ఓ విహంగ వీక్షణం | Sakshi
Sakshi News home page

ఓ విహంగ వీక్షణం

Published Sun, Dec 10 2017 12:09 AM

S Millard  loves nature - Sakshi

చాలా ముద్దుగా కూడా ఉండి ఉంటుంది, ఆ పక్షి. పసుపు రంగు మెడతో ఉన్న బుజ్జి పక్షి. ఆ పిల్లవాడి తుపాకీ దెబ్బకి రాలిపోయింది. అప్పుడు ఆలోచించాడా అబ్బాయి, ఈ పక్షి పేరేమై ఉంటుందని! ఏ జాతిదై ఉంటుందని! ఆ మృత విహంగాన్నే తీసుకుని వెళ్లి మేనమామను అడిగాడు. ఆయన ప్రకృతిని ప్రేమించేవాడే. పక్షులని వేటాడుతూ ఉండేవాడే. కానీ ఆయనకీ తెలియలేదు. మేనల్లుడి ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అంతో ఇంతో పరిచయం కలిగిన బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ కార్యదర్శి డబ్లు్య ఎస్‌ మిల్లార్డ్‌ దగ్గరకు తీసుకుపోయాడు. ఆ పిల్లవాడి ఆసక్తి చూసి మిల్లార్డ్‌ కొంత చెప్పాడు. మిల్లార్డ్‌కీ ముచ్చట తీరలేదు. తను సేకరించిన పక్షుల బొమ్మలను చూపించాడు. నిజానికి  వాటికి ప్రాణం లేదు. పట్టుకున్న తరువాత వాటి లోపలి మాంసాన్ని తొలగించి, దూది కుక్కి మళ్లీ నిండుగా తయారుచేసే స్టఫ్డ్‌ పక్షులు. ఎన్ని జాతులు! ఎన్ని రంగులు! ఎన్ని పరిమాణాలు! వాటిని చూశాకే ఆ అబ్బాయిలో పక్షుల మీద ఉన్న ఆసక్తికి హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. అలా ప్రపంచ పక్షిశాస్త్రానికి కొత్త వెలుగును ఇచ్చిన ఒక శాస్త్రవేత్త పుట్టాడు. ఆయనే డాక్టర్‌ సలీం అలీ (నవంబర్‌ 12, 1896– జూలై 27, 1987). ఆ పిచ్చుక అలీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పలేం. తన జీవిత చరిత్రకు, ‘ఒక పిచ్చుక పతనం’ అని పేరు పెట్టారాయన.

 ‘నువ్వు ఎగిరిపోవాలనుకుంటే, అన్నీ వదిలిపెట్టెయ్‌! అప్పుడే బరువు తగ్గుతుంది’ అంటాడొక తత్వవేత్త. సలీం అలీ చేసింది అదే. ఇదే విషయాన్ని తన వాస్తవ అనుభవంతో ఇంకాస్త లోతుగా చెప్పారు అలీ– ‘నీవు పక్షుల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలిపెట్టాలి’. పక్షులతో ఆయన అనుబంధం ఇలా ఒక తాత్విక స్థాయికి చేరుకుంది.
జీనత్‌ ఉన్నిసా, మొయిజుద్దీన్‌ దంపతుల తొమ్మిది మంది సంతానంలో నాలుగో సంతానమే సలీం. మూడో ఏటకే అమ్మానాన్న కన్నుమూశారు. ‘గోరొంక గూటికే చేరావు చిలుక’ అన్నట్టు మేనమామ అమీరుద్దీన్‌ తాయబ్జీ ఆయనను పెంచుకున్నాడు. ఆయనకీ పిల్లలు లేరు. ప్రకృతి అన్నా, వేట అన్నా మహా ఇష్టం. మేనల్లుడిని తాయబ్జీ మొదట జనానా బైబిల్‌ మెడిసిన్‌ మిషన్‌ గరల్స్‌ హైస్కూలులో చేర్చాడు. తరువాత సెయింట్‌ జేవియర్‌ హైస్కూలుకు మార్చాడు. ఇలా స్కూలుకి వెళ్లడం బొత్తిగా నచ్చలేదు సలీంకి. అందుకే 1913లో బొంబాయి యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ పట్టా తీసుకోగలిగాడు. అప్పుడు బీయస్సీలో చేరాడు. కానీ అల్జీబ్రా, లాగర్దమ్స్‌ అంటే బొత్తిగా సరిపడలేదు. మొదటి సంవత్సరంతోనే ఆగిపోయింది డిగ్రీ చదువు. మళ్లీ పక్షుల వీక్షణానికి అనుకోకుండా అవకాశం వచ్చింది.

చదువు పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేని సలీంని బర్మాలో ఉంటున్న అతని కుటుంబం దగ్గరికి పంపించాడు మేనమామ. అప్పటికే పెళ్లి కూడా అయింది. ఆమె పేరు తెహమినా బేగం. బర్మాలో (నేటి మైన్మార్‌) తేవీ అనేచోట వారి కుటుంబానికి కలప, గనుల వ్యాపారం ఉండేది. అంటే మళ్లీ అటవీ ప్రాంతానికే. కాబట్టి పక్షులను చూస్తూ కాలం గడపవచ్చు. ఏడేళ్లు చేసిన పని అదే. ఆ తరువాత భారతదేశానికి వచ్చేశాడు. మళ్లీ కాలేజీలో చేరాలని అనిపించింది. దావర్స్‌ కాలేజీలో వాణిజ్యశాస్త్రం చదవడానికి చేరాడు. కానీ పద్దులు కాదు, పక్షులే కళ్ల ముందు కదిలేవి. శ్రద్ధ పెట్టలేకపోయాడు. దీనిని గమనించి అప్పటి ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ ఎథెల్బర్ట్‌ బ్లాటర్‌ ఉదయం పూట వాణిజ్యశాస్త్రం చదవడానికీ, సాయంత్రం జంతుశాస్త్ర తరగతులకు హాజరు కావడానికీ అనుమతించాడు.సలీం అలీ కళ్లెప్పుడూ పక్షుల కోసమే వెదుకుతూ ఉండేవన్న మాట నిజం. ఆయన వేకువనే లేచేవారు. చుట్టూ చెట్లు చేమలు, వాటి మధ్య వారి ఇల్లు ఉండేది. ఆ చెట్ల మీద గిజిగాడి గూళ్లు ఉండేవి. పోర్సిలిన్‌ పూలకుండీ అంతటి కళాత్మకతను గడ్డిపోచల అల్లికతోనే సాధించిన ఆ పక్షుల ప్రతిభ విస్మయ పరిచేది. ప్రతి చెట్టుకూ గూడే. అన్ని గూళ్లు ఎందుకు కడతాయి? అన్నది కూడా ఆయన శోధిం^è దలిచాడు.

డాక్టర్‌ అలీ చాలా చిత్రమైన విషయం కనుగొన్నాడు. గిజిగాడి గూళ్లను మగ పక్షులు నిర్మిస్తాయి. గూడు సిద్ధమైన తరువాత ఆడపక్షి వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతుంది. పెంచుతుంది. ఇంతలో ఆ మగపక్షి అక్కడే ఇంకో కొమ్మకు మరో గూడు కడుతుంది. కానీ ఈసారి పాత ఆడపక్షి కాదు, మరొక ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. ఈ విషయాన్నే ఆయన మొదటిసారి ఒక అంతర్జాతీయ సైన్సు పత్రికలో ప్రచురించాడు. మొదట చర్చ వచ్చినా, తరువాత అంతా అంగీకరించారు.సాయం వేళ చదువుతో జంతుశాస్త్రంలో డిగ్రీ తెచ్చుకున్నాడు సలీం. కానీ ఎంఎస్‌సీ లేదా పీహెచ్‌డీ పట్టా లేదు కాబట్టి బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీలో ఉద్యోగం రాలేదు.దేశంలో అప్పటికి ఏ విశ్వవిద్యాలయంలోను పక్షిశాస్త్రం లేదు. అప్పటికే ఒంటరి పోరాటంలో ఉన్న అలీకి తన పనిలో కొత్తదనం కనిపించలేదు. అప్పుడే బెర్లిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఇర్విన్‌ స్ట్రెస్‌మాన్‌ ఆహ్వానించాడు. అలీ జర్మనీ వెళ్లాడు. అక్కడే చాలామంది పక్షిశాస్త్రవేత్తలతో కలసి తిరిగాడు. మళ్లీ 1930లో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొంది వచ్చినా వలస భారతంలో ఆయనకు అనుకున్న ఉద్యోగం రాలేదు. బొంబాయి దగ్గరే ఉన్న కిహిమ్‌ అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పక్షుల మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేశాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ సారథ్యం ఆయనకే అప్పగించారు. వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అప్పటికే కడగండ్లతో కాలం గడుపుతున్న ఆ సొసైటీని డాక్టర్‌ సలీం కాపాడారు. భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది.
పక్షిశాస్త్రవేత్తగా (ఆర్నిథాలజీ) డాక్టర్‌ సలీం సేవలు అసమానమైనవి. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురించిన వ్యాసాలు ఈ విషయాన్ని నిస్సందేహంగా నిరూపిస్తాయి. పక్షుల జీవన సరళిని పరిశీలించడం కూడా శాస్త్రంలో భాగమేనని తేల్చారు. ఆయన పరిశోధనలో పక్షుల అలవాట్లు, ఆహారం, గుడ్లు, పిల్లల పోషణ ప్రధానంగా చోటు చేసుకున్నాయి. జీవావరణ పరిస్థితులనే ఆయన ఎక్కువ అధ్యయనం చేశారు. భారతదేశంలో పక్షుల వర్గీకరణ అనేది ఆయన వచ్చిన తరువాత మరింత శాస్త్రీయతను సంతరించుకోవడం విశేషం. ఆయన పరిశోధన వల్ల జరిగిన మేలు అసాధారణమైనది. ప్రపంచంలో దాదాపు 8,580 జాతుల పక్షులు ఉన్నాయని అంటారు. ఇందులో 1,200 జాతులు భారతదేశంలో నివసిస్తున్నాయన్న సంగతి మనకు చెప్పినవారు డాక్టర్‌ అలీయే.

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత్‌పూర్‌ పక్షి సంరక్షణ కేంద్రం కొనసాగిందంటే అందుకు కారకుడు డాక్టర్‌ సలీం అలీ. 250 ఏళ్ల చరిత్ర కలిగిన భరత్‌పూర్‌ పక్షి రక్షణ కేంద్రం ఒక అద్భుతం. రాజస్థాన్‌లో ఇది ఉంది. దీనికే కియోలదేవ్‌ (స్థానికంగా శివుడిపేరు) ఘానా జాతీయ సంరక్షణ కేంద్రంగా తరువాత నామకరణం చేశారు. అక్కడ ఉన్న కియోలదేవ్‌ ఆలయం కారణంగా ఆ పేరు వచ్చింది. భరత్‌పూర్‌ సంస్థానంలో ఘానా అనేచోట ఇది సహజంగా ఏర్పడింది. దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. శీతాకాలంలో కొన్నివేల పక్షులు వస్తాయి. స్థానికంగా 250 రకాలు ఎప్పుడూ ఉంటాయి. 1938లో అప్పటి వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో ఆ ఏడాది 4,273 పక్షులను వేటాడాడు. 1958 ప్రాంతంలో స్థానికులు ఈ పక్షి కేంద్రాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. దీనితో సలీం అలీ నేరుగా నెహ్రూను కలసి పక్షి రక్షణ కేంద్రంగా ప్రకటింపచేశారు.  1971లో దీనికి ప్రపంచ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు వచ్చింది.  కేరళలోని సైలెంట్‌ వ్యాలీ నేషనల్‌ పార్కు రక్షణలో కూడా ఆయన కృషి ఉంది. ఇది కూడా ఒక అద్భుత పక్షి కేంద్రమే. 1847లో దీనిని గుర్తించారు. 90 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించుకొని ఉంది. 1970 దీనికి సమీపంలో ఒక జల విద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. దీనితో సేవ్‌ సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం మొదలయింది. చివరికి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకుంది. ఈ పార్కుతో డాక్టర్‌ అలీకి విశేష అనుబంధం కూడా ఉంది. ‘బర్డ్స్‌ ఆఫ్‌ కేరళ’ అని ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశారు. మరొక పుస్తకం ‘ది బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ బర్డ్స్‌’.

పక్షుల గురించి శోధనకు వెళ్లినప్పుడు అలీకి ఇంకేమీ పట్టేది కాదు. ఆయన విహంగాలను వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగారు. ఇబ్బంది కలిగించే వాతావరణం గాని, కొండలూ కోనలూ గాని ఆయన గవేషణకు అడ్డం కాలేకపోయాయి. భారతదేశం నలుమూలలా కూడా ఆయన అన్వేషణ సాగింది. పక్షుల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన కళ్లు డేగ కళ్లయిపోతాయని మిత్రులు చమత్కరించేవారు. ఖాకీ యూనిఫారమ్‌లో, ఆకుపచ్చ టోపీతో నెరిసిపోయిన జుట్టుతో, చిరుగెడ్డంతో కనిపించేవారాయన.  ఇంకో మిత్రుడు ‘తెల్ల వెంట్రుకల బుల్‌బుల్‌ వస్తోంది!’ అనేవాడు. ‘నేను బాగా పాడతాను కాబట్టి, ఆ పేరు సరిగానే ఉంది. కానీ నాకు రాబందు అన్న పేరైతే బావుంటుంది’ అని డాక్టర్‌ అలీ చెప్పేవారు. మెడలోఒక బైనాక్యులర్‌ వేసుకుని, చేతిలో పేజీలు నలిగిన చిన్న డైరీతో అడవుల వెంట, కొండల వెంట, చెట్ల మధ్య నుంచి ఆయన మైళ్ల తరబడి నడిపోతున్న దృశ్యం మిత్రులకు నిరంతరం ఆశ్చర్యంగా అనిపించేంది. ఎనిమిది పదులు దాటిన తరువాత కూడా ఆయనలో అదే తృష్ణ కనిపించేది. రెక్కలు సాచి విహాయసంలో ఎగిరే పక్షిని చూస్తూ ఉండడం ఆయనకొక వ్యసనం.
ఆయన పక్షుల మనస్తత్వం ఎంత బాగా గ్రహించారో చూస్తే వింతనిపిస్తుంది. చాలా విమానాశ్రయాలకు పక్షుల బెడద మొదలైంది. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పక్షులు అక్కడికి ఎందుకు వస్తున్నాయో దర్యాప్తు చేయండని సలహా ఇచ్చారు. నిజమే, అంత గడబిడ ఉన్నచోటకి ఆ చక్కని ప్రాణులు ఎందుకు వస్తాయి? పరిశోధించిన అధికారులకు ఒక విషయం తెలిసింది. ఇలాంటి ఫిర్యాదు వచ్చిన విమానాశ్రయాలకు సమీపంలో కబేళాలు ఉన్నాయి. అందుకే పక్షులు అక్కడికి చేరుతున్నాయి. వాటి తప్పు కాదు.
 ఆయన 91వ ఏట కన్నుమూశారు. అప్పటికి మూడేళ్ల ముందు కూడా ఆయన ఒడిశాలోని తూర్పు కనుమలలో తిరిగారు. నల్లమెడ కొంగను చూడడం కోసం లద్ధాక్‌ చలిలో తిరిగారు. ఫ్లెమింగో పక్షి గూడును చూడ్డానికి ఏం చేశారో తెలుసా? రాణ్‌ ఆఫ్‌ కచ్‌లో ఒంటె మీద పదిగంటల పాటు ప్రయాణించారు. కానీ ఆ గూడును చూడడం సాధ్యపడలేదు. అయినా నిరుత్సాహపడలేదు.

 భారత్,పాక్‌ దేశపు పక్షులు అన్న అంశంతో ఆయన చేసిన పరిశోధనను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రెస్‌ వారు 1968, 1974 సంవత్సరాల మధ్య పది వాల్యూమ్‌లుగా ప్రచురించారు. ఏడు దశాబ్దాల పాటు పక్షుల గురించి అన్వేషించి, ఒక శాస్త్రాన్ని మథించినా జీవితపు చరమాంకంలో ఆయన అన్న మాట అందరినీ విస్తుపోయేటట్టు చేస్తుంది. ‘నాకు ఇంత కీర్తిప్రతిష్టలు రావడం బాగానే ఉంది కానీ, పక్షిశాస్త్ర శోధనలో ఇక్కడ దాదాపు ఏమీ జరగలేదనే అనుకుంటాను. నేను నూతిలో కప్పలాంటి వాడిని. లేదంటే, అందరూ గుడ్డివాళ్లే ఉన్నచోట ఒంటికన్నువాడిని’ అని సవినయంగా చెప్పుకున్నారు. ప్రఖ్యాత జీవావరణ శాస్త్రవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ మాత్రం అలీ గురించి గొప్ప మాట అన్నాడు.  ‘ఈ 20వ శతాబ్దంలో జీవజాలం మీద ఏ ఒక్కరు చేయనంత కృషి ఆయన ఒక్కరే చేశారు.’ చివరికి ఆ పక్షిప్రేమికుడు  కేన్సర్‌ వ్యాధికి గురయ్యారు. 91వ ఏట హంస ఎగిరిపోయింది.
∙డా. గోపరాజు నారాయణరావు

Advertisement
Advertisement