క్షీర భగీరథుడు | Sakshi
Sakshi News home page

క్షీర భగీరథుడు

Published Sun, May 29 2016 2:36 AM

క్షీర భగీరథుడు

మన దిగ్గజాలు - జూన్1 ప్రపంచ పాల దినోత్సవం
దేశంలో క్షీరవిప్లవాన్ని తెచ్చిన దార్శనికుడు ఆయన. ఒకప్పుడు పాల కోసం అల్లాడిన భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత ఆయన సొంతం. ఆయనే వర్ఘీస్ కురియన్. ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట ఆయన చేపట్టిన ఈ భగీరథ ప్రయత్నం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయానుబంధ కార్యక్రమంగా గుర్తింపు పొందింది.
 
ఈ క్షీరవిప్లవమే కురియన్‌ను ‘మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రజలకు చేరువ చేసింది. దేశంలో పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధించిందంటే, అది ఆయన చలవే! అంతేనా, వంటనూనెల ఉత్పత్తిలోనూ దేశాన్ని స్వయంసమృద్ధి సాధించేలా చేయడంలోనూ గురుతర పాత్ర పోషించారాయన.
 
కేరళ జన్మస్థలం... గుజరాత్ కార్యక్షేత్రం
అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రావిన్స్‌లోని కాలికట్‌లో (ప్రస్తుతం ఇది కేరళలో ఉంది. దీనిపేరు కోజికోడ్‌గా మారింది) 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు వర్ఘీస్ కురియన్. కేరళలో పాఠశాల విద్య పూర్తయ్యాక కాలేజీ చదువుల కోసం మద్రాసు చేరుకున్నారు. మద్రాసులోని లయోలా కాలేజీ నుంచి ఫిజిక్స్‌లో బీఎస్సీ పొందారు. ఆ తర్వాత మద్రాసు వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు జెమ్‌షెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు.

భారత ప్రభుత్వం అందించిన స్కాలర్‌షిప్‌తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మిషిగాన్ స్టేట్ వర్సిటీ నుంచి 1948లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యార్హతలతో దేశానికి తిరిగి వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభించిన ప్రయోగాత్మక పాలకేంద్రం విధులను అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆనంద్ ఆయన కార్యక్షేత్రంగా మారింది.
 
మధ్యలోనే మానేద్దామనుకున్నారు
ప్రభుత్వం పంపగా కురియన్ తొలుత అయిష్టంగానే ఆ పని చేపట్టారు. మధ్యలోనే ఆ ఉద్యోగం మానేసి, వేరే ఏదైనా పని వెదుక్కోవాలని భావించారు. అయితే, కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం వ్యవస్థాపకుడు త్రిభువన్‌దాస్ పటేల్ నచ్చచెప్పడంతో కురియన్ ఆనంద్‌లోనే ఉండిపోయారు. పటేల్ పాడి రైతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, వారందరూ ప్రభుత్వ పాల కేంద్రానికే పాలు సరఫరా చేసేలా చూశారు. అయితే, పాల కేంద్రం కార్యకలాపాల్లో తరచూ అధికారులు జోక్యం చేసుకుంటుండటంతో కురియన్ విసుగెత్తిపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం సాధించాలనుకున్నారు. ఈ విషయమై తనకు మార్గదర్శిగా ఉన్న పటేల్‌తో చర్చించారు.
 
అమూల్... అలా మొదలైంది
సహకార పద్ధతిలో పాల సేకరణ మంచి ఫలితాలనే ఇస్తున్నా, అధికారుల జోక్యమే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోందని కురియన్, పటేల్ భావించారు. అందుకే స్వయంగానే ఏదైనా చేద్దామని భావించారు. వారి ఆలోచన నుంచి ‘అమూల్’ పుట్టింది. ఆనంద్‌లో ఏర్పాటు చేసిన ‘అమూల్’ ప్లాంట్‌ను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ‘అమూల్’ ద్వారా పాలపొడి, చీజ్, వెన్న ఉత్పత్తులు ప్రారంభమైన కొద్ది సంవత్సరాలలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. సహకార పద్ధతిలో పాలసేకరణ ద్వారా సాధించిన ఈ విజయం అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిని ఎంతగానో ఆకట్టుకుంది.

దాంతో ఆయన కురియన్‌ను ఆహ్వానించి, దేశానికి పాల కొరత తీర్చాలనే సంకల్పంతో జాతీయ పాడి అభివృద్ధి మండలి (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్) నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో దేశంలో క్షీరవిప్లవానికి నాందీప్రస్తావన జరిగింది. ఇక ఆ తర్వాత కురియన్ సాధించిన విజయాలన్నీ చరిత్రను సృష్టించాయి. ఆయన సారథ్యంలోనే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న అమెరికాను భారత్ అధిగమించగలిగింది.

కురియన్ చలవ వల్ల లక్షలాది మంది పాడి రైతులు పేదరికం నుంచి బయటపడి స్వయంసమృద్ధిని సాధించగలిగారు. ఈ విజయాలన్నీ కురియన్‌కు ‘పద్మవిభూషణ్’ సహా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘అమూల్’ విజయం స్ఫూర్తితో బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనగల్ రూపొందించిన ‘మంథన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం మరో విశేషం.
 - వర్ఘీస్ కురియన్

Advertisement
Advertisement