంతుష్టిగా తింటూ పుష్టిగా కండబలానికి లోటు లేకుండా బతకవచ్చని నిరూపిస్తున్న శాకాహారుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడే పాశ్చాత్య దేశాల్లో సైతం గడచిన దశాబ్ద కాలంగా శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  

 

 పెరుగుతున్న శాకాహారులు

 హిందువులు, బౌద్ధులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎక్కువగానే ఉంటోంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మాత్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ, పర్యావరణ స్పృహ పెరగడమే ఈ పరిణామానికి కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ‘పెటా’ వంటి సంస్థల ప్రచారం వల్ల జంతువులపై హింసను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది.

 

  మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి యూరోపియన్ దేశాల్లో గడచిన దశాబ్ద కాలంలో వెజిటేరియన్ రెస్టారెంట్ల సంఖ్య రెట్టింపు కావడమే దీనికి నిదర్శనం. తాజా అంచనాల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 12 శాతం, స్వీడన్‌లో సుమారు 10 శాతం, ఇజ్రాయెల్‌లో, అమెరికాలో దాదాపు 4 శాతం ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లో ఎక్కువగా యువతరం జనాభా క్రమంగా మాంసాహారానికి దూరమవుతుండటం విశేషం.

 

 మాంసాహారంతో పర్యావరణ సమస్యలు

 మాంసాహారం వల్ల పర్యావరణానికి చాలా సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాంసాహారం పరోక్షంగా నీటి ఎద్దడికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక కిలో మాంసం వినియోగదారుడికి అందాలంటే దాదాపు 15,500 లీటర్ల నీరు అవసరమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 70 శాతం మంచినీరు మాంసాహారానికి ఉపయోగపడే జంతువుల కోసం పచ్చిక పెంచడానికే సరిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) హెచ్చరిస్తోంది. బహుశ ఈ హెచ్చరికలు కూడా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల జనాభా పెరగడానికి దోహదపడి ఉంటాయని భావిస్తున్నారు.

 

 శాకాహారమూ బలవర్ధకమే

 ఆకులు అలములు, కాయలు పండ్లతో కూడిన శాకాహారంలో ఎలాంటి బలం ఉండదనేది అపోహ మాత్రమేనని పలు పరిశోధనలు ఇప్పటికే రుజువు చేశాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా గింజలు, పప్పుధాన్యాలు తీసుకున్నట్లయితే పుష్కలంగా శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. పశుసంపద నుంచి సేకరించే పాలకు బదులుగా సోయా పాలు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించే శుద్ధ శాకాహారులు సైతం నిక్షేపంగా బతుకుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసం సహా ఇతర జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా శుద్ధ శాకాహారం తీసుకుంటూ జీవించినా ఆరోగ్యానికి ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. శాకాహారం వల్ల శరీర దారుఢ్యానికి ఎలాంటి లోటు ఉండదని పలువురు క్రీడాకారులు తాము సాధించిన విజయాలతో ఇప్పటికే ప్రపంచం కళ్లు తెరిపించారు. జర్మన్ వెయిట్ లిఫ్టర్ పాట్రిక్ బాబోమియాన్, ఆస్ట్రేలియన్ బాడీబిల్డర్ బిల్లీ సిమ్మండ్స్ తదితరులు శుద్ధ శాకాహారులే.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top