ఆగర్భ హింస

special  story on   womens Violence - Sakshi

కవర్‌ స్టోరీ

‘‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తాన’’ని పంతులుగారన్నప్పుడే భయమేసింది.‘‘ఆఫీసులో నా మొగుడున్నాడు ! అవసరమొచ్చినా సెలవివ్వడ’’ని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది – ‘‘వాడికేం? మగమహారాజని ‘‘ఆడా మగా వాగినప్పుడే అర్థమైపోయింది – ‘‘పెళ్ళి’’ అంటే ‘‘పెద్దశిక్ష ’’ అని ‘‘మొగుడు’’ అంటే ‘‘స్వేచ్ఛా భక్షకుడు’’ అని మేం పాలిచ్చి పెంచిన జనంలో సగం మమ్మల్ని విభజించి పాలిస్తుందని ! సావిత్రి అనే స్త్రీవాద కవయిత్రి రాసిన ఈ కవిత మొదటిసారి చదివినపుడే కాదు, చదివిన ప్రతిసారీ హృదయాన్ని కంపింపజేస్తుంది . కేవలం పదకొండు పొట్టి వాక్యాలలో సావిత్రి  మనం చూస్తున్న సమాజాన్ని, మన చుట్టూ పంజరంలా వేల  ఊచలతో పరుచుకున్న  పురుష పెత్తందారీ సమాజాన్ని చిత్రిక పట్టింది . చిత్రంగా మగవాళ్ళు కూడా విసుగునో, తప్పించుకోలేని పెత్తనాన్నో చెప్పాలంటే మొగుడు అన్న పదాన్నే వాడుతూ మొగుడు అనే పదవికి వున్న నిరంకుశ ధోరణిని చెప్పకనే ఒప్పుకుంటూ ఉంటారని ఆమె ఈ చిన్ని కవితలో చెప్పుకొచ్చింది.

‘తల్లి’ కడుపును చీల్చుకొని బయట పడకముందునుంచే బంగారు ‘తల్లి’కి లెక్కలేనన్ని కష్టాలు. ఒక్కో దశలో ఒక్కోరకం హింసను దాటుకొనొచ్చి నిలబడాలి ఆ తల్లి. పెళ్లయ్యాకైతే కొంతమందికి చెప్పుకోలేని, చెప్పనివ్వలేని హింస.. గృహహింస. నవంబర్‌ 25 ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైనెస్ట్‌ విమెన్‌’ సందర్భంగా...రవీందర్‌ బాగా చదువుకున్న వ్యక్తి. ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉన్నతోద్యోగంలో వున్నాడు. అతని భార్య ప్రవీణ, టీచర్‌. వారికిద్దరు పిల్లలు. అత్తమామలు వంటి బాదరబందీ లేని ఆధునిక కుటుంబం. అయినా రవీందర్‌ ఎప్పుడూ ప్రవీణను మనశ్శాంతిగా ఉండనిచ్చేవాడు కాదు. దానికి కారణం ఆమె ఒంటి రంగు. ఆమె నల్లగా  ఉండటం అతనికి చాలా అసహనం కలగజేసేది. ఆమె ఇచ్చిన కట్నం డబ్బు ఆమె రంగును ఆనాడు అతని కంటికి కనిపించనీయకుండా అడ్డుపడింది. కానీ ఈరోజు ఆమెకి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఆమె లాగే నల్లగా ఉండటం అతనికి చిరాకుగా మారింది. ఆ చిరాకును అతను మొదట్లో సూటిపోటి మాటలతో వ్యక్తపరచేవాడు. కాలక్రమంలో ప్రవీణకు పుట్టింటివాళ్ళ వెన్నుదన్ను పెద్దగా లేదని అర్థమయ్యాక అతని అసహనం మాటల నుంచి చేతలకు మారింది. అతను పెట్టే హింస తట్టుకోలేనిదిగా వున్నా నలుగురి ముందు పరువు పోతుందనీ, పిల్లలు తండ్రి లేనివారవుతారనీ, ఈ వయసులో మొగుడ్ని వదిలేస్తే ఇంక దిక్కేముందనీ, నిదానంగా ఆయనే మారుతారని ప్రవీణ ఈ అత్యాచారాన్ని తన కర్మగా భావిస్తూ, భరిస్తూ వచ్చేది. సరిగ్గా పోయిన కార్తీక మాసంలో రవీందర్‌ కొట్టిన దెబ్బలు ఆమెకు తగలరాని చోట తగిలి  అక్కడికక్కడే మరణించింది. అలా మరణించే వరకు ఆమె తన సహనాన్ని పాతివ్రత్యం అనీ, ఆ పాతివ్రత్యానికి  దేవుడి ఆశీస్సులు తప్పకుండా వుంటాయని అందరికీ చెప్తూ ఉండేది. ప్రవీణ మరణం ప్రమాదకర మరణం అని అందరినీ నమ్మించిన కొంతకాలానికి రవీందర్‌ ప్రవీణకు పుట్టిన నల్ల పిల్లల్ని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపేసి, ఇంకా పసి వయసులోనే వున్నాడు అని సమాజపు ఆమోదాన్ని పొంది రెండవ పెళ్లి చేసేసుకున్నాడు. ఈసారి కట్నానికి పెద్ద ఆశపడకూడదనీ, తనకి తెల్లటి అమ్మాయే కావాలని తెలిసివచ్చిందని  భావించి, తెల్లటి అమ్మాయిని వెదికి పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ కేసు భారత దేశంలో నమోదు కాని అనేకానేక గృహ హింస కేసులలో ఒక  కేసుగా, పోలీస్‌ స్టేషన్‌ వరకు రాని హత్యగా కాలగర్భంలో కలిసి పోయింది.

స్త్రీవాద యోధులు మిరాబెల్‌ సిస్టర్స్‌
నవంబర్‌ 25వ తేదీని ఐక్య రాజ్య సమితి ‘‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైనెస్ట్‌ విమెన్‌’’గా ప్రకటించింది. చలమూ, పెరియార్‌ ఈ వీ రామస్వామి ఇంకా చాలామంది స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించిన పెద్ద మనుషులు స్త్రీకి ’నీ గురించి నీవే ఆలోచించుకోవాలి’ అని చెప్పారు. తనకేం కావాలో, తాను అనుభవిస్తున్న బాధల రూపమేమిటో తానైతేనే బాగా చెప్పగలదని భావించారు. ప్రపంచవ్యాప్తంగా మొలకెత్తిన ఈ ఆలోచనా రూపమే స్త్రీవాదం. ఈ స్త్రీవాదం సాధించిన విజయమే నవంబర్‌ 25. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినదిస్తూ ఏర్పడిన ఈ రోజు వెనుక ఒక ఘనమైన త్యాగం వుంది. ఆ త్యాగమూర్తులు ముగ్గురూ అనన్య సామాన్యమైన సాహసం కలిగిన స్త్రీలు. వీరే డొమినికన్‌ రిపబ్లిక్‌కు  చెందిన ‘మిరాబెల్‌ సిస్టర్స్‌’గా ప్రసిద్ధి పొందిన పాట్రియా మెర్సిడెస్‌ మిరాబెల్‌ రెయెస్, మారియా అర్జెంటీనా మినెర్వా మిరాబెల్‌ రెయెస్, ఆంటోనియా మారియా టెరెసా మిరాబెల్‌ రెయెస్‌లు.డొమినికన్‌ నియంత రాఫెల్‌ ట్రుజిలో అమలు జరుపుతున్న అన్యాయాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా వీరు గొంతెత్తారు. వీరి నిర్భీకతను సహించలేక  నియంత రాఫెల్‌ 1960 నవంబర్‌ 25న వారిని హత్య చేయించాడు. దేశంపై వీరి హత్య తీవ్ర ప్రభావాన్ని చూపింది. తరువాతి కాలంలో వీరు ‘‘ఫెమినిస్ట్‌ ఐకాన్స్‌’’గా ప్రసిద్ధి పొందారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 1999 డిసెంబర్‌ 17 నాటి సమావేశంలో వీరి వర్ధంతిని ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయొలెన్స్‌ అగైనెస్ట్‌ విమెన్‌గా ప్రకటించింది.

ఈ దినోత్సవం ఎందుకంటే..?
ఈ అంతర్జాతీయ దినోత్సవం ఆవశ్యకత ఏమిటన్న దానికి ఐక్యరాజ్య సమితి ఇలా సమాధానమిచ్చింది... ‘‘మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన. చట్టాలలో, ఆచరణలో స్త్రీల మీద వున్న వివక్షకు, స్త్రీపురుషుల మధ్య వున్న అసమానత్వానికి పర్యవసానమే మహిళలపై జరుగుతున్న హింస. మహిళలపై జరుగుతున్న హింస అనేక రంగాలపై తిరోగమన ప్రభావాన్ని కలుగజేస్తుంది. పేదరిక నిర్మూలన, ఎయిడ్స్‌పై పోరాటం, శాంతిభద్రతలు వంటి అనేక అంశాలకు విఘాతం కలిగిస్తూ వుంది. మహిళలపై హింస అనివార్యమైనది కాదు. నివారణ సాధ్యమైనది, అత్యంత ఆవశ్యకమైనది. మహిళలపై హింస యావత్‌ ప్రపంచం ఎదుర్కొంటున్న జాడ్యం, రుగ్మత. మహిళలపై హింస బహిరంగ ప్రదేశాలలోనూ, రహస్య ప్రదేశాలలోనూ జరుగుతూనే వుంది. దీనికి అనేక రూపాలున్నాయి. కొన్ని సార్లు ఇది గృహ హింస, సన్నిహిత భాగస్వామి చేసే హింసగా ఉంటే, మరికొన్నిసార్లు లైంగిక వేధింపులు, లైంగిక దాడుల రూపంలోనూ, స్త్రీల జననాంగ విచ్ఛేదన, లైంగిక హత్యల రూపంలోనూ వుంటున్నది’’ అని పేర్కొన్నది.  
అంతే కాకుండా నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10వ తేదీన జరిగే ‘హ్యూమన్‌ రైట్స్‌ డే’ వరకు క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాల్సిందిగా పిలుపునిస్తున్నది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ‘‘స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యత’’ప్రచారానికి థీమ్‌గా ‘‘లీవ్‌ నో వన్‌ బిహైండ్‌: ఎండ్‌  వయొలెన్స్‌ అగైనెస్ట్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌’’ని ప్రకటించారు. అంటే అణగారిన వర్గాల వారిని, అల్పసంఖ్యాక వర్గాల వారిని, శరణార్థులను ఎవ్వరినీ వదిలి పెట్టకుండా అందర్నీ కలుపుకుని ‘‘యునైటెడ్‌ నేషన్స్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌’’–30 సాధించడానికి మహిళలపై హింస నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు.

అన్ని వర్గాల మహిళలూ బాధితులే!
ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. ఈ హింసకు అన్ని ఆదాయ వర్గాల వారు, అన్ని వయసుల వారు, అన్ని విద్యార్హతలు కలిగిన మహిళలూ బాధితులే. ఈ హింస స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది . తీవ్రమైన సంఘటనల్లో మహిళలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. స్త్రీల మీద హింసకు ప్రపంచ వ్యాప్తంగా భర్త వంటి సన్నిహిత భాగస్వాములే కారణమవుతున్నారు. స్త్రీల మీద జరిగే హింసలో శారీరక  హింస కంటే లైంగిక హింస తక్కువే అయినప్పటికీ సన్నిహిత భాగస్వాములు హింసకు పాల్పడే ఘటనల్లో రెండు హింసలూ ఏకకాలంలో జరుగుతున్నాయి.

అసమానతల నేపథ్యం
ఆదిమ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి అసమానత లేదు. ఉత్పత్తి కన్నా, సంతానోత్పత్తికి ఎక్కువ గౌరవమున్న కాలంలో స్త్రీ సమ ప్రాధాన్యతను పొందుతూ వచ్చింది. ఎప్పుడైతే పురుషుడు ఆయుధోత్పత్తిపై ఆసక్తి చూపుతూ ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చాడో అప్పుడు శ్రమ విభజన మొదలయింది, దీనినే ఏంగెల్స్‌ ‘‘చరిత్రలో మొదటి శ్రమ విభజన   స్త్రీపురుషుల మధ్య జరిగింది. మొదటి వర్గ పీడన, స్త్రీలపై పురుషుల పీడన ఒకే కాలంలో సంభవించాయి. కుటుంబంలో భర్త బూర్జువా, భార్య కార్మికురాలు’’ అని తన ‘కుటుంబం – వ్యక్తిగత ఆస్తి రాజ్యాల పుట్టుక’ లో పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా ఎంతెంతో పెద్ద మేధావులు, తత్వవేత్తలూ స్త్రీకి కూడా పురుషునితో సమానమైన ఆలోచన చేయదగ్గ మెదడు ఉందని అంగీకరించడానికి నిరాకరించిన వారే. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్రా సంకెళ్ళమయమయ్యాడన్న రూసో స్త్రీ దగ్గరికొచ్చేసరికి ‘‘స్త్రీల చదువంతా తప్పనిసరిగా పురుషులను ఆనందపెట్టడానికి, వారికి ఉపయోగపడటానికి, పురుషులకు చిన్నతనంలో చదువు నేర్పటానికి, పెద్దయ్యాక వారి అవసరాలు తీరుస్తూ వారి జీవితం సౌఖ్యంగా సాగటానికి స్త్రీలు చదువుకోవాలి’’ అన్నాడు. పురుషులు స్త్రీని సంతాన రక్షణకు, ఇంటి అవసరాలను చూసుకోవడానికి పరిమితం చేసిన తరువాత అందుకు అనుగుణమైన తర్ఫీదును స్త్రీలకూ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ శిక్షణలో మొదటి అంశమే నీవు పురుషుని సౌఖ్యం కోసం పుట్టావ్‌ అన్న భావజాలం. ఈ భావజాలం స్త్రీ మనశ్శరీరాలను ఎంత ఆక్రమించుకున్నదంటే మూడవ నేషనల్‌ ఫ్యామిలీ అండ్‌ హెల్త్‌ సర్వేలో కుటుంబ హింస గురించి చేసిన సర్వేలో ఆడవాళ్లను మగవాళ్ళు కొట్టవచ్చు అని 55% మహిళలు అంగీకరించారు. అత్తమామలను అగౌరవపరిస్తే 48%, ఇంటిని నిర్లక్ష్యం చేస్తే 38%, భర్తతో వాదన పెట్టుకుంటే 35%, భర్త అనుమతి లేకుండా బయటకు వెళితే 30% మహిళలు భర్త  తమను  కొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పితృస్వామ్యం  మెదడులో ఇంకిపోయిన మహిళలు కీలకమైన పదవులలో, భావజాల వ్యాప్తికి పనిచేసే విద్యాలయాల్లో ఉంటూ పురుషులకు ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్నారు. పురుషస్వామ్యం దాని పని అది చేసుకుంటూ వెళుతూ ఉంటే చైతన్యవంతులైన స్త్రీలు స్త్రీవాదులుగా మారి స్త్రీల జీవితాలకు చేసిన సేవ చిన్నది కాదు. పునరుత్పత్తి చేసే అవయవాలు ఉన్నప్పటికీ తాను బిడ్డకు జన్మనివ్వాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఈనాటికీ లేదు. కానీ బ్రిటన్‌కి చెందిన మార్గరెట్‌ సాంగర్‌ వంటివారు ఎంతో పోరాడిన తరువాత ఈ రోజు అబార్షన్‌ హక్కు అమలులోకి వచ్చింది.

స్త్రీలకు మేలు చేసిన సంస్కరణోద్యమం
స్త్రీ వాద ఉద్యమమే కాదు, సంస్కరణోద్యమం కూడా భారతీయ స్త్రీలకు మేలు చేసింది, మార్పు రాత్రికి రాత్రే రాకపోయినా మార్పు రాకుండా ఆగిపోలేదు. గృహ హింస ఇండియాలో ప్రత్యేకమైన నేరంగా మొదటిసారి 1983లో చట్టాల్లో చేరింది. ఆ సంవత్సరం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ లో ‘సెక్షన్‌ 498–ఎ’ చేర్చడం ద్వారా భర్త లేదా అతని కుటుంబం భార్య మీద చేసే క్రూరత్వం ఒక ప్రత్యేకమైన నేరంగా పరిగణనలోకి వచ్చింది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే గృహహింసను కొలవడానికి కాన్‌ఫ్లిక్ట్‌ టాక్టిక్‌ స్కేల్‌ను ఉపయోగించింది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 15 నుంచి 49 వయసు ఉన్న మహిళల్లో 39.7% మంది ఎదో ఒక రకమైన హింసకి బాధితులు. బీహార్‌లో అత్యధికంగా 60% మంది మహిళలు హింసకి బాధితులు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 36.8% మంది, కేరళలో 19.8%, తమిళనాడులో 44.1%, కర్ణాటకలో 21.5%. స్త్రీలు హింసకి బాధితులు. ఈ సర్వే ప్రకారం... నిరక్షరాస్యులైన స్త్రీలలో 44% హింసకి బాధితులైతే, విద్యాధికులైన స్త్రీలలో బాధితులు 14%. అలాగే భర్త నిరక్షరాస్యుడు అయితే 20% స్త్రీలు హింసకి బాధితులు అవుతుండగా, భర్త విద్యాధికుడు అయితే 8.9% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. అసలు మద్యపానం చేయని భర్త ఉంటే 12% స్త్రీలు హింసకి బాధితులు అయితే భర్త తాగుబోతు అయితే 38% స్త్రీలు హింసకి బాధితులు అవుతున్నారు. ఆర్థిక స్థితిగతులు కూడా కుటుంబ హింసని ప్రభావితం చేస్తున్నాయి. సంపన్న వర్గాలలో హింసకి బాధితులు అయిన మహిళలు 19% అయితే నిరుపేద వర్గాలలో బాధిత మహిళలు 44%. ఈ సర్వే ప్రకారం మన దేశంలో 66%మంది మహిళలు  తమపై జరిగిన హింసను ఎవరికీ చెప్పుకోరు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం భర్త మరియు ఇతర కుటుంబ సభ్యుల క్రూరత్వం వల్ల మహిళలపై జరిగిన నేరాలు 2012 లో 29% ఉండగా, 2015లో అది 34% అయింది. ఈ కేసులు నమోదు చేయడానికి స్త్రీలు ముందుకు రావడానికి కారణం 2005 నుంచి అమలులోకి వచ్చిన ‘గృహ హింస’ చట్టం కారణం కావచ్చుట! ప్రతి 5 నిమిషాలకీ ఒక ఇంటిలో కుటుంబ హింస జరుగుతూ వుండే భారత దేశంలో ఇటువంటి చట్టం అవసరం ఎంతైనా వుంది. ఈ చట్టానికి ముందు కుటుంబ హింసకి గురైన మహిళలకు అందుబాటులో వుండిన చట్టపరమైన ఉపశమనాలన్నీ దీర్ఘకాలికమైనవి. అటు 498–ఎ అయినా, విడాకులయినా అనేక సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ చట్టం ఈ లోపాలని సరిదిద్దిందనే చెప్పవచ్చు. ఈ చట్టంలోకి హింసకు గురయ్యే భార్యలే కాకుండా పిల్లలు, లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో వుండే మహిళలు, వితంతువులై పుట్టింటికి చేరిన వారు వారి సొంత  అన్నదమ్ములపై కూడా కేసులు పెట్టొచ్చు. ఈ చట్టం హింసను విపులంగా వర్గీకరించింది. అది శారీరక, లైంగిక హింస మాత్రమే కాదు, మాటలతో వేధించడం, మానసికంగా హింసించడం కూడా ఈ  చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ కేసు జరుగుతున్నంత కాలం ఆమె కావాలనుకుంటే తన భర్త ఇంటిలోనే వుండి పోరాడే నివాస హక్కుని ఈ చట్టం కల్పించింది. ఈ చట్టం అమలు తీరుపై పలువురు పలురకాలైన సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

సిగ్గుపడాలి
మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా బయటకి రాకుండా స్త్రీలు హింసను తాము తట్టుకోగలిగినంత మేర అనుభవిస్తున్నారు. సమాజం స్త్రీ చుట్టూ అల్లి పెట్టిన సంప్రదాయ వల చాలా గట్టిది. స్త్రీలు ఈ భ్రమాత్మకమయిన సంప్రదాయాలను ఛేదించుకుని బయటకి రావాలి. సమాజం కోసమో సంప్రదాయాల కోసమో లేదా చివరికి పిల్లల కోసమో స్త్రీలు హింసను భరించాల్సిన అవసరంలేదని తెలుసుకోవాలి. తండ్రులుగా, సోదరులుగా మగవాళ్ళు తమ స్త్రీలకు అక్కర వచ్చినపుడు పటిష్టమైన కొండంత అండగా నిలబడే శిక్షణను మన విద్య నేర్పించాలి. తస్లీమా నస్రీన్‌ అంటారు ‘‘మనం స్త్రీలం. ఒంటరిగా, చప్పుడు కాకుండా ఒంటరి ప్రదేశాల్లో ఏడుస్తూ ఇక ఎంతో కాలం ఉండలేం. మనం బాధితులమైతే గట్టిగా అరవాలి. మన అరుపులు అందరికీ వినిపించాలి’’. వ్యవస్థల ద్వారా జరిగే అణచివేతను ఆపటానికి స్త్రీలు పోరాడకపోతే ఆ స్త్రీలు సిగ్గుపడాలి. ప్రతిఘటించకుండా, పోరాడకుండా, ఆ వ్యవస్థను కొనసాగనిస్తున్నందుకు, మన పిల్లలను, మన పిల్లల పిల్లలనూ ఆ అణచివేతలో పడిపోనిస్తున్నందుకు సిగ్గుపడాలి.  

గృహహింసపై కవీంద్రుని కథ
రవీంద్రనాథ్‌ టాగోర్‌ 1913లో ఒక క«థ రాశాడు. ఆ క«థ పేరు ‘‘భార్య వ్రాసిన లేఖ’’. 104 ఏళ్ళ క్రితం ఆయన రాసిన ఈ క«థలోని భార్య తన భర్తకి రాసిన ఉత్తరంలో చాలా విషయాలను చర్చకు పెడుతుంది. ఆమె ఆదరించి పెంచిన చిన్న అమ్మాయి ఒకతె వివాహానంతరం చీరకు నిప్పంటించుకుని చనిపోతుంది. అది చూసి సమాజం దిగ్భ్రమ చెందదు, కనీసం అయ్యో అని సానుభూతి కూడా చూపదు, చూపకపోగా ’’ఆడవాళ్లు చీరలకు నిప్పంటించుకుని చచ్చిపోవడం ఒక ఫ్యాషన్‌ అయిపోయింది’’ అని చిరాకు పడుతుంది.  దానిని ప్రశ్నిస్తూ ఆ ఉత్తరం రాసిన భార్య ‘ఇదంతా నాటకం’ అన్నారు మీరు. కావచ్చు. కానీ ఈ నాటక క్రీడ కేవలం బెంగాలీ స్త్రీల చీరల మీదుగానే జరుగుతుందేం! బెంగాలీ వీరపురుషుల ధోవతుల అంచుల మీదుగా జరగదెందుకని?అది కూడా ఆలోచించి చూడటం యుక్తం...!’’ అంటుంది. స్త్రీలు అనుభవిస్తున్న కుటుంబ హింస ఈ కథా కాలానికంటే కూడా చాలా పురాతనమైంది. 
– సామాన్య కిరణ్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top