ఇంకో పేరు లేదు | Sakshi
Sakshi News home page

ఇంకో పేరు లేదు

Published Sun, Apr 1 2018 1:44 AM

funday horror story - Sakshi

ఆయన చనిపోయి కొన్ని రోజులైనా కానప్పుడు ఆయన చనిపోయిన మనిషి ఎలా అవుతారు డాక్టర్‌? డాక్టర్‌ అరాన్హ.. ఆ అమ్మాయినే ఏకదీక్షతో చూస్తున్నాడు. ‘‘పేరును బట్టి మిమ్మల్ని ఉత్తరాదివారు అనుకున్నాను డాక్టర్‌. మీరు ఉగాదివారు అన్నమాట’’ అంది పూర్ణిమ. మనస్ఫూర్తిగా నవ్వాడు అరాన్హ. ఎప్పుడో గానీ ఆయన అలా నవ్వడు. ‘ఉగాదివారు’ అన్న విరుపు ఆయనకు నచ్చింది. ‘‘నేను తెలుగువాణ్ణే. మా పూర్వికులెవరో పోర్చుగీసులో ఉన్నారట. అరాన్హ అంటే స్పైడర్‌ అని అర్థం’’ అన్నాడు డాక్టర్‌ అరాన్హ.. అదే నవ్వుతో. ‘‘ఓ.. అయితే మీరు తెలుగు స్పైడర్‌మాన్‌!’’.. నవ్వింది పూర్ణిమ. పూర్ణిమ మెంటల్‌ కండిషన్‌ పర్‌ఫెక్ట్‌గా ఉందని ఆయనకు అర్థమైంది అయినా గానీ అడిగాడు.. ‘‘చెప్పండి పూర్ణిమా.. ఏంటి మీ ప్రాబ్లం?’’ అని. ‘‘నేను చెప్పానా డాక్టర్‌.. నాకేదో ప్రాబ్లం ఉందని!’’ ఆశ్చర్యంగా ముఖం పెట్టింది పూర్ణిమ. పాతికేళ్లకు అటూ ఇటుగా ఉంటుంది ఆమె వయసు. అందంగా ఉంది. చలాకీగా ఉంది. ‘‘మీరు చెప్పలేదు మిస్‌ పూర్ణిమా.. మీవాళ్లు చెప్పారు.. మీరేదో సైకలాజికల్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నారని’’ అన్నాడు అరాన్హ. పూర్ణిమ ఇబ్బందిగా చూసింది. ‘‘మిస్‌ పూర్ణిమ కాదు. మిసెస్‌ పూర్ణిమ’’ అని చెప్పింది. ‘‘అండ్‌.. సైకలాజికల్‌ డిజార్జర్‌తో బాధపడుతున్నది నేను కాదు. నాకేదో సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌ ఉందని నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చినవాళ్లు..’’ అంది. ‘‘ఎందుకు వాళ్లలా మీ గురించి అనుకుంటున్నారు మిసెస్‌ పూర్ణిమ’’ అన్నాడు అరాన్హ. ‘‘నా హస్బెండ్‌ చనిపోయారు. ఆయన్నే తలుచుకుని తలుచుకుని బాధపడుతున్నానని అలా అనుకుంటున్నారు. తలుచుకుని బాధపడడం బాధే అవుతుంది తప్ప ప్రాబ్లం అవుతుందా! చెప్పండి డాక్టర్‌?’’.. అడిగింది పూర్ణిమ ఆవేదనగా.

‘‘మీరన్నది నిజమే పూర్ణిమా. తలచుకుని బాధ పడడం బాధ అవుతుంది తప్ప ప్రాబ్లం అవదు’ అన్నాడు అరాన్హ. పూర్ణిమ నవ్వింది. ‘‘ట్రూ.. డాక్టర్‌. తలచుకునే అవసరాన్ని నా భర్త నాకు రానివ్వలేదు. ఆయన చనిపోయి కొన్ని రోజులైనా కానప్పుడు ఆయన చనిపోయిన మనిషి ఎలా అవుతారు? అలాంటప్పుడు నేను ఆయన్ని తలచుకోవడం అంటూ ఉంటుందా!’’‘‘దెన్, మీవాళ్లు అంటున్న తలచుకోవడం ఏంటి?’’ అన్నాడు అరాన్హ. ‘‘నాకూ అదే అర్థం కావడం లేదు డాక్టర్‌. నేను వాళ్లకు క్లియర్‌గానే చెప్తున్నాను. సూర్య ఇవాళ నాతో మాట్లాడాడు. సూర్య ఇవాళ ‘ఆకలవుతోంది. త్వరగా అన్నం పెట్టు పూర్ణిమా’ అని అడిగాడు. సూర్య ఇవాళ.. ‘ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావ్‌’ అన్నాడు.. అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాను. అయితే అదంతా కూడా నేను సూర్యను ‘తలచుకోవడం’ అనే అనుకుంటున్నారు’’ అంది పూర్ణిమ. ‘‘నేనూ అలాగే అనుకుంటున్నాను మిసెస్‌ పూర్ణిమా. చనిపోయిన మనిషి మాట్లాడ్డం, అన్నం పెట్టు అని అడగడం, నువ్వీ చీరలో బాగున్నావు అని కాంప్లిమెంట్‌ ఇవ్వడం.. ఇవన్నీ కూడా తలచుకోవడమే. సైకాలజీలో దీనికి ఇంకో పేరు లేదు. ‘భ్రాంతి’ అనొచ్చు. కానీ, మీ విషయంలో దానిని ప్రేమ అనాలి’’ అన్నాడు డాక్టర్‌ అరాన్హ, తను చెప్పదలచుకున్నది ఇంకా మొదలు పెట్టకుండానే. 
ఒక్కసారిగా ఏడ్చేసింది పూర్ణిమ! 

పూర్ణిమ కనుక ఎమోషనల్‌ అయిపోకుండా ఉంటే డాక్టర్‌ అరాన్హ మొదలు పెట్టదలచుకున్న విషయం వేరే ఉంది. మొదట ఆమెకు ఆయన ఒక జోక్‌ చెప్పి నవ్వించాలనుకున్నాడు. నవ్వించడం ఆయన ఉద్దేశం కాదు. ప్రతి దానికీ ఒక లాజిక్‌ ఉంటుందని చెప్పడం. లాజిక్‌ లేకుండా దెయ్యం కూడా ఉండదని చెప్పడం. అయితే ఇప్పుడిక ఆ జోక్‌ని ఆమెకు చెప్పకూడదనే అనుకున్నాడు. కేవలం లాజిక్‌ గురించే మాట్లాడాలనుకున్నారు. ‘‘దెయ్యాలు లేవని చెప్పడానికి ఎంత లాజిక్‌ ఉంటుందో, ఉందని చెప్పడానికీ అంతే లాజిక్‌ ఉంటుంది మిసెస్‌ పూర్ణిమా’’ అన్నాడు అరాన్హ. ‘‘దెయ్యం అని మీరు ఎవర్ని అంటున్నారు డాక్టర్‌’’ అంది పూర్ణిమ, కళ్లు తుడుచుకుంటూ. ‘‘ఒకవేళ నా భర్త నాకు పట్టడం జరిగితే, అది దెయ్యం పట్టడం అవదు. ఆత్మ పట్టడం అవుతుంది. అయితే.. పట్టడానికి ఆయన ఆత్మ కూడా కాదు డాక్టర్‌. రోజూ నేను ఆయన్ని స్పష్టంగా చూస్తున్నాను. మాట్లాడుతున్నాను. ఆయన వాడే పెర్‌ఫ్యూమ్‌ని కూడా ఫీలవుతున్నాను’’ అంది పూర్ణిమ. ‘‘స్ట్రేంజ్‌’’ అన్నాడు అరాన్హ. ‘షిట్‌’ అని మాత్రం మనసులో అనుకున్నాడు.
‘‘వెళ్తాను డాక్టర్‌. మావాళ్లకు మీరేం ట్రీట్‌మెంట్‌ ఇస్తారో ఇవ్వండి’’ అని, నవ్వుతూ కుర్చీలోంచి లేచింది పూర్ణిమ. అరాన్హ కూడా ఆమెతో పాటు లేచాడు. ‘‘మీకో జోక్‌ చెప్పమంటారా డాక్టర్‌’’ అంది పూర్ణిమ సడన్‌గా.  ఆశ్చర్యంగా చూశాడు అరాన్హ. 

‘‘ఒక యంగ్‌ లేడీకి ముంబైలో ఉద్యోగం వచ్చింది. ఒంటరిగానే వెళ్లి ఉద్యోగంలో చేరింది. అక్కడో మంచి ఇంటిని కూడా తనే వెతుక్కుంది. ఆ తర్వాత భర్తకు ఎస్‌.ఎమ్‌.ఎస్‌.పెట్టింది.అయితే ఆ ఎస్‌.ఎం.ఎస్‌. పొరపాటున భర్తకు బదులు వేరొకరికి వెళ్లింది. ఆ వేరొకతను అప్పుడే తన భార్యకు అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చాడు. తనకొచ్చిన ఎస్‌.ఎమ్‌.ఎస్‌.ను చదివి స్పృహ తప్పి పడిపోయాడు! వెంటనే ఆయన్ని దగ్గర్లోని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. ఇంతకీ ఆ ఎస్‌.ఎమ్‌.ఎస్‌.లో ఏముంది?! ‘నేను క్షేమంగా చేరాను. ఇక్కడ ఉండేందుకు అనుకూలమైన చోటు దొరికింది. నా గురించి బెంగ పెట్టుకోకు. వీలుపడితే ఒకట్రెండు రోజుల్లో మిమ్మల్ని తీసుకెళతా..’ ఇట్లు మీ భార్యామణి.’’డాక్టర్‌ అరాన్హ అదిరిపడి చూశాడు పూర్ణిమ వైపు. పూర్ణిమకు అంతకుక్రితమే అతడు చెప్పాలనుకున్న జోక్‌ అది!‘‘ఎలా తెలుసు మీకీ జోక్‌.. మిసెస్‌ పూర్ణిమా!’’ అని అడిగాడు. పూర్ణిమ నవ్వింది. ‘‘రాత్రి.. నేనూ నా భర్త మాట్లాడుకుంటూ ఉంటే, ఆయనే చెప్పారు నాకు.. నేను మీ దగ్గరకు వస్తే మీరు ఈ జోక్‌ని నాకు చెప్తారని. ఈరోజు రాత్రి మళ్లీ మేము కలుసుకున్నప్పుడు ఆయనకు చెప్పాలి. నేనే మీకు ఈ జోక్‌ని చెప్పానని’’ అంటూ క్లినిక్‌ బయటికి వచ్చేసింది పూర్ణిమ. లోపల ఎవరో ‘దబ్‌’మని పడిపోయిన చప్పుడు ఆమెకు వినిపించలేదు.
- మాధవ్‌ శింగరాజు 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement