
ఎందుకు వలచేవో...ఎందుకు వగచేవో!
శరత్‌బాబు, సుజాత, సరిత ముఖ్య తారలుగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘గుప్పెడు మనసు’. మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసిన అద్భుతమైన పాటల్లో ఒకటైన ‘మౌనమే నీ భాష...
శరత్‌బాబు, సుజాత, సరిత ముఖ్య తారలుగా కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘గుప్పెడు మనసు’. మనసు కవి ఆచార్య ఆత్రేయ రాసిన అద్భుతమైన పాటల్లో ఒకటైన ‘మౌనమే నీ భాష...’ ఈ చిత్రం లోనిదే. ఈ పాటతత్వం గురించి యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాటల్లో.....
ఈ పాటలో మనిషి మనసు గురించి, మనస్తత్వం గురించి, జీవిత తత్వం గురించి చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితానికీ, వాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలకూ ఈ పాటలోని తత్వం దగ్గరగా ఉంటుంది. హ్యూమన్ థింకింగ్, ఫిలాసఫీకి ఓ పాఠ్య పుస్తకం లాంటిదీ పాట. కర్మ–యోగి తత్వం తరహాలో ఉంటుంది.
పల్లవి:
మౌనమే నీ భాష.. ఓ మూగ మనసా (2)
తలపులు యెన్నేన్నో కలలుగా కంటావు (2)
కల్లలు కాగానే కన్నీరవుతావు ‘‘మౌనమే నీ భాష..‘‘
నిజమే... మనతో, ప్రతి మనిషితో తన మనసు మౌనంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే... మనసుకి భాష లేదు గనుక. కానీ, భావోద్వేగాలు మాత్రం బోలెడు. సంతోషం, దుఃఖం, నిరాశ, కోపం... మన మనసులో ఎన్నెన్నో భావోద్వేగాలు. మనసు మనిషితో మాట్లాడినప్పుడు ముఖంలో భావోద్వేగాలన్నీ బయటకొస్తాయి. ఈ తత్వాన్ని పల్లవిలో ఎంతో అందంగా చెప్పారు. ముఖ్యంగా పల్లవిలో చివరి రెండు లైన్లు నాకు బాగా ఇష్టం. ఉదాహరణకు... ప్రతిరోజూ ఎన్నో అంచనాలతో ఏదో జరుగుతుందనే ఆశతో మనమంతా పనులు ప్రారంభిస్తాం. ఆశించినది జరగని పక్షంలో నిరాశకు లోనవుతాం. కలలు కల్లలు కాగానే కన్నీరవుతావని ఆత్రేయగారు ఎంతో అద్భుతంగా చెప్పారు.
చరణం 1:
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు (2)
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో (2)
‘‘మౌనమే నీ భాష..‘‘
ఈ చరణంలో మనసును నాటక రంగంతో పోల్చడం టిపికల్ కాయినింగ్. మది (మైండ్), మనసు (హార్ట్).. రెండిటి గురించీ చెప్పారు. నాటకాన్ని ఎప్పుడైనా చూశామనుకోండి... రకరకాల పాత్రలు వచ్చి వెళ్తూ ఉంటాయి. కానీ, రంగస్థలం మారదు. మన మనసులోనూ అంతే. ఎన్నెన్నో కోరికలు.. ఒక్కోసారి ఒక్కో కోరిక వచ్చి వెళ్తుంది. ఒకదానితో పొంతన లేని మరో కోరిక తర్వాత వస్తుంటుంది. ఓ డైరెక్షన్ అంటూ ఏమీ ఉండదు. తెగిన గాలిపటంలా ఏటో పయనిస్తుంది. సాధారణంగా మన మనసే హృదయ స్పందనలను నిర్ణయిస్తుందనీ, తద్వారా మది నడుచుకుంటుందనీ చెబుతారు. కానీ, మైండ్‌కి లాజిక్ కావాలి. మనసుకు ప్రేమ, ఫీలింగ్స్ సరిపోతాయి. బహుశా... ఆత్రేయగారు అది ఆలోచించే మనసు ఎందుకు వలచేవో, వగచేవో, రగిలేవో అన్నట్టున్నారు.
చరణం 2:
కోర్కెల సెల నీవు.. కూరిమి వల నీవు (2)
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
‘‘మౌనమే నీ భాష..‘‘
మన మనసు నిజంగా మాయల మహమ్మారి. ఊహాలోకంలో విహరించే వయ్యారి. ఎప్పుడూ ఉన్నదానితో సంతృప్తి చెందదు. దాన్ని వదిలేసి, లేనిదాన్నేదో కోరుతుంది. ఆ కోరికలు ఒక్కోసారి మనల్ని కూరిమిలోకి నెట్టేస్తాయి. ఒక్క తప్పు చేస్తే.. సరిదిద్దుకోడానికి కొన్నేళ్లు పడుతుందనే భావాన్ని ఈ చరణంలో చెప్పారు. మన గురించి, మన మనసు గురించి తెలుసుకోవడమే ఈ పాట అర్థమని నాకు అనిపిస్తుంటుంది.
ఈ పాటలోని సాహిత్యం వినడానికి కవితాత్మకంగా అనిపించినా... మన మనసు కనులు తెరచి చూస్తే అంతులేని అర్థం ధ్వనిస్తుంది, కనిపిస్తుంది. భగవధ్గీత, బైబిల్, ఖురాన్... అన్నిటిలోనూ మనం ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అనే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి. మనిషి జీవిత గమనానికి మార్గదర్శిగా నిలిచాయి. కానీ, ఈ పాటలో భావం, తత్వం అందరికీ అర్థమయ్యేలా గొప్పగా ఉంటుంది.
నేను సంగీత దర్శకుణ్ణి కాబట్టి ప్రతి పాటలోనూ ఎక్కువగా సంగీతం, స్వరం గురించి ఆలోచించేవాణ్ణి. కానీ, ఈ పాట విన్న తర్వాత ఎవరు రాశారో తెలుసుకోవాలనుకున్నా. అప్పట్నుంచీ ఆత్రేయగారికి పెద్ద అభిమానినయ్యా. బాలమురళీగారు పాడిన విధానం గానీ, ఆత్రేయగారు రాసిన విధానం గానీ, ఎమ్మెస్ విశ్వనాథన్‌గారి బాణీ గానీ మహాద్భుతం అనే చెప్పాలి. ముగ్గురు లెజెండ్స్ కలసి చేసిన ఈ పాటను కొన్నివేల సార్లు విన్నాను.
నాకు ఆత్రేయగారన్నా, ఈ పాటన్నా నాకు ఎంత అభిమానమంటే... నేను సంగీతమందించిన ‘వెళ్లిపోమాకే’ సినిమాలోని ఓ పాటలో ‘ఓ మూగ మనసా..’ అనే పదాన్ని హుక్‌లైన్‌గా తీసుకున్నా. ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు ‘ఓ మూగ మనసా’ని నేనే కాయినింగ్ చేశా. ఈ పాటలోని లిరిక్స్ సారాంశం తీసుకుని ఆ పాట చేశా.
నాలో ఈ పాట అంత స్ఫూర్తి నింపింది. ఇటీవల విడుదలైన ‘వెళ్లిపోమాకే’ పాటలకు, ముఖ్యంగా ‘ఓ మూగ మనసా’ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంటే హ్యాపీగా ఉంది. ఇప్పుడు పందిపిల్లతో దర్శకుడు రవిబాబు తీస్తున్న ‘అదిగో’, శ్రీవిష్ణు హీరోగా రాజ్‌కందుకూరి నిర్మిస్తున్న ‘మెంటల్ మదిలో’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను.
సంభాషణ: సత్య పులగం