వ‌నం నుంచి ఆకాశానికి హ‌రివిల్లు

Funday child story in this week - Sakshi

పిల్లల కథ

అదొక ఎత్తయిన కొండ. కొండ నిండా చెట్లు. ఆకులనే కప్పుకున్నట్లు అనిపించే కొండది. కొండ కింద ఓ దట్టమైన వనం. బోలెడు చెట్లతో పువ్వులతో ఆ వనం అందంగా కనిపిస్తుండేది. కొండకు వచ్చిన వారంతా ముందుగా ఆ వనాన్ని తిలకించి పులకించిపోయేవారు. అక్కడి వాతావరణం ఎంత బాగుండేదో చెప్పడానికి మాటలు చాలవు. ఓరోజు కొండ పైనుంచి కనిపించింది ఓ హరివిల్లు. సప్తవర్ణాలతో ఆ హరివిల్లు చూసిన వారందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. మానవమాత్రులే కాదు, సువిశాలమైన తోటలో నివాసముంటున్న జంతువులు కూడా ఆ హరివిల్లును చూసి ఆస్వాదిస్తున్నాయి. పట్టరాని ఆనందంతో నృత్యాలు చేస్తున్నాయి. ఇంతలో ఓ ఏనుగు మరొక ఏనుగును పిలిచింది. ‘ఏంటీ పిలిచేవా?’ అని అడిగింది రెండో ఏనుగు.

‘అవును సోదరా! ఇదిగో చూసేవా ఆ కొండ మీద నుంచి కనిపిస్తున్న హరివిల్లుని. ఎంత బాగుందో కదూ! దాన్ని తీసుకొచ్చి మన వనానికి తోరణంలా చేసుకుందాం. అప్పుడు ఈ హరివిల్లుతో మన తోటకు మరింత అందం వస్తుంది అని చెప్పింది మొదటి ఏనుగు.‘అవును! నిజమే, నీ ఆలోచన బాగుంది. ఇప్పుడే వెళ్దాం మనమిద్దరం.’అని రెండో ఏనుగు చెప్పింది.రెండు ఏనుగులూ కొండ ఎక్కడం మొదలుపెట్టాయి. కొండ ఎక్కుతున్న కొద్దీ హరివిల్లు అందం అంతకంతకూ రెట్టింపవుతూ కనిపిస్తోంది. ఈ ఆనందంతో తాము పర్వతం ఎక్కుతున్న శ్రమను మరచిపోయాయి ఏనుగులు. ఓ గంటకు ఏనుగులు రెండూ హరివిల్లుకు చేరువకొచ్చాయి. ఏనుగులు తమ తొండాన్ని పెద్దవి చేసి హరివిల్లును అందుకున్నాయి. రెండూ ఓ అవగాహనకొచ్చాయి. పెద్ద ఏనుగు తన వీపుమీద హరివిల్లును పెట్టుకుని కొండ దిగింది. వెనకే చిన్న ఏనుగూ వచ్చింది. రెండు ఏనుగులకు ఎంత ఉత్సాహమో మాటల్లో చెప్పలేం. పాటలు పాడుతూ పర్వతం కిందకు చేరాయి. ఈ ఏనుగుల పాటలు విని తోటలోని మిగిలిన జంతువులూ వాటి దగ్గరకు వచ్చాయి. జంతువుల లోకంలో ఆనందం ఉప్పొంగింది. పెద్ద ఏనుగు వీపు మీదున్న హరివిల్లు తమ తోటలో ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాయి ఇతర జంతువులు. ఇంతలో అక్కడికి పక్కనున్న తోటలోని ఓ పులి అక్కడకు వచ్చింది.

‘ఏనుగా.. ఏనుగా..! నువ్వు చేసింది సరికాదు. ప్రకృతిలో హరివిల్లు అందరికీ సొంతం. మన తోటలన్నింటికీ కలిపేసుకుంటూ వాటికి ప్రవేశద్వారంగా ఈ హరివిల్లును ఏర్పాటుచేసుకుందాం’ అని చెప్పింది పులి. ‘అలా కలపడం కుదరదంటే ఒక్కో వనానికి ఒక్కో రోజు ఈ హరివిల్లుని ప్రవేశద్వారంగా ఉంచుకుందాం’ అని కూడా పులి చెప్పింది.కానీ ఓ ఎలుగుబంటి అంది కదా దానికన్నా ‘హరివిల్లులో ఏడు రంగులు ఉన్నాయి కదా. వాటిని ఏ రంగుకా రంగు విడగొట్టి ఒక్కో తోటకు ప్రవేశద్వారంగా చేసుకుందాం’ అని సూచించింది.కానీ అందుకు జింకలు ఒప్పుకోలేదు. ‘హరివిల్లుని అలా వేరు చేస్తే అది హరివిల్లు ఎందుకవుతుంది? రంగులనలా వేరు చేయడం ఏమీ బాగుండదు’ అంది జింకల నాయకుడు.‘అయితే మరేం చేద్దాం?’ అని కుందేలు అడిగింది.అప్పుడు ఒంటె చెప్పిందిలా...‘ఏడు రంగులూ చెదరిపోకుండా హరివిల్లుని ఏడు ముక్కలుగా చేసుకుని ఒక్కో వనానికి ఓ ప్రవేశద్వారం ఏర్పాటు చేసుకుందాం’ అని.ఇంతలో డేగ అంది కదా ‘అన్నట్టు మనుషులకైతే ఏదైనా ముక్కలు చేయడానికీ కోయడానికీ వాళ్ళ దగ్గర సుత్తి కొడవలి రంపం అంటూ ఏవేవో సాధనాలు ఉంటాయి. మన దగ్గర అలాంటివి లేవుగా... మరి హరివిల్లుని ఏడు ముక్కలు చేయడం ఎలాగా?’ అని ప్రశ్నించింది. ఈ మాట వినడంతోనే పులి క్షణాల్లో ఓ పెద్ద లావుపాటి కర్రను తీసుకొచ్చింది. పులి ఎక్కడ కర్రతో హరివిల్లుని ముక్కలు చేస్తుందో అని కోతి పెద్దగా అరిచింది...‘ఆగండి అందరూ..!  మాట వినండి’ అంటూ కోతి చెట్టుపై నుంచి దూకింది.

‘మిత్రులారా! హరివిల్లుని ముక్కలు చేయడమో కోయడమో అసాధ్యం. అది అంత సులువైనది కాదు. ప్రకృతి వరప్రసాదం. మనుషులు ప్రకృతిని తమ ఇష్టమొచ్చినట్టు నాశనం చేస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం, అందం కోసం, కాలక్షేపం కోసం అంటూ రకరకాల కారణాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అదెంత తప్పో వారికి తెలియడం లేదు. భవిష్యత్తరాలవారికి చేటు తెచ్చే పనులే ఇవన్నీనూ. కనుక మనమూ అలాంటి పనే చేయడం దేనికి? .ఏది ఎక్కడుండాలో అక్కడుంటేనే దానికి అందం. దానిని నాశనం చేసే హక్కు మనకే కాదు మనుషులకూ లేదు. వాతావరణ సమతుల్యతను పరిరక్షించడం మన కర్తవ్యం కూడానూ. మనుషులకీ విషయాన్ని మనమందరం కలిసి చెప్దాం’ అంది కోతి.ఈ మాటలు చిరుతపులికి నచ్చలేదు.‘ఈ కోతి ఏదో జ్ఞానిలా ఈ మాటలు చెప్తోంది. దాని మాటలు వినకండి’ అని అరిచింది చిరుతపులి.కానీ కోతి మాటలతో ఏనుగు ఏకీభవించింది.‘అవును! కోతి చెప్పింది నిజమే. మనముండే వనంలోకి మనుషులు ప్రవేశిస్తున్నప్పుడు, చెట్లను నరుకుతున్నప్పుడు మనమందరికీ కోపం వస్తోంది. బాధపడుతున్నాం కదా! అలాగే ఇది కూడా. చెప్పింది ఏదో మనకన్నా చిన్నదని నిర్లక్ష్యం చేయకూడదు. అందరి మాటా వినాలి. నాకేదో అనిపించి ఈ హరివిల్లుని తీసుకొచ్చాను. అది తప్పని తెలిసింది. ఆకాశం నుంచి తీసుకొచ్చేయడం నా స్వార్థానికి నిదర్శనం కదా’ అంది ఏనుగు.

పెద్ద ఏనుగు చెప్పిన ఈ మాటలతో మిగిలిన జంతువులన్నీ ఏకీభవించాయి. అందరం కలిసి ఈ హరివిల్లుని కొండెక్కి ఆకాశంలో పెట్టేద్దాం అని ముక్తకంఠంతో చెప్పాయి. అన్నీ కలిసి హరివిల్లుని ఏనుగు వీపు మీద పెట్టాయి. వాటి వెనుక ఆటపాటలతో కొండ మీదకు సాగాయి. పర్వతం అగ్రభాగానికి చేరాయి. హరివిల్లుని ఆకాశంకేసి విసిరాయి. అది మేఘాల మధ్య తేలుతూ కనిపించింది. ఆ అందాన్ని చూసి జంతువులన్నీ చప్పట్లు చరిచాయి. వాటి ఆనందాన్ని చూసి మేఘాలు పకపకా నవ్వాయి. వాటి ఆనందంతో శ్రుతికలిపాయి. మేఘాలు మహదానందంగా వర్షం కురిపించాయి.సూర్యుడు కూడా సంతోషంతో వెచ్చటి ఎండను ప్రసాదించి మురిసిపోయాడు. ఆ వర్షానికి, ఆ ఎండకూ మధ్య హరివిల్లు మరింత అందంగా దర్శనమిచ్చింది. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.
- యామిజాల జగదీశ్‌  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top