కిష్టిగాడు

Funday seen yours title ours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా పేరున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమైన హీరో, ఆ తర్వాత సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగారు. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

కృష్ణను అందరూ కిష్టిగాడు అని పిలుస్తారు. అమాయకుడు. లోకమంటే ఏంటో తెలియదు. తన పని తాను చేసుకుంటూ వెళతాడు. అలాంటి కిష్టిగాడు తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు.  ఆరోజు రాత్రి కృష్ణ ఇంకో ఇద్దరితో కలిసి మున్సబుగారి తోటలోకి వెళ్లాడు. అక్కడ కొబ్బరిబోండాలను దొంగతనం చేసి సంచుల్లో సర్దుకుంటున్న పకీరయ్య వాళ్లకు కనిపించాడు. పకీరయ్యను ‘‘ఏం చేస్తున్నావురా ఇక్కడ?’’ అనడిగాడు కృష్ణతో వచ్చిన వారిలో ఒకతను. ‘‘నువ్వెవడివిరా అడగటానికి?’’ అన్నాడు పకీరయ్య కోపంగా. ‘‘నీ పాలిటి యముడ్నిరా’’ అంటూ పకీరయ్య మీదకి కత్తి విసిరాడతను. అది అతన్ని తాకకుండా వెళ్లి చెట్టుకి గుచ్చుకుంది. పకీరయ్య తిరిగి అతని మీదకి తన కత్తి విసిరాడు. అది సరిగ్గా అతని మెడకు గుచ్చుకుంది. ‘కృష్ణ.. కృష్ణ..’ అని అరుస్తూ అతనక్కడే కూలబడిపోయి చనిపోయాడు. కృష్ణతో వచ్చిన మరొకతను అక్కడికి పరిగెత్తుకొని వచ్చాడు. అతని మీదకీ కత్తి విసిరాడు పకీరయ్య. అతనూ అక్కడికక్కడే కూలబడిపోయాడు. ఆ ఇద్దరి కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన కృష్ణ ఇద్దరినీ శవాల్లా చూసి భయపడిపోయాడు. ‘అమ్మ బాబోయ్‌’ అని గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. కృష్ణను పకీరయ్య, అతడి మనుషులు వెంబడిస్తున్నారు. అర్ధరాత్రి దాటింది. చీకట్లో ఎవరు ఎవరివెంట పరిగెడుతున్నారో అర్థం కానట్లు ఉంది అక్కడి పరిస్థితి. 

కృష్ణ పరిగెడుతూ పరిగెడుతూ మున్సబుగారి ఇల్లు చేరాడు. ‘‘ఆ పకీరుగాడు మా మామని, ఈరిగాడ్ని చంపేశాడు. నన్ను కూడా చంపేస్తానని నా ఎంట పడ్డాడు. బాబుగారూ నన్ను దాచేయండి. నన్ను దాచేయండి బాబూ.. వాడు చంపేస్తాడు’’ అంటూ మున్సబుగారి కాళ్ల మీద పడ్డాడు. ‘‘వాడు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడురా! కొంపంతా గాలిస్తాడురా. ఎక్కడ దాచినా పట్టుకుంటాడురా’’ మున్సబుగారు అతన్ని సముదాయించి, ‘‘దాక్కునేందుకు ఒకే ఇల్లు ఉందిరా. అది పకీరు ఇల్లు’’ అని చెప్పాడు. ‘‘పకీరు ఇల్లా?’’ ‘‘వాడి కొంపలో దాక్కుంటావని వాడు కల్లో కూడా అనుకోడు. ఊరు ఊరంతా గాలిస్తాడు. నువ్వు పరిగెత్తుకెళ్లి చుక్క కాళ్లు పట్టుకొని కాసేపు దాక్కో. వాడు ఇక్కణ్నుంచి వెళ్లగానే నేను కబురుచేస్తాను.’’ అన్నాడు మున్సబు. కృష్ణ వెళ్లిపోయాడు. కృష్ణ వెళ్లగానే పకీరయ్య వచ్చి మున్సబు ఇల్లంతా వెతికి వెళ్లాడు. కృష్ణ పకీరయ్య ఇంట్లోనే దాక్కున్నాడు. పకీరయ్య చెల్లెలు చుక్క కృష్ణకు మంచి స్నేహితురాలు. అంతకంటే ఎక్కువే కూడా. ఊరంతా వెతికి ఇంటికి చేరాడు పకీరయ్య.

చుక్కకు కొన్ని జాగ్రత్తలు చెప్పి ఎవరైనా అడిగితే తాను ఊర్లో లేడని చెప్పమన్నాడు. కృష్ణ దాక్కున్న చోటే స్పృహ తప్పి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. పకీరయ్య వెళ్లిపోగానే చుక్క కృష్ణను లేపి ఏం జరిగిందో చెప్పమని బతిమిలాడింది. కృష్ణ నోరువిప్పే పరిస్థితిలో కూడా లేడు. మున్సబుగారి దగ్గర్నుంచి కబురొచ్చింది. ఈలోపు పోలీసులొచ్చారు. శవాలను స్వాధీన పరచుకున్నారు. పకీరయ్య కోసం గాలింపు మొదలైంది. ఊరు పెద్దలంతా ఒక దగ్గర చేరారు. పకీరయ్యే ఆ ఇద్దరినీ చంపాడనడానికి ఉన్న ఒకే ఒక్క సాక్షి కృష్ణ. కానీ కృష్ణ ధైర్యంగా ఈ విషయం చెప్పగలడా? ‘‘బాబుగారూ బాబుగారూ.. నన్ను కాపాడండి. వాడు నన్ను చంపేస్తాడు.’’ కృష్ణ భయంగా ఏడుస్తూ మున్సబు ముందుకొచ్చి కూర్చున్నాడు. ‘‘నీకెందుకురా భయం? వాడు పారిపోయాడు.’’ ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు మున్సబు. ‘‘రేపు కోర్టులో ఖూనీ.. ఎక్కడ? ఎలా? ఎవరికోసం జరిగింది ఉన్నది ఉన్నట్టు పూసగుచ్చినట్టు చెప్పేసెయ్యి..’’ మున్సబుకు ఎప్పుడూ అండగా ఉండే రంగారావు కృష్ణకు సలహాలు ఇస్తున్నాడు. ‘‘అమ్మబాబోయ్‌! పకీరు మీద సాక్చికమా?’’ భోరున ఏడుస్తున్నాడు కృష్ణ.  అతను భయపడి ఏడుస్తూనే ఉన్నాడు. కానీ పెద్దలంతా తలా ఒక మాట చెప్పి అతనికి ధైర్యాన్నిచ్చారు. భయంగానే, ‘‘మీదే భారం’’ అని ఒప్పుకున్నాడు కృష్ణ. కోర్టులో అందరూ చెప్పమన్నట్టే సాక్ష్యం చెప్పాడు. పకీరయ్యకు ఉరిశిక్ష పడటం ఖాయం అనుకున్నారంతా. కానీ ఆత్మరక్షణలో భాగంగా ఈ పని చేశానని చెప్పుకున్న పకీరయ్య వాదననుకూడా పరిగణనలోకి తీసుకుని కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష మాత్రమే వేసింది. పకీరయ్య జైలుకు వెళ్తూ వెళ్తూ, ‘‘వచ్చే పున్నమిలోగా నీ అంతు చూస్తారా కిష్టిగా!’’ అంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు. పకీరయ్య కృష్ణను బెదిరించిన తీరు చూసిన వారంతా అప్పటికప్పుడు కృష్ణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ‘మేమున్నాం’ అని చెప్పిన వాళ్లంతా వెనకడుగు వేసేశారు. కృష్ణ ఇప్పుడు ఒంటరి. చావు ఏ రూపంలో, ఎప్పుడైనా రావొచ్చు. 

మున్సబు కృష్ణను పనినుంచి కూడా తీసేశాడు. మున్సబు కాళ్లమీద పడి వేడుకున్నాడు కృష్ణ. ‘‘ఊరికే కాకి గోల చేయక అవతలికి పో! ఎవడ్రా నిన్ను సాక్ష్యం చెప్పమన్నాడు?’’ అంటూ  మున్సబు మాటమార్చి కృష్ణను గెంటేశాడు.కృష్ణకు కనిపించిన దారొక్కటే! చుక్క. ఊరొదిలి పారిపోవాలనుకున్నవాడు, చుక్క ఇచ్చిన ధైర్యంతో ఊర్లోనే ఉండిపోయాడు. కృష్ణ, చుక్కలకు ఒకరిమీద ఒకరికి ప్రేమయింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పకీరయ్య స్నేహితులు ఇందుకు ఒప్పుకోలేదు. గొడవ చేశారు. నర్సిని పెళ్లి చేసుకోవాలని కృష్ణ అత్త అతన్ని పోరు పెట్టింది. ఊర్లో పెద్దలు కూడా కృష్ణ నర్సినే చేసుకోవాలని పట్టుబట్టారు. కానీ నర్సి పకీరయ్యను ప్రేమించింది. అతనికోసమే ఎదురుచూస్తోంది. కృష్ణ పరిస్థితి అయోమయంగా ఉంది. పకీరయ్య జైలునుంచి పారిపోయి ఊరికొచ్చాడు. కృష్ణ కనిపిస్తే అతన్ని చంపాలని తిరుగుతున్నాడు. ‘‘ఎక్కడికైనా పారిపోదాం మామా!’’ అంది చుక్క. ‘‘ఎక్కడికని పారిపోతావు? ఎన్నాళ్లని పారిపోతావు?’’ జీవితంలో మొదటిసారి ధిక్కార స్వరంతో మాట్లాడాడు కృష్ణ. పకీరయ్యను నిలదీస్తానని వెళ్లిన నర్సి, అతని చేతుల్లోనే చనిపోయింది. ఊరంతా తిరుగుతున్నాడు కృష్ణ, పకీరయ్యకు దొరక్కుండా. కృష్ణ కోసం పకీరయ్య ఊరంతా గాలిస్తున్నాడు. అర్ధరాత్రి దాటింతర్వాత ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరిమీద ఒకరు కలబడ్డారు. కత్తి తీశాడు పకీరయ్య. అదే కత్తిని తిప్పి పకీరయ్య గుండెల్లోనే పొడిచాడు కృష్ణ. పకీరయ్య అక్కడే కూలబడిపోయి చనిపోయాడు.  పకీరయ్య ఊర్లోకి వచ్చాడని తెలుసుకొని దాక్కున్న పెద్దలంతా ఒక్కొక్కరుగా కృష్ణ చుట్టూ పోగయ్యారు. చుక్క గట్టిగా ఏడ్చి కృష్ణను హత్తుకుంది. కృష్ణ అందరికీ దండం పెట్టి, ‘‘వెళ్లొస్తా’’ అంటూ పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరాడు, తాను చేసిన హత్యకు సాక్ష్యం ఒకరు చెప్పే అవసరం లేకుండా! 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top