పసందైన వంటకాలు మీకోసం

Lets Try This Brinjal Roles Item At Your Home - Sakshi

స్నాక్‌ సెంటర్‌ 

బీట్‌రూట్‌ చపాతి
కావలసినవి:  బీట్‌రూట్‌ గుజ్జు – 1 కప్పు, గోధుమ పిండి – 1 కప్పు, అల్లం – వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌ చొప్పున, వాము పొడి – అర టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, ఆలివ్‌ నూనె – 1 టీ స్పూన్‌, నీళ్లు – సరిపడా, నూనె – కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – గార్నిష్‌కి

తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌లో గోధుమ పిండి, బీట్‌రూట్‌ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆలీవ్‌ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాము పొడి కూడా అందులో వేసుకుని, కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డంత పరిమాణంలో ముద్దలు తీసుకుని చపాతి కర్రతో చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌పైన నూనె వేసి దోరగా వేయించుకుని.. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.

కార్న్‌ కబాబ్స్‌

కావలసినవి:
 ఉడికించిన స్వీట్‌ కార్న్‌ – ఒకటిన్నర కప్పులు+8 టేబుల్‌ స్పూన్లు, బంగాళదుంపలు – 2 (ముక్కలుగా కోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్‌, క్యాప్సికం – సగం, అటుకులు – 1 కప్పు (అప్పటికప్పుడు నీళ్లలో తడిపి, గట్టిగా పిండుకోవాలి), శనగ పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్ట్‌ – పావు టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, కొత్తిమీర తురుము – కొంచెం, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా మిక్సీ బౌల్‌లో ఉడికించిన ఒకటిన్నర కప్పుల స్వీట్‌ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,తడిపిన అటుకులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో శనగపిండి, అల్లం పేస్ట్,  పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు  వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె, మిగిలిన 5 గరిటెల స్వీట్‌ కార్న్, కారం, కొత్తిమీర తురుము వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమంలో 3 టేబుల్‌ స్పూన్ల స్వీట్‌కార్న్‌ వేసుకుని.. ఒకసారి పైపైన కలిపి, వడల్లా చేసుకుని నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. మిగిలిన స్వీట్‌ కార్న్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

బ్రింజాల్‌ రోల్స్‌

కావలసినవి: వంకాయలు – 4 పెద్దవి, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు చొప్పున (గార్నిష్‌కి అదనంగా), కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు (గార్నిష్‌కి అదనంగా), పుదీనా తరుగు – 1 టేబుల్‌ స్పూన్లు, బీట్‌ రూట్‌ తురుము – పావు కప్పు, బియ్యం రవ్వ – ముప్పావు కప్పు(ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి), ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌, నిమ్మరసం – 4 టేబుల్‌ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, వేరుశనగల పొడి – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండున్నర గరిటెల నూనె వేసుకుని వేడి కాగానే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, బీట్‌రూట్‌ తురుము, టమాటా ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, వేరుశనగల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆలివ్‌ నూనె, నిమ్మరసం వేసుకుని బాగా తిప్పుతూ ఉండాలి. చివరిగా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత వంకాయలను పొడవుగా (థిన్‌ స్లైస్‌లా) కట్‌ చేసుకుని, నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని, అందులో కొద్ది కొద్దిగా ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకోవాలి. ఊడిపోకుండా సన్నని పుల్ల అడ్డంగా గుచ్చుకుని తీనేటప్పుడు ఆ పుల్లని తొలగించుకోవచ్చు. వీటిని కొత్తిమీర తరుగు, టమాటా ముక్కలతో లేదా ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top