ఐక్యూ హయ్యర్‌గా ఉంటుందా?

funday health counciling - Sakshi

సందేహం

ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు రోజుకు తొమ్మిది గుడ్లు తింటే పుట్టబోయే బిడ్డ ఐక్యూ అనేది హయ్యర్‌ ఉంటుందని ఒక స్టడీ తెలియజేసినట్లు చదివాను. ఇది ఎంత వరకు నిజం? గర్భిణిగా ఉన్నప్పుడు  తీసుకునే ఆహారానికి ఐక్యూకు సంబంధం ఉంటుందా? మరోవైపు గర్భిణీ స్త్రీలు గుడ్లు తినడం మంచిది కాదనేది కూడా విన్నాను. దీని గురించి తెలియజేయగలరు.
– నవ్య, కర్నూల్‌

గర్భంతో లేనివారే రోజుకు తొమ్మిది గుడ్లు తినాలంటే ఇబ్బంది పడతారు. అలాంటిది గర్భంతో ఉన్నవారు రోజుకు అన్ని గుడ్లు తిన్నారంటే.. వారిలో అజీర్తి, కడుపు ఉబ్బరం, బరువు అధికంగా పెరగడం, ఆయాసం వంటి సమస్యలు వస్తాయి. పుట్టబోయే బిడ్డ ఐక్యూ అనేది తల్లిదండ్రుల ప్రవర్తన, నడవడిక, జన్యుపరంగా, ఇలా చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. గర్భిణీ సమయంలో తల్లిలో మానసిక ఒత్తిడి, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్స్, బిడ్డ మెదడులో లోపాలు, పనితీరులో లోపాలు వంటి వాటివల్ల బిడ్డ ఐక్యూ తగ్గే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ సమయంలో తల్లి మానసికంగా ఆనందంగా ఉండటం, ఆరోగ్యకరమైన, సులువుగా అరిగే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఐక్యూ పెరగటం ఉండదు. గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి బిడ్డ మెదడు పెరుగుదలకు ఉపయోగపడతాయి. పచ్చసొనలో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీలలో సన్నగా ఉన్నవారు రోజుకు ఒక గుడ్డు తీసుకోవచ్చు. లావుగా ఉన్నవారు తెల్లసొనను రోజూ తీసుకుంటూ పచ్చసొనను వారానికి ఓసారి తీసుకోవచ్చు. పచ్చి గుడ్డు లేదా సగం ఉడికిన గుడ్డు కాకుండా బాగా ఉడికిన గుడ్డును తీసుకోవాలి. పచ్చి లేదా సరిగా ఉడకని గుడ్డులో ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు, గర్భాశయంలో కాంట్రాక్షన్స్, నెలలు నిండకుండానే కాన్పు వంటి సమస్యలు రావచ్చు. ఒక గుడ్డులో 70 క్యాలరీల శక్తి ఉంటుంది. గరిష్టంగా రోజుకు.. వారి శరీరతత్వాన్నిబట్టి రెండు గుడ్లు తినొచ్చు.

నాకు వేపుడు పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీ సమయంలో తినొచ్చా? ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పారసెటమాల్‌ మాత్రను తీసుకోవడం మంచిది కాదని విన్నాను. ఈ సమయంలో ఎలాంటి మాత్రలు తీసుకోకూడదో తెలియజేయగలరు.
– పీఆర్, ఇచ్చాపురం

వేపుడు పదార్థాలలో నూనె ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువగా వేయించడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు ఎక్కువగా ఆవిరైపోతాయి. అలాంటివి తింటే రుచికి తప్పితే, బిడ్డ పెరుగుదలకి పెద్దగా ఉపయోగం ఉండదు. తరచూ వేపుడు పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్తి, అసిడిటీ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రుచి కోసం అయితే అప్పుడప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు. గర్భిణీ సమయాల్లో వచ్చే నొప్పులకు, జ్వరానికి పారసెటమాల్‌ మాత్ర ఒక్కటే మంచిది. దీనివల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఏమీ లేవు. ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పారసెటమాల్‌ మాత్ర అవసరాన్ని బట్టి రోజుకు రెండు, మూడుసార్లు వేసుకోవచ్చు. గర్భిణీ సమయాల్లో ఏ మందులు అయినా డాక్టర్‌ పర్యవేక్షణలోనే తీసుకోవలసి ఉంటుంది. కొన్నిరకాల యాంటిబయోటిక్స్,  నొప్పి నివారణ మందులు, ఫిట్స్, డిప్రెషన్‌కు వాడే మాత్రలు వంటివి గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వాడవలసి వచ్చినా, అవి వాడకపోతే హాని ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ సలహామేరకు అతి తక్కువ దుష్ప్రభావాలు ఉన్న మందులను వాడొచ్చు.

నా వయసు 37. థైరాయిడ్, పీసీఓడీ ప్రాబ్లమ్‌ ఉంది. ఇటీవల ఒక ఐదునెలలు థైరాయిడ్‌ టాబ్లెట్లు వాడడం మానేశాను. వారం రోజుల క్రితం టెస్ట్‌ చేయించుకుంటే టి3 – 87, టి4 – 5.3, టీఎస్‌హెచ్‌ 5.4 ఉంది. ఇప్పుడు థైరోనార్మ్‌ 25 ఎమ్‌.జీ మొదలుపెట్టాను. అంత మోతాదు సరిపోతుందా? టీఎస్‌హెచ్‌ ఎక్కువగా ఉంటే హైపో థైరాయిడిజమ్‌ అంటారా? లేక హైపర్‌ థైరాయిడిజమ్‌ అంటారా? పీసీఓడీకి ఎటువంటి మందులు వాడడం లేదు. రెండు లేక మూడు నెలలకు ఒకసారి నెలసరి వస్తుంది. దీనితో నాకు హెయిర్‌ఫాల్‌ కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి తెలుపగలరు?
– సరిత, తాళ్ళరేవు

మీరు బరువు ఎంత ఉన్నారు? వివాహం అయిందా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? అనే ప్రధానమైన విషయాలు రాయలేదు. పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి గర్భాశయం, అండాశయాల పనితీరు, మెదడు నుంచి విడుదలయ్యే ఎఫ్‌ఎస్‌హెచ్, సీహెచ్, ప్రొలాక్టిన్, టీఎస్‌హెచ్‌ హార్మోన్లు, థైరాయిడ్‌ గ్రంథి నుంచి విడుదలయ్యే టి3, టి4 హార్మోన్లు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లన్నీ సక్రమంగా ఉండాలి. మీకు టీఎస్‌హెచ్‌ కొద్దిగా బార్డర్‌లైన్‌లో పెరిగింది. దీనిని హైపో థైరాయిడిజమ్‌ అంటారు. మెడలోపల ఉండే థైరాయిడ్‌ గ్రం«థి నుంచి విడుదలయ్యే టి3, టి4 అనే థైరాయిడ్‌ హార్మోన్లు తక్కువగా విడుదల అవుతుంటే.. థైరాయిడ్‌ గ్రం«థిని ఉత్తేజపరచడానికి (స్టిములేట్‌) మెదడులోకి పిట్యూటరీ గ్రంథి నుంచి టీఎస్‌హెచ్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల అవుతుంది. మీకు థైరోనార్మ్‌ 25 ఎమ్‌.జీ సరిపోతుంది. మీకున్న పీసీఓడీ సమస్యవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, జుట్టు ఊడిపోవడం, అవసరం లేని దగ్గర జుట్టు పెరగడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడతాయి. ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి మితమైన ఆహారం, వ్యాయామాలు చేసి బరువు తగ్గటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అశ్రద్ధ చేయకుండా మీ శరీరతత్వాన్ని బట్టి కొంతకాలంపాటు అవసరమైన మందులు వాడటం మంచిది.

డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్‌
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top