క్రిమినల్‌

funday crime story - Sakshi

క్రైమ్‌ స్టోరీ

కళ్ళు తెరిచేసరికి ఓ షెడ్‌లో చెక్క కుర్చీలో ఉన్నా. తాళ్ళతో కట్టేశారు నన్ను. నా నోటికి టేప్‌ అంటించారు.ఆశ్చర్యంతో అయోమయంగా పరిసరాలను పరికించి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఒక్కో విషయం మెల్లగా గుర్తుకు రాసాగింది. రాత్రి ఎనిమిది గంటలకు ఆల్‌ నైట్‌ క్లబ్‌లో డ్రింక్స్‌కి ఆర్డర్‌ ఇచ్చాను. ఓ యువతి నాకు కంపెనీ ఇచ్చింది. అందం కంటే ఆకర్షణే ఎక్కువ ఆమెలో. చికెన్‌ పకోడాను ఒకరికొకరం తినిపించుకుంటూ డ్రింక్స్‌ పూర్తిచేశాం. ఆ రోజు కాస్త ఎక్కువే తాగాను నేను. సెల్‌ఫోన్‌ మోగడంతో మాట్లాడుతూ అక్కణ్ణుంచి వెళ్ళిందామె. నేను బిల్‌ చెల్లించి తూలుకుంటూ బైటకు నడిచాను. పార్కింగ్‌లో ఉన్న నా బైక్‌ని తీయబోతూంటే, వెనుక నుంచి వచ్చి నా చేయి పట్టుకుందామె. ‘మీకు డోస్‌ ఎక్కువయింది. ఈ స్థితిలో బైక్‌ రైడ్‌ సేఫ్‌ కాదు. ఈ పక్కనే నా రూమ్‌ ఉంది. ఈ రాత్రికి అక్కడ ఉండి తెల్లవారాక వెళుదురుగాని’ అంది.ఆమెను చూశాక ఎందుకో మారు మాట్లాడకుండా ఆమె వెంట నడిచాను. 

తల గట్టిగా విదిలించి మళ్ళీ కళ్ళు తెరచాను నేను – ‘ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఇలా కట్టిపడేసిందెవరు??...’ ఓ వ్యక్తి బకెట్‌తో నీళ్ళు తెచ్చి నా నెత్తిమీద గుమ్మరించాడు. నా మత్తు పూర్తిగా దిగిపోయింది. అది కలా కాదు, కల్లా కాదు – పచ్చి వాస్తవం! నా ఎదుట కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతను – సిటీలో పేరుమోసిన డాన్‌!‘భాయ్‌’ అని పిలుస్తారంతా. అతని వెనుక అనుచరులు కొందరు నిల్చున్నారు.పక్కనే ఉన్న స్టూల్‌ మీద కొన్ని ఏటీఎమ్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, బ్లో టార్చ్, ప్లయర్స్, హాక్సా బ్లేడ్, క్లా హేమర్, పెన్‌ నైఫ్‌ వగైరాలు ఉన్నాయి. అవన్నీ నావే. నేను, నాక్రైమ్‌ పార్ట్‌నర్‌ రాబర్ట్‌ దోచుకొచ్చినవి. భాయ్‌కి ఆగ్రహం తెప్పించే పని నేను ఏం చేశానో బోధపడలేదు నాకు. ఆ విషయమే అడుగుదామంటే, నోటికి టేప్‌.‘‘బ్రహ్మాజీ!’’ భాయ్‌ పిలుపుతో చుట్టూ చూశాను. కాని, అతను పిలిచింది నన్నేనని గ్రహించి విస్తుపోయాను.  జేబులోంచి ఓ పాత ఐడీ కార్డ్‌ తీశాడు భాయ్‌. ‘‘నీ జేబులోంచి తీసిన ఐడీ కార్డ్‌ ఇది. ఇదే నిన్ను పట్టిచ్చింది. ఈ పదేళ్ళలో కార్డ్‌ని మార్చలేదనుకుంటాను నువ్వు. మసకబారిన ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని తీసేసి కలర్‌ ఫోటోని పెట్టుకోవాలనిపించలేదా నీకు. ఇప్పుడు అనిపించినా ప్రయోజనం లేదులే. ఎందుకంటే ఇకపైన దీని అవసరం నీకు ఉండదుకదా!’’ అన్నాడతను.
 
‘‘నీ పేరు బ్రహ్మాజీ. కోల్‌కతాలో ఓ చెప్పుల కంపెనీ ఉంది నీకు. బిజినెస్‌ పని మీద ఈ ఊరికి వచ్చావు. వారం క్రితం తప్పతాగి కారు నడుపుతూ ఓ యువతిని ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయావు..’’ ఆ యువతి భాయ్‌ చిన్న పెళ్ళాం జాస్మిన్‌ అట. ఆ రాత్రి రోడ్‌ క్రాస్‌ చేస్తుండగా ఆ ప్రమాదం జరిగిందట. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలిందట. అదరిపడ్డాను నేను. అసలు ఆ బ్రహ్మాజీ ఎవరో నేను ఎరుగను. నా పేరు సిద్ధు. ఓ క్రిమినల్‌ని. బ్రహ్మాజీ అన్న వ్యక్తి ఐడీ కార్డ్‌ నా జేబులోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ‘మిస్టేకెన్‌ ఐడెంటిటీ’ అని ఎలుగెత్తి చాటాలనుకున్నాను. టేప్‌ అడ్డు వచ్చింది. తల అడ్డుగా తిప్పాను. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు వెళుతూన్న ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని తన సెల్‌ ఫోన్లో వీడియో తీసాడు. కార్‌ నంబర్‌ ఆధారంగా నిన్ను ట్రేస్‌ చేయడం జరిగింది.’’ చెప్పాడు భాయ్‌. ఆ హంతకుడు నేను కానని చెప్పడానికి కళ్ళతో, తలతో గింజుకున్నాను. టేప్‌ని తొలగించవలసిందిగా సైగలు చేశాను.‘‘ప్రాణానికి ప్రాణమైన నా జాస్మిన్‌ ప్రాణాలను గాలిలో కలిపేసినవాడు బతికి ఉండకూడదు. వాణ్ణి యమపురికి పంపి నా జాస్మిన్‌ ఆత్మకు శాంతి చేకూర్చుతానని శపథం చేశా. నా శపథం నెరవేరబోతోంది ఇప్పుడు..’’ అంటూ అనుచరులకు సైగ చేశాడు భాయ్‌.నిశ్శబ్దంగా అతని పక్కకు వచ్చి నిలుచున్న వ్యక్తిని చూసి తెల్లబోయాను నేను.రాబర్ట్‌! నా క్రైమ్‌ పార్ట్‌నర్‌!  గత పదేళ్ళుగా రాబర్ట్, నేను కలసి నేరాలు చేస్తున్నాము. అతను ఇతరుల క్రెడిట్‌ కార్డులు, ఏటీఎమ్‌ కార్డులను దొంగిలించి తెచ్చి నాకు అమ్ముతాడు. నేను వాటికి ఫేక్‌ పిన్‌ నంబర్లు సృష్టించి క్యాష్‌ చేసుకుంటాను. 

జాస్మిన్‌కి యాక్సిడెంట్‌ జరిగినట్లు చెప్తున్న రోజు నేను ముంబైలో ఉన్నానన్న విషయం రాబర్ట్‌కి తెలుసు. ‘రాబర్ట్‌! ప్లీజ్‌! నేను బ్రహ్మాజీని కాననీ, నీ ఫ్రెండ్‌ సిద్ధూననీ, యాక్సిడెంట్‌ రోజున నేను ఈ ఊళ్ళోనే లేననీ భాయ్‌తో నిజం చెప్పు,’ అర్థింపుగా అతని వంక చూశాను. చూపులు మరల్చుకున్నాడు.మూడు రోజుల క్రితం మోనిక అన్న మాటలు హఠాత్తుగా నా మదిలో మెదిలాయి – ‘సిద్ధూ! నీ ఫ్రెండ్‌ ఓవర్‌ స్మార్ట్‌. తన పెళ్ళాంతో సంబంధం పెట్టుకున్నావని తెలిస్తే చంపేస్తాడు నిన్ను. నేనంటే పిచ్చి కనుక, కోపంతో నాలుగు దెబ్బలు వేసి ఊరుకుంటాడంతే’.    ఏడాది క్రితం మోనికను ఎలాగో ట్రాప్‌ చేసి పెళ్ళి చేసుకున్నాడు రాబర్ట్‌. ఆమె అంటే పిచ్చిప్రేమ. కాని, ఆమె నాపైన మనసు పారేసుకుంది. మా వ్యవహారం రాబర్ట్‌కి తెలిసిపోయిందనీ, అందుకే జాస్మిన్‌ యాక్సిడెంటు కేసులో నన్ను తెలివిగా ఇరికించాడనీ గ్రహించడం కష్టం కాలేదు నాకు. నేను నోరు విప్పితే భాయ్‌కి నిజం తెలుస్తుందనే నా నోటికి టేప్‌ కూడా వేయించాడని బోధపడింది. ‘‘బ్రహ్మాజీ! నీ అంతిమ ప్రార్థన చేసుకో’’ అన్న భాయ్‌ హెచ్చరికతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకున్నాను.  అతని చేతిలోని రివాల్వర్‌ మెల్లిగా పైకి లేస్తుంటే, నేరజీవితం సరిగ్గా ఎక్కడ ముగుస్తుందో తెలుస్తున్నట్టనిపించింది.
- తిరుమలశ్రీ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top