అతడు గోదారి ఎదురీదాడు

Funday story of the week - Sakshi

ఈవారం కథ

రేయ్‌... ఆగండి.... ఎంత దూరమని పరుగులెడతారు. చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకు రావాల్సిందే కదా. వయసు తాపాలు వద్దు, ప్రేమ పాశాలు వద్దు. మోహాలు...ప్రేమలు ...వద్దు. జీవించడం ప్రధానం. వేట కొడవళ్ళు కక్కుళ్ళు పెట్టి నునుపుదేరి ఉన్నాయి. గండ్ర గొడ్డళ్ళు కొలిమిలో కాగి కాగి పదునుతేరి ఉన్నాయి. దానికి తోడు అడ్డంగా నరికేసే ఆత్మాభిమానాలున్నాయి. కుల జాడ్యాలున్నాయి. కాస్త నిగ్రహం పాటించండి, లోకం మారే దాకా, జనం జట్టు కట్టే దాకా. అయినా...ఆగరా...మీ మాట మీదేనా...ఎవరి మాటా వినరా....అయితే ...అయితే.... మీ ఇష్టం...మీ ప్రారబ్ధం.  గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పడవ అటూ ఇటూ ఊగుతోంది. ఎదురీదుతున్నట్లుగా సాగుతోంది.   కాసేపు ఎండా మరికాసేపు వాన. వాతావరణం గమ్మత్తుగా ఉంది. ఇది విహారం కాదు. వేట ముఖ్యం. బతుకు తెరువు ముఖ్యం. బండి లాగించడం ముఖ్యం. ముగ్గురున్నారు పడవలో. రామచంద్రం, సత్య, శివుడు.దూసుకెళ్తున్న పడవ నీటిని అడ్డంగా కోస్తూంది. నీటి ముక్కలు తెల్లటి నురగలుగా తెగి పడుతున్నాయి. చితికి పరిగెలు ఎగిరెగిరి పడుతున్నట్టుగా ఉంది. దూది పింజెలు చెల్లాచెదురుగా ఎగురుతున్నట్టుగా ఉంది.   శివుడు తదేకంగా చూస్తున్నాడు. అమ్మా నాన్నలతో యుద్ధం చేసి వచ్చాడు వేటకు. పెద్ద పేచీ పెట్టి పంతం నెగ్గించుకుని వచ్చాడు. సరదా తీరింది. కళ్ళు సలుపుతున్నాయి. కాళ్ళు నెప్పెడుతున్నాయి. 

ఉన్నట్టుండి ఆకాశంలో గురక పెడుతున్న చప్పుడు. అల్లంత దూరాన  విమానం. తడిగా ఉన్న లాగు ఒంటి మీద ఉండగానే పిండుకున్నాడు. చూపు మాత్రం ఆకాశం పైనే. సరిగ్గా నెత్తి మీదకు రాగానే అడిగాడు.‘‘అందులో నిజంగా మనుషులుంటారా? భయం ఉండదా? నేనెప్పుడైనా అలాంటి పడవలో ఎక్కి కూర్చుంటానా? ’’ ‘‘అది పడవ కాదురా ..ఇమానం...ఇమానం. ఒరేయ్‌... నాయనా... లాగు విప్పేసి పిండుకోరా... గోదారి మధ్యలో ఉన్నాం. నీకేటి సిగ్గు? ఇందాకటి పాడు వాన... సడీ సప్పుడు లేకుండా వచ్చి కుమ్మరించేసింది... ముందా బట్టలిప్పుకో... ప్రతి దానికీ తయారవుతావు. సెప్పింది ఇనవు కదా ’’ అని విసుగ్గా అంది సత్య.‘‘విమానమని నాకు తెల్దేంటీ? ఊరికే పడవన్నాను’’ చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు శివుడు. దూరంగా చిన్న చుక్కలా కనిపిస్తోంది విమానం. బొటనవేలు, చూపుడువేలు గుండ్రంగా చుట్టి అందులోంచి విమానం చుక్కను చూస్తున్నాడు శివుడు. చిన్నగా ఉంది. అమ్మ చేత ఇక బతిమాలించుకోలేదు. గబగబా బట్టలు విడిచి దిశమొలతో నిలబడ్డాడు. ఈసారి ఆకాశంలో బారులు కట్టిన పక్షులు. వాటికేసి చూస్తూ అలాగే నిలబడ్డాడు. ‘‘ఈవేళ్టికి చాల్లే సంబడం. బేగి తెవిలితే మంచిది. ఈయేళ అచ్చి రాలేదు. సేపలు గీపలు లేవు గానీ కాళ్ళు తీట పుడుతున్నాయి. పొద్దెక్కింది. ఇక వెనక్కి తిప్పు....’’ మొగుడుతో అంది సత్య. గొంతులో నిరాశ. చెంబు లోంచి మంచినీళ్ళు గొంతు లోకి వొంపుకుంది. 

‘‘వండుకున్నమ్మ తినక మానదు. కడుపుతో ఉన్నమ్మ కనక మానదు. ఇంటికి పోక ఇక్కడే నీటిలో గుండ్రంగా తిరుగుతూ ఏటెల్ల కాలం ఉండిపోతామా, ఏటి? వొక అంచు వలేసి చూద్దారి...కంగారు పడితే ఎలా? కాసింత నిదానం ఉండాలి’’ అన్నాడు రామచంద్రం చుట్టూ గోదారిని నిశితంగా చూస్తూ. శివుడు ఒబ్బిడిగా వల పట్టుకుని అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకో వాడికి ఇప్పటికిప్పుడే ఇంటికి వెళదామని లేదు. మళ్ళీ ఎప్పటికో గానీ తీసుకెళ్ళరు. ‘‘మనోడు గట్టోడే. ఏదైనా అంటే చాలు చిటికెలో తయారయిపోతాడు. అయినా గానీ సేప పిల్లకి ఈత నేర్పాలా?’’‘‘అసుమంటి కబుర్లు చెప్పమాకు. నా కొడుకు ఈ పని సస్తే చేయడు. సక్కగా సదువుకుని కలకటేరు అవుతాడు...ఏరా అబ్బిగా....’’ అంది మురిపెంగా సత్య కొడుకు కేసి చూస్తూ. తలూపాడు శివుడు. ఎండలో మెరుస్తూ రోడ్డు మీద గాంధీ వేషం వేసుకున్న కుర్రాడిలా ఉన్నాడు శివుడు. ‘‘రోజులీయాల్లా ఉండవులే... మనోడికి సదువొచ్చి మీద పడాలే గానీ  నేనేమైనా కాదంటానా?’’ వలలో ఏదో పడినట్లుగా బరువుగా తోచి ‘‘ఇలా రాయే....’’ అంటూ అరిచాడు రామచంద్రం. పడింది పండుగొప్ప. అనుకోని అదృష్టం. ‘‘బాబిగాడొచ్చిన యేలా విసేసం’’  శివుడు ఆసక్తిగా చూస్తున్నాడు. సత్య ఆశగా చూస్తోంది. రామచంద్రం తృప్తిగా చూస్తున్నాడు. గోదారి పాయ.దక్షిణం నుండి ఉత్తరం వైపుకు పారే కోరింగ నది. ఉధృతంగా పరవళ్ళు తొక్కుతూ విశాల ఆవరణంలోంచి సన్నని ఇరుకు సందులోకి వచ్చి గడిబిడిగా... పరుగులు తీస్తోంది. దాని వేగం భయం కలిగించేలాఉంది. కట్టలు తెంచుకుని ప్రవహిస్తే ఇంక ఏమైనా ఉందా? నదీ పాయ దిగువన మంచి పారు మీద వరిచేలున్నాయి. పొట్ట మీద ఉండి ఆకుపచ్చని తివాసీ పరిచినట్లుండే పొలాలు ఏమౌతాయో? ముంపుకు గురయితే నీరు దిగే అవకాశం లేని పంట పొలాల గతి ఊహించడం కష్టం.

 నీటిని కట్టడి చేయడానికి పెద్ద పెద్ద తలుపులు బిగించి టైడల్‌ లాక్‌ ఏర్పాటు చేశారు. ఏ కారణం చేతనైనా అవి కొట్టుకుని పోతే తప్ప ప్రస్తుతం ఇబ్బంది లేదు. దానికి సమీపంలో మర్రిచెట్టు. దాని చుట్టూరా సిమెంటు చప్టా కట్టారు. ఊళ్ళో జనం ఊసులాడుకోడానికి అనువైన అడ్డా అది.  సాయంత్రం సమయంలో అంతా చేరతారు భైరవస్వామి కబుర్లూ, కతలూ వినడానికి. అర్ధరాత్రి దాక ఒకటే కబుర్లు. ఊళ్ళో విషయాలన్నీ వాళ్ళకే కావాలి. భైరవస్వామి వయసు ఎనభై ఏళ్ళు. ఎర్రగా ఉంటాడు. తెల్లటి జుట్టు. పొట్టిగా ఉంటాడు. గట్టివాడే. హుషారుగా మాట్లాడతాడు.  మాటల పోగు. మనిషిలో దిగులుండదు. సమస్యలున్నట్టు అనిపించదు. ఒకవేళ ఉన్నా తెలియనీయడు. లౌక్యం తెలిసినవాడు. చెట్టు మొదలు గోనెసంచి పరుచుకుని కూర్చుంటాడు భైరవస్వామి. పొగాకు కాడ చీల్చి చుట్టలు చుట్టుకుంటాడు.నోరు ఊరుకోదు. అనుభవం రంగరించి లోకం తీరు గురించి మనుషుల మనస్తత్వాల గురించి చెబుతాడు.  మంచీ చెడూ మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడానికి ప్రయత్నించడు. కానీ కోపం వస్తే పట్టుకోలేం.వీరావేశంతో ఊగిపోతాడు. ఊళ్ళో వాళ్ళు భైరవస్వామిని  గౌరవిస్తారు. శ్రద్ధగా వింటారు. దినపత్రికల్లో వచ్చే వార్తలు చదివి దేశంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా చెబుతాడు. టీవీ కథనాల గురించీ ముచ్చటిస్తాడు. జీవితమంతా నాగరిక ప్రపంచంలో మసిలి  వచ్చినవాడు. స్పష్టంగా  మంచి భాష మాట్లాడతాడు.     రచ్చబండకు దగ్గర్లోనే మహాప్రస్థానం పేరున శ్మశానం ఉంది. శవ దహనం సమయంలో అయితే భైరవస్వామి వేదాంత తత్వాలు పాడతాడు. జీవన సత్యాలు పలుకుతాడు. చావు పుట్టుకల మర్మం విప్పుతాడు. సాయం సంధ్య. చల్లగా గాలి వీస్తోంది. ఆవేళ భైరవస్వామి కాస్త నలతగా ఉన్నాడు. వచ్చీపోయే నాల్ని చూస్తూ కూర్చున్నాడు. అదే సమయంలో శివుడు ఆ దారిన వస్తున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. భైరవస్వామికి శివుడంటే చాలా ఇష్టం. అతడ్ని చూడగానే ఎక్కడలేని ఓపిక వచ్చేసింది. భైరవస్వామితాతకు తల వంచి నమస్కారాలు చెప్పి పాదాలు ముట్టుకున్నాడు శివుడు.

‘‘చాలా సంతోషం నాయనా... మీ నాన్న రామచంద్రం సంబరపడుతూ చెప్పాడు. వాడు ఎంతో ఇదిగా పొంగిపోతున్నాడు. బిడ్డల ఎదుగుదల తండ్రికి ఆనందమే కదా. వాడొక్కడితో సరిపోయిందా?  మన పేటోళ్ళంతా  గొప్పలు చెప్పుకుంటూ గెంతులేస్తున్నారు. ఇప్పుడేం చేస్తావు, బాబూ...’’ భైరవస్వామి కళ్ళలో వెలుగులు నింపుకుని అడిగాడు. ‘‘కోచింగు తీసుకుంటున్నాను, తాతా... ఐ.ఎ.ఎస్‌ రాస్తాను. మళ్ళీ ఊరికి రావడం ఇప్పట్లో కుదరదని అమ్మా నాన్నలను చూడ్డానికి వస్తున్నాను ’’ అన్నాడు వినయంగా శివుడు.భైరవస్వామి ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాడు. తల గోక్కున్నాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.భుజం మీద చేయి వేసి గుచ్చినట్టు గట్టిగా నొక్కి వదిలాడు. లోపలికి గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలాడు. తాత ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని అర్థమైంది శివుడికి. ఆయన చెప్పబోయే దానికోసం ఎదురుచూస్తున్నాడు.‘‘మన జాతిలో నీ అంత తెలివైనవాడు మరొకడు లేడురా... పదోతరగతి  మొదలు అన్నింటా మొదటోడిగా చదువుతున్నావు. నీవు అనుకున్నది కచ్చితంగా సాధించి తీరతావు. అందులో ఈసమెత్తు అనుమానం లేదు. కానీ... ఒరేయ్‌.... మీ నాన్న కష్టం చూడాలి. చేపల వేట గిట్టుబాటు కావడం లేదని నీకోసం రాత్రింబవళ్లు ఇసుక తవ్వుకి కూడా పోతున్నాడు. నిన్ను ప్రయోజకుడ్ని చేయాలనేది వాడి తాపత్రయం. మీ అమ్మా అంతే. వాళ్ళ కష్టం ఊరికే పోదు. ఇపుడు నీకో పాలి ఓ మాట చెప్పాలి... వింటావా? ’’ భైరవస్వామి అడిగాడు సూటిగా శివుడి కేసి చూస్తూ. ‘‘అలాగే చెప్పండి. పెద్దలు అంతా మంచికే చెబుతారు. చెప్పండి, తాతా? ’’ నవ్వుతూ అన్నాడు శివుడు. 

‘‘నన్ను అర్థం చేసుకోగలవు. ఆ జ్ఞానం నీకుందని నాకు తెలుసు. అందుకే చెబుతున్నాను. ఒరేయ్‌... శివుడూ... నీకెలాగూ మంచి ఉద్యోగమే తప్పక వస్తుంది. అది దేవుడు ఎప్పుడో రాసేశాడు. దానికి తిరుగులేదు. నువ్వు ఈ మట్టిలో పుట్టిన మాణిక్యానివి. అసలు సంగతేమిటంటే నీవు కులం లోని పిల్లనే పెళ్ళాడాలి. నిన్ను ఏ అగ్రకులం పిల్లో వల పన్ని ఎగరేసుకుపోకూడదు. నీ జీవిత వైభోగమంతా కులం పిల్లే పొందాలి. ఎవడైనా ఎదిగాక పుట్టినచోటునీ జాతినీ మరచిపోకూడదు రా..’’ అన్నాడు. అంత దాక ఆవహించిన నీరసం భైరవస్వామిలో ఇప్పుడు మచ్చుకి కూడా లేదు. ‘‘మీ మాటలు గుర్తుంచుకుంటాను, తాతా ... అయినా ఇంకా ఏమైంది... మొదటి మెట్టు మీదే ఉన్నాను’’ అంటూ లేచాడు శివుడు వెళ్లడానికి సిద్ధపడుతూ. ‘‘ఒక్క క్షణం ఆగు... కొన్ని వార్తలు వింటుంటే నా ఒళ్ళు కుతకుతలాడిపోతోంది. ఇంతకష్టపడి తీర్చిదిద్దుకున్న ఫలం ఇంకొకళ్ళు దోచుకుపోతుంటే నాలాంటి వాడు ఉసూరుమంటాడు. వెన్ను లోంచి బాధ తన్నుకొస్తాది ’’అంతలోనే భైరవస్వామి స్వరం మారింది. గొంతులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ‘‘అలాంటిది మన ఊళ్ళో జరిగితే ఊరుకునేది లేదు. కుల పంచాయితీ పెట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇదిగో అబ్బాయ్‌... ఆ తర్వాత బాధపడి ప్రయోజనం లేదు... నా మాటను వేళాకోళంగా తీసుకోవద్దు’’అన్నాడు. భైరవస్వామి అంతే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట్లాడే ధోరణి మారిపోతుంది. ‘‘అలాగే తాతా...’’ వినమ్రంగా అని శివుడు ఊరివైపుకు అడుగులేశాడు. పదడుగులేసి వెనక్కి తిరిగి చూశాడు.అక్కడున్న నలుగురూ చప్పట్లు కొడుతున్నారు. భైరవస్వామి తృప్తిగా తల ఎగరేసి నవ్వుతున్నాడు.  నాలుగేళ్ళ కాలం గిర్రున తిరిగిపోయింది. జాతీయ స్థాయిలో శివుడికి ఐదో ర్యాంకు వచ్చింది.దినపత్రికల మొదటి పేజీల్లో ఫొటోతో సహా ప్రముఖంగా ప్రచురించారు.  ఊరూ వాడా సంబరాల్లో మునిగిపోయింది. ఊరు కాంతి దిశదశలా వెలుగులు జిమ్ముతోంది. కొడుకు ఫొటో ఉన్న పేపరు చంకలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి చూపిస్తున్నాడు రామచంద్రం. విషయం తెలిసింది మొదలు మొగుడూ పెళ్ళాలు ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగానే ఉన్నారు. విలేకర్లు మూకుమ్మడిగా ఊళ్ళోకి వచ్చి ఏవేవే ప్రశ్నలు వేస్తున్నారు. ఉన్నంతలో మంచి బట్టలేసుకుని సమాధానాలు ఇస్తున్నారు. చిన్నప్పట్నుంచీ శివుడికి చదువంటే ఉండే శ్రద్ధ గురించి చెబుతున్నారు వాళ్ళదైన భాషలో.  ఊళ్ళో మనిషి కలెక్టరు కావడం అంటే మాటలా?  శిక్షణాకాలం పూర్తయ్యింది. 

మరో ఏడాదిన్నర ఇట్టే గడిచింది. ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన తర్పీదూ పూర్తయ్యింది. శివుడి ఆలోచనలు గోదారి తరంగాల్లా ఒకచోట నిలబడటం లేదు.  మాట్లాడేవాడెవరో తెలీదు. మాట్లాడుతున్నాడు.అంతలోనే పాట పాడుతున్నాడు. పాట సారాంశం ఏదో సందేశం ఇస్తున్నట్లుగానే ఉంది. మంద్రస్థాయిలో వినబడుతోంది. భాష మటుక్కి ఖచ్చితంగా తెలుగే. కాదు. మరేదో. అయినా భావం మాత్రం తెలిసిపోతోంది. ప్రత్యేకమైన వ్యక్తిలా ఉన్నాడు. దుస్తులు చిత్రంగా ఉన్నాయి. చిరిగిన బట్టల మీద మాసిన కోటు వేసుకున్నాడు. అయిదు అడుగులు కంటే పొడుగుండడు. దవడలు వేలాడుతున్నాయి. గెడ్డం  పెరిగి ఉంది. జుట్టు తైలసంస్కారం లేక అట్ట కట్టింది. కళ్ళజోడు ఉంది. వాటికి అద్దాలు లేవు. తనని చూసి దగ్గరకు వస్తున్నాడు. అయినా ఆనవాలు తెలియడం లేదు. చల్లని చూపు మెత్తగా తగిలింది. అది కొండంత అభిమానాన్ని చూపుతున్నది. ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాడు. సూటిగా కళ్ళలోకి చూస్తున్నాడు. ఉహూ(... గుర్తుపట్టడం కష్టంగానే ఉంది. అనునయంగా ఏదో చెబుతున్నాడు. ఒక్క ముక్క అర్థం కావడంలేదు. ముక్కు మీద వేలేసుకుని మంత్రాలు చదివినట్లుగా రాగం తీస్తున్నాడు. భుజం మీద చేయి వేశాడు. స్పర్శ గిలిగింతలు పెట్టింది. భుజం గట్టిగా గుచ్చినట్టు నొక్కి వదిలాడు. ఆత్మీయ స్పర్శ.అంతే... తెలిసిపోయింది. జీర గొంతు. వణుకుతున్న స్వరం లోంచి మాటలు జారుతున్నాయి. మరచిపోయిందేదో గుర్తు చేస్తున్న అలికిడి. జ్ఞాపకాల తేనెతుట్ట రేగింది. ఇక సమస్తం  అర్థమైపోయింది.సరిగ్గా అప్పుడే కుక్కలు గందరగోళంగా మొరుగుతున్నాయి, కాలభైరవుని మేల్కొలుపులా. వెంటనే మెలకువ వచ్చేసింది. తక్షణం చేయాల్సిన పని గుర్తుకొచ్చింది. దిగ్గున లేచాడు. మర్నాడు శ్రీలతను కలిశాడు. శ్రీలత తనతోబాటు శిక్షణ పొందింది. ‘‘సమస్యొకటి మీద పడింది. పరిష్కారం నాకు తెలుసు. నా చేతిలోనే ఉంది. మనకేమీ ఇబ్బంది లేదు. అంతా సజావుగా జరుగుతుంది.అందులో సందేహం లేదు. అయినానీకు చెప్పాలి. చెప్పకుండా ఉండలేను’’ అని మొత్తం చెప్పేశాడు. శ్రీలత తేలిగ్గా తీసుకుంది. కంగారుపడలేదు. గుండెలు బాదుకోలేదు. గగ్గోలు పెట్టలేదు. ఇంత అన్యాయం చేస్తావా అని నిలదీయలేదు. ప్రసన్నంగా నవ్వింది. చదువు నేర్పిన సంస్కారం. లోకం తీరు బాగా ఎరిగిన మేధ. ఉదాత్త ఆలోచనల పోగు. ‘‘తప్పుగా ప్రవర్తించకు. నీవు కులం వాళ్ళ మాట విను.పెద్దలు చెప్పినట్టు మసులుకో. పర్వాలేదు. సర్దుకోగలను. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. నీవు చెప్పడం మంచిదే. ఈ రోజు నుండి మనం మంచి స్నేహితులం’’ అంది శ్రీలత ఏవిధమైన ఉద్వేగం కనిపించనీయకుండా. కళ్ళు తడిగా ఉన్నాయి. ముఖం నవ్వుతూనే ఉంది. జీవితం సవాలు విసిరినపుడు నిబ్బరంగా ఎదుర్కోవాలి. నచ్చచెప్పాల్సిన వాళ్ళకు నచ్చచెప్పాడు. బతిమాలాల్సిన వాళ్ళను బతిమాలాడు. నదిని దాటి గమ్యం చేరాలంటే కొన్నిసార్లు ఎదురీదాలి. ఎన్నో ‘నేను’ల సమూహం సంఘం. ఒక్క ‘నేను’ విడివడి ఎదురీదాలి. శివుడు వాలులో కొట్టుకు పోలేదు. ఎదురీదాడు. ఆఖరుగా ఎదిరించాల్సిన వాళ్ళను ఎదిరించాడు. గోదారి ఎప్పటిలాగే పాటు పోటులతో సందడిగా ఉంది.             
దాట్ల  దేవదానంరాజు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top