వివరం: వివేకపు మూటలు.. (అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)

వివరం: వివేకపు మూటలు.. (అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం) - Sakshi

అక్టోబర్ 1న ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’

వృద్ధుల కోసం సాక్షి హెల్త్ ప్రత్యేక కథనం

మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు. మన పెద్దలు. వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుంది; ఆలోచన ఉంటుంది;  తమదైన దృష్టికోణం ఉంటుంది. గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తూ వర్తమానంతో జరిపే సంభాషణ వాళ్ల జీవితసారం. అయినప్పటికీ చరిత్రలో వయోధికులకు అందాల్సినంత ఆదరణ అందిందా? వర్తమానం సంగతేమిటి? 
 
ప్రాచీన కాలంలో రోమ్‌లో ఒక సామెత వాడుకలో ఉండేదట: అరవై దాటిన వాళ్లను వంతెన మీంచి కిందికి తోసేయాలి. రేపు మన జీవితం ఏమిటో గుర్తెరగనివ్వని యవ్వనపు మిడిసిపాటులోంచే ఇలాంటి క్రూరమైన సామెత పుట్టివుంటుంది. నిజంగా కూడా చరిత్రలో వృద్ధుల పట్ల ఇలాంటి ఘోరాపచారాలు జరిగివుంటాయా?
 
డిజ్-ఆనర్ కిల్లింగ్
‘ఎనభై దాటిన తరువాత అంతకుముందు చాలా సులభంగా కనబడే చాలా పనులు చాలా కష్టమైపోతాయి,’ అంటారు యాన్ మిర్డాల్. స్నానం చేయడం కష్టం, గట్టి మూత తీయడం కష్టం, మెట్లు ఎక్కడం కష్టం, అసలు నడకే కష్టం; ఒక్కోసారి సొంతంగా పూర్తి పక్కకు తిరిగి పడుకోవడం కూడా కష్టం కావొచ్చు. అలాంటి వయసులో మిర్డాల్ తన ‘భారత్‌పై అరుణతార’ రచన కోసం స్వీడన్ నుంచి వచ్చారు. చెట్టు, పుట్ట దాటుతూ దండకారణ్యం తిరిగారు. వృద్ధాప్యాన్ని గౌరవించి, తన దేహ ధర్మాల విషయంలో సహకరించిన కామ్రేడ్స్‌ను ప్రశంసిస్తూ, దేశాల మధ్య ఉండే సాంస్కృతిక తేడాల గురించి ప్రస్తావించారు.

అమ్మో.. అదేం దురాచారం 

స్వీడన్‌లో అందరికందరూ విశ్వసించే నమ్మకం ఒకటుంది. గతంలో వృద్ధులను వారి కుటుంబ సభ్యులు ఒక కొండమీదిదాకా నడిపించుకుంటూ వెళ్లేవారట. కొండ అంచు నుంచి ఆ వృద్ధులు వారైనా దూకేసేవారట, లేదా, కుటుంబ సభ్యులైనా తోసేసేవారట. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పని చేసేవారు గనుక, ఏ ఒక్కరికీ వ్యక్తిగత అపరాధ భావన ఉండేది కాదట.’ అలాగే, ఇంట్లో వృద్ధుడో, వృద్ధురాలో పనిచేయలేని వయసుకు చేరితే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పొడవాటి కర్ర ఉన్న గదలాంటి దానితో మోది తల పగలగొట్టేవాళ్లట! ఇలాంటి దురాచారమే జపాన్‌లోనూ ఉండేదట. వయసు మళ్లినవాళ్లను సుదూర ప్రాంతంలోని ఏ కొండమీదకో తీసుకెళ్లి, వారిని అక్కడే వదిలేసి వచ్చేవాళ్లట.
 
పొరుగున ఉన్న దురాచార పురుగు

స్వీడన్‌లో ఉన్న ఒళ్లు జలదరింపజేసే దుస్సంప్రదాయం మన పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ ఉండటం దారుణం. ఆయిల్ బాత్ చేసిన రోజున కొబ్బరినీళ్లు తాగొద్దని అక్కడి పిల్లలకు పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే విచిత్రంగా ఇదే మరో రీతిలో అమలవుతూ ఉంటుంది. ఉదయాన్నే వయసు ఉడిగిన పెద్దవారి ఒంటికి బాగా నూనె మర్దించి స్నానం చేయిస్తారు. ఇక ఆ రోజంతా చల్లటి కొబ్బరినీళ్లు తాగిస్తూ ఉంటారు. దీనివల్ల మూత్రపిండాలు పనిచేయవు, శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది, ఫిట్స్ రావొచ్చు, ఒకట్రెండు రోజుల్లో విపరీతమైన జ్వరం వచ్చి దుర్బల శరీరమున్న ముసలివాళ్లు కాలం చేస్తారు. ‘తలైకూతల్’ అని పిలిచే ఈ సంప్రదాయ హత్యాకాండ దక్షిణ తమిళనాడులో కొనసాగుతోందంటూ, 2010లో ప్రసార మాధ్యమాల్లో గగ్గోలు జరిగింది. అక్కడి ముసలివాళ్లు కూడా ఇంతకంటే మరో దారి లేదన్నట్టుగా ఆ సంప్రదాయానికి అంగీకరించడం పేదరికం తెచ్చిపెట్టిన దుర్మార్గం తప్ప మరొకటి కాదు. పిల్లలే వాళ్ల జీవితాలకోసం పోరాడుతుంటే మేమెందుకు వారికి బరువు కావడం, అని అక్కడి ముసలమ్మలు చెప్పడం కలిచివేసే విషయం. కులానికో మతానికో సంబంధమైనదిగా కాకుండా, నేరానికీ పేదరికానికీ మధ్య ఉన్న సన్నటి రేఖగా అక్కడి వారు ఆ దురాచారాన్ని పరిగణించడం గమనార్హం.
 
ఉత్పత్తి వర్సెస్ వివేకం

బలవంతంగా వృద్ధుల మరణాన్ని ప్రోత్సహించే ‘సెనిసైడ్’ ప్రపంచంలో ఏదో మూల ఏదో రూపంలో కొనసాగింది. దానికి ముఖ్యం కారణం వారిని అన్‌ప్రొడక్టివ్‌గా భావించడమే! అనారోగ్యం తలెత్తే వయసులో, ఎముకలు పటుత్వం కోల్పోయే వయసులో ఇది పీడ మీద పీడ. కోతికీ, ఏనుగుకూ ఒకే పరీక్ష పెట్టే సమాజంలో వాళ్లు చెట్లు ఎక్కకపోవచ్చు. కానీ శారీరక శక్తికి మించిన ఎన్నోరెట్ల వివేకాన్ని పంచగలరని ఈ కథ చెబుతుంది.

ఈ కథ చదివి బుద్ధి తెచ్చుకోండి

ప్రాచీన కాలంలో ఒక రాజు ఇలాగే ముసలివాళ్లందరూ ఎందుకూ కొరగాని వాళ్లని తలచి, అందరినీ నిర్మూలించడానికి ఆదేశాలు ఇచ్చాడు. దేశంలో ముసలివాళ్లంటూ లేకుండాపోయారు. అయితే, ఒక మనవడికి మాత్రం వాళ్ల తాతంటే ప్రాణం. సైనికుల కంటబడితే ఎక్కడ చంపుతారోనని తాతను అటక మీద దాచాడు. ఇరుగు పొరుగు వారు గమనించకుండా అన్నం నీళ్లు అందిచ్చేవాడు. కొంత కాలం గడిచాక రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆహార నిల్వలు అడుగంటాయి.
 
ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. పంట వేద్దామన్నా గుప్పెడు ధాన్యపు గింజలు లేని కరువు. ఇదే సంగతి యువకుడు తాతకు చెప్పాడు. ఆ తాత ఆలోచించి ఒక సలహా ఇచ్చాడు. ఇంటి పైకప్పుగా వేసిన గడ్డికట్టలు మొత్తం కిందికి దించి దులిపి చూడు; ఎక్కడైనా ఒక తప్పుడు గింజ ఉండకపోదు, అన్నాడు. మనవడు అలాగే చేశాడు. గింజలు రాలిపడ్డాయి. వాటిని పొలంలో జల్లాడు. తెల్లారే సరికల్లా అవి పెరిగాయి, తర్వాత కంకులు వేశాయి. రాజుకు విషయం తెలిసి ముందు సంతోషించినా, చట్ట ధిక్కారానికి వివరణ అడిగాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మనవడు. వాళ్ల ప్రేమకు, అది చేయించిన సాహసానికి, వృద్ధుడు కనబరిచిన వివేకానికి ఆశ్చర్యపోయి, తన తప్పు తెలుసుకొని, బతికినంత కాలం మనుషుల్ని బతకనిచ్చేలా చట్టానికి సవరణ చేశాడు.
 
వృద్ధ విజేతలు

ఉత్పత్తి అనగానే, ఏ కర్మాగారంలోనో చెమటలు కక్కుతూ పనిచేయడం అనుకుంటాం. అది ఉత్పత్తే అయినా, అది మాత్రమే ఉత్పత్తి కాదు. ప్రపంచ ప్రసిద్ధ చాలా ‘ఉత్పత్తులు’ వయసు తెచ్చిన అనుభవసారంలోంచి పుట్టాయి. సోఫోక్లిస్ తన ప్రసిద్ధ నాటకం ‘ఈడిపస్ ఎట్ కొలొనస్’ రాసినప్పుడు ఆయనకు 89 ఏళ్లు. ‘వెన్ వి డీడ్ అవేకెన్’ సృజించినప్పుడు హెన్రిక్ ఇబ్సెన్ ఏడు పదులు దాటాడు. హైడ్రోఫాయిల్ బోట్‌కు సంబంధించిన పేటెంట్ అందుకునేప్పటికి గ్రాహంబెల్ 75లో పడ్డాడు. ‘వై షి వుడ్ నాట్’ నాటకాన్ని తన 94వ ఏట లిఖించాడు జార్జ్ బెర్నార్డ్ షా. ‘ఇన్ ద క్లియరింగ్’ కవితా సంకలనం అచ్చు వేసినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ 88 ఏళ్ల వృద్ధుడు. జాన్ మిల్టన్ తన 63వ ఏట ‘ప్యారడైజ్ రీగెయిన్డ్’ రాశాడు. నో వెబ్‌స్టర్ తన సుప్రసిద్ధ డిక్షనరీని సంకలనం చేసింది ఏడు పదుల వయసులోనే. అంతెందుకు, ప్రపంచ ప్రసిద్ధ రచన ‘డాన్ కిహోటి’ రాసినప్పుడు సెర్వాంటెజ్ వయసు 70. ప్రపంచ రాజకీయాల్ని, పరిణామాల్ని శాసించేది కూడా వృద్ధులు కాక మరెవరు!
 
వృద్ధ హిత సమాజం కావాలి!

మనదేశంలో 7.7 కోట్ల వృద్ధులు ఉన్నారని ఒక లెక్క. 2025 నాటికి ఇది 17.7 కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో 90 శాతం మంది అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్నారు. 40 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 75 శాతం గ్రామీణులు. 55 శాతం మహిళలు భర్తను కోల్పోయిన ఒంటరులు. వ్యవసాయ కూలీలు, రిక్షా నడిపేవాళ్లు, కూరగాయలు మోసుకుంటూ వచ్చేవాళ్లు, దుకాణాల్లో గుమస్తాలు; వెంట్రుకల్లో నలుపు మాయమైనట్టుగానే ఎముకల్లో పటుత్వం పోయినా, చివరి రక్తపు బొట్టు వరకు వీరంతా రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి రావడం హృదయం ద్రవించే విషయం. వృద్ధుల హిత విధాన నిర్ణయాలతో పాటు, సమాజం వారి పట్ల మరింత సున్నితం కావడం అవసరం.
 
రెండో బాల్యం

పేదరికం ఒక సమస్య అయితే, ఉన్నట్టుండి జీవితం చేజారిపోయినట్టవడం, కాలం ఎలా గడపాలో తెలియకపోవడం మరో రకమైన బాధలు! చేతిలోంచి అధికారం జారిపోవడం, డబ్బులు వచ్చే మార్గం ఆగిపోవడం, రోజూ అలవాటుపడిన ఆఫీసు, పనిస్థలం ఒక్కసారిగా పరాయిది కావడం పెద్దవారికి మింగుడుపడని అంశాలు. ఇలాంటి సందర్భంలో ఇంట్లోవాళ్లు మరింత ఎక్కువ శ్రద్ధ కనబరచాలి లేదూ మామూలుగా ఉన్నా నయమే.

ఆధ్యాత్మికం.. ఉత్తమ మార్గం 

ఏ యోగా క్లాసుకో వెళ్తూనో, ఏ లాఫింగ్ క్లబ్బులోనో పొట్ట పట్టుకుంటూనో, ఏ అమర్‌నాథ్‌కో ప్రయాణం కడుతూనో రిటైర్డ్ ఉద్యోగులు కనబడతారు. కానీ ఎన్నాళ్లు? ఉదయాన వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రాణం ఏమీతోచక పిచ్చెక్కిపోతోందనుకోవడం వింటూ ఉంటాం. ఎంతసేపటికీ పాడైన మిక్సీ రిపేర్ చేయించడంతోనో, కరివేపాకు ఎవరు తెంపుకెళ్లారో ఆలోచించడంతోనే సరిపోతుంది. బహుశా అందుకే పాతకాలం నుంచీ వానప్రస్థం ద్వారా కుటుంబంతో డిటాచ్‌మెంట్ పెంచి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టడం నాణ్యతతో కూడిన పొద్దుపుచ్చడం కోసమేనేమో!
 
చిత్రకారిణి నానమ్మ
శారీరకంగా వృద్ధాప్యంలో ప్రతికూలతలు ఉండొచ్చుగాక; నిజమైన జీవితాన్ని ఆనందించే వయసు కూడా ఇదేనేమో! బాదరబందీలు అన్నీ తీరిపోయి, తమ ఆలోచనల పట్ల తాము దృష్టి కేంద్రీకరించగలిగే వయసు, తీరిక ఒక వయసు దాటాకే లభిస్తుంది. అందుకే లోపలి కొత్త శక్తులను రాబట్టుకోవడానికి మలిదశ జీవితాన్ని ఉపయోగించుకోవడం విలువైన వ్యాపకం కాగలదు. అనా మేరీ రాబర్ట్‌సన్ మోజెస్ తన 76వ ఏటగానీ కుంచె పట్టుకోలేదు. ఈ అమెరికా బామ్మ యౌవన కాలమంతా పొలాల్లో పనిచేసింది. పెద్దగా చదువుకోలేదు. కళల్లో ప్రవేశం లేదు. అలాంటిది ఒకరోజు పెయింటింగ్ మీదకు ఆసక్తి మళ్లింది. పాతికేళ్లల్లో వెయ్యి చిత్రాలు గీసింది. బాల్యం, పంటపొలాలు, మంచు కురియడం లాంటివి ఆమె థీమ్స్. ఆమె చిత్రకళ క్రమంగా గుర్తింపుపొందింది. మ్యూజియమ్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శితమైంది. 101 ఏళ్ల వయసులో ఆమె మరణించినప్పుడు జాన్ ఎఫ్ కెన్నెడీ నివాళి ప్రకటించారు. బీజం అంటూ లోపల ఉండాలేగానీ, అది మొక్కవడానికి వయసు అడ్డంకి కాదు!
 
సీసీ టు ఫాదర్

బహుశా వయసు మళ్లాక మాత్రమే అర్థమయ్యే విషయం, వినేవాళ్లను కోరుకోవడం. పెద్దలు చెప్పేది మనస్ఫూర్తిగా వినడం వారి కడుపు నింపుతుంది. వాళ్ల మీదుగా వ్యవహారాన్ని నడపడం, మెయిల్‌లో ‘సీసీ’ పెట్టినట్టు ప్రతి కీలక విషయాన్ని వారికి తెలియజేస్తుండటం, వయసు మాత్రమే తేగలిగే అనుభవసారంతో వాళ్లు ఇచ్చే సలహాలను స్వీకరించడం వారి గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. పాత బియ్యం ఎక్కువ సాగుతాయి. వృద్ధులు మరింత రుచికరమైన జీవితానుభవాలతో పండిపోయివుంటారు. యువతరానికి  వాళ్లు అందివ్వగలిగేది ఈ ఆలోచనానిధే! ఎంత తవ్వుకుంటే అంత ఉపయోగం. ‘నేను ఎంతకాలం బతుకుతూ ఉంటే, జీవితం అంత అందంగా తయారవుతూ ఉంది’ అన్నాడు ఫ్రాంక్ లాయిడ్ రైట్. పెద్దవాళ్లు ఎంతకాలం ఉంటే, అంతకాలం మన జీవితం ఆనందమయం అవుతూ ఉంటుంది.76వ యేట నుంచి పెయింటింగ్ ప్రాక్టీస్ చేసి కీర్తిని గడించిన అనా మేరీ రాబర్ట్‌సన్
 
వయసెరుగని విన్యాసాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినవారిలోకెల్లా వయసులో పెద్దవారు కత్సుసుకె యనాగిసావా (జపాన్). 1936లో జన్మించిన యునాగిసావా ఉపాధ్యాయులు. 2007 మేలో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు ఆయన సంకల్పానికి తలవంచింది. అప్పుడు యునాగిసావా వయసు 71 ఏళ్లు.

ప్యారాచూట్ జంప్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది ఎస్ట్రిడ్ గీర్ట్‌సన్(డెన్మార్క్) అనే బామ్మ. 1904 లో పుట్టిన గీర్ట్‌సన్ వందవ ఏట 2004లో నాలుగు కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఈ విన్యాసం చేశారు.

ఫిలిప్ రాబినోవిట్జ్‌ను ఫ్లైయింగ్ ఫిల్ అంటారు. ఈ దక్షిణాఫ్రికా వృద్ధుడు తన 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుపందాన్ని 30.86 సెకన్లలో పూర్తిచేశారు. ఇది ఆ వయసులో వరల్డ్ రికార్డ్. ప్రస్తుత ప్రపంచ పరుగు వీరుడు జమైకాకు చెందిన 23 ఏళ్ల ఉసేన్ బోల్ట్ ఈ దూరాన్ని పరుగెత్తిన కాలం 9.58 సెకన్లు. కానీ ఇది 23, అది 100!
 
భాగ్ ఫౌజా భాగ్

శతాధిక వృద్ధుడిగా ఒక మారథాన్‌ను పూర్తిచేసిన ఘనత ఫౌజా సింగ్‌కు దక్కింది. బ్రిటన్‌లో స్థిరపడిన ఈ పంజాబీ సర్దార్ ఈ అంశంలో వరల్డ్ రికార్డ్ స్థాపించాడు. 2003లో జరిగిన లండన్ మారథాన్‌ను 6 గంటల్లో పూర్తిచేశాడు. 2004లో అడిడాస్ షూ కంపెనీకి డేవిడ్ బెక్‌హమ్, మహమ్మద్ అలీ లాంటివాళ్లతో కలిసి మోడల్‌గా చేశాడు. 1911లో జన్మించిన ఫౌజా 2011లో టోరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌ను పూర్తిచేసిన కాలం 8గం. 25ని. 18సె. అన్నట్టూ, మారథాన్‌లో పరుగెత్తాల్సిన దూరం 42 కిలోమీటర్లు. ఆసక్తికర విషయం ఏమిటంటే, చిన్నతనంలో పరుగుపందెపు అనుభవమున్నా ఫౌజా దాన్ని సీరియస్‌గా సాధన మొదలుపెట్టింది తన 83వ ఏటే!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top